AMMA అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా..

"కొంతమంది ఆఫీస్ బేరర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలొచ్చాయి. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రస్తుత అమ్మ పాలకమండలి రాజీనామా చేస్తోంది. - AMMA

Update: 2024-08-27 12:19 GMT

అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (AMMA) అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరికొంతమంది ఆఫీస్ బేరర్లు కూడా తమ పదవులకు రిజైన్ చేశారు. ఆఫీస్ బేరర్లతో సహా సభ్యులపై లైంగిక దోపిడీ ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ కమిటీని రద్దు చేసినట్లు అధ్యక్షుడు మోహన్ లాల్ తెలిపారు. AMMA ఎగ్జిక్యూటివ్ కమిటీ జూన్ 2024లో ఎన్నుకున్నారు. 2027 వరకు కమిటీ కొనసాగాల్సి ఉంది. రెండు నెలల్లో కొత్త కమిటీ ఎన్నిక అవుతుందని మోహన్ లాల్ తెలిపారు. 500 మంది సభ్యులున్న అమ్మను రద్దు చేయడంతో సంస్థ సంక్షోభంలో పడింది. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో AMMA ప్రధాన కార్యదర్శి సిద్ధిక్ కూడా తన రాజీనామాను సమర్పించారు .

"కొంతమంది AMMA ఆఫీస్ బేరర్లపై లైంగిక వేధింపులు ఆరోపణలొచ్చాయి. హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ ప్రస్తుత అమ్మ పాలకమండలి రాజీనామా చేస్తోంది. కొత్త పాలకమండలి ఎన్నికకు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అంతవరకు కమిటీ సభ్యులకు నెలవారీ ఆర్థిక సహాయం, వైద్య సహాయ కార్యకలాపాలను ప్రస్తుత కమిటీ తాత్కాలికంగా నిర్వహిస్తుంది.’’ అని AMMA ఒక ప్రకటన విడుదల చేసింది.

హేమ కమిటీతో ప్రకంపనలు..

మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ ఇటీవల విడుదల చేసిన నివేదిక రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రిటైర్డ్ హైకోర్టు జ‌డ్జి కే హేమ ఈ కమిటీకి నాయ‌క‌త్వం వ‌హించారు. న‌టి శార‌దతో పాటు మాజీ సివిల్ స‌ర్వీస్ అఫిషియ‌ల్ కేబీ వాత్సల కుమారి కమిటీ స‌భ్యులుగా ఉన్నారు. ఆ కమిటీ ఇటీవలే త‌న నివేదిక‌ను కేరళ సీఎం పినరయి విజ‌యన్‌కు స‌మ‌ర్పించింది. ప్రముఖ నటిపై జరిగిన లైంగిక వేధింపుల నేపథ్యంలో 2017లో రాష్ట్ర ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికీ ఎన్నోసార్లు నివేదికలు సమర్పించింది. అయినా దాడులు పెరుగుతుండటంతో..ఇటీవల మరోసారి నివేదిక విడుదల చేసింది.

Tags:    

Similar News