వెట్రీమారన్‌ ‘విడుదల 2’ ఓటీటీ రివ్యూ

తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు సామాజిక అంశాలతో కూడి ఉండటంతో ఇక్కడ మనవాళ్లలో ఓ వర్గం బాగా కనెక్ట్ అవుతుంటారు.;

Update: 2025-01-25 09:30 GMT

తమిళ దర్శకుడు వెట్రిమారన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు సామాజిక అంశాలతో కూడి ఉండటంతో ఇక్కడ మనవాళ్లలో ఓ వర్గం బాగా కనెక్ట్ అవుతుంటారు. ఆ క్రమంలో విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'విడుదల -1' చిత్రం ఇక్కడ బాగానే ఆడింది. ఆక్రమంలో ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'విడుదల-2' తెరకెక్కింది. ఇళయారాజా సంగీతం అందించిన ఈ చిత్రం (డిసెంబర్‌ 20) ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మహారాజా లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత విజయ్‌ సేతుపతి నుంచి వచ్చిన ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. అయితే అన్ని వర్గాల వారికి నచ్చలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ‘విడుదల 2’ లో కథేంటి, ప్లస్ లు, మైనస్ లు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

'విడుదల -1' చిత్రం ప్రజాదళం నాయకుడు పెరుమాళ్‌(విజయ్‌ సేతుపతి) అరెస్ట్‌తో ముగుస్తుంది. దాని కంటిన్యూషన్ గా కస్టడీలో ఉన్న పెరుమాళ్‌ విచారణతో పార్ట్‌ 2 ప్రారంభం అవుతుంది. పెరుమాళ్‌ అరెస్ట్‌ విషయం బయటకు రానివ్వకూడదు అనుకుంటుంది ప్రభుత్వం. అతన్ని మరో క్యాంపుకు తరలించి, అక్కడే ఎన్‌కౌంటర్‌ చేయాలని ప్లాన్‌ చేస్తారు. ఆ క్యాంపుకి అడవి మార్గం ద్వారానే వెళ్లాలి. కొమరన్‌(సూరి)తో కలిసి మరికొంత మంది పోలీసులు పెరుమాళ్‌ని తీసుకెళ్తారు. ఈ క్రమంలో అసలు పెరుమాళ్ ఎవరనే కథ రివీల్ అవుతుంది.

స్కూల్‌ టీచర్‌గా పెరుమాళ్‌ పనిచేస్తూంటాడు. అయితే అతనికి పెత్తందారీ విధానాలు నచ్చవు. ఆ క్రమంలో జమిందారి వ్యవస్థ చేసే అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కేకే(కిశోర్‌) పరిచయం అవుతాడు. అతనితో కలిసి జమిందారీ వ్యవస్థ చేస్తున్న ఆగడాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో మెల్లిగా దళ నాయకుడిగా మారతాడు. ఈ ఉద్యమ ప్రయాణంలో ఫ్యాక్టరీ యజమాని కూతురు మహాలక్ష్మి(మంజు వారియర్‌) తో ప్రేమలో పడతాడు.

కానీ మొదటి నుంచి అహింసను ఇష్టపడే పెరుమాళ్‌ కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తన ఉద్యమాన్ని హింసాత్మక బాటలో నడిపించాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. తన మిత్రుడు కె.కె హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు పెరుమాళ్‌ కత్తి పట్టాల్సి వస్తుంది. దాంతో తన ఉద్యమాన్ని హింసాత్మక బాట పట్టించడం.. ఈ క్రమంలో ఆ హత్యకు పాల్పడిన జమిందారుల్ని, అధికారుల్ని తను వేటాడి చంపుతాడు. అయితే పెరుమాళ్ ఆధ్వర్యంలో నడిచే ప్రజా దళాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వంతో కలిసి జమీందార్లు కుట్ర చేస్తారు. దాని పర్యవసానాలు ఏమిటి? పార్ట్‌ 1లో జరిగిన రైలు ప్రమాదం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? పోలీసు కస్టడీ నుంచి పెరుమాళ్‌ తప్పించుకున్నాడా లేదా? కానిస్టేబుల్ సూరి తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని ఎలా మార్చింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

పిల్లలకు పాఠాలు చెప్పే మాస్టార్‌గా ఉన్న పెరుమాళ్‌ను ఉద్యమం వైపు ఎలా అడుగులు వేసాడు అనేది ప్రధానంగా చూపించారు ఈ సెకండ్ పార్ట్ లో . అలాగే షుగర్ ఫ్యాక్టరీ లో కార్మికుడి హత్య కేసు విషయంలో అక్కడి కార్మికులందరితో కలిసి పోరాటం చేయడం వంటి ఎపిసోడ్స్ కొంత వరకూ ఉత్కంఠగానే సాగింది. ఈ క్రమంలో కమ్యూనిస్టు ఉద్యమాలు ఎలా మొదలవుతాయి? వారి పంథా, సిద్ధాంతం ఏం చెబుతుంది? అనే విషయాలు వెట్రిమారన్ చర్చించారు.

అయితే కొంత స్లో గానూ,సిద్దాంతాల వివరణతోనూ నడవడం సామాన్య ప్రేక్షకుడికి కొరుకుడు పడదు. పోలీసులకు, పెరుమాళ్‌ దళ సభ్యులకు మధ్య జరిగే కాల్పుల ఎపిసోడ్‌ ఎంత సేపు ఉన్నా అవ్వక విసుగిస్తాయి. ఫస్ట్ పార్ట్ లో కుమరేశన్‌ పాత్రలో సూరి (Soori)పాత్ర హైలెట్..సెకండ్ పార్ట్ లో ఆ పాత్ర వైపు నుంచి కథ చెప్తారు అనుకుంటే అది పెరుమాళ్ వైపుకు తిరిగటం ఊహించని ప్రేక్షకుడికి సినిమాపై ఆసక్తి తగ్గిపోతుంది. ఇవి చాలదన్నట్లు మూడో పార్ట్ కోసం కథను అసమగ్రంగా ముగిస్తారు. ఈ కథ కోసం వెట్రిమారన్ చాలా రీసెర్చ్ చేసి అదంతా సినిమాలో చూపించాలనే తాపత్రయం కనపరుస్తారు. కథకు ఎంత అవసరమో అంతే చూపిస్తే బాగుండేది.

చూడచ్చా

నక్సల్ ఉద్యమాన్ని కళ్లకి కట్టినట్టు చూపించే ఈ చిత్రం అలాంటి కథాంశాలు కోరుకునేవారికి నచ్చుతుంది. మిగతా వారికి సోసో గా అనిపిస్తుంది. అలాగే స్త్రీలను వివస్త్రల్ని చేసి కొట్టడం.. దారుణమైన హింస.. పోలీసులు, దళ సభ్యులు ఒకర్నొకరు చంపుకోవడం రక్తపాతం.. వంటివి ఫ్యామిలీలతో చూడాలనుకునే వారికి కాస్తంత ఇబ్బందే. ఇళయరాజా సంగీతం బాగుంది కానీ అద్భుతమైతే కాదు. కెమెరా వర్క్ సినిమాకు కావాల్సినంత సహజత్వం తెచ్చిపెట్టింది. వెట్రిమారన్ దర్శకత్వం ఎప్పుడూ బాగుంటుంది. కథాంశమే ఆకట్టుకునేది కాదు.

ఎక్కడ చూడచ్చు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో తెలుగులో ఉంది

Tags:    

Similar News