'పవర్' పోరాటమే అసలు కథ?

థియేటర్ల బంద్ వెనుక స్క్రిప్ట్ ఎవరిది?;

Update: 2025-05-26 08:16 GMT

"ఇండస్ట్రీ అంటే కేవలం లైట్లు, కెమెరా, యాక్షన్ మాత్రమే కాదు... నిశబ్ద రాజకీయాలు కూడా"

టాలీవుడ్ లో థియేటర్ బంద్ ప్రపోజల్ వెనుక అలాంటి రాజకీయాలు ఉన్నాయా, అందుకోసం ఎవరైనా పెద్దలు స్క్రీన్‌ప్లే డిజైన్ చేసి ప్లే చేస్తున్నారా?

ఒకవైపు ఎగ్జిబిటర్లు పర్సంటేజ్‌ లాభాల్లో భాగస్వామ్యం కోరుతూ థియేటర్ల బంద్‌ సిద్ధమయ్యామంటే, మరోవైపు కొందరు నిర్మాతలు దీన్ని " పాలిటిక్స్ తో కూడిన బిజనెస్ గేమ్" గా అభివర్ణిస్తున్నారు.

అందుకు కారణం జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం జూన్ 12న విడుదల అవుతుంది. ఈ రెండు దగ్గర పెట్టి చూస్తే పజిల్ విడిపోతుందని అంటున్నారు.

ఇది యాదృచ్ఛికమా? లేక ప్లాన్‌ చేసిన "పొలిటికల్ ప్లాట్ ట్విస్ట్"?

"ఓ హీరో తో లేదా రాజకీయ నాయకుడుతో విరోధం ఉండొచ్చు... కానీ ఒక కథా నాయ‌కుడి కథ (సినిమా)ని అడ్డుకోవడం అంటే – ప్రేక్షకుడిని బ్లాక్ మెయిల్ చేయటమే!. ఇది కేవలం లాభనష్టాల తర్కం కాదు — ఓ వ్యక్తిని రాజకీయంగా ఎదగకుండా చూడాలన్న కుట్ర" అంటున్నారు పవన్ అభిమానులు, జనసేన పార్టీ వారు.

ఇప్పటికే మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు థియేటర్స్ మూసివేత నిర్ణయం ఎందుకు వచ్చిందని, విచారణ చేయాలని అధికారులను ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ ఆదేశించారు.

అలాగే తెలుగు చిత్ర పరిశ్రమపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా.. తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారా అని పవన్ పేషీ ప్రశ్నించింది.

గత ప్రభుత్వం సినిమా రంగంవారిని, అగ్ర నటులను ఛీత్కరించిన తీరును గుర్తు చేసింది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని స్పష్టం చేసింది.

అల్లు అరవింద్ వ్యాఖ్యలు

ఈ టైమ్ లోనే ఆ నలుగురు నిర్మాతలు పవన్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ నలుగురిలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారని వినిపించాయి. దీంతో ఆయన స్వయంగా ఆదివారం సాయంత్రం స్పందించారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడారు. కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు:

“పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసమే!”

“ఆ నలుగురిలో నేను లేను. ఎప్పుడో సంబంధాలు తెంచుకున్నాను. . కొవిడ్ సమయంలోనే బయటకు వచ్చేశాను. నా పేరు వాడొద్దు ”

“తెలుగు రాష్ట్రాల్లో నాకు కేవలం 15కి మించని థియేటర్లే ఉన్నాయి. లీజు పూర్తయ్యాక వాటిని రెన్యువల్‌ చేయొద్దని స్టాఫ్‌ కు ఎప్పుడూ చెబుతుంటాను.”

ఎవరు స్క్రీన్ మీద? ఎవరు స్క్రీన్ వెనుక?

అల్లు అరవింద్ కూడా ఇదే విషయం ప్రస్తావించటం లో కొన్ని ప్రశ్నలు జనాలపైకి వదిలినట్లైంది . ఒక సినిమా రిలీజ్ కు ముందే థియేటర్ బంద్ అనటం కావాలని కొందరు చేస్తున్న ప్రయత్నమా?

థియేటర్ల బంద్ టైమింగ్ యాదృచ్ఛికమా?

పర్సంటేజ్ పద్దతే నిజంగా ఈ వివాదానికి మూలమా?

లేక పవన్ సినిమాను అడ్డుకునే రహస్య యత్నమా?

ఈ కథ ముగియటం అంత సులువు కాదు. ఇది స్క్రీన్‌మీద జరిగే సినిమా కాదు. స్క్రీన్ వెనుక నడిచే స్క్రిప్ట్.

ఏదైమైనా ఎన్ని రాజకీయాలు నడిచినా, గేమ్స్ జరుగుతున్నా ...థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రావ‌డం లేదన్నది నిజం. అందుకే ఆదాయాలు త‌గ్గుతున్నాయి. అటు ఎగ్జిబీట‌ర్ల‌కూ, ఇటు డిస్టిబ్యూట‌ర్ల‌కూ, నిర్మాత‌కూ డ‌బ్బులు రావాలంటే ముందు ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావాలి. అది జరగనప్పుడు ఎవరెన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా పెద్దగా కలిసొచ్చదేమీలేదు. ఒకరి మీద మరొకరు అక్కసు వెల్లగక్కుకోవటం తప్పించి.

Tags:    

Similar News