SSMB 29 నుంచి వరుస లీక్‌లు జక్కన్న ప్లానేనా..!

‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల నుంచి కూడా లీకులు రాకుండా అడ్డుకున్న జక్కన్న.. ఎస్ఎస్ఎంబీ29 సినిమా విషయంలో ఫెయిల్ అయ్యారా?;

Update: 2025-03-24 11:07 GMT

కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. అదే ఎస్ఎస్ రాజమౌళి అంటే మాత్రం అంతా ఇట్టే గుర్తు పట్టేస్తారు. రాజమౌళి ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ రాజమౌళి ఫేమ్ అంటే బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అనే చెప్పాలి. బాహుబలి ముందు వరకు జక్కన్న అంటే ఇండియా వరకు బాగా తెలిసిన దర్శకుడు. టాలీవుడ్‌లో ప్లాప్ తెలియని దర్శకుడిగా ఉన్నాడు. కానీ బాహుబలి తర్వాత రాజమౌళి అంటే ప్రపంచమంతా గుర్తుపట్టేస్తుంది. ఆ తర్వాత రాజమౌళి చేసిన సినిమాలంటే యావత్ ప్రపంచం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం ప్రారంభించింది. అదే సమయంలో జక్కన్న తీసిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ కూడా యావత్ ప్రపంచం బంపర్ హిట్ అందించింది. దీంతో ఇప్పుడు రాజమౌళి సినిమా అంటేనే హిట్ పక్కా అన్న టాక్ ఉంది. ఈ క్రమంలో రాజమౌళి తన తదుపరి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ ‘మహేష్ బాబు’తో కలిసి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణం ఈ సినిమా నుంచి వస్తున్న వరుస లీకులు.

అవును.. ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్, రాజమౌళి కాంబో సినిమా నుంచి వరుస లీకులు మూవీ టీమ్‌కు నిద్రపట్టకుండా చేస్తుంది. తొలుత మహేష్ బాబు లుక్స్ ఇవేనంటూ ఒక ఫొటో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇదేంటీ అనుకుని మూవీ టీమ్ చర్యలు కూడా తీసుకుంది. కానీ ఇంతలోనే ఒడిశాలో షూట్ చేసిన ఓ సీన్ కూడా లీక్ అయింది. దీంతో జక్కన్న స్వయంగా రంగంలోకి దిగి.. యాక్షన్ తీసుకున్నాడు. ఇలా చర్యలు తీసుకొంటున్నారో లేదో మరో లీక్ బయటకు వస్తుంది. ఈసారి సినిమా స్టోరీ ఇదేనంటూ వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఒక స్టోరీ కూడా సర్క్యులేట్ అయింది. ఇదేంట్రా బాబు.. అని అంతా ఖంగుతిన్నారు. దాని నుంచి కోలుకునేలోపే మరోసారి మహేష్ లుక్స్ అదుర్స్ అంటూ మహేష్ బాబు ఫొటో ఇంకొకటి నెట్టింట ప్రత్యక్షమైంది. అందులో మహేష్ బాబు గడ్డం, పొడవాటి జుట్టుతో క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. ఈ ఫొటో రావడంతో జక్కన్న.. సినిమాకు లీకుల బెడద తప్పట్లేదని అంటున్నారు అభిమానులు.

 

అయితే ఇప్పుడు అసలు లీకులు ఎలా అవుతున్నాయి? అన్నదే అతిపెద్ద చర్చగా మారింది. ‘స్టూడెంట్ నెం.1’ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు జక్కన్న తీసిని ఏ సినిమా నుంచి లీకులు రాలేదు. తనను టాలీవుడ్ దర్శకుడి దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందించిన ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల నుంచి కూడా లీకులు రాకుండా అడ్డుకున్న జక్కన్న.. ఎస్ఎస్ఎంబీ29 సినిమా విషయంలో ఫెయిల్ అయ్యారా? అంటే కాదన్న మాటే వినిపిస్తుంది. మరీ ఈ లీకులన్నీ ఏంటంటే.. ఇదంతా కూడా జక్కన్న ప్లానే అంటున్నారు కొందరు విశ్లేషకులు. ఎస్ఎస్ఎంబీ29 నుంచి వస్తున్న ప్రతి లీక్ కూడా జక్కన్న, మూవీ టీమ్ పక్కాగా ప్లాన్ చేసిందేనన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అలా ఎందుకు? లీకులతో తన సినిమాను రాజమౌలి ఎందుకు చెడగొట్టుకుంటున్నాడు? అంటే అదేం లేదు.. ఇదంతా ప్రమోషన్స్ అంటున్నారు.

అవును.. సినిమా ఎంత బాగా తీసినా.. వందల కోట్లు కుమ్మరించినా.. ఆ సినిమాను చూడటానికి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో మూవీ ప్రమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రమోషన్స్ అంటే ఏంటి.. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియ. సినిమాను ప్రేక్షకులకు పరిచయం చేసేది. ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచేది. ఇప్పటి వరకు తాను తీసే ప్రతి సినిమా ప్రమోషన్స్‌ విషయంలో కూడా రాజమౌళి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తాడు. ఇందుకు బాహుబలి, ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ నిలువెత్తు నిదర్శనాలు. అలాంటి మాస్టర్‌మైండ్..ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ29 విషయంలో డీలా పడ్డారా? అంటే కాదంటున్నారు. సాధారణంగా తమ సినిమాను ప్రమోట్ చేయడానికి ప్రతి దర్శకుడు, నిర్మాత భారీగా ఖర్చు చేస్తారు. వీరిలో జక్కన్న కూడా ఒకడు. అతడి బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీస్ ప్రమోషన్స్ చూస్తే ఈ విషయం మనకు కూడా అర్థమవుతుంది. కానీ ఈసారి ఎస్ఎస్ఎంబీ 29 విషయంలో రాజమౌళి తన స్టైల్ మార్చినట్లు తెలుస్తోంది. ఖర్చు లేని ప్రమోషన్స్‌‌ను మార్గంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సినిమాను ప్రజల్లో ఉంచడమే కదా.. ప్రమోషన్స్ అంటే.. అది ఎలా జరిగితే ఏంటి అనుకున్నారని..అందుకే లీకులను ఎంచుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

 

ఇప్పటి వరకు ఎస్ఎస్ఎంబీ29 నుంచి ప్రతి లీకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉండటం ఈ వాదనను మరింత బలపరుస్తోంది. తొలుత వచ్చిన మహేష్ లుక్స్ నుంచి.. వీడియో క్లిప్, తాజాగా వచ్చి మహేష్ ఫొటో కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. ఫొటో తీయడానికే రెడీగా ఉండి.. తీసిన ఫొటోలా అనిపిస్తుంది. ఒక ఫ్యాన్ తీసిన ఫొటో అయితే.. అందులో కచ్ఛితంగా మోషన్ బ్లర్ అనేది ఉంటుందని, అలాంటిదేమీ లేకుండా తీయాలంటే పక్కాగా ప్లాన్ చేసుకోవాలని అంటున్నారు కొందరు ఎక్స్‌పర్ట్స్. అదే విధంగా ఒడిశాలో జరిగిన షూటింగ్‌కు సంబంధించిన వీడియో కూడా.. ఎటువంటి బ్లర్ కానీ, ఏమీలేకుండా ఉంది. అంతేకాకుండ షూటింగ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు ఈ వీడియో తీశారు అని చెప్పాలంటే.. అంత రద్దీలో కూడా అంత స్టేబుల్ కెమెరా, పక్కాగా యాంగిల్, ఎవరూ అడ్డురాకపోవడం అనేది ఆలోచింపజేస్తోంది. సినిమా హాల్లోనే 100 మంది ప్రేక్షకులు ఉంటే.. తెరకు ఎంతో మంది అడ్డు వస్తుంటారు. అలాంటిది మూవీ షూటింగ్ చూడటానికి వేల మంది వస్తుంటారు.. అలాంటిది సదరు ఫ్యాన్ తీస్తున్న వీడియోకి మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డురాకపోవడం ఏంటి? అన్న డౌట్ వస్తుంది.

సినిమాను ప్రేక్షకుల్లో ఉండేలా చేయడానికి రాజమౌళి, మూవీ టీమ్ పక్కాగా ప్లాన్ చేసుకునే ఈ లీకులను విడుదల చేస్తుందన్న టాక్ వస్తోంది. అందుకు వీటినే ఉదాహరణలుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన లీకుల్లో సినిమా గురించి పెద్దగా ఏమీ చెప్పేలా లేదు. నాలుగు లీకులు వస్తే వాటిలో రెండు మహేష్ లుక్స్ అనే ఉన్నాయి. అవి కూడా చాలా పర్ఫెక్ట్‌గా తీసిన ఫొటోల్లానే ఉన్నాయి. దీంతో ఇదంతా కూడా జక్కన్నే చేయిస్తున్నారని, అందుకే ఈ లీకులపై ఇప్పటి వరకు పోలీసులను కూడా ఆశ్రయించలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. తమ సినిమా లీకులు వస్తున్నాయి అంటే చిన్నచిన్న సినిమా వాళ్లే పోలీసులను ఆశ్రయిస్తుంటే.. జక్కన్న అండ్ టీమ్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంది. ఎందుకంటే అది వాళ్లు చేస్తున్నదే కాబట్టి అని సినీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న మాట. మరి రానున్న రోజుల్లో అయినా జక్కన్న ఈ లీకులపై యాక్షన్ తీసుకుంటాడేమో చూడాలి.

‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాల నుంచి కూడా లీకులు రాకుండా అడ్డుకున్న జక్కన్న.. ఎస్ఎస్ఎంబీ29 సినిమా విషయంలో ఫెయిల్ అయ్యారా?

Tags:    

Similar News