పాలకుండతో ఫ్రాన్స్ కి బయల్దేరిన స్మితాపాటిల్ 'మంథన్'
శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ కురియన్ ఈ సినిమాకు ప్రేరణ. పాడి వ్యాపారుల కబంధ హస్తాల నుంచి పాడి ఉత్పత్తిదారులను కాపాడడంతో పాటు సంఘంగా తీర్చిదిద్దిన తీరే మంథన్.
సముద్రాన్ని చిలికితే అమృతం వస్తుందో రాదో గాని పాలు తోడు పెట్టి పెరుగును కవ్వం పడితే మాత్రం కచ్చితంగా వచ్చేది వెన్న. అటువంటి అంశాన్ని కథావస్తువుగా చేపట్టి ఓ 50 ఏళ్ల కిందట అద్భుత సినిమా వచ్చింది. దాని పేరే మంథన్..పాత హిందీ ఫిలిం. మహామహులు నటించారు. చనిపోయి ఏ లోకాన ఉందో స్మితా పాటిల్ ఓ పల్లెటూరి పిల్ల పాత్రలో జీవించి నవరసాలను పండించారు. నజీరుద్దీన్ షా గురించైతే ఇక చెప్పాల్సిన పనే లేదు. అలాంటి సినమా అది. ఓ జాతీయ ప్రయోజనం కోసం ఈ సినిమాను ప్రముఖ దర్శకులు, తెలుగుమూలాలున్న శ్యామ్ బెనగల్ తీశారు. ఆ సినిమాను ఈ (మే) నెల 14 నుంచి 25 వరకు ఫ్రాన్స్ లో జరిగే ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ అరుదైన అవకాశం ఈ పాడి రైతుల సినిమా ‘మంథన్’కి దక్కింది. ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ పునరుద్ధరించిన ‘మంథన్’ వెర్షన్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమవుతోంది. కేన్స్ క్లాసిక్ విభాగం కింద ఎంపికయిన ఏకైక భారతీయ చిత్రం 'మంథన్'. ఈ సినిమా ప్రీమియర్‌కు నసీరుద్దీన్ షా, దివంగత స్మితా పాటిల్ కుటుంబం, చిత్ర నిర్మాతలు, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్‌కి చెందిన శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్ హాజరుకానున్నారు.
శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ ఈ సినిమాకు ప్రేరణ. పాల కొరత ఉన్న భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మార్చిన అసాధారణమైన యాత్ర ఆ సినిమా. పాడి రైతుల సహకార ఉద్యమానికి నాందీ పలికిన అపురూప కథా రూపం మంథన్. కష్టకాలంలో రైతులు తమ ఇంటి అవసరాలు కూడా తీర్చుకోలేని దుర్భర స్థితిలో ఉన్నప్పుడు నలుగురు పాడి రైతుల్ని ఒక చోట గుమికట్టి పాడిని నమ్ముకుంటే బతుకు బండి లాగ వచ్చునని రుజువు చేసిన సినిమా ఇది. సంఘమంటే ఏమిటో తెలియని పాడి రైతులతో సంఘాన్ని పెట్టించి అమూల్ సంస్థకు బాటలు వేసిన సినిమా అది. పాడి సంఘం ఏర్పాటుకు చిన్న, మధ్యతరహా రైతులు చేసిన పోరాటం, చిన్న చిన్న విజయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రాన్ని ఐదు లక్షల మంది పాడి రైతులు తలా రెండు రూపాయలు వేసుకుని తీసిన సినిమా.