మొదటిదే బాగుంది అనిపించే.. "ప్రతినిధి-2" మూవీ రివ్యూ
దాదాపు పదేళ్ల తర్వాత వచ్చి సీక్వెల్ సినిమా ప్రతినిధి-2. ఫస్ట పార్ట్ తరహాలోనే ఈసారి ఎన్నికల ముందే వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే..
ఇది సీక్వెల్స్ కాలం, వాయిదాల కాలం కూడా. ఈ మధ్యకాలంలో తెలుగులో ఒకటి రెండు సీక్వెల్స్ వచ్చాయి. కొంతమేరకు విజయం సాధించాయి కూడా. రవితేజ " ఈగల్", నరేష్ సినిమా "ఆ ఒక్కటి అడక్కు" రెండు మూడు వాయిదాలు తర్వాత చివరకు రిలీజ్ అయ్యాయి.పెద్దగా విజయం సాధించలేకపోయాయి. అదేవిధంగా నారా రోహిత్ హీరోగా తీసిన సీక్వెల్ "ప్రతినిధి-2" కూడా ఏప్రిల్ 25న విడుదల కావాల్సింది. చివరకు మే 10వ తారీఖున థియేటర్లలోకి వచ్చింది. మొదటి సినిమా ప్రతినిధి ఒక పొలిటికల్ థ్రిల్లర్. సీఎం కిడ్నాప్ నేపథ్యంలో నడుస్తుంది. చాలా వరకు విజయవంతమైంది. ఇప్పుడు ఈ సినిమా కూడా పొలిటికల్ థ్రిల్లరే అని ముందుగానే ప్రకటించబడింది. ఈ సినిమాలో హీరో పాత్ర గురించి కూడా కొన్ని విషయాలు ముందే ప్రేక్షకులకు తెలిసాయి. అలాగే ఈ సినిమా దర్శకుడు మూర్తి దేవగుప్తపు ఒక ప్రముఖ జర్నలిస్ట్ కావడం విశేషం.
ప్రతినిధి-2 సినిమాకు మరో విశేషం ఉంది. గతంలో 2014 ఎలక్షన్లకు ముందు ప్రతినిధి విడుదలై ప్రేక్షకుల, విమర్శకుల మెప్పు పొందింది. ఇప్పుడు ప్రతినిధి-2 కూడా సరిగ్గా ఎలక్షన్లకి మూడు రోజుల ముందు రిలీజ్ కావడం కూడా ఒక విశేషమే. దీని గురించి ఇంకో సంగతి ఏంటంటే, ఒక సినిమా సీక్వెల్ రావడానికి పది సంవత్సరాల కాలం తీసుకోవడం. ఇది బాహుబలి సినిమాకు తీసుకున్న టైం కన్నా చాలా ఎక్కువ. ఇన్ని విశేషాల మధ్య విడుదలైన సినిమా గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తం కావడం అనేది సాధారణమైన విషయమే.
ఇక నారా రోహిత్ రెండు సినిమాలు వీర భోగ వసంత రాయలు, ఆటగాళ్లు 2018 లో వచ్చాయి. మొదటి సినిమా నిరాశపరిచింది ఆటగాళ్లు ఓ మోస్తారుగా ఆడింది. నారా రోహిత్ తన మొదటి సినిమా " బాణం" నుంచి ఇప్పటివరకు డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు తీస్తున్నాడు. ప్రతినిధి కూడా అంతే. ఇక దాని సీక్వెల్ ప్రతినిధి-2 సీక్వెల్స్ కు సాధారణంగా ఉండే సమస్యలను అధిగమించి విజయం సాధించిందా? లేదా అన్నది ఒకసారి చూద్దాం.
కథాపరంగా చూస్తే, సీఎం మీద జరిగిన బాంబు దాడి... తద్వారా ఉత్పన్నమైన సంఘటనలతో ఈ సినిమా నడుస్తుంది. చేతన్(చే అని పిలవబడతాడు) ఒక నికార్సైన నిజాయితీగల జర్నలిస్టు. దానికి తోడు ఉదయభాను(ఈ సినిమా లో మంచి పాత్ర దొరికింది. చాలా వరకు దానికి న్యాయం చేసింది) పెట్టిన ఎన్ ఎన్ సి ఛానల్ కు సీఈఓ గా చేస్తుంది. అతను తనదైన శైలిలో దూసుకుపోతుంటాడు. ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడ్కర్) మీద జరిగిన దాడి తర్వాత అనేక సంఘటనలు, సిబిఐ ఎంక్వైరీ ఇతర రాజకీయ నాయకుల ఎత్తుగడలు తో సినిమా సాగుతుంది. చివరికి ఒక ట్విస్ట్ తో ముగుస్తుంది. చివర్లో దర్శకుడు మూర్తి ప్రతినిధి 3 ఉంటుందన్న సూచనతో సినిమా ముగుస్తుంది.
సీక్వెల్ కు ఉన్న సమస్యలు ఈ సినిమా పరిష్కరించలేకపోయింది. దాంతో మొదటి సినిమానే బాగుందని ప్రేక్షకులు అనిపిస్తుంది. దర్శకుడు కొత్తవాడు కావడం వల్ల ఒక టీవీ ప్రోగ్రామ్ లాగా దీన్ని తయారు చేశాడు. అంటే అనేక కట్ చేయబడిన సంఘటనలను(వాటిలో చాలా బాగున్నప్పటికీ) అతికించడం వల్ల సినిమా కథనం దెబ్బతినింది. కథ వరకు కూడా సినిమా మొదటి సినిమా లాగా ఒక సమస్యను తీసుకొని దాన్ని సాధించే క్రమంలో రాసుకున్న కథ కాదు. అలా సంఘటనలను చిత్రీకరిస్తూ పోయాడు అంతే. చాలా సన్నివేశాలను సాగదీయడం వల్ల స్క్రీన్ ప్లే గందరగోళంగా తయారైంది. అయితే కొంతవరకు ఈ సినిమా చూడగలిగేలా ఉండడానికి కారణం దర్శకత్వం మాత్రం కాదు. సినిమాకి దర్శకుడు రాసుకున్న డైలాగులు, నారా రోహిత్ పాత్ర, నటన. అయితే నారా రోహిత్ మొదటి సినిమాలో చేసినంత బాగా ఈ సినిమాలో చేయలేదు అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. దానికి కారణం రోహిత్ కాదు. అనుభవం లేని దర్శకుడు.
అయితే ఈ సినిమా ఎలక్షన్ల ముందు రిలీజ్ చేయడం ఎవరికి లాభిస్తుందో తెలియదు కానీ ఎన్నికలు, అవి నిర్వహించే పద్ధతులు, ఎన్నికల్లో వివిధ పార్టీలు గెలవడానికి చేసే పనులను ఈ సినిమాలో చిత్రీకరించారు. ఈ సినిమాలో సస్పెన్స్ కూడా ఉంది. పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్పారు కానీ, ఇందులో ట్విస్టులు ఎక్కువగా ఉండి, దీన్ని పొలిటికల్, సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా మార్చేశారు. దర్శకుడు స్వయంగా ఒక జర్నలిస్టు కావడంవల్ల సన్నివేశాలను ఎక్కువ సేపు చూపిస్తూ పోయాడు. మీడియా క్లిప్పింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల సినిమా బోర్ కొట్టేస్తుంది. ముందే చెప్పినట్లు ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా బాగా చిత్రీకరించారు. దానికి తోడు డైలాగులు అర్థవంతంగా ఉండడం వల్ల, అప్పుడప్పుడు ఆ సినిమా చూడగలిగే సినిమాగా మారింది తప్ప, మొత్తం సినిమా గా అయితే నిరాశపరిచినట్లే. మరోసారి ఈ సినిమాలో డైలాగులు గురించి చెప్పాలి. " నేను గెలిచింది వ్యూహకర్తల వల్ల కాదు, కార్యకర్తల వల్ల" వంటి డైలాగులు బాగున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కొంతవరకు బాగానే చూపించారు.
ఈ సినిమాలో చాలామంది నటీనటులు ఉన్నారు. ముఖ్యమంత్రి పాత్రలో సచిన్ ఖేడ్కర్ పర్వాలేదు. సిబిఐ ఆఫీసర్ పాత్రలో జిసుసేన్ గుప్తా(ఈ పాత్రకు సంబంధించిన ఫుటేజ్ ఎక్కువ ఉండడం వల్ల సినిమా తేలిపోయింది) తనదైన శైలిలో చేశాడు.ముఖ్యమంత్రి సెక్రటరీ పాత్రలో సిరి లెల్ల కు(ఈ మధ్య బాగా పాపులర్ అయిన యువ నటి శ్రీ లీల పోలికలు ఉన్నాయి) కొంత టాలెంట్ ఉందని అర్థమవుతుంది. సినిమాలో ఉన్న రెండు పాటలు, భోజనంలో పంటికింది రాయిలా ఉన్నాయి తప్ప, సినిమాకు పెద్దగా ఉపయోగపడవు.
ముందే చెప్పినట్లు ఒక టీవీ ప్రోగ్రాం లాగా ఈ సినిమాని తీయడంలో దర్శకుడు అనుభవరాహిత్యం పనికి వచ్చింది. ఏమాటకామాట చెప్పాలంటే బిట్లుబిట్లుగా ఈ సినిమా చూడవచ్చు. కానీ సినిమాకు ఒక మొదలు, ఒక లక్ష్యం లేకపోవడం, ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూపించాలో క్లారిటీ లేకపోవడం వల్ల సినిమా కథ, కథనం దారి తప్పడం వల్ల, సీక్వెల్ అంతగా ప్రేక్షకులకు ఎక్కదు.
ఈ సినిమా ప్రస్తుతం ఎలక్షన్ల సందర్భంగా విడుదల కావడం, దాంతో ఎలక్షన్లపైన అభ్యర్థుల సెలక్షన్ ల పైన వేసిన విసుర్లు బాగానే ఉన్నాయి. టీవీలో న్యూస్ ఎక్కువగా చూసే వాళ్ళకి ఈ సినిమా కొంతవరకు నచ్చవచ్చు. మిగతా ప్రేక్షకులకు ఈ సినిమా నిరాశ కలిగిస్తుంది. కొసమెరుపు: ప్రతినిధి-2 సినిమా విడుదలను నిలిపివేయాలని ఒక పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఒక పత్రికలో వచ్చింది. ఈ చిత్రం ఒక పార్టీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ట్రైలర్ ఉందని, ఆ ఫిర్యాదులో పేర్కొంది
తారాగణం : నారా రోహిత్, జిషు సేన్గుప్తా, సచిన్ ఖేడేకర్,తనికెళ్ల భరణి,దినేష్ తేజ్,సిరి లెల్ల, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్
కథ, కథనం, మాటలు,దర్శకత్వం : మూర్తి దేవగుప్తపు
సంగీతం :మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం : నాని చమిడిశెట్టి
ఎడిటర్ :రవితేజ గిరిజాల
నిర్మాతలు :తోట శ్రీ ఆంజనేయులు, కుమారరాజ బత్తుల,సురేంద్రనాథ్ బొల్లినేని
నిర్మాణసంస్థలు :వానరా ఎంటర్టైన్మెంట్స్ ,రానా ఆర్ట్స్ బ్యానర్.
విడుదల తేదీ: మే 10, 2024