Karnataka | రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్రకు బెయిల్‌..

కర్ణాటక హైకోర్టు శుక్రవారం నటి పవిత్ర గౌడకు షరతులకు కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.;

Update: 2024-12-17 10:05 GMT

రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలయిన నటి పవిత్ర గౌడ జైలు నుంచి మంగళవారం విడుదలయ్యారు. కర్ణాటక హైకోర్టు శుక్రవారం ఆమెకు షరతులకు కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. కన్నడ సినీనటుడు దర్శన్ తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో పవిత్ర గౌడ మొదటి నిందితురాలు. రెండో నిందితుడు దర్శన్. వీరితో పాటు మరికొంతమంది (ఆర్ నాగరాజు, అను కుమార్ అలియాస్ అను, లక్ష్మణ్ ఎం, జగదీష్ అలియాస్ జగ్గా ప్రదూష్ ఎస్ రావు) సహ నిందితులుగా ఉన్నారు. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ అరెస్టు అయ్యారు. అదే సమయంలో పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది సహ నిందితులను అరెస్టు చేశారు.

వైద్య కారణాలతో దర్శన్ విడుదల..

వైద్య కారణాలతో దర్శన్ ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు కర్నాటక హైకోర్టు ఆయనకు ఆరు వారాల పాటు ఉపశమనం కల్పించింది. నాలుగు నెలలకు పైగా జైలులో ఉన్న దర్శన్ అక్టోబర్ 30న బళ్లారి జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చారు.

రేణుకాస్వామి హత్య..

పోలీసుల కథనం మేరకు.. దర్శన్ అభిమాని చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి(33) దర్శన్ స్నేహితురాలయిన నటి పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడు. ఈ విషయం పవిత్ర దర్శన్‌కు చెప్పడంతో ఆయన పథకం ప్రకారం రేణుకాస్వామిని హత్య చేశారు. సినీనటుడు దర్శన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారని చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘ సభ్యుల్లో ఒకరైన రాఘవేంద్ర రేణుకస్వామికి ఫోన్ చేసి ఆర్‌ఆర్ నగర్‌లోని ఓ షెడ్డుకు రప్పించాడు. అదే షెడ్డులోనే రేణుకస్వామిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారు. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న కాలువ దగ్గర రేణుకాస్వామి మృతదేహం కనిపించింది. రేణుకాస్వామికి కరెంట్ షాక్ ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం జరిగి చనిపోయాడని పోస్ట్‌మార్టం రిపోర్టులో పేర్కొన్నారు. రేణుకాస్వామి హత్యకు పవిత్రే ప్రధాన కారణమని, ఇతర నిందితులను రేణుకస్వామికి హత్యకు దర్శన్ ప్రేరేపించాడని ఎఫ్ఐఆర్‌లో కనపర్చారు.

Tags:    

Similar News