“కోర్ట్” మూవీ రివ్యూ

బజ్ కు, క్రేజ్ కి తగినట్లు సినిమా ఉందా, సినిమా కథేంటి వంటి విషయాలు చూద్దాం.;

Update: 2025-03-14 06:38 GMT

ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ తో భాక్సాఫీస్ దగ్గర సందడి చేసి ఓపినింగ్స్ రప్పించిన సినిమా కోర్ట్. నాని నిర్మాణం లో రావటం, ‘పోక్సో చట్టం చుట్టూ కథ తిరగటం, . “కోర్ట్ నచ్చకపోతే హిట్ 3 చూడకండి” అంటూ నాని ఇచ్చిన స్టేట్మెంట్ ఇవన్నీ మీడియాలో బజ్ క్రియేట్ చేసాయి. ఎంగేజింగ్ కోర్ట్ రూమ్ డ్రామాలకు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కు ప్లస్ అవ్వాలి. అది జరిగిందా, బజ్ కు, క్రేజ్ కి తగినట్లు సినిమా ఉందా, సినిమా కథేంటి వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

మంగపతి (శివాజీ)ది ఊళ్లో బాగా డబ్బున్న, రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం. అతని కుటుంబానికి చెందిన జాబిలి (శ్రీదేవి) తక్కువ స్థాయికి చెందిన చందు (హర్ష్ రోషన్) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. చందు ఓ ఇంటి దగ్గర వాచ్ మెన్ గా పనిచేస్తూంటాడు. అతను వచ్చి తమ ఫ్యామిలీకు చెందిన అమ్మాయిని ప్రేమించటం ఏమిటని మంగపతి మండిపడతాడు. అంతేకాకుండా ఆ కుర్రాడిపై అబద్ధపు కేసులు, మరీ ముఖ్యంగా పోక్సో కేసు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టిస్తాడు. అందుకు తనకు బాగా తెలిసిన లాయర్ దాము (హర్షవర్ధన్) ని వినియోగించుకుంటాడు. దాంతో సరైన న్యాయ సహాయం లేక 78 రోజుల పాట బెయిల్ లేకుండా రిమాండ్ లోనే ఉండిపోతాడు చందూ.

అంతేకాదు చందూ త‌ర‌పున వాదించే న్యాయ‌వాదిని సైతం మంగ‌ప‌తికి కొనేస్తాడు. ఈ క్రమంలో కోర్టు కూడా చందూని దోషి అని నిర్దారించి తుది తీర్పుకు సిద్ధం అవుతుంది. ఇలాంటి ద‌శ‌లోనే చందూ కేసు వాదించ‌డానికి ముందుకొస్తాడు జూనియ‌ర్ లాయ‌ర్ వస్తాడు. న్యాయవాది మోహనరావు(సాయికుమార్) దగ్గర పనిచేసే సూర్యతేజ (ప్రియదర్శి) ఈ కేసుని భుజాన వేసుకుంటాడు. అప్పటికే దాదాపు మునిగిపోయే స్దితిలో ఉన్న చందూని సూర్య కాపాడాడా? అసలు న్యాయం జ‌రిగిందా? త‌ప్పుడు కేసుల నుంచి చందూని త‌ప్పించాడా? చివరికి ఏమైంది అనేది “కోర్ట్” (Court) సినిమా కథాంశం.

విశ్లేషణ

కథ గా లవ్ స్టోరీ, పెద్ద కుటుంబం పెత్తందారి తనం వంటివి చూస్తే పాతదే అనిపిస్తుంది. అందులో పోక్సో చట్టం కలిపి చెప్పటమే కొత్తగా ఉంది. అలాగే పోక్సో చ‌ట్టం వెనుక ఉద్దేశ్యం మంచిదే అయినా , దాన్ని అడ్డం పెట్టి కొందరు అమాయకులను బలి చేయటాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూస్తుంటే అల్లరి నరేష్ నాంది, పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాలు గుర్తు వస్తాయి. ఫస్టాఫ్ లవ్ స్టోరీ చుట్టు తిరుగుతుంది. సెకండాప్ పూర్తి కోర్ట్ రూమ్ డ్రామాగా నడుస్తుంది. అలాగే సినిమాలో డైరక్టర్ చాలా చోట్ల సినిమాటెక్ లిబర్టిని తీసుకుని తనకు కన్వీనెంట్ గా సీన్స్ రాసుకున్నారు. అదే ఇబ్బంది అనిపిస్తుంది. ఎక్కడా మనం ఊహించని మలుపులు అయితే ఉండవు.

అలాగే సినిమాలో హర్షవర్ధన్ వాదించే పాయింట్స్ అన్నీ క్రాస్ ఎగ్జామినేషన్ లో తేలిపోతూంటాయి అని సాధారణ ప్రేక్షకుడుకి కూడా అర్థమవుతూనే ఉంటుంది. అంత సింపుల్ పాయింట్స్ మీద పోక్సో యాక్ట్ కేస్ ను నడిపించడం అనేది ఎందుకో సరిగ్గా అనిపించదు. అలాగే సినిమా చివర్లో జాబిలి పాత్ర “ఇవాళ నా 18వ బర్త్ డే” అని చెప్పి హీరో ని హగ్ చేసుకోవడం అప్పటిదాకా వచ్చిన నేరేషన్ ని డెల్యూట్ చేసేస్తుంది. 18 ఏళ్లు వస్తే ఏదైనా చేసేయచ్చా అని జనం అనుకునే ఈ డైలాగు తీసేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఇలాంటి లోపాలను ప్రక్కన పెడితే ఇలాంటి సబ్డెక్ట్ ని తీసుకుని చట్టంపై అవగాహన కల్పిస్తూ సినిమా తీసిన దర్శక,నిర్మాతలని మాత్రం అభినందించాల్సిందే.

టెక్నికల్ గా

ఈ సినిమాకు మెయిన్ హైలెట్ బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ మ్యాజిక్. ప్రేమలో సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది. సినిమాలో ఉన్న మిగిలిన రెండు పాటలు కూడా బాగున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ స్పీడుగా పరుగెత్తేలా షార్ప్ గా ఉంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ క్లాస్ గా ఉంది. ఇక నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని కొత్త దర్శకుడు రామ్ జగదీష్ నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. నాని ఈ సినిమాకు మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చి సహకరించాడు.

నటీనటుల్లో..

ప్రియదర్శి ఈ సినిమాలో పాత్రను.. ఛాలెంజింగ్ గా తీసుకుని చేసాడు. హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రలో చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. కొత్తమ్మాయి శ్రీదేవి బాగుంది.. సాయి కుమార్ ఎప్పటిలాగే బాగా చేసారు. ఈ సినిమాలో హైలెట్ శివాజీ నటన అని చెప్పాలి. తనలోని సరికొత్త విలన్ ని పరిచయం చేసి చూపించాడు శివాజీ. రోహిణి, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

చూడచ్చా

ఇదో ఇంట్రెస్టింగ్ కోర్టు డ్రామా..! ఇలాంటి కోర్ట్ డ్రామాలుపై ఆసక్తి ఉన్నవాళ్లు చూడదగ్గ సినిమా

Tags:    

Similar News