ప్చ్... 'పారిజాతం','భరతనాట్యం','గీతాంజలి' అన్నీ ఒకే నేపథ్యం ,ఒకే రిజల్ట్

సినిమాలకు సినిమా నేపథ్యమే గండమా అంటే ఈ మూడు సినిమా అవుననే అంటున్నాయి. సినిమా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే..

Update: 2024-04-21 03:20 GMT

అదేంటో సినిమా వాళ్లకు... సినిమాలే యాంటీ సెంటిమెంట్. సినిమా నేపథ్యంలో వచ్చే సినిమాలు ఆడవని సినిమా ఫీల్డ్‌లో పెద్ద సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ నిజం కాదని అనిపించినా, ఎక్కువ సార్లు సినీ నేపథ్య సినిమాలు ఫ్లాప్ అవటంతో నిజమే అని అనిపిస్తూంటుంది. అయితే ఈ జనరేషన్‌లో ఈ సెంటిమెంట్‌ని ప్రక్కన పెట్టేసి ముందుకు వెళ్లిపోయేవాళ్లే ఎక్కువ. తాజాగా ఈ ఏప్రిల్‌లో విడుదలైన ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’, ‘భరతనాట్యం’, ‘పారిజాత పర్వం’ ఈ మూడు సినిమాలు సిని నేపథ్యాలతో వచ్చినవే. ఈ సినిమాల్లో హీరో సినిమా డైరెక్టర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూంటాడు. మూడు మంచి క్లాసిక్ టైటిల్సే. మూడూ చూసేవాడి మాడు పగలకొట్టే ప్రయత్నాలు చేసినవే కావటం విశేషం. దాంతో ఈ మూడు సినిమాలు రిజల్ట్‌లు తేడా కొట్టేసి.. ఈ సెంటిమెంట్‌కు ఊతమిచ్చాయి.

'గీతాంజలి మళ్లీ వచ్చింది' కథని చూస్తే..

దర్శకుడు శ్రీను (శ్రీనివాస్ రెడ్డి), రచయితలు ఆత్రేయ (సత్యం రాజేష్), ఆరుద్ర (షకలక శంకర్) సినిమా అవకాశాలు కోసం చూస్తూ ఉంటారు. తమ ఫ్రెండ్ అయాన్ (కమిడయన్ సత్య) హీరోగా దిల్ రాజు నిర్మాతగా సినిమా చేస్తున్నామని చెప్పి అయాన్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఒకరోజు నిజం తెలిసిన అయాన్ వీళ్ళని నిలదీస్తే నిజం చెప్పేస్తారు, తమకి ఏ నిర్మాత ఆఫర్ ఇవ్వలేదని, స్నేహితుడు కదా అని అతనికి అబద్ధం చెప్పి డబ్బులు అవసరానికి వాడుకున్నామని ఒప్పుకుంటారు. సినిమాలు వద్దు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో ఒక నిర్మాత విష్ణు (రాహుల్ మాధవ్) దగ్గర నుంచి సినిమా ఆఫర్ వస్తుంది, నిర్మాత ఊటీ రమ్మంటాడు. స్నేహితులు నలుగురూ ఊటీ వెళతారు. అక్కడ నుంచి జరిగే పరిణామాలు చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా సెకండాఫ్ దారుణంగా ఉండటంతో చూసిన వాళ్లకు ఈ గీతాంజలి మళ్లీ రావడం అవసరమా అనే పరిస్థితి వచ్చింది.

ఇక రెండో సినిమా 'భరతనాట్యం'

రాజు సుందరం(సూర్య తేజ ఏలే) కథలు రాసుకుని డైరెక్షన్ ట్రయిల్స్ వేసుకుంటాడు. పేద కుటుంబం నుండి వచ్చిన అతనికి ఆర్థిక ఇబ్బందులు బాగా ఎక్కువ. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నప్పటికీ అతని వద్ద డబ్బు ఉండదు. మరోపక్క అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఇంకోపక్క అతని గర్ల్ ఫ్రెండ్(మీనాక్షి గోస్వామి) పెళ్లి చేసుకోమని పట్టుబడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజు సుందరం ఏదైనా తప్పు చేసి డబ్బు సంపాదించాలి.. తద్వారా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటాడు. ఇలాంటి టైంలో దిల్ షుఖ్ నగర్ దామోదర్(హర్షవర్ధన్) రంగమతి(టెంపర్ వంశీ)లు అక్రమంగా తరలిస్తున్న భరతనాట్యం అనే డ్రగ్స్ బ్యాగ్‌ను.. డబ్బులు ఉన్న బ్యాగ్ ఏమో అని కన్ఫ్యూజ్ అయ్యి కొట్టేస్తాడు. కానీ తర్వాత అది డ్రగ్స్ బ్యాగ్ అని తెలిసి వదిలించుకునే ప్రాసెస్‌లో శకుని(అజయ్ ఘోష్) అనే పోలీస్‌కి దొరికిపోతాడు. అక్కడ నుంచి జరిగే పరిణామాలు చుట్టూ తిరిగే కథ ఇది.

మూడో సినిమా 'పారిజాతం' విషయానికి వస్తే...

డైరెక్టర్ అవుదామనుకున్న చైతన్య (చైతన్య రావు) సినిమా ట్రయల్స్‌లో నిర్మాతల చుట్టూ తిరుగుతూంటాడు. భీమవరం నుంచి వచ్చి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన బార్ శీను(సునీల్) బయోపిక్‌ని స్క్రిప్టుగా రాసుకుంటాడు. అతని స్నేహితుడు హర్ష (హర్ష చెముడు)ని హీరోగా అనుకొని కథలు ప్రొడ్యూసర్స్‌కు చెప్తూంటాడు. నిర్మాతలు అతని కథలు బాగున్నాయి అంటారు కానీ, అతని స్నేహితుడిని హీరో అంటే ఎవరూ ఒప్పుకోరు. ఏ నిర్మాతా సినిమా ఛాన్సులు ఇవ్వకపోవడంతో విసిగిపోయిన చైతన్య.. హర్ష, తమ స్నేహితురాలు (మాళవిక సతీషన్)తో కలిసి నిర్మాత శెట్టి (శ్రీకాంత్ అయ్యంగార్) రెండో భార్య సురేఖ (సురేఖ వాణి) ని కిడ్నాప్ చేసి, నిర్మాత దగ్గర కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి సినిమా తియ్యాలనుకుంటాడు. అక్కడ నుంచి వచ్చే పరిణామాలు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

కంటెంట్ తప్ప ఇంక దేన్నీ నమ్ముకోవడానికి వీల్లేని చిన్న సినిమాలకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడమే గండంగా మారిన తరుణంలో ఈ మూడు సినిమాలు అంతో ఇంతో ఒక వర్గం ప్రేక్షకుల్లో ఆసక్తి రేపాయి. అయితే జనాలు వీటిని థియేటర్‌లో చూడటానికి ఆసక్తి చూపించలేదు. నిజానికి ఈ సినిమాలు వర్కవుట్ కాకపోవటానికి సినిమా బ్యాక్ డ్రాపే కారణం అని మళ్లీ సెంటిమెంట్‌గా చెప్పి తప్పుకోలేం. ఇంతకు ముందు శ్రీవిష్ణు బ్రోచేవారెవరురా చిత్రం కూడా సినిమా బ్యాక్ గ్రౌండ్‌లోనే వచ్చింది. కిడ్నాప్ డ్రామాని కలుపుకుంది. అయితే అందులో ఓ కొత్తదనాన్ని ఒడిసి పట్టుకుని సినిమా నిలబడింది. వీటిల్లో అదే మిస్సైంది.

సినిమా పెద్దదైనా చిన్నదైనా ఆసక్తికరంగా స్క్రీన్‌ప్లే ఉండాలి. పాత్రల తీరుతెన్నులు లాజిక్‌కి దగ్గరగా అనిపించాలి. సంగీతంతో సహా సాంకేతిక విభాగాలన్నీ తమ వంతు పాత్రను సమర్దవంతంగా పోషించాలి. కథలో కాన్‌ఫ్లిక్ట్, త్రిల్స్, సస్పెన్స్ లేకుండా చప్పగా సాగిపోయే సినిమాలు ఏ నేపథ్యంలో వస్తే ఏంటి?

Tags:    

Similar News