నెట్ ప్లిక్స్ ‘కురుక్షేత్ర’ వెబ్ సిరీస్ రివ్యూ

మహాభారతం కాదు, మానవ స్వభావం మీద యుద్ధం!

Update: 2025-10-13 11:28 GMT

మహాభారతం అంటే సాధారణంగా కథలు, శ్లోకాలు, దేవతలు గుర్తుకువస్తాయి. కానీ నెట్‌ఫ్లిక్స్ యొక్క తాజా యానిమేటెడ్ సిరీస్ “కురుక్షేత్ర”

మహాభారతాన్ని కొత్త కోణంలో చూపిస్తుంది — రక్తం, ధర్మం, మానవ భావాల తాత్విక సమరంగా. 18 రోజుల యుద్ధం… పాండవులు vs కౌరవులు…కానీ ఇక్కడ ధర్మం vs అహంకారం మధ్య యుద్ధం మనసులోనే మొదలవుతుంది. అదెలా చూపించారో చూద్దాం.

స్టోరీ లైన్

పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం... ఒక సంవత్సరం అజ్ఞాతవాసం. ధర్మానికి పరీక్ష పూర్తి చేసిన పాండవులు రాజ్యానికి తిరిగి వస్తారు . కానీ రాజ్యం మాత్రం మూసుకుపోయిన తలుపుల వెనుకే ఉంది. కౌరవుల సభలో మాటలు వాగ్దానాల్లా విరగిపోతాయి. ఐదుగురికి ఐదు ఊళ్లు ఇవ్వమన్న వినమ్ర విజ్ఞప్తికీ దుర్యోధనుడు తల వంచడు. అతని మొండితనం కేవలం అధికార దాహం కాదు — అది ఒక మానసిక యుద్ధం, "నాకు దక్కకపోతే ఎవరికీ దక్కకూడదు" అనే దురాశ రూపం.

ధృతరాష్ట్రుడి మూగ ప్రేమ, గాంధారి మౌనం, శకుని చెడ్డ మేధస్సు, కర్ణుడి అహంకారం, అశ్వద్ధామ దుర్బల వీరత్వం — ఇవన్నీ దుర్యోధనుడి పక్కన యుద్ధం చేసేవారు కాదు, అతని వినాశనానికి బాట వేసే నీడలు.

కృష్ణుడు — యుద్ధానికి రాని యోధుడు, కానీ యుద్ధాన్ని మార్చిన మేధావి. దుర్యోధనుడు ఆయన దగ్గరకి వస్తాడు. అర్జునుడు కూడా అదే క్షణంలో. ఒకరికి సైన్యం దక్కుతుంది, మరొకరికి సాక్షాత్ కృష్ణుడు. ఇది యుద్ధానికి మొదటి మలుపు.

యుద్ధం మొదలైనప్పుడు అర్జునుడు చేతులు వణుకుతాయి — తనవాళ్లను చంపి రాజ్యం ఏం సాధిస్తాను అని అడుగుతాడు.

అప్పుడు కృష్ణుడు సమాధానం చెబుతాడు కాదు — ఆ సమాధానం ‘గీత’గా మారుతుంది. యుద్ధం కొనసాగుతుంది. ధర్మం, అధర్మం మధ్య సరిహద్దులు చెరిగిపోతాయి.

ప్రతి బాణం ఒక నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.

ప్రతి మరణం ఒక తాత్విక ప్రశ్నని లేవనెత్తుతుంది.

మరి చివరికి ఎవరు గెలుస్తారు? తెలిసిందే అయినా ఓటిటి తెరపై చూస్తేనే బాగుంటుంది.

విశ్లేషణ

ఇతర మహాభారత కథనాలు సగటుగా మొత్తం ఇతిహాసాన్ని చూపిస్తే, “కురుక్షేత్ర” మాత్రం ఒకే దానిపై దృష్టి పెడుతుంది. అదే యుద్ధభూమి.

ఇక్కడ మాటలకంటే లోతైనది భావ గర్జన, ఇక్కడ ప్రతీ బాణం వెనుక తాత్వికత ఉంది, ప్రతీ మౌనం వెనుక ధర్మం నిలబడి ఉంది.

‘మహావతార్ నరసింహ’ తర్వాత నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో మహత్తర యానిమేటెడ్ సిరీస్ — “కురుక్షేత్ర.” హిందీలో రూపొందించిన ఈ సిరీస్ మహాభారతంలోని 18 రోజుల కురుక్షేత్ర యుద్ధాన్ని ఆధారంగా తీసుకుంది. కానీ ఇది కేవలం యుద్ధగాధ కాదు.

ఇది కుటుంబ గౌరవం, లోభం, ప్రతీకారం అనే మానవ భావాల గణితాన్ని తిరిగి రాసిన ప్రయత్నం.

ఉజాన్ గాంగూలీ రాసి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొదటి సీజన్‌లో యుద్ధం మొదటి 14 రోజులను చూపిస్తుంది. గుర్తుంచుకునే విధంగా మొదలవుతుంది ఈ ఎపిక్ సిరీస్ 18 ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. మొదటి సీజన్‌లో తొమ్మిది ఎపిసోడ్‌లు — అర్జునుడు, యుధిష్ఠిరుడు, అభిమన్యుడు వంటి పాత్రల దృష్టికోణంలో యుద్ధం అన్ పోల్డ్ అవుతుంది. రెండో సీజన్‌లో మిగిలిన తొమ్మిది పాత్రల మనస్తత్వాలు బయటపడతాయి. ప్రతి ఎపిసోడ్ ఒక పాత్ర యొక్క యుద్ధం — బాహ్యంగా కాదు, అంతర్ముఖంగా.

లెజెండరీ కవి గుల్జార్ వాయిస్‌లో సాగిన ఈ కథనం కేవలం వాయిస్ ఓవర్ కాదు. ఇది ఒక తాత్విక అనుభవం. ప్రతి ఎపిసోడ్ ఆయన స్వరం తాకినప్పుడు, రక్తపాతం కూడా కవిత్వంలా వినిపిస్తుంది. “నిజం ఒక్కటే కాదు... దానికి కూడా పతన రంగులు ఉంటాయి,” అని గుల్జార్ గళం చెబుతుంది. ప్రతి ఎపిసోడ్ ఒక మానవ విరుద్ధత. విజయం వెనుక ఉన్న నష్టాన్ని చూపించే అంతర్ముఖ యాత్ర.

మైనస్ లు

కానీ... యుద్ధం ఎంత అద్భుతంగా కనిపించినా, కథనంలో కొంత గందరగోళం. స్క్రిప్ట్ ఎప్పుడూ ప్రేక్షకుల కంటే ఒక అడుగు ముందుకెళ్తుంది —

మహాభారతం గురించి ఎక్కువ తెలియని వారిని గందరగోళానికి గురిచేస్తుంది, తెలిసినవారిని అసహనానికి దారి తీస్తుంది. ఫ్లాష్‌బ్యాక్‌లు చక్కగా ఉన్నా, వాటి టైమ్‌లైన్ జంప్స్ అర్థం చేసుకోవడం కష్టం. పాత్రల ప్రేరణలు, వారి లోతైన గాయాలు — అవి పూర్తిగా బయటపడవు.

వాస్తవికత, కళ, ఆధ్యాత్మికత కలిసిన సంధి.

యుద్ధభూమి అద్భుతంగా తీర్చిదిద్దారు. సైన్యాల ఊచకోత, అర్జునుడి బాణం చీల్చిన ఆకాశం, దేవతల జోక్యం. అన్నీ ఒకేసారి భవ్యం, హృదయాన్ని తాకుతాయి. ఆర్మర్ నుండి రథాల డిజైన్ వరకూ ప్రతి అంశం పరిశోధనాత్మకంగా రూపుదిద్దుకుంది. ప్రతి ఫ్రేమ్‌లో భారతీయ కళా నైపుణ్యం మెరిసిపోతుంది.

యానిమేషన్ – Netflix స్టాండర్డ్స్‌కి ఇంకా కొంచెం దూరం.

విజువల్స్ బాగున్నాయి, కాని మరింత డీటైల్ ఉండుంటే అనిపిస్తుంది. యుద్ధ దృశ్యాలు ఆకర్షణీయంగా ఉన్నా, కొన్ని ఫ్రేమ్‌లు భావోద్వేగం కోల్పోతాయి.ఇది భక్తి పూర్ణ చిత్రకళా ప్రయత్నం, కానీ Netflixలో ఉన్న అత్యుత్తమ యానిమేషన్ సిరీస్‌లతో పోల్చితే కొంచెం వెనుకబడి ఉంటుంది. “మహావతార్ నరసింహ” కంటే మెరుగైన పనితనం ఉన్నప్పటికీ, Netflixలో ఉన్న Love, Death & Robots వంటి డీటైల్డ్ యానిమేషన్లతో పోలిస్తే కొంత తగ్గిపోతుంది.

డైలాగ్స్ – తాత్వికతను కత్తిలా పదును పెట్టిన వాక్యాలు.

స్క్రీన్‌రైటింగ్ టీమ్ అద్భుత సమతుల్యత చూపింది. ధర్మం, కర్మ, విధి వంటి భావాలు తాత్వికం మాత్రమే కాకుండా, ప్రతి యోధుడి నిర్ణయాన్ని నడిపించే జీవిత సంఘర్షణలుగా చూపించారు. అర్జునుడి ప్రశ్న, కృష్ణుడి సమాధానం, కర్ణుడి ఆవేదన, భీష్ముడి నిశ్శబ్దం. ఇవి కేవలం సంభాషణలు కాదు; మానవ మనసు విరిగినప్పుడు వినిపించే సత్యాల ప్రతిధ్వని.

ఫైనల్ థాట్

మొత్తానికి… “కురుక్షేత్ర” అనేది ఒక శ్రవణానుభూతి – దాని బలం ‘స్వరాలు’, బలహీనత ‘సందర్భాలు’. “కురుక్షేత్ర – ధర్మం మాటలతో కాదు, స్వరాలతో గర్జిస్తుంది.”

ఎలా ఉంది, చూడచ్చా

ఇది ఒక కళాత్మక ప్రయత్నం — ప్రాచీన ఇతిహాసాన్ని ఆధునిక టెక్నాలజీతో కలిపిన ప్రయోగం. ఖచ్చితంగా చూడదగినదే.

ఎక్కడ చూడచ్చు

నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది

Tags:    

Similar News