'ఒక బృందావనం' మూవీ రివ్యూ
కొత్త ఆర్టిస్ట్ లతో రూపొందిన ఈ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎలా ఉంది, కథేంటి, ఈ రివ్యూ లో చూద్దాం....;
“కథలో కొత్తదనం ఉంటే, ముఖాలు కొత్తవైనా పరవాలేదు... మనసును తాకే భావోద్వేగాలు చాలు – ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది.” ఈ విషయం గతంలో ఎన్నో చిన్న సినిమాలు – పెద్ద విజయాలుగా నిలిచినప్పుడు రుజువైంది. తాజాగా అదే కోవలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఒక బృందావనం’.
కొత్త ఆర్టిస్ట్ లతో రూపొందిన ఈ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎలా ఉంది, కథేంటి, వర్కవుట్ అయ్యేదేనా, ఈ ప్రయాణం మరిచిపోవాల్సిన ఓ చిన్న ప్రయత్నంగా మిగిలిపోతుందా?
స్టోరీ లైన్:
When Strangers Walk Together, They Sometimes Become Family ఈ పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
విక్రమ్ (బాలు) అమెరికా వెళ్లే కలతో జీవిస్తున్న కెమెరామెన్. మహీ (షిన్నోవా) పెళ్లి వద్దనకుని, డాక్యుమెంటరీ తీసేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఆ డాక్యుమెంటరీ తన తల్లి కల. వీళ్లద్దరూ తమ తమ వృత్తి ప్రయణంలో కలుస్తారు. కలిసి ఓ డాక్యుమెంటరీకి పని చేయాలనుకుంటారు. ఆ క్రమంలో వారికి తన అంకుల్ జోసెఫ్ (శుభలేఖ సుధాకర్) ని వెతుకుతున్న చిన్నారి నైనిక (సాన్విత) గురించి తెలుస్తుంది.
అనాధ అయిన ఆ పాప "ప్రతి క్రిస్మస్కి గిఫ్ట్ పంపే ఆ జోసెఫ్ అంకుల్ ఎవరు?" అనే తన జీవితంలో దాగున్న మిస్టరీని ఛేదించాలనుకుంటుంది. దాంతో నైనిక గురించి డాక్యుమెంటరీ తీయాలని అనుకుంటారు. దాంతో విక్రమ్, మహీ, నైనిక ముగ్గరూ జర్నీ మొదలెడతారు. ఈ ముగ్గురూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఒకటవుతారు. కాని ప్రయాణం కొనసాగేకొద్దీ… వాళ్ల ప్రయోజనాల కంటే పెద్దదైన పరస్పర అనుబంధం ఏర్పడుతుంది. మొదట డబ్బు, కీర్తి కోసం మొదలైన ప్రయాణం, చివరకు హృదయాల అనుబంధంగా ఎలా మారిందో తెరపై చూడాలి.
విశ్లేషణ
కథలో కొత్తదనం ఉంటే, నటీనటులెవరు అనే క్వశ్చన్ కరిగిపోతుంది. ‘ఒక బృందావనం’ అదే నిరూపిస్తోంది. పేరుకు ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించినా… అసలు సినిమాలో విషయం మాత్రం మనసుని తాకే మానవీయ విలువల చుట్టూ తిరుగుతుంది. కథనం ఓ చిన్నారి చుట్టూ తిరుగుతుందని అనిపించినా... నిజంగా ఇది మనలోని చిన్నపిల్లలపై ఉన్న ప్రేమను, మరచిపోయిన అనుబంధాలను, కలల వెంబడి మానవత్వాన్ని తిరిగి గుర్తుచేసే కథ. ఈ సినిమా చెప్పదలచుకున్నది ఏ హీరో రైజింగ్ కాదు, ఏవైనా విలన్స్ ఫాల్ కాదు — ఇది మనుషుల మధ్య సంబంధాలు ఎలా పుట్టతాయన్నదనే చెప్పే సినిమా.
ఈ సినిమా ఓ భావోద్వేగ ప్రస్థానం అని చెప్పాలి. ఎలాంటి అద్భుతమైన సంభాషణలు లేకుండానే… కొన్ని చూపులు, చిన్న పిలుపులు, మౌన క్షణాలు ప్రేక్షకుని లోతుగా తాకుతాయి. అనుబంధాలు ఎలా పుడతాయో తెలియదు… కానీ ఒక్క చిన్నారి కోసం ముగ్గురు అజ్ఞాతుల ప్రయాణం చూస్తే… మన లోపల ఎక్కడో ఓ చిన్న కదలిక వస్తుంది.
దర్శకుడు ఎంచుకున్న కాన్సెప్ట్ తాజాదనంతో పాటు హ్యూమన్ కనెక్షన్‌కి ప్రధాన పీట వేశాడు. అయితే ఫస్టాఫ్ పేసింగ్ కొద్దిగా మెల్లగా సాగుతుంది. పాత్రల పరిచయం కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా… సెకండాఫ్‌లో సినిమా తన అసలు కలర్ చూపిస్తుంది. ముఖ్యంగా నైనిక-జోసెఫ్ ట్రాక్ మనని పట్టుకుంటుంది.
ఇక్కడి ప్రశంసించదగిన విషయం ఏమిటంటే… ఈ కథలో "హీరో ఎవరు?" అనే ప్రశ్నకే సమాధానం లేదు. అందరూ కలిసి ఒకరికొకరు హీరోలు. దానిలోని ఎమోషన్లు, హ్యూమన్ డ్రామా సహజంగా, అద్భుతంగా అల్లబడ్డాయి.
టెక్నికల్ గా :
సంగీతం — భావోద్వేగాలను రైజ్ చేయటానికి బాగా ప్లస్ అయ్యింది. ఇక కెమెరా వర్క్ — విజువల్ టోన్ మెల్లిగా నడిచినట్లు అనిపించినా అందంగా ఉంది. డైలాగ్స్ — అవసరమైన చోట మాత్రమే, కృత్రిమత లేకుండా రాసుకున్నారు. ఎడిటింగ్ — ఫస్టాఫ్‌లో కొద్దిగా ఫైన్‌ట్యూనింగ్ అవసరం, అయితే సెకండాఫ్‌లో ఫెరఫెక్ట్ గా ఉంది.
ఫైనల్ థాట్
"Sometimes, the camera captures not just the faces, but the forgotten feelings."
ఇక ఈ సినిమా తక్కువ ఖర్చుతో తీసినా... మంచి ప్రయత్నంలా తీశారు. ప్రేక్షకులు కథలో ఉన్న వాస్తవత, ఎమోషన్లతో తడవడం ఖాయం. ‘ఒక బృందావనం’ ఓ చిన్నారి ఆశల కోసం నడిచిన త్రివేణి సంగమం లాంటి జర్నీ. ఇది హంగులు ఎక్కువగల చిత్రం కాదు. ఇది హృదయాన్ని తాకే చిన్న కథ.
ఎక్కడ చూడచ్చు?
ప్రస్తుతానికి థియేటర్స్ లోనే , ఇంకా ఓటిటిలోకి రాలేదు.