ఈ ‘మ‌హారాజ‌’కుర్చీలో కూర్చోవల్సింది చిరంజీవే, కానీ....

చిరంజీవి తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. బ్యాక్ గ్రౌండ్ అనేది లేకుండా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయన నంబర్ 1 హీరోగా ఎదగడానికి కారణం.

Update: 2024-06-17 07:22 GMT

చిరంజీవి (Chiranjeevi) తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. బ్యాక్ గ్రౌండ్ అనేది లేకుండా ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఆయన నంబర్ 1 హీరోగా ఎదగడానికి కారణం.. కృషి, పట్టుదల.. అలాగే కెరీర్ ప్రారంభంలో వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేయడం. ఆ తర్వాత తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కమర్షియల్ కథలు ఎంచుకుని దూసుకుపోవడం. అయితే ఈ మధ్య ఆయన అంచనాలు తప్పుతున్నాయి.

ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో చేసిన గాడ్ ఫాధర్ యావరేజ్ అనిపించుకుంటే, భోళా శంకర్, ఆచార్య చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. అయితే ఆ సినిమాల్లో కథలకు ఆయన సెట్ కాలేదేమో కానీ నటనకు మాత్రం వంక పెట్టలేని విధంగా చేసారు. ఈ క్రమంలో ఆయన ఈ వయస్సులో ఎలాంటి సినిమాలు చేయాలి, చేస్తే బాగుంటుందనే డిస్కషన్ అభిమానుల్లో ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా విజయ్ సేతపతి హీరోగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘మ‌హారాజ‌’చూసిన వెంటనే ..అరే...మన చిరు చేయాల్సింది ఇలాంటి కథ కదా అంటున్నారు.

తెలుగులో ఏ సినిమా కూడా ఆడటం లేదు అనిపించుకున్న టైమ్ లో డబ్బింగ్ ‘మ‌హారాజ‌’ జనాలకు తెగ నచ్చేసింది. ఈ సినిమా రైట్స్ ని ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ కేవ‌లం రూ.2 కోట్ల‌ పెట్టి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఈ రైట్స్ లో శాటిలైట్ హ‌క్కుల‌ు కూడా కలిసి ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు బజ్ లేదు. అసలు సినిమా ఆడుతుందో లేదో తెలియదు. అందుకే బేరం ఆడి మరీ అంత తక్కువకు తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు లాభాల పంట పండిస్తోంది.

కేవలం థియేట్రిక‌ల్ నుంచే రూ.5 కోట్ల వ‌ర‌కూ రావొచ్చ‌ని లెక్కలు వేస్తున్నారు. నైజాం నుంచే రూ.2 కోట్లు రావొచ్చు అంటున్నారు. ఇంత పెద్ద హిట్ అయ్యింది కాబట్టి శాటిలైట్ క‌నీసంలో కనీసం రూ.3 కోట్లు వస్తాయనుకున్నా రూ.8 కోట్ల లెక్క తేలుతోంది. అంటే.. ఆరు కోట్ల లాభం అనే చెప్పాలి. ఇది అసలు ఎవరూ ఊహించని మొత్తం. ఈ సినిమా ఇంతలా జనాలకి నచ్చడానికి కారణం ఈ సినిమాకు రాసిన స్క్రీన్ ప్లే.

చూసిన వాళ్ళంతా ఈ సినిమా స్క్రీన్ ప్లేని తెగ మెచ్చుకుంటున్నారు. సినిమా ప్రారంభం మామూలుగా చాలా జోవియల్ గా మొదలైనా మెల్లమెల్లగా సీరియస్ టోన్‌లోకి మారుతుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి అదిరిపోయే కీ ట్విస్ట్ వస్తుంది. ఇక అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు ఊహకందని మలుపులు మనల్ని ఎగ్జైట్ చేస్తూనే ఉంటాయి. 'మహారాజ' సినిమా రెండున్నర గంటల్లో కొద్ది సేపు కూడా బోర్ కొట్టదు. ఎక్కడా అక్కర్లేని పాటలు, కమర్షియల్ ఎలిమెంట్స్ పేరిట ఫైట్స్ పెట్టలేదు. ఏ సీన్ ఎక్కడుండాలో పర్ఫెక్ట్ కొలతలతో తీసిన మూవీ 'మహారాజ'. అంత‌ర్లీనంగా క‌ర్మ సిద్ధాంతం తో ముడిప‌డి ఉన్నా కిక్ ఇచ్చే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌. స్టోరీ లైన్ గా చూస్తే రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగానే క‌నిపించినా ఓ మామూలు ప్రేక్షకుడుకి ఏమేమి కావాలో అన్ని ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ లు .. సేతుప‌తి యాక్ష‌న్ బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ఇలాంటి సినిమా కదా చిరంజీవి చేయాల్సింది అనిపిస్తుంది. డబ్బింగ్ అయ్యి రాకపోతే రీమేక్ చేయాలనిపించే మంచి కంటెంట్. ఇలాంటి కథను ఎంచుకంటే నటనకు అవకాశం ఉంటుంది. అలాగే యాక్షన్ కు స్కోప్ ఉంటుంది. ఖచ్చితంగా కొత్త జనరేషన్ ఆడియన్స్ ఇలాంటి పాత్రల్లో చిరంజీవిని చూడాలనే అనుకుంటున్నారు. కొత్త తరహా కథలు, కొత్త దర్శకులని ఓపిగ్గా వెతికితే ఇలాంటి కథలు బయటకు వస్తాయి.

ఇక విజయ్‌ సేతుపతి తన కెరీర్‌లోని 50వ సినిమా అయిన మహారాజకు నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించాడు. మమతా మోహన్‌దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది.మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఇంతకీ చిత్రం కథేంటి?

మహారాజ (విజయ్ సేతుపతి) ఓ బార్బర్. భార్య, కూతురు ఉంటారు. ఓ రోజు యాక్సిడెంట్‌లో భార్య చనిపోతుంది. కూతురిపై ఇనుప చెత్త డబ్బా పడటంతో ఆమె ప్రాణాలతో బయటపడుతుంది. తన కూతుర్ని కాపాడిన చెత్త డబ్బాకు లక్ష‍్మీ అని పేరు పెట్టి సొంత మనిషిలా చూసుకుంటారు. అయితే ఓ రోజు చెవిపై కట్టుతో పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మహారాజ.. తన లక్ష‍్మీ కనిపించకుండా పోయిందని కంప్లైంట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది?అస‌లు మ‌హారాజాకు జ‌రిగిన అన్యాయ‌మేంటి? ఎన్ని అవ‌మానాలు ఎదురైనా ల‌క్ష్మిని వెతికి పెట్టాలంటూ మ‌హారాజా పోలీస్ స్టేష‌న్ చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాడు? పోలీసులు లక్ష‍్మీని పట్టుకుని మహారాజకు అప్పగించారా లేదా అనేదే స్టోరీ.

Tags:    

Similar News