కృష్ణమ్మ: మూవీ రివ్యూ

కృష్ణమ్మ మూవీ చూడడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. నటీనటుల నటన, మనసును హత్తుకునే సన్నివేశాలు. సహజత్వానికి దగ్గరగా ఉన్న చిత్రీకరణ. నేల విడిచి, సాము చేయని పాత్రలు.

Update: 2024-05-11 10:57 GMT

(సలీం భాషా)


కృష్ణమ్మ సినిమా... భద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల), శివ (కృష్ణతేజ) అనే అనాధల కథ. ముగ్గురు చిన్నప్పటి నుంచి విజయవాడలోని వించిపేట లో ఉంటారు. భద్ర, కోటి, గంజాయి సరఫరా చేయడం వల్ల వచ్చిన డబ్బులతో బతికేస్తుంటారు. ఏ విధమైన లక్ష్యాలు, ఆశలు ఉండవు. వాళ్లలో శివ మాత్రం ఆ ఇద్దరు చేసే పనులు నచ్చక, ఒక స్క్రీన్ ప్రింటింగ్ షాప్ నడుపుతుంటాడు. అలా బతికేస్తున్న వాళ్ళ జీవితం,శివ జీవితంలోకి మీనా (అథిరా రాజ్) రావడంతో ఒక మలుపు తిరుగుతుంది. ఎటువంటి బంధాలు లేని భద్ర ను ఆమె అన్నయ్యగా భావించడం తో ఆమెకు ఒక సమస్య వచ్చినప్పుడు డబ్బుల కోసం వాళ్లు గంజాయి స్మగ్లింగ్ లోకి వెళ్లి అక్కడ పోలీసులకు పట్టుబడతారు. దాంతో పోలీసులు వాళ్లని వేరే కేసులో ఇరికిస్తారు. చివరకు శివ పోలీసుల చేతిలో చచ్చిపోవడంతో, వాళ్ళిద్దరూ జైలుకు వెళ్తారు. 12 సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత భద్ర, కోటీలు కలిసి పోలీసులతోపాటు వారి సమస్యకు కారణమైన వాళ్ళని కూడా చంపడం, ఆ క్రమంలో వాళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది.

ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయి. అయితే అటువంటి సినిమాల్లో తెలియని వ్యక్తుల మధ్య బంధం ఏర్పడడం, ఆ బంధం బలపడడం లాంటి ఎమోషనల్ పాయింట్స్ వంటి వాటితో కథ నడపడం జరిగింది. అనాధల మధ్య స్నేహ సంబంధాలు ఏర్పడడం, ఒకరి కోసం ఒకరు అని వాళ్ళు జీవితం గడపడం అన్నది ఈ కథల మూల సూత్రం.మొదటి నుంచి చివరి వరకు కూడా ఈ అంశాన్ని మనసుకు హత్తుకునేలా, పాత్రలతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీసిన సినిమాలు విజయవంతం అయ్యాయి. ఈ సినిమాలో కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు ఒకటి రెండు ఉన్నాయి. అదే మీనా, శివల మధ్య ప్రేమ. ఇటువంటి సినిమాల్లో కథనం చాలా ముఖ్యం. సినిమా మొదటి భాగం కొంచెం స్లోగా నడిపిన దర్శకుడు గోపాలకృష్ణ, రెండో సగంలో దాని కొంత వేగంగా నడిపినప్పటికీ, కొన్ని సీన్లు సాగదీయబడి, మెలో డ్రామా ఎక్కువయి సినిమాకు మైనస్ అయ్యింది. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాల కన్నా, కాసింత చూడదగ్గదిగా ఉండడానికి కారణమైన అంశాలు కొన్ని ఈ సినిమాలో ఉన్నాయి.

ఈ సినిమా ప్రధానంగా తన భుజాల మీద మోసింది, నటుడు సత్యదేవ్. ఈ మధ్యకాలంలో వైవిధ్య భరితమైన పాత్రలలో తన నటనను చూపించిన సత్యదేవ్ ఈ సినిమాలో కూడా మంచి ప్రయత్నమే చేశాడు. మీనా గా అథిరా రాజ్ ఈ సినిమాలో సర్ ప్రైజ్ ఎలిమెంట్. ఈ ఇద్దరు కలిసి సినిమాను కొంతవరకు నిలబెట్టారు. మిగతా నటీనటుల్లో ఏసీపీగా చేసిన నందగోపాల్ విలనీ సినిమాని ముందుకు నడపడానికి పనికి వచ్చింది. ఈ మధ్యకాలంలో ఒకటి రెండు సినిమాల్లో పోలీసు పాత్రలోనే నందగోపాల్ రాణించాడు. రెండో సగంలో తేనె పూసిన కత్తిలాంటి పాలిష్డ్ విలన్ గా బాగానే చేశాడు. మరో పోలీసు పాత్రలో రఘు కుంచే కొంచెం మెరిశాడు. ఈ సినిమాలో రఘు చెప్పిన డైలాగ్ ఒకటుంది." వాళ్లు నేరం చేసి శిక్ష అనుభవించిన వాళ్ళు కాదు. శిక్ష అనుభవించి నేరం చేస్తున్నారు". సినిమాలో ఈ డైలాగు ఒక్కమాటలో సినిమా గురించి చెప్పింది.

ఈ సినిమాలో ఫైట్లు బాగా చిత్రీకరించారు. ఇంకా ఈ సినిమాలో పోలీసులు నేరస్తులతో ఎలా వ్యవహరిస్తారు, ఎలా వాళ్ల మీద లేని నేరాన్ని మోపి చిత్రహింసలు చేస్తారు అన్నది బాగా చూపించారు. సినిమా చాలా భాగం విజయవాడలో దిగువ మధ్యతరగతి వాడల్లో చిత్రీకరించడం వల్ల కొంత సహజంగా అనిపిస్తుంది. మానవ సంబంధాలు ఎలా ఏర్పడతాయి, ఎలా గట్టిపడతాయి, ఎలా గాఢతను సంతరించుకుంటాయి అన్నది చూపించడం దర్శకులకు కత్తి మీద సామే. దర్శకుడు గోపాలకృష్ణ ఈ విషయంలో పాస్ మార్కులు తెచ్చుకున్నాడు. ఈ మధ్యకాలంలో వస్తున్న, వచ్చిన అన్ని సినిమాల లాగే ఈ సినిమా కూడా చాలా చోట్ల సాగదీయబడింది.

అయినప్పటికీ ఈ సినిమా చూడడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. కొంతమంది నటీనటుల నటన, మనసును హత్తుకునే కొన్ని సన్నివేశాలు. సహజత్వానికి దగ్గరగా ఉన్న చిత్రీకరణ. నేల విడిచి, సాము చేయని పాత్రలు. సహజత్వానికి దగ్గరగా ఉన్న పోలిసుల ప్రవర్తన, మానవీయ కోణాన్ని, అనాధలుగా ఉండడంలో ఉన్న బాధను కష్టాన్ని చాలా వరకు చక్కగానే చూపించడం వంటివి ఈ సినిమాకు కొంత వరకు చూడదగ్గదిగా చేశాయి.

తారాగణం: సత్యదేవ్, అథిరా రాజ్, కృష్ణ బురుగుల, కృష్ణతేజ, లక్ష్మణ్ మీసాల, అర్చన అయ్యర్, రఘు కుంచె, నంద గోపాల్

దర్శకత్వం : వి.వి. గోపాల కృష్ణ

రచన: రమేష్ ఎలిగేటి, వి.వి. గోపాల కృష్ణ

సంగీతం :కాల భైరవ

ఛాయాగ్రహణం :సన్నీ కూరపాటి

ఎడిటర్: నవీన్ నూలి

సమర్పణ: కొరటాల శివ

నిర్మాత: కృష్ణ కొమ్మాలపాటి

నిర్మాణసంస్థ: అరుణాచల క్రియేషన్స్

విడుదల తేదీ: మే 10, 2024

Tags:    

Similar News