బాలకృష్ణ 'డాకు మహారాజ్' రివ్యూ
అఖండ, వీరసింహా రెడ్డి & భగవంత్ కేసరి, మూడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ సినిమాలు...;
అఖండ, వీరసింహా రెడ్డి & భగవంత్ కేసరి, మూడు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ఫుల్ సినిమాలు. ఇలా వరస హిట్స్ ఇవ్వటం, అదీ ఈ రోజుల్లో కేవలం బాలయ్య కే సాధ్యం. దాంతో సీనియర్ హీరో అయినా బాలయ్య సినిమా అంటే ఓ ప్రత్యేకమైన క్రేజ్ క్రియేట్ అయ్యింది. దానికి తోడు వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీ దర్శకుడు కావటంతో అంచనాలు మరికాస్త ముందుకు వెళ్లాయి. వాటిని ఈ సినిమా అందుకోగలిగిందా, బాలయ్య తన విజయ ప్రస్దానాన్ని కొనసాగించగలిగాడా, అసలు ఈ చిత్రం కథేంటి వంటి విషయాలు, విశేషాలు చూద్దాం.
కథేంటి
లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్), అతని సోదరుడు (సందీప్ రాజ్) నుండి ఒక చిన్న అమ్మాయి, బేబీ వైష్ణవి కు సమస్య ఏర్పడుతుంది. ఆ కుటుంబం కోటీశ్వరులు అయినా త్రిమూర్తులును ఎదిరించే సత్తా ఉండదు. దాంతో ఆ కుటుంబంలో ఉన్న గోవింద్ గుజ్జర్ (మకరంద్ దేశ్‌పాండే) ఆ పాపని, ఆ కుటుంబాన్ని రక్షించమని నానాజీ (బాలయ్య) ని అభ్యర్థించాడు. దాంతో ఆ కుటుంబంలోకి డ్రైవర్ గా వస్తాడు నానాజీ. డ్రైవింగ్ తో పాటు పనిలో పనిగా ఆ కుటుంబానికి సంరక్షకునిగా పని చేస్తున్నప్పుడు, టీ ఎస్టేట్ పేరుతో కొకైన్ సాగు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఠాకూర్‌ల ముఠాను చూస్తాడు. ఠాకూర్స్ గ్యాంగ్‌తో వారి గొడవ పడినప్పుడు, నానాజీ అసలు పేరు డాకు మహారాజ్ అని రివీల్ అవుతుంది. అసలు ఈ డాకు మహారాజ్ ఎవరు? బేబీ వైష్ణవితో డాకు మహారాజ్‌కి ఉన్న సంబంధం ఏమిటి? డాకు మహారాజ్ , ఠాకూర్ ఫ్యామిలీ(బాబి డయోల్) మధ్య శత్రుత్వం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సీనియర్ హీరోలందరూ ఇప్పుడు తాము సినిమా చెయ్యాలంటే కమల్ హాసన్ విక్రమ్, రజనీకాంత్ జైలర్ ని ఎదురుగా పెట్టుకుని చేస్తున్నారు. అయితే ఆ రెండు సినిమాలు డిఫరెంట్ స్క్రీన్ ప్లేలతో చేసిన సినిమాలనే విషయం మర్చిపోతున్నారు. కేవలం ఆ సినిమాలో ఎలివేషన్స్, పాప సెంటిమెంట్ వంటివి మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్తున్నారు. అలాగే అదే సమయంలో స్టైలిష్ ప్రెజెంటేషన్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే కేవలం ఎలివేషన్స్, స్టైలిష్ విజువల్స్ ఆ చిత్రాల సూపర్ హిట్ కు కారణం కాదు. కేవలం ఆ సక్సెస్ స్దాయిని మరో స్దాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడినవి మాత్రమే అని మర్చిపోతున్నారు. ఈ సినిమా కోసం కూడా డైరక్టర్ బాబి...ఇలాంటి ఎలిమెంట్స్ కు తగ్గ నేపధ్యం ఎంచుకున్నారు. కానీ ఆ సినిమాల స్దాయిలో స్క్రీన్ ప్లేని డిజైన్ చేయలేకపోయారు. మద్య మధ్యలో హీరోయిజం బాగా ఎలివేట్ చేసే సీన్స్ మాత్రం పేర్చుకున్నారు. దాంతో ఆ సీన్స్ వచ్చినప్పుడు జనం ఎంజాయ్ చేస్తున్నారు కానీ మిగతా సమయంలో అలా చూస్తుండిపోతున్నారు. ముఖ్యంగా మాస్ డైలాగ్స్ తో హీరో ఫ్యాన్స్ కు పండగ చేయాలనుకున్నాడు. అలాగే ఇంటర్వెల్ , ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కు వచ్చేసరికి రొటీన్ రాసుకుని,తెరకెక్కించేసారు.
టెక్నికల్ గా..
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ & థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రెండు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అదే సమయంలో రొటీన్ గా సాగే స్క్రిప్టు, ఎగ్జిక్యూషన్ సినిమాని నేలకు లాగే ప్రయత్నం చేసాయి. ఎక్కడా ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు కానీ ,ఇంటెన్స్ నేరేషన్ కానీ లేకుండా కథ,కథనం నడిపారు. సినిమాలో మెయిన్ విలన్ బాబి డయోల్ పాత్ర అయితే తెరపై ఎన్నో సార్లు చూసిన విలన్ క్యారక్టరే. పాటల్లో ఎంతో కొంత ఎక్సపెక్ట్ చేసిన ‘దబిడి దిబిడి’ పాటలో కొరియోగ్రఫీ జస్ట్ ఓకే అన్నట్లుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
చూడచ్చా
బాలయ్య చేసిన ఎన్నో రెగ్యులర్ మాస్ మసాలా సినిమాల్లో ఇది ఒకటి. స్టైలిష్ గా తీయటం ఈ సినిమాకు కొత్త. కాబట్టి స్టైలిష్ బాలయ్యను, యాక్షన్ ఎపిసోడ్స్ చూడాలంటే ఈ సినిమాకు వెళ్లవచ్చు. ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుంది. మిగతా వాళ్లకు జస్ట్ ఓకే అనిపిస్తుంది.