చిరుని కదిలించిన తమన్ ఎమోషనల్ స్పీచ్, అసలేం జరిగింది? ఎందుకింత ద్వేషం
సోషల్ మీడియాలో ఈ రోజు ఎంతటి విద్వేషం ప్రవహిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.;
సోషల్ మీడియాలో ఈ రోజు ఎంతటి విద్వేషం ప్రవహిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ జనం చాలా మంది ఎప్పుడూ ఎవరో ఒకరి మీద విద్వేషంతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా సినిమా హీరోల అభిమానులు విషయంలో అది మరీ ఎక్కువైంది. తమ హీరో సినిమా రిలీజైతే ఒకలా, వేరొక హీరో సినిమా రిలీజైతే మరొకలా రెచ్చిపోతున్నారు. ఎలాగైనా వేరే హీరోల సినిమాలు ఫ్లాఫ్ చేయాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నారు.
ట్రోలింగ్ చేయడానికి, ఎదుటి వారిని కించపరచడానికి సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. రీసెంట్గా గేమ్ ఛేంజర్ మూవీ విషయంలోనూ అదే జరిగింది. ఆ సినిమాని ఎలాగైనా తొక్కేయాలని కొంత మంది యాంటీ ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. నెగిటివ్ రివ్యూలు ప్రచారం చేశారు. అలాగే వీడియో లింక్ లు ఇచ్చేసారు. నార్త్, ఓవర్సీస్లో థియేటర్లు ఖాళీగా ఉన్నాయంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేసారు.
ఇక డే వన్ పోస్టర్ మీద ఇప్పటికే నానా రచ్చ జరిగింది. అందుకే ఇక మళ్లీ గేమ్ ఛేంజర్ కలెక్షన్ పోస్టర్లను చిత్ర యూనిట్ రిలీజ్ చేయలేదు. ఇది చాలదన్నట్లుగా రామ్ గోపాల్ వర్మ కూడా గేమ్ ఛేంజర్ మీద కౌంటర్లు వేసాడు. ఈ విషయమై తమన్ రీసెంట్ గా మాట్లాడారు. ఇప్పుడు చిరంజీవి సైతం తమన్ మాటలను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.
బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్' సినిమా సక్సెస్ మీట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (SS Thaman) మాట్లాడిన ఎమోషన్ స్పీచ్ అందరినీ ఆలోచింపజేస్తుంది. తెలుగు సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా కూడా ఉందని తమన్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమన్ స్టేజిపై మాట్లాడిన మాటలు నన్నెంతో కదిలించాయని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) X ద్వారా ట్వీట్ చేశారు.
"నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ ఉండే నీలో ఇంత ఆవేదన ఉండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయిన, క్రికెట్ అయిన, మరో సామాజిక సమస్య ఏదైనా.. సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి.
ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, మాటలు ప్రేరేపించగలవు. మరియు ఆ మాటలే నాశనం చేయగలవు. కానీ, మీరు ఇందులో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.(Words can inspire. And Words can destroy. Choose what you wish to do) మనం పాజిటివ్‌గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్‌గా ముందుకు నడిపిస్తుందని" చిరంజీవి పోస్ట్‌లో వెల్లడించాడు.
ఇంతకీ థమన్ ఏం మాట్లాడంటే:
థమన్ మాట్లాడుతూ.. సక్సెస్ మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. సక్సెస్ ఉంటే ఏదైనా కొనవచ్చు, నచ్చినట్టు బ్రతుకొచ్చు. అయితే, ఇలాంటి సక్సెస్ కి సోషల్ మీడియా ట్రోల్స్ అడ్డుపడుతున్నాయి. మీరు సినిమాపై పెట్టె నెగిటివ్ ట్రెండ్స్ నిర్మాతని కూల్చేస్తున్నాయి. అంతేకాకుండా నిర్మాత బాగుండాలని సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ, అలాగే అందరి హీరోల ఫ్యాన్స్ కోరుకోవాలని థమన్ అన్నారు.
అయితే, ఇప్పుడు సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా కూడా ఉందని ఆయన అన్నారు. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుందని.. థమన్ ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి హీరో ఫ్యాన్ కి ఎంతో బాధ్యత ఉందన్నారు. దయచేసి తెలుగు సినిమాల మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు.. బాలీవుడ్ మలయాళ కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడి వారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని అంటూ ఉంటారని, కానీ మనవాళ్ళకేమో తెలుగు సినిమాలంటే చులకనలా మారిందని అన్నారు.
ఒక్కటి గుర్తు చేసుకోండి.. తెలుగు సినిమాకి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు. సినిమా చాలా గొప్పది.. వ్యక్తిగతంగా ఏమున్నా మీరు మీరు కొట్టుకు చావండి. కానీ, సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చంపేయకండి. ఇది చాలా పెద్ద తప్పు. ఇక ఏ సినిమాకు ఇటువంటి తప్పు జరగకూడదు" అని థమన్ కోరాడు.