హారర్ థ్రిల్లర్: హన్సిక '105 మినిట్స్' (ఆహా) మూవీ రివ్యూ!

ఈ మూవీ కాన్సెప్ట్ రాసుకున్న డైరక్టర్ కి, దాన్ని న‌మ్మి చేసేందుకు ముందుకొచ్చిన ఆర్టిస్ట్‌, నిర్మాత‌కు చాలా ధైర్యం కావాలి. అలాంటి ఓ ప్రయోగాన్ని హ‌న్సిక‌ చేసింది.

Update: 2024-06-12 11:15 GMT

ఒకే పాత్ర చుట్టూ తిరిగుతూ, దాదాపు ఒకే ఇంట్లో సాగే కథ సినిమా తీసి ప్రేక్ష‌కుల్ని రెండున్న‌ర గంట‌లు థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టడం చాలా కష్టం. ఇలాంటి కాన్సెప్ట్ రాసుకున్న డైరక్టర్ కి.. దాన్ని న‌మ్మి చేసేందుకు ముందుకొచ్చిన ఆర్టిస్ట్‌, నిర్మాత‌కు చాలా ధైర్యం కావాలి. అలాంటి ఓ ప్రయోగాన్ని హ‌న్సిక‌ చేసింది. ప్రయోగంగా చూసి హన్సికను, ద‌ర్శ‌క నిర్మాత‌లిద్ద‌ర్నీ అభినందించగలం. అయితే తీసే వాళ్ల సంగతి ఎలా ఉన్నా చూసేది మనమే కాబట్టి ...ఆ ప్ర‌యోగాన్ని ఎంత ఆస‌క్తిక‌రంగా తెర‌పై ఆవిష్క‌రించారు అనే విషయం ముఖ్యం. ఈ సినీ ప్రయోగం ఇంట్రస్టింగ్ గా చివరి దాకా చూసేలా ఉందా... అసలు కంటెంట్ ఏంటి.. ఏ ధైర్యంతో తీసారో చూద్దాం.

కథేంటి

జానర్ పరంగా ఇదో హారర్ థ్రిల్లర్. జాను (హన్సిక) కారులో ఆఫీస్‌ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తూంటే మధ్య దార్లో ఓ అదృశ్య శక్తి తనను వెంటాడుతున్నట్లు అనిపిస్తుంది. కాసేపటికి కళ్ల ముందు... గాలిలో తన నిలువెత్తు రూపం తనకు స్పష్టంగా కనిపించి తనను హత్యచేసినట్లు అనిపించి క్షణాల్లో మాయం అవుతుంది. అదే ఆలోచనలో భయంతో కంగారుతో జాను ఇంట్లోకి వెళ్తుంది. అయితే అదే సమయంలో భారీగా వర్షం కురుస్తూంటుంది. ఇంట్లో కరెంట్‌ పోతుంది. కొవ్వొత్తి వెలిగిస్తూంటే కొన్ని భయానక శబ్దాలు వస్తుంటాయి.

అలా అంత‌కు ముందు వెంటాడిన ఆ అదృశ్య శ‌క్తి.. తన ఇంట్లోకి వస్తుంది. అంతేకాకుండా త‌న‌ను ఇంట్లోనే ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం మొద‌లు పెడుతుంది. 'నీప్రేమ కావాలి.. నీ కోసం పోయిన నా ప్రాణం కావాలి' అంటూ ఆ అదృశ్య శక్తి ఆమెను వెంటాడుతూ ఉంటుంది. ఒక వైపు నుంచి ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. మరో వైపు నుంచి డోర్ బెల్ మోగుతూ ఉంటుంది. కానీ తీసే అవకాశం ఆమెకి లేకుండా పోతుంది.

ప్రాణాల‌ను అర చేతిలో పెట్టుకుని ఆ ఇంటి నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంది జాను. కానీ, ఇంట్లో ఉన్న శ‌క్తి త‌న‌ను అడ్డుకుంటుంది. త‌న మ‌ర‌ణానికి జానునే కార‌ణ‌మ‌ని.. తాను పెట్టే చిత్రహింసను అనుభ‌వించాల్సిందే అంటూ భయపెడుతూ ఓ మగ గొంతు అరుస్తుంది. మ‌రి ఆ ఇంటి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డిందా? ఆ భయపెట్టే శక్తి ఏమిటి... ఆ గొంతు ఎవరిది. అతని మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే...

సింగిల్ క్యారక్టర్ తో కథ నడపాలనుకుని దర్శకుడు ఆ దిశగా సీన్స్ రాసుకుని ముందుకు వెళ్లాడు కానీ వాటిని జనం చూస్తారా చూడరా అని పట్టించుకున్నట్లు లేడు. హన్సిక కూడా తనో ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాను అనుకునే వరకే పట్టించుకున్నట్లు ఉంది. ఇలాంటి స్క్రిప్టులకు స్క్రీన్ ప్లే టైట్ గా ఉంటే కానీ వర్కవుట్ కాదు. ఎంతసేపూ హన్సిక ని ఓ అదృశ్య శక్తి భయపెడుతోందనే విషయం చెప్తూ సాగతీస్తారు. అవే సీన్స్ రిపీట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఆ శక్తి ఎవరో చివరి దాకా రివీల్ కాదు. హన్సిక మొదటి నుంచి చివరి దాకా అరస్తూ, ఏడుస్తూ బాధతో కేకలు వేస్తూంటే విసుగ్గా అనిపిస్తుంది. అక్కడ అదృశ్య శక్తి... హన్సికను హింసలు పెడుతున్నట్లు అనిపించదు. మనని హింసిస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇంతోటి సినిమాకు మళ్లీ సీక్వెల్ ప్రకటన ఒకటి కామెడీగా.

ఇక టైటిల్ 105 అని ఎందుకు పెట్టారు అంటే... ఏంజెల్ నెంబర్ 105 అని ఓ థీరి ఉంది. మీరు ఈ సృష్టిలో ఒంటిరి కాదు అని చెప్పటం ఆ థీరి ఉద్దేశ్యం. మీలో మార్పుకు, పరివర్తనకు సంబంధించిన అంకె ఇది. పూర్తిగా పాజిటివ్ అంశాలపై ఫోకస్ చేయాలని చెప్పటం ఈ అంకె ఉద్దేశ్యం. అయితే సినిమాలో అదేమీ రిఫ్లెక్ట్ కాదు. డైరక్టర్ కథలో సస్పెన్స్ మెయింటైన్ చేద్దామనుకున్నాడు కానీ అసలు మొత్తం అర్ధం కాకుండా సినిమా తీస్తున్నాని అర్దం చేసుకోలేకపోయాడు.

హన్సిక కు మంచి మార్కులు

జాను పాత్రలో హన్సిక వందకు వంద శాతం ప్రయత్నించింది. సినిమాను తన భుజాల మీద మోసే ప్రయత్నం చేసింది. నటన చూపిద్దామనకుంటే అది ఆక్రందనలకే పరిమితం అయ్యింది. మిగతా పాత్రలు లేవు కాబట్టి ఇంక చెప్పుకునేదేమీ లేదు.

చూడచ్చా

హన్సిక ఉంది కదా అని కాస్తంత గ్లామర్ ఎక్సపెక్ట్ చేస్తే దెబ్బ తింటారు. సింగిల్ క్యారక్టర్ తో మీరేదన్నా చేయాలనుకుంటే ఎలా తీయకూడదో రిఫరెన్స్ గా చూడదగ్గ సినిమా ఇది. అలాగే మీరు హన్సిక వీరాభిమాని అయినా చూడచ్చు.

ఎక్కడ చూడచ్చు

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.

Tags:    

Similar News