‘మహాభారత్’ కర్ణుడు కన్నుమూత
క్యాన్సర్‌తో ముంబైలో తుదిశ్వాస విడిచిన నటుడు పంకజ్ ధీర్..
‘మహాభారత్’(Mahabharat) టీవీ సీరియల్‌లో కర్ణుడి పాత్రధారి పంకజ్ ధీర్(68) ఈ రోజు(అక్టోబర్ 15న) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కొన్ని మాసాల క్రితం క్యాన్సర్ నిర్ధారణ కావడంతో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. మొదట్లో కోలుకున్నా..ఆ తర్వాత మళ్లీ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ముంబైలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.
కర్ణుడి పాత్రకు విశేష ప్రజాదరణ..
బీఆర్ చోప్రా దర్శకత్వ వహించిన ‘మహాభారత్’ టీవీ సీరియల్‌లో నటించారు. అందులో ఆయన కర్ణుడి పాత్రలో కనిపించారు. పంకజ్ (Pankaj Dheer) చక్కటి నటనకు మంచి గుర్తింపు లభించింది. వాస్తవానికి మొదట అర్జునుడి పాత్రలో నటించాలని కోరారట. కానీ ఆయన కర్ణుడి పాత్రను ఎంచుకున్నారు.
సినిమాల్లోనూ..
చంద్రకాంత, హరిశ్చంద్ర, ససురల్ సిమర్ కా లాంటి టెలివిజన్ షోలలో కూడా కనిపించిన పంకజ్.. సనమ్ బేవఫా, సోల్జర్, బాద్షా చిత్రాల్లోనూ నటించారు. 2019లో వెబ్ సిరీస్ ‘పాయిజన్’లో కూడా కనిపించారు. చివరి సారిగా ధ్రువ్ తారా - సమయ్ సాది సే పరే (2024) టీవీ షోలో కనిపించారు.
డైరెక్టర్‌గా, యాక్టింగ్ అకాడమీలో శిక్షకుడిగా..
2014లో ‘మై ఫాదర్ గాడ్‌ఫాదర్’ చిత్రానికి దర్శకత్వ వహించారు. అంతకుముందు 2010లో ముంబైలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్థాపించిన అబ్బిన్నయ్ యాక్టింగ్ అకాడమీలో శిక్షకుడిగా పనిచేశారు.
పంజాబ్‌లో జన్మించిన పంకజ్.. చిత్రనిర్మాత CL ధీర్ కుమారుడు. నటన కంటే ముందు ఆయన డైరెక్టర్ కావాలనుకున్నారు.
పంకజ్ ధీర్ కుమారుడు నికితిన్ ధీర్ కూడా నటుడే. చెన్నై ఎక్స్‌ప్రెస్, జోధా అక్బర్, సూర్యవంశీ చిత్రాల్లో నటించాడు.
సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) పంకజ్ ధీర్ మృతికి సంతాపం తెలిపింది. అసోసియేషన్ మాజీ గౌరవాధ్యక్షుడి మరణం తమకు కలచివేసిందని అందులో పేర్కొన్నారు.
పంకజ్ మృతితో భారతీయ టెలివిజన్‌లో పౌరాణిక ధారావాహిక శకం ముగిసిందనే చెప్పాలి.
బీఆర్ చోప్రా దర్శకత్వ వహించిన ‘మహాభారత్’ పౌరాణిక ధారావాహిక టీవీ సీరియల్ దూరదర్శన్‌లో 1988 అక్టోబర్ 2న ప్రసారమైంది. 1990 జూన్‌లో ముగిసింది.