కష్టపడితేనే కలలు సాకారమవుతాయంటున్న లోకోపైలట్ మనీషా..

లారీ డ్రైవర్‌ బిడ్డ, వందేభారత్‌ లోకో పైలట్‌గా ఎలా ఎదిగింది ?

Update: 2025-10-13 10:17 GMT

బెంగళూరు-జైపూర్‌ మధ్య గంటకు 180కిలో మీటర్ల వేగంతో దూసుకు పోతోంది, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌. ఆ రైలులో సొగసైన కేబిన్‌లో కూర్చొని, దానిని నడిపిస్తున్న లోకో పైలట్‌ గుంటి మనీషా ఆలోచనలు అంతకంటే వేగంగా గతం వైపు పరిగెడుతున్నాయి.

లారీ డ్రైవర్‌గా పనిచేసే తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో చుట్టుముట్టిన కష్టాలు. చినుకులు పడితే చిత్తడిగా మారే చిన్న ఇల్లు, పూటగడిచేందుకే ఎదురైన ఇబ్బందులు, ఆకలిని ఆపుకొని గ్లాసుడు నీళ్లతో కడుపు నింపుకున్న రోజులు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పేదరికాన్ని మించిన కులవివక్ష వల్ల ఎదురైన అవమానాల గాయాలు గుర్తుకు వస్తున్నాయి.

కానీ ఎదురుగా కనిపించే రైల్వే ట్రాక్‌ ఆమె లక్ష్యాన్ని గుర్తు చేసింది. కొన్ని వందల మంది ప్రయాణీకులను క్షేమంగా గమ్యం చేర్చే బాధ్యత తన పై ఉందని గుర్తుకు వచ్చి అంతులేని ఆత్మవిశ్వాసం తన కష్టాలను మర్చి పోయేలా చేస్తోంది.

కొత్తూరు తాడేపల్లిలో పుట్టిన కల

‘ మాది ఏపీలోని, ఎన్టీఆర్‌ జిల్లా , కొత్తూరు తాడేపల్లి.

అతి పేద కుటుంబం. వాన పడితే అందరికీ సంతోషం కానీ మాకైతే భయం.

ఇల్లంతా కారిపోతుంది. మా నాన్న గుంటి నాగరాజు లారీ డ్రైవర్‌. దురదృష్టవశాత్తూ నా చిన్నతనంలోనే నాన్న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో కష్టాలు చుట్టుముట్టాయి. పూటగడిచేందుకే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అవన్నీ తట్టుకొని నిలబడ్డాను. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని, రైలు డ్రైవర్‌ కావాలని కలలు కన్నాను.

అవి నిజం అవ్వడానికి అంతులేని కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని అమ్మ , మా అక్క కవిత ప్రోత్సాహంతో శిక్షణ తీసుకొని నా కలను సాకారం చేసుకున్నాను. ఇపుడు హైస్పీడ్‌, వందేభారత్‌ రైళ్ల లోకో పైలట్‌గా పనిచేస్తున్నారు. విజయవాడ నుండి చెన్నయ్‌కి వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో పైలట్‌గా ఉద్యోగం చేస్తున్నాను.’ అని జీవన ప్రయాణం వివరించింది మనీషా.


జీవితంలో సాధించాలన్న మనీషా పట్టుదల ముందు పేదరికం, ఆకలి వంటి అవరోధాలు ఓడిపోయాయి.

ఏదో ఒక ఉద్యోగాన్ని ఎవరైనా సంపాదిస్తారు. కానీ, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్‌ ఉద్యోగం లక్ష్యంగా సాగిన ఆమె కృషి ఫలించింది.

అక్క ప్రోత్సాహంతో 

టీవీ నటిగా, ఎంటర్‌టైన్‌ మెంట్‌ ఈవెంట్‌ నిర్వాహకురాలిగా పనిచేస్తున్న మనీషా అక్క కవిత ప్రోత్సాహం లేక పోతే తను ఈ స్ధాయికి ఎదిగే దానిని కాదని మనీషా అంటుంది.

‘ అక్క నన్ను అక్కున చేర్చుకుంది. పదో తరగతి పూర్తయ్యాక ఐటీఐలో ఎలక్ట్రిషియన్‌ కోర్సు చేయమని ప్రోత్సహించింది. నాకు అది కొత్త ప్రపంచం. అక్కడి ఇన్‌స్ట్రక్టర్లు నా ఆసక్తిని గమనించి రైల్వేలో అవకాశం ఉందని చెప్పారు.

ఐటీఐ పూర్తయ్యాక రైల్వే శాఖలో లోకో పైలట్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించటానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. అక్క ఆర్ధిక సాయంతో బెంగళూరులోని ఓ అకాడమీలో పోటీ పరీక్షకు కోచింగ్‌ తీసుకున్నాను. సాధారణంగా లోకో పైలట్‌ ఉద్యోగాలకు పోటీ ఎక్కువ. రెండు మూడు ప్రయత్నాలు చేస్తే తప్ప ఉత్తీర్ణులుకావడం కష్టమని అంటారు. అలాంటిది తొలి ప్రయత్నంలోనే రైల్వే లోకోపైలట్‌ ఉద్యోగం సాధించాను. ’ అని ఆమె నవ్వుతూ చెబుతుంది. ఆ నవ్వులో కష్టాన్ని జయించిన గర్వం ఉంది.సంతోషంగా చెప్పింది మనీషా.


తొలి అవకాశం

కర్నాటక లోని బెంగళూరు డివిజన్‌ పరిధిలో 3 సంవత్సరాలు శిక్షణ పొందింది. శిక్షణ సమయంలోనే అత్యుత్తమ ప్రతిభను కనపర్చడంతో ఆమెకు బెంగళూరు-జైపూర్‌ గూడ్స్‌ రైలు లోకో పైలట్‌గా విధులు కేటాయించారు.

‘ శిక్షణ సమయంలోనే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రైలు నడపడం కేవలం మెకానికల్‌ పని కాదు. ప్రతి క్షణం జాగ్రత్త, సమయపాలన, ప్రయాణికుల భద్రత అన్నీ లోకో పైలట్‌ బాధ్యతలో భాగం. ఎంత సమర్థవంతంగా సమస్యలు ఎదుర్కోవాలి వంటి విషయాలపై పూర్తి అవగాహన కలిగించారు. శిక్షణ అనంతరం వెంటనే తిరుచినాపల్లి-విజయవాడ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో పైలట్‌గా అవకాశం ఇచ్చారు. అక్కడ సక్సెస్‌ అవ్వడంతో వందేభారత్‌ నడిపే అవకాశం వచ్చింది. బెంగళూరు-జైపూర్‌ మధ్య గంటకు 180కిలో మీటర్ల వేగంతో నడిచే వందేభారత్‌ లోకో పైలట్‌గా నెల క్రితమే అవకాశం ఇచ్చారు రైల్వే అధికారులు. ’ అని తనకు వచ్చిన అవకాశాన్ని వివరించింది ఆమె.


‘మొదటిసారి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపేటప్పుడు ఉత్కంఠగా అనిపించింది. అది సాధారణ రైలు కాదు, భారతదేశం గర్వించదగిన హై స్పీడ్‌ రైలు. కానీ స్టార్ట్‌ బటన్‌ నొక్కిన క్షణం నుంచీ ఆ భయం నమ్మకంగా మారిపోయింది,’’ అని మనీషా సంతోషంగా చెబుతోంది.

కళ్ల ముందే మరణాలు 

కానీ ఈ వృత్తిలో కొన్ని విషాదాలు భరించాలి. రైలు నడుపుతున్నపుడు కొందరు పట్టాలు దాటుతుంటారు. చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. 180 కిలో మీటర్ల వేగంగా వెళ్తున్న ట్రైన్‌కి సడన్‌ బ్రేక్‌ వేయడం కష్టం. ఒక్కరి కోసం ఆపితే ప్రయాణీకులంతా ప్రమాదానికి లోనవుతారు.

కనీసం అరగంట ముందు ట్రాక్‌కి ఎవరైనా అడ్డుగా ఉన్నారని తెలిసినపుడే ట్రైన్‌ అపడం సాధ్యం అవుతుంది. అని బాధగా చెప్పారు మనీషా.

పేదరికాన్ని జ‌యించింది

ఆమె పట్టుదల ముందు పేదరికం ఓడిపోయింది. ప్రతి అడ్డంకిని అవకాశంగా మార్చుకుంది. పోటీ పరీక్షలు, రాత్రిళ్లు చదువు, ఉదయాన్నే శిక్షణ, ఆర్థిక కష్టాల మధ్య తల్లి, అక్కలతో జీవితం... ఇవన్నీ ఆమె జీవిత యాత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.


‘నేడు నేను నడిపే వందేభారత్‌ రైలులో కూర్చున్న ప్రతీ ప్రయాణికుడు నాకు నా తండ్రి జ్ఞాపకంలా ఉంటాడు. ఆయన చనిపోయాక నేనూ మూ కుటుంబం చీకటిలో మిగిలిపోయాము. కానీ నేడు ఈ రైలు లైట్లు, ఆ వేగం మా జీవితాలను వెలుగులోకి తెచ్చాయి,’

‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడిపే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ విజయాన్ని మా అమ్మకు, అక్కకు అంకితం చేస్తున్నాను.

నా లాంటి పేద అమ్మాయిలకు ఇదొక పాఠం. కష్టపడండి కలలు తప్పకుండా నెరవేరుతాయి,’’ అని మనీషా చెబుతుంది.

మనీషా కథ చదివిన పాఠకులకు ఒక డౌట్‌ రావచ్చు. రైలు నడిపే వారికి జీతం, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయి? అని... ఇవిగో వివరాలు.

‘లోకో పైలట్‌’ కి జీతం, ఇతర సౌకర్యాలు ఎలా ఉంటాయి?

వందేభారత్‌ లోకో పైలట్‌ జీతం: ₹1 – ₹1.8 లక్షల మధ్య ఉంటుంది.

ఇతర భత్యాలు & సౌకర్యాలు

డ్యూటీ అలవెన్స్ (Running Allowance):

ప్రతి కిలోమీటరుకు ₹250–₹400 వరకు (రైల్వే జోన్‌ ఆధారంగా).

వందేభారత్‌ ట్రైన్‌ లో ఎక్కువ రన్ ఉండటంతో ఈ అలవెన్స్‌ చాలా ఉంటుంది.

రాత్రి & ట్రావెల్ అలవెన్స్:

రాత్రి షిఫ్ట్‌ డ్యూటీలకు ప్రత్యేక భత్యం.

మెడికల్ & హౌస్‌ సదుపాయాలు:

రైల్వే హాస్పిటల్‌ లో ఉచిత వైద్యం + రైల్వే క్వార్టర్‌.

ఫ్యామిలీ ప్రయాణ పాస్‌లు:

భార్య/భర్త, పిల్లలతో ఉచితంగా లేదా తగ్గింపు రేట్లతో రైలు ప్రయాణం.

పెన్షన్‌ & గ్రాట్యుటీ:

రిటైర్మెంట్‌ తర్వాత జీవితాంతం పెన్షన్‌, ఇతర రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌.

శిక్షణ & ప్రమోషన్‌ అవకాశాలు:

Assistant Loco Pilot → Senior Loco Pilot → Power Controller → Loco Inspector వంటి ప్రమోషన్‌ మార్గం ఉంటుంద.

Tags:    

Similar News