దిల్ రాజు vs మీడియా

అవును! ఇప్పుడిదే ట్రెండ్:;

Update: 2025-05-27 05:16 GMT

"సినిమా బిజినెస్ లో ఏదైనా పొరపాటు జరిగిందంటే... మీడియానే కారణం!"

ఇంతవరకూ 'సినిమాలు ఆడకపోతే — రివ్యూలు దారుణంగా రాశారు',

'లీకులు వచ్చాయంటే — మీడియానే స్పై!',

ఇప్పుడు 'థియేటర్లు బంద్ అనే గందరగోళం వచ్చింది అంటే — మీడియా తప్పుగా ప్రచారం చేసింది!'

సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా… వెంటనే వచ్చే డైలాగు— “అంతా మీడియానే చేసింది!”

మీడియాని టార్గెట్ చేసి తప్పుకోవటం సినిమా పరిశ్రమకు అలవాటైపోతోంది..కాదు కాదు అలవాటైపోయింది. ఎందుకంటే సినిమా మీడియాలో ఎక్కువ శాతం తాము ఇచ్చే యాడ్స్ మీద డిపెండ్ అవుతారని వాళ్లకు స్పష్టంగా తెలుసు. వాళ్లేమీ తిరిగి కౌంటర్ ఇవ్వరని తెలుసు. అందుకే పదే పదే అదే డైలాగ్ మళ్ళీ వినిపిస్తోంది — “అంతా మీరే చేశారు!”

ఈ మాట ఏదో సినిమాలో డైలాగ్ కాదు. ఇది “బొమ్మరిల్లు” ఫేమ్ దిల్ రాజుగారి మూడ్‌ను గుర్తు చేసే డైలాగ్. ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్ మీట్స్ చూస్తే, కౌంటర్లన్నీ మీడియా బాద్యతలపై సూటిగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా జూన్ 1న థియేటర్లు బంద్ అవుతాయన్న ప్రచారం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.

దిల్ రాజు అంటున్నది ఏంటి?

థియేటర్ ఎగ్జిబిటర్ల సమస్యలు నిజమే అన్న దిల్ రాజు, వాటికి ఇప్పటివరకు సరైన పరిష్కారం రాకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు.

తన దగ్గర ఉన్న థియేటర్ల కౌంట్ కూడా పబ్లిక్ చేశారు.

కానీ అసలు వివాదం – బంద్ వార్త గురించి మాట్లాడినప్పుడు మాత్రం, మీడియానే ఈ ఇష్యూని తప్పుగా కమ్యూనికేట్ చేసిందని ఆరోపించారు.

జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే వార్త నిజం కాదు, కానీ ఆ కోణంలోనే జనానికి, ప్రభుత్వానికి ఇంప్రెషన్ ఇచ్చేలా వార్తలు వచ్చాయని తేల్చారు.

మరి ఇక్కడ ఏమైంది?

"ఇండస్ట్రీలో ఒక వార్త బయటకు వస్తే, అది true or false అని మీడియా నిర్ణయించదు. స్పందించాల్సింది నిర్మాతలే. స్పందించకపోతే అసలు కథే అదే అవుతుంది."

దిల్ రాజుగారి స్థాయిలో ఉన్న ఒక నిర్మాతగా, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా, ఇండస్ట్రీని లీడ్ చేస్తున్న వ్యక్తిగా, ప్రొయాక్టివ్‌గా సోషల్ మీడియాలో స్పందించాలి. సినిమా బిజినెస్‌లో క్లారిటీ communication తప్పనిసరి. ఏదైనా అనర్థక ప్రచారం వస్తే వెంటనే ఖండించాలి. కానీ ఇక్కడ జరిగిందేమిటంటే... ఒకవైపు మౌనం, మరోవైపు మీడియాపై అభ్యంతరాలు.

ఒకవేళ నిజంగా మీడియా తప్పుగా ప్రచారం చేస్తే, వెంటనే రిపోర్ట్ ఖండించి క్లారిటీ ఇచ్చే బాధ్యత ఎవరిది?

ఫిల్మ్ ఛాంబర్? గిల్డ్? లేదా ఆ వార్తలపై నోరు విప్పే పెద్ద నిర్మాతలదేనా?

అయితే ఏదీ జరగలేదు. ఒక సోషల్ మీడియా పోస్టు కూడా పెట్టలేదు. కానీ…డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఓ అధికారిక ప్రకటన రావడంతోనే అన్నీ కదలికలోకి వచ్చాయి. అప్పటికి ఆలస్యం అయ్యింది.

అల్లు అరవింద్ vs దిల్ రాజు – టోన్ డిఫరెన్స్ స్పష్టంగా కనిపించింది!

ఒకవైపు అల్లు అరవింద్ తన ప్రెస్ మీట్‌లో సున్నితంగా, సాఫీగా మాట్లాడారు. మీడియా, ప్రేక్షకులపై బాధ్యతతో స్పందించారు. కానీ దిల్ రాజు మాత్రం మీడియా పైనే నేరుగా నెపం వేసినట్టుగా మాట్లాడటం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది.

ఏదైమైనా మీడియా పాత్రను మర్చిపోకండి!

మీడియా అంటే పబ్లిక్‌తో, పాలసీ మేకర్స్‌తో సినిమా వర్గాల్ని కలిపే బ్రిడ్జ్.

ఒకప్పుడు రామోజీ రావు గారు స్పష్టంగా చెప్పారు:

“పబ్లిక్ కు నిజాల్ని అర్థమయ్యేలా చెబితే, అది మీడియా విజయం.”

అయితే ఆ నిజాలు చెప్పేందుకు అవకాసం ఇవ్వాలి కదా.

“సినిమా ఒక బిజినెస్. ప్రతి డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ ఒక బిజినెస్‌మేనేజ్‌మెంట్ మోడల్‌లో పనిచేస్తున్నారు. కానీ ఈ బిజినెస్ లో జరగుతున్న కమ్యూనికేషన్ ఫెయిల్యూర్‌ను మీడియా మీదకు నెట్టేయడం వ్యవస్థను బలహీనపరచడమే.”

“మీడియా రివ్యూలతో సినిమాలు బెదరిపోదు, కంటెంట్ బలహీనమైతే టికెట్ కౌంటర్ వద్దే దాని లైఫ్ తేలిపోతుంది!”

వాస్తవానికి ఈ రోజుల్లో, చాలా వార్తల జర్నలిజం ఆన్‌లైన్‌లో జరుగుతోంది, అంటే ఒక కథనాన్ని ముందుగా ప్రచురించాలనే పోటీ తారాస్థాయికి చేరుకుంది. తాజా సమాచారానికి ప్రాధాన్యత పెరిగిపోవటంతో, సంఘటనల యొక్క విస్తృత సందర్భం చాలా వరకు తగ్గిపోతుంది, ప్రపంచంలో వాస్తవానికి ఏమి జరుగుతుందో సమాజం పూర్తిగా తెలియని డిస్‌కనెక్ట్ చేయబడిన దృక్పథంతో ఉండాల్సి వస్తోంది. దాంతో ఈ ప్రక్రియలో, సాధారణ పౌరుడు కొంచెం దూరంగా ఉంటాడు.

అసలు విషయంలోకి వస్తే…

థియేటర్ ఎగ్జిబిటర్ల సమస్యలు నిజమే. రెవెన్యూ షేరింగ్, మెయింటెనెన్స్ ఖర్చులు, టికెట్ ధరల గందరగోళం అన్నీ పచ్చి వాస్తవాలే.

అయితే ఈ సమస్యలపై స్పష్టత ఇవ్వకపోవడం వల్లే బంద్ అన్న ప్రచారం పెద్ద సునామీలా మారింది.

ఇండస్ట్రీ పెద్దలు కూర్చుని ఓ మెమో విడుదల చేస్తే చాలు — సమస్య ఆగేది.

ఒక సింపుల్ ట్వీట్ వేసినా చాలు — క్లారిటీ వచ్చేది.

కానీ దాని బదులుగా మౌనంగా ఉండి, చివరికి మీడియా మీద నింద వేయడం మాత్రం ఎంతవరకూ సమంజసం?

అసలు సమస్య: ఐక్యత లోపం

ఇది మీడియా తప్పు కంటే ముందు, ఇండస్ట్రీలో ఐక్యత లేకపోవడమే అసలైన సమస్య. ఒకటి చెప్పేవారు, మరోసారి మళ్లీ విభిన్నంగా స్పందించే మరో గ్రూప్ — ఇలా ప్రజలలో, ప్రభుత్వంలో గందరగోళాన్ని మిగిల్చుతోంది. అసలేం జరుగుతోంది, ఎవరు ఏం కోరుకుంటున్నారు అన్నది సరిగా తెలియక పోవడం వల్లే మీడియా కూడా ఊహలకే ఆధారపడుతుంది.

ఫిల్మ్ బిజినెస్‌లో 'పబ్లిక్ పర్సెప్షన్' విలువ

“సినిమా అంటే కంటెంట్ కాదు. అది కమ్యూనికేషన్+కన్విక్షన్. థియేటర్‌లో టికెట్ కొనే ముందు ఆడియన్స్ డిసైడ్ అయ్యే ప్రక్రియలో మీడియా ఓ కీలక పాత్రధారి.”

మరి మీడియాని శత్రువుల్లా ట్రీట్ చేస్తే ఎలా?

ఏదైమైనా ఈ “బంద్ వివాదం”లో అసలు కంఫ్యూజన్ కారణం మీడియా కాదనే వాదనకు బలం లేదు. వారి వాదనలకి క్లారిటీగా స్పందించకపోవడమే, మీడియా ఊహలకే ముద్ర వేయడానికి కారణం అయ్యింది. ఆ తర్వాత ఒక్కసారిగా మీడియానే బలి చేయటమే కాకుండా,ఇప్పటికీ ఎవరు బంద్ చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎవరి డిమాండ్స్ ఏంటో స్పష్టత లేదు.

సినిమా పెద్దలు నిజంగా ఇండస్ట్రీని పటిష్టంగా నిలబెట్టాలంటే —

ఒక్క ఐక్యత, ఒక స్పష్టమైన కమ్యూనికేషన్, ఒక విజన్ అవసరం.

మీడియా మీద మోపే నిందలతో కాదు, నిజాయితీతో, స్పష్టతతోనే సమస్యలు పరిష్కారం లభిస్తాయి.

Tags:    

Similar News