"రాయన్" మూవీ రివ్యూ

పాపులర్ తమిళ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన రెండో సినిమా " రాయన్" కొంత ఆలస్యంగానైనా ఇవాళే విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందంటే..

By :  Admin
Update: 2024-07-26 12:09 GMT

పాపులర్ తమిళ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన రెండో సినిమా " రాయన్" కొంత ఆలస్యంగానైనా ఈ శుక్రవారం(26.7.24) విడుదల అయింది. ధనుష్‌తో పాటు చాలా మంది తమిళ, తెలుగు సినీ రంగానికి చెందిన నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ మధ్యకాలంలో భారీ తెలుగు కానీ తమిళ సినిమా కానీ రిలీజ్ కాలేదు. టీజర్‌ను బట్టి ఇది ఒక ఫ్యామిలీ క్రైమ్, థ్రిల్లర్ సినిమా అని అర్థమవుతుంది.

సాధారణ గ్యాంగ్ వార్ ల క్రైమ్ కథ

ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే, ఒక సాధారణమైన కథ. కార్తవరాయన్(ధనుష్) టౌన్ కి వెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి రాకపోవడంతో, చిన్న వయసులో చెల్లెలు దుర్గ (దుషర విజయన్) తమ్ముళ్లు ముత్తు రాయన్ (సందీప్ కిషన్), మాణిక్య రాయన్ (కాళిదాసు జైరాం) లను తీసుకుని చెన్నైలోని అంజనాపురం అనే ప్రాంతానికి వెళ్లిపోతాడు. ఆ ప్రాంతంలో శేఖర్ (సెల్వ రాఘవన్) సహాయంతో తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలిని పెంచి పెద్ద వాళ్ళని చేస్తాడు. దానికోసం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతాడు.

అంజనాపురం ప్రాంతంలో ఉంటున్న ఇద్దరు లోకల్ డాన్‌లు సేతురామన్ (ఎస్ జే సూర్య), దురై (శరవణన్) ల మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. అంతవరకు ప్రశాంతంగా ఉంటున్న ఆ కుటుంబ జీవితం ముత్తు రాయన్ చేసిన ఒక పని వల్ల అల్లకల్లోలం అవుతుంది. కార్తవరాయన్ కూడా తన తమ్ముడి కోసం అందులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఈ గ్యాంగ్ వార్ ఏ మేరకు ఆ నలుగురి జీవితాలను ప్రభావితం చేసింది. తన తమ్ముళ్లే తనను చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు కార్తవ రాయన్ ఏం చేశాడు? చివరకు ఏం జరిగింది? అన్నది కథ

కథా పరంగా చూస్తే ఇది ఒక సాధారణ కథ. గతంలో ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. ఈ సినిమాకు దర్శకుడు కూడా అయిన ధనుష్ కథను సరిగ్గా రాసుకోకపోవడం వల్ల, కేవలం కొన్ని అంశాల మీదే ఆధారపడి సినిమా కొంత వరకు మాత్రమే చూడదగ్గదిగా ఉంది. పైగా ఇది ఒక డార్క్ షేడ్ (బ్లాక్ కలర్) లో సలార్, కేజీఎఫ్ సినిమాల మాదిరిగా తీయడం వల్ల కొత్తదనం అనిపించవచ్చేమో కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ కలరు క్రైమ్ ఎలిమెంట్‌కి సరిపోయినప్పటికీ కుటుంబ నేపథ్యమున్న క్రైమ్ కథలకి అంతగా సూట్ కాదు. దర్శకుడిగా ధనుష్ ఫెయిల్ అయ్యాడు. అక్కడక్కడ కథనంలో మార్పులు, ఒకటి రెండు ఊహించదగ్గ ట్విస్టులు ఉన్నప్పటికీ సినిమాను ఎలివేట్ చేయలేకపోయాయి. ఈ సినిమా నిడివి కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. అనేక సన్నివేశాలు చాలా సాధారణంగా ఉంటూ, ఎక్కువసేపు ఉండటం వల్ల తేలిపోతాయి. పైగా చాలా సన్నివేశాలు వేరే సినిమాల్లో ప్రేక్షకులు చూసే ఉంటారు.

దర్శకుడిగా ఫెయిల్ అయినా.. నటుడిగా రాణించిన ధనుష్

ఈ సినిమాలో మెప్పించే అంశాలు కొన్ని ఉన్నప్పటికీ, చాలా మటుకు రొటీన్ గా ఉన్న సన్నివేశాలు ఎక్కువ. అయితే ఈ సినిమా కాసేపైనా చూడదగ్గదిగా చేసిన అంశాలు కొన్ని ఉన్నాయి. . అది కొంతమంది నటీనటుల నటన. అందులో ముందుగా చెప్పవలసింది ధనుష్ గురించే. సినిమాలో ఎక్కువ భాగం అండర్ ప్లే చేయాల్సి ఉన్నప్పటికీ, దాన్ని చక్కగా చేశాడని చెప్పాలి. ఒక విధంగా ఇది ధనుష్ సినిమా అని చెప్పాలి. సందీప్ కిషన్ "మంచి పాత్ర దొరికింది నాకు" అని చెప్పినప్పటికీ, అంత బాగా చేసే అవకాశాలను పోగొట్టుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. అయితే ఈ సినిమాను కాసేపు చూడొచ్చు అనిపించేలా చేసిన సర్ప్రైజ్ ప్యాకేజ్, ధనుష్ చెల్లెలుగా నటించిన దుషార విజయన్ ది. కొన్ని సన్నివేశాల్లో చాలా బాగా చేసి ప్రేక్షకుల మెప్పు పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా హాస్పిటల్ లో జరిగిన ఫైట్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. ఈ అమ్మాయి నటనలో ప్రత్యేకత ఏంటంటే అలా అలవోకగా నటిస్తూ పోవడం. ఈ అమ్మాయి లో చాలా ఈజ్ ఉంది. ఈ అమ్మాయికి భవిష్యత్తు ఉంది.

సినిమాలో చాలా వరకు పాత్ర పరంగా తేలిపోయినప్పటికీ ప్రముఖ తమిళ దర్శక నటుడు ఎస్ జె సూర్య సేతు పాత్రలో విలన్ గా ఆకట్టుకొని సినిమా చాలా వరకు నడిపిస్తాడు. కొన్ని కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా చేశాడు. విలన్ గా బాగా నటించినప్పటికీ పాత్రను సరిగ్గా రాసుకోవడం వల్ల విలనిజం అంతగా ఎఫెక్టివ్ గా లేదు. శేఖర్ పాత్రలో సెల్వ రాఘవన్ బాగానే చేశాడని చెప్పాలి. వరలక్ష్మి శరత్ కుమార్ పెద్దగా ఏమీ చేసే అవకాశం లేని ఒక చిన్న పాత్రలో నటించింది.

మెప్పించే అంశాలు కొన్నే..

ఇంకా ఈ సినిమాకు సాంకేతికపరంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయినా, కొంతవరకు సినిమా మూడ్ ని ఎలివేట్ చేయడానికి పనికి వచ్చింది. ఒకటి రెండు పాటలు ఉన్నప్పటికీ, అవి రెహ్మాన్ పాటలు లాగా అనిపించవు. దానికి తోడు ఫోటోగ్రఫీ కూడా ఒక ప్రాంతంలో జరిగే క్రైమ్ ను బాగానే చూపించగలిగింది. తెలుగు డబ్బింగ్ సినిమాలో హనుమాన్ చౌదరి రాసిన డైలాగులు అక్కడక్కడ మెరుస్తాయి. ఒకటి రెండు చోట్ల ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు అంతకు ముందు ధనుష్ ఫైట్ సన్నివేశం ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తుంది. ఇవన్నీ కూడా సినిమాకు కొంతవరకే సాయం చేయగలిగాయి.

కొంతవరకు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమా

నటుడిగా సక్సెస్ అయినప్పటికీ దర్శకుడిగా ధనుష్ తన రెండో సినిమాతో నిరాశపరిచాడు అని చెప్పాలి. అనుభవాలేమి కొంత వరకు దీని కారణమైనప్పటికీ ప్రేక్షకుల సానుభూతి పొందడం కష్టం. స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోకపోవడమే కాకుండా, ఎడిటింగ్ కూడా సరిగ్గా లేకపోవడం వల్ల సినిమా తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోదు. ఒక సాధారణ కుటుంబ క్రైమ్ కథ తో ఎంతో మంది నటీనటులను తీసుకొని తీసిన ఈ సినిమా మొత్తంగా చూస్తే నిరాశపరిచే సినిమానే. కాకపోతే ఇలాంటి సినిమాలు తమిళ ప్రేక్షకులకు అలవాటే కాబట్టి, వాళ్లకి కొంత, ధనుష్ అభిమానులకు మరికొంత ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.

నటీనటులు: ధనుష్,,సందీప్ కిషన్, ఎస్.జే. సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్ కుమార్, కాళిదాస్ జయరామ్,దుషారా విజయన్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ధనుష్

సంగీతం: ఏఆర్ రెహమాన్

సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్

ఎడిటర్: ప్రసన్న

నిర్మాత: కళానిధి మారన్

నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్

విడుదల: 26 జూలై 2024

Tags:    

Similar News