‘ఉద్వేగం’ ఓటీటీ మూవీ రివ్యూ
అసలు ఈ చిత్రం కథేంటి, సినిమా చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.;
కోర్టు చుట్టూ తిరిగే కథల్లో విషయం ఉంటే బాగానే ఆడతాయని రీసెంట్ గా నాని ప్రూవ్ చేశారు.ఆ ధైర్యమో ఏమో కానీ ఏడాది క్రితం థియేటర్ లో రిలీజైన ఓ కోర్టు చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. బయట ఉన్న మూడ్ ని ఈ సినిమా క్యాష్ చేసుకోగలదా, అసలు ఈ చిత్రం కథేంటి, సినిమా చూడదగినదేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
హైదరాబాద్ సిటీ శివార్లలో ఓ గ్యాంగ్ రేప్ జరుగుతుంది. తీవ్రమైన గాయాలతో ఉన్న హాస్పిటల్ లో ఉంటుంది. ఆ రేప్ కేసు చాలా సంచలనం సృష్టిస్తుంది. రేప్ చేసిన వాళ్లలో నరేష్ .. పవన్ .. తేజ సాయి అనే ముగ్గురు పోలీసులకు చిక్కుతారు. అయితే నాలుగో వ్యక్తి సంపత్ మాత్రం దొరకడు. పోలీసులు వెతుక్కుంటారు. మీడియా, సామాన్యజనం అందరూ ఈ కేసు గురించే మాట్లాడుతున్నారు.
ఎలాంటి క్రిమినల్ కేసులనైనా తన చాకచక్యంతో వాదించి గెలిస్తూంటాడు లాయర్ మహీంద్రా (త్రిగుణ్). ఓ రోజు అతను ఆఫీస్ లో ఉండగా అతని దగ్గరికి ఈ గ్యాంగ్ రేప్ లో తప్పించుకుని తిరుగుతున్న నాలుగో నిందితుడు సంపత్ వచ్చి సేవ్ చేయమని అడుగుతాడు. ఈలోగా అతన్ని వెంబడిస్తున్న పోలీసులు వచ్చి ఆ కుర్రాడిని అదుపులోకి తీసుకుంటారు. మహేంద్రకు ఏమీ అర్థం కాదు.
ఇంతలో సంపత్ నాయనమ్మ వచ్చి,తన మనవడికి ఏ పాపం తెలియదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ఆవేదనలో మహేంద్రకి నిజాయితీ కనిపిస్తుంది. అప్పుడు మహేంద్ర ఆ యువకుడు తరఫున వాదించాలని నిర్ణయించుకుంటాడు. అయితే బయట నుంచే కాక తన వాళ్ల నుంచి కూడా అతనికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. మరోవైపు లాయర్ ప్రసాద్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఈ కేస్‌లో పసలేదని నలుగురుకి శిక్ష విధించి కేస్ క్లోజ్ చేయాలని జడ్జి సమక్షంలో వాదిస్తాడు. కానీ మహీంద్రా లోతుగా పరిశోధించి a4 ముద్దాయిని కాపాడాలని చూస్తాడు.
ఆఖరకు మహేంద్ర ఎంగేజ్మెంట్ కూడా రద్దవుతుంది. అయినా సంపత్ ను నమ్మి అతను ఈ కేసులో ముందుకు వెళతాడు. అతని ధైర్యం,సానుభూతి అతనికి ఏ ఫలం ఇచ్చింది. ఈ క్రమంలో అతనికి ఎలాంటి ఛాలెంజ్ లు ఎదురవుతాయి? సంపత్ ను మహేంద్ర రక్షించగలుగుతాడా లేదా? అనేది మిగతా కథ.
విశ్లేషణ
సాధారణంగా కోర్టు డ్రామా సినిమాల్లో బాధిత అమ్మాయి తరపున హీరో కేసు వాదించడం చూస్తుంటాం. కానీ ఇందులో బాధిత అమ్మాయి తరపున కాకుండా, A2 నిందితుడు తరపున హీరో కేసు వాదించడం అనేది కొత్త పాయింట్. దాంతో చూసే ప్రేక్షకులు.. రేప్ జరిగిన మ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటూనే, మరోవైపు A2 గెలవాలని కోరుకుంటారు. దాంతో సినిమా చూస్తున్నప్పుడు ఓ కొత్త ఎక్సపీరియన్స్ కలగాలి. అయితే ఈ సినిమాలో టైట్ స్క్రిప్టు లేకపోవటంతో జస్ట్ ఓకే అనిపిస్తుంది.
అందులోనూ అసలు కథలోకి రావడానికి చాలా టైమ్ తీసుకున్నారు. హీరో చేతికి గ్యాంగ్ రేప్ కేసు వచ్చిన తర్వాత సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు రూమ్ సన్నివేశాలు, ట్విస్ట్ లు బాగానే రాసుకున్నారు. అదే సమయంలో కొన్ని సీన్స్ మరీ సినిమాటిక్‌గా, వాస్తవికానికి చాలా దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, త్రిగుణ్ మధ్య వచ్చే సన్నివేశాలను మరింత బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. లెంగ్త్ తక్కువగా ఉండడం సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. కథ థీమ్ కొత్తదే కానీ తెరకెక్కించే విధానంలో కొత్తదనంగా ఆలోచించి, ఇంకాస్త థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కమర్షియాలిటీ జోడించి ఉంటే రిజల్ట్ మరింత బావుండేది.
టెక్నికల్ గా ..
ఇదో చిన్న బడ్జెట్ సినిమా. అందుకు తగ్గట్లుగానే సాంతేకిక విలువలు ఉన్నాయి. దర్శకుడు మహిపాల్ రెడ్డి స్టార్స్ లేకపోయినా ఈ కోర్టు డ్రామాను ఎలాంటి డైవర్షన్స్ లేకుండా నీట్‌గా, ఎంగేజింగ్‌గా ప్రజెంట్ చేశారు. కార్తీక్ కొడగండ్ల సంగీతం బాగుంది. జి.వి. అజయ్ కుమార్ కెమెరా వర్క్ పర్వాలేదు. ఎడిటర్ జశ్వీన్ ప్రభు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
లాయర్ మహీంద్రగా త్రిగుణ్ మంచి ఫెరఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. దీప్సిక తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఓ మాదిరిగా ఉంది. త్రిగుణ్ గురువు పాత్రలో పరుచూరి గోపాలకృష్ణ ఎప్పటిలాగే తన మార్క్ చూపించారు.
జడ్జిగా సీనియర్ నటుడు సురేష్ చేసిన కామెడీ నవ్వులు పూయిస్తోంది. ఇక లాయర్ ప్రసాద్‌గా శ్రీకాంత్ అయ్యంగార్ ఎప్పటిమాదిరి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు శివ కృష్ణ కూడా తాను పోషించిన పోలీస్ పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
చూడచ్చా
ఓ క్రైమ్ కోర్టు డ్రామా చూడాలనుకున్నప్పుడు ఈ సినిమా మంచి ఆప్షన్.
ఎక్కడ చూడచ్చు
ఈటీవీ విన్ లో తెలుగులో ఉంది సినిమా.