ఒకే సినిమా...26 రీమేక్ లతో గిన్నీస్ రికార్డ్, ఏముంది ఈ సినిమాలో..కథేంటి?

ఓ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయితే ప్యాన్ వరల్డ్ సినిమా అంటున్నాము. అదే ఓ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రీమేక్ లు అవుతూ వెళ్తే దాన్ని పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ సినిమా అనాలి.

Update: 2024-08-12 13:07 GMT

ఓ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయితే ప్యాన్ వరల్డ్ సినిమా అంటున్నాము. అదే ఓ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రీమేక్ లు అవుతూ వెళ్తే దాన్ని పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ సినిమా అనాలి. సక్సెస్ ఫుల్ సినిమాలను రీమేక్ చేయటం సినిమా పుట్టిన నాటి నుంచీ జరుగుతూనే ఉంది. అయితే ఒకే సినిమా 26 భాషల్లోకి రీమేక్ అవటం మాత్రం అరుదే. అందుకే ఎక్కువ రీమేక్ అయ్యిన చిత్రంగా గిన్నీస్ రికార్డ్ కు ఎక్కింది. చాలా మంది అఫీషియల్ గా ఈ సినిమా రైట్స్ తీసుకుని తెరకెక్కిస్తే కొందరు అనీఫిషియల్ గా ఈ కాన్సెప్టు ని లేపేసి తమ తెలివి తేటలు అద్దేసి సినిమాలు తీసారు. తెలుగులో కూడా ఓ సినిమా అనీఫిషియల్ గా తెరకెక్కించారు. అయితే ఆ సినిమా వర్కవుట్ కాలేదు. జనాలకు అసలు వచ్చి, వెళ్లిందనే విషయమే తెలియకుండాపోయి ఓటిటీ లో వాలింది. ఇంతకీ ఇంతమందిని ఎట్రాక్ట్ చేసి, ఇన్ని రీమేక్ లకు తెరతీసిన సినిమా ఏంటి...ఆ కథేంటో చూద్దాం.

ఆ సినిమా టైటిల్ పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ Perfect Strangers (Perfetti Sconosciuti). 2016లో విడుదలైన ఇటాలియన్‌ వచ్చిన ఈ సినిమా ఈ ఎనిమిదేళ్లలో 26 సార్లు ప్రపంచాన్ని చుట్టేసింది. అంతేకాదు, అత్యధికసార్లు రీమేక్ అయిన మూవీగానూ ‘పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌’ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కు ఎక్కింది. ఒక్కో దేశంలో ఒక్కో టైటిల్ తో రీమేక్ అవుతూ వచ్చింది. నథింగ్‌ టు హైడ్‌ (ఫ్రెంచ్‌), ఇంటిమేట్‌ స్ట్రేంజర్స్‌ (కొరియన్‌), కిల్‌ మొబైల్‌ (మాండరిన్‌) లౌడ్‌ కనెక్షన్‌ (రష్యన్‌), వైల్డ్‌ గేమ్‌ (ఐస్‌ల్యాండిక్‌)అలా చాలా భాషల్లో రీమేక్‌ చేశారు.అలాగే అదే టైటిల్ తో అరబిక్‌, రొమేనియన్‌, హిబ్రూ, జర్మన్‌ భాషల్లో రీమేక్ చేసారు. మనదేశంలో కన్నడలో ‘లౌడ్‌ స్పీకర్‌’ అఫిషియల్‌ రీమేక్‌ చేసారు. మలయాళంలో ‘12th మ్యాన్‌’, తెలుగులో ‘రిచి గాడి పెళ్లి’ చిత్రాలు ఈ సినిమాకు అనీఫిషియల్ రీమేక్ లు.

కథేంటి.

ప్రముఖ రచయిత గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ (Gabriel García Márquez) ఓ మాట అంటారు..."మానవులు అందరికీ మూడు జీవితాలు ఉంటాయి...అవి పబ్లిక్, ప్రెవేట్, సీక్రెట్”. ఈ కోట్ ని బేస్ చేసుకునే ఈ సినిమా మార్కెట్ చేసారు. అదే ఈ సినిమాకు సెంట్రల్ థీమ్ కూడాను.

ఈ చిత్రం కథ చాలా చిన్నది. ఏడుగురు క్లోజ్ ప్రెండ్స్ సాయింత్రం డిన్నర్ పార్టీకు వెళ్తారు. అక్కడ మాటల సందర్బంలో వాళ్లు తమ జీవితాల్లో దాపరికం అనేది లేదని, అంతా ఓపెన్ అని ప్రగల్బాలు పలుకుతారు. దాన్ని ప్రూవ్ చేయటానికి కూడా సిద్దమే అని ఛాలెంజ్ లు చేస్తారు. అప్పుడు వాళ్లు ఏ చిన్న గేమ్ ఆడదామనుకుంటారు. వాళ్లలో ఈవా అనే అమ్మాయి...ఓ మాట అంటుంది..‘మీరు ఇన్ని చెప్తున్నారు కానీ....ఇక్కడ ఉన్నవారిలో ఒకరి ఫోన్‌లో ఉన్న మెస్సేజ్‌ మరొకరు చూస్తే ఆ జంటలు తప్పకుండా విడిపోతారు’. అంత లేదని వాళ్లు వాదిస్తారు. సర్లే అదీ చూద్దాం అని ప్రతీ ఒక్కళ్లూ తమ పోన్స్ ని టేబుల్ పై పెడతారు.

ఆ స్నేహితుల ఫోన్స్ లో ఉన్న మేసేజ్ లు, కాల్స్ మొహమాటం లేకుండా,ఎవరినీ అడగకుండా ఒకరివి మరొకరు చూడచ్చు. అంద‌రు త‌మ ఫోన్స్ అన్ లాక్ చేసి చూపించాలి. అలాగే ప్రతీ టెక్ట్స్ మెసేజ్ గట్టిగా చదవాలి. వచ్చే ప్రతీకాల్ కు లౌడ్ స్పీకర్ పెట్టాలి. ఈ గేమ్ సరదాగా స్టార్ట్ అవుతుంది. మొదటి రౌండ్ ఏ ఇబ్బంది లేకుండా హ్యాపీగా నడుస్తుంది. ఇంతే కదా అనుకుంటారు.. కానీ ఎదరకి వెళ్లే కొలది...ఒకరి ఫోన్ లో మెసేజ్ మరొకరు, చూడటానికి వెనకడుగు వేస్తూంటారు. అలా ఎందుకు చేస్తున్నారు. అసలు వాళ్ల ఫోన్ లో ఉన్న మెసేజ్ లు వల్ల వచ్చే సమస్యలు ఏమిటి..కాల్స్ కాపురాలను కూలుస్తాయా వంటి విషయాలుతో సరదాగా ఈ సినిమా ముందుకు వెళ్తుంది.

అప్పట్లో ఈ సినిమా రిలీజైనప్పుడు అంటే 2016లో ఇటాలియన్ సమాజాన్ని కుదిపేసింది. ఈ ఇటాలియన్‌ చిత్రం 32 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ కథ చదవుతూంటే మనకు త‌మిళం,తెలుగులో హిట్ అయిన ల‌వ్ టూడే సినిమా స్టోరీ కాన్సెప్ట్‌ కూడా గుర్తు వస్తోంది కదా.

ఎలా ఉంది...

గాబ్రియల్ గార్సియా మార్క్వెజ్ చెప్పిన మూడు జీవితాలు ఐడియా ఈ సినిమాలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. మొబైల్ ఫోన్స్ మన ప్రెవసీని ఎలా లాక్కెళ్లిపోతున్నాయో, మన ఫోన్స్ తో మనం ఎంత పొసిసెవ్ గా ఉంటున్నామో ఈ సినిమా మొహం మీద కొట్టినట్లు చూపిస్తుంది. ఇదొక కామెడీగా చూస్తే ఏమీ అనిపించదు. ఇది మన గురించి చెప్పిన కథే అని అర్దమైతే మాత్రం మొహమాటం లేకుండా మన ఆలోచనలు..ఆలోచనలో పడిపోతాయి. అందుకే ఈ సినిమా చూసిన ప్రతీ వారిని కట్టి పారేసింది. సెల్ ఫోన్ మన జీవితంలోకు వచ్చినంత ఈజీగా ఈ సినిమా కూడా ప్రతీ దేశంలో ఈజీగా రీమేక్ అవటం మొదలెట్టింది.

ముఖ్యంగా ఈ సినిమా రీమేక్ ల కు కారణం...తక్కువ బడ్జెట్, తక్కువ లొకేషన్స్, కేవలం కంటెంట్ ని మాత్రమే నమ్మి చేయదగ్గ సినిమా ఇధి. ఈ సినిమా ఇప్పుడు హిందీలో ఆగస్టు 15న ‘ఖేల్‌ ఖేల్‌మే’ పేరుతో హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్, తాప్సీ పన్ను ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న తాజా చిత్రం ‘ఖేల్ ఖేల్ మే’. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు. కామెడీ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ప్రపంచం గ్రామంగా మారిపోతున్న వేళ ఇలాంటి యూనివర్శిల్ కాన్సెప్టులుకు బోలెడు డిమాండ్ ఉంది. తెలుగులోనూ ఇలాంటి కాన్సెప్టు ఓరియెంటెడ్ సినిమాలు తీయచ్చు. చిన్న సినిమాను బ్రతికించవచ్చు. అలాగే తమ కాన్సెప్టులతో ప్రపంచాన్ని మన వైపు తిప్పుకోవచ్చు.

Tags:    

Similar News