‘‘మాలీవుడ్ డ్రగ్స్ వినియోగానికి ప్రత్యేక రూమ్ లు, బడ్జెట్లు’’
తెరవెనక జరగుతున్న చీకటి కోణాలను వివరించిన నిర్మాత సాండ్ర థామస్;
By : Praveen Chepyala
Update: 2025-05-22 14:05 GMT
మాలీవుడ్ లో డ్రగ్స్ ను విచ్చలవిడిగా వాడుతున్నారని, ఈ విష సంస్కృతి చాలా లోతుగా పాతుకుపోయిందని సినీ నిర్మాత నటి సాండ్రా థామస్ సంచలన విషయాలు వెల్లడించారు. ఆమె ఓ మలయాళ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.
చూస్తూ ఊరుకుంటున్నారు..
సినిమా సెట్లలో మాదక ద్రవ్యాల వినియోగం కోసం ప్రత్యేకంగా గదులు కేటాయించడమే కాకుండా, దీనికోసం నిర్మాతలు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తున్నారనే విషయాలు చెప్పి కలకలం రేపారు.
‘‘సెట్లో ఏం జరుగుతుందో అందరికి తెలుసు. కానీ భవిష్యత్ ప్రాజెక్టులకు ఈ వ్యక్తులు అవసరం కాబట్టి, ఎవరు ఏమి అనరు. ఎలాంటి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించరు’’ అని థామస్ అన్నారు.
సినీ సంఘాల నిష్క్రియాత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ఈ సమస్య కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతోందని, అయినప్పటికీ ఎలాంటి జోక్యం చేసుకోవట్లేదని చెప్పారు.
కొన్నిరోజుల క్రితం ‘సూత్రవాక్యం’ సినిమా షూటింగ్ సందర్భంగా తన సహ నటుడు విన్సి అలోషియస్ డ్రగ్స్ మత్తులో తనను వేధించాడని ప్రముఖ నటుడు షైన్ టామ్ చాకో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సాండ్రా థామస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
విన్సీ పై ఎలాంటి చట్టపరమైన చర్య తీసుకోకూడదని నిర్ణయించుకున్నప్పటికీ ఈ సంఘటన సినిమా సెట్లలో మాదక ద్రవ్యాల వినియోగం వాడుతున్నారనే చర్చను తిరిగి తెచ్చింది.
జకారియాయుడే గర్భినికల్, ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ వంటి చిత్రాలను సాండ్రా థామస్ నిర్మించింది. అలాగే ఆమెన్, ఆడు ఒరు భీకర జీవియను వంటి చిత్రాలలో నటించారు.
మలయాళ చిత్ర పరిశ్రమ వివిధ సమస్యలను పరిష్కరించే విధానం పై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల సంస్కృతి గురించి మాట్లాడటమే కాకుండా నిర్మాతల సంఘం కార్యనిర్వాహాక కమిటీ సమావేశంలో తనపై అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపిస్తూ ప్రముఖ సినీ నిర్మాత ఆంటో జోసెఫ్ పై చట్టపరమైన చర్య కూడా తీసుకున్నారు. సమావేశంలో తన వినయాన్ని చేతగానితనంగా తీసుకున్నారని, అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని సాండ్రా చెప్పారు.
ఇటీవల కాలంలో మాలీవుడ్ పరిశ్రమ పలు వివాదాల్లో చిక్కుకుంది. కొంతమంది నటులు తమను సెట్లో వేధించారనే విషయం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు బాధితులు చెప్పడం, ఆ వివరాలు హైకోర్టు ఆదేశంతో బయటకు రావడంతో రాష్ట్రంలో కలకలం రేగింది. ఇప్పుడు వారి మాటలకు సాండ్రాథామస్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి.
మోహన్ లాల్ ప్రచారం...
సాండ్రా థామస్ వ్యాఖ్యలు శాండల్ ఉడ్ లో తీవ్ర చర్చనీయాంశమైన నేపథ్యంలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం కూడా హైలైట్ అయింది. తన ఎన్జీఓ ‘విశ్వశాంతి ఫౌండేషన్’ ద్వారా ఏడాది పొడవునా మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు.
‘‘బీ ఏ హీరో’’ అనే పేరుతో ఉన్న ఈ ప్రచారం యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన పెంచడం, వాటికి దూరంగా ఉండేలా ప్రొత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.
మాదక ద్రవ్యాల వినియోగం..
ఈ ఆరోపణలతో పరిశ్రమ సతమతమవుతున్న తరుణంలో సినిమా సెట్లలో మాదక ద్రవ్యాల వినియోగానికి ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
సాండ్రా థామస్ వెల్లడించిన విషయాలు మలయాళ సినీ పరిశ్రమలో ఉంటున్న వారికి సురక్షితమైన వాతవరణం తీసుకురావడానికి ఓ మేల్కోలుపుగా భావిస్తున్నారు.