అన‌న్య నాగ‌ళ్ల 'పొట్టేల్' ఓటిటి రివ్యూ

రా అండ్ ర‌స్టిక్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ కోసం...

Update: 2024-12-22 05:58 GMT
అన‌న్య నాగ‌ళ్ల   పొట్టేల్ ఓటిటి రివ్యూ
  • whatsapp icon

పీరియాడిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన పొట్టేల్ మూవీ ఓటిటిలోకి దిగింది. యువ‌చంద్ర‌, అన‌న్య నాగ‌ళ్ల జంట‌గా న‌టించిన ఈ మూవీకి సాహిత్ మోత్కూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అక్టోబర్ 25న ఈ రూరల్ రస్టిక్ థ్రిల్లర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే, పొట్టేల్ సినిమా అంచనాలకు తగ్గట్టుగా టాక్ తెచ్చుకోలేకపోయింది. రిలీజ్ టైమ్ లో బజ్ క్రియేట్ చేయగలిగినా, భాక్సాపీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయింది. ఓ వర్గానికి నచ్చేటట్లు ఉన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ - ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రం కథేంటి, ఓటిటిలో చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

స్టోరీ లైన్
1970, 80వ దశకం నాటి కథ ఇది. విధర్భ (మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్) లోని గుర్రంగట్టు ఊళ్లో అప్పటి పరిస్దితులు, పాత్రలను ఎస్టాబ్లిష్ చేస్తూ సినిమా మొదలవుతుంది. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను బలి ఇవ్వాలనేది అప్పటి ఆచారం. ఆ టైంలో ఆ ఊరి పటేల్‌కు బాలమ్మ పూనుతుందని జనం నమ్ముతూంటారు. అయితే చిన పటేల్ (అజయ్)కి చిన్న తనం నుంచి బాలమ్మ పూనదు. కానీ బాలమ్మ పూనినట్టుగా నాటకం ఆడుతూంటాడు. ఆ విషయం బాలమ్మ పొట్టేల్‌ను కాపాడే గంగాధర్ (యువ చంద్ర)కి మాత్రమే తెలుసు. అదే విషయాన్ని జనాలకు చెప్పినా నమ్మలేని సిట్యువేషన్.
పోనీ ఆ పటేల్ మంచోడా అంటే...తను తప్పించి ఎవరూ బాగుండకూడదనుకునే మనస్తత్వం. ఊర్లోని బలహీన వర్గాలను ఎదగటానికి అవసరమైన చదువును దూరం చేస్తాడు.. ఈ క్ర‌మంలో గంగాధ‌ర్ జీవితంలోకి బుజ్జ‌మ్మ (అన‌న్య నాగ‌ళ్ల‌) వ‌స్తుంది. పెద్ద‌ల‌ను ఎదురించి మరీ ఆమెను పెళ్లిచేసుకుంటాడు గంగాధ‌ర్. ఆ తర్వాత పుట్టిన తన కూతురు సరస్వతిని ఎవ్వరికీ తెలియకుండా ఆ ఊరి టీచర్ దుర్యోధన్ (శ్రీకాంత్ అయ్యంగార్) ద్వారా చదివిస్తాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పటేల్.. గంగాధర్ వద్ద ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. ఏ కారణంగానైనా పొట్టేలును బలి ఇవ్వలేకపోతే, సంరక్షకుడిగా ఉన్నవారు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది.
పొట్టేలు మాయమైనందనే విషయం తెలిసిన ఊరి జనం అంతా గంగాధర్ మీద ఆగ్రహంతో ఉంటారు. జాతర టైంకి పొట్టేల్‌ను తీసుకు రావాలని ఊరి నుంచి వెలివేస్తారు. పొట్టేల్‌తో తిరిగి రాకపోతే తన కూతుర్ని బలి ఇస్తానని అంటాడు పటేల్. దీంతో ఈ పొట్టేల్ కోసం గంగాధర్ చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు ఏం జరుగుతుంది? అన్నది మిగతా కథ.
ఎనాలిసిస్
సామాజిక క‌ట్టుబాట్ల న‌డుమ త‌న కూతురిని చ‌దివించేందుకు ఓ తండ్రి ఎలాంటి పోరాటం సాగించాడు? అనేది మంచి ఎలిమెంటే. అయితే దర్శకుడు క‌థ వెన‌క ఎంతో గొప్ప ఉద్దేశం ఉండచ్చు. కానీ, దానిని ఎంత ఇంట్రస్టింగ్ గా ప్రెజెంట్ చేసామన్నదే ముఖ్యం. సినిమా చూడటానికి వచ్చే వారు తెరపై తనను తాను చూసుకోవటానికి లేదా ఓ మంచి కథను తనను తాను మరిచిపోయి కానీ చూడాలనుకుంటాడు. అందుకు తగ్గ భావోద్వేగాలు,నేరేషన్ లో ఉత్సుకత ఉంటే సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్తుంది. అవన్నీ కథ ఆ తర్వాత రాసుకునే స్క్రీన్ ప్లే నుంచి వస్తాయి. ఈ సినిమా దొరల కాలంలో వారి దురాగతాలని, మూఢ నమ్మకాలను వారు పెంచి పోషించిన విధానాన్ని, చదువు విలువను చెప్తూ రాసుకున్నారు. కానీ దాన్ని ఇంట్రస్టింగ్ గా కూర్చోబెట్టి చివరిదాకా చూసేలా చెప్పలేకపోయారు.
మరీ ముఖ్యంగా హీరో విల‌న్ పోరాటంలోని సంఘ‌ర్ష‌ణ అంత‌గా పండ‌లేదు. ప‌టేల్‌ను హీరో ఎదురించే సీన్స్‌లో హై మూవ్‌మెంట్స్ వ‌చ్చినా వాటిని ఉప‌యోగించుకోలేక‌పోయాడు. ఈ పొట్టేల్ కథలో చాలా లేయర్లు ఉన్నాయి. చదువు ప్రాముఖ్యత ని హైలెట్ చేయాలని, పటేల్‌ను ఎదురించి తన కూతుర్ని చదివించుకోవాలనుకున్న తండ్రి తపన, తాపత్రయాన్ని బాగానే చూపించాడు దర్శకుడు సాహిత్.అయితే నేరేషన్ లో ఇంటెన్స్ లోపించటం, ప్లాట్ ట్విస్ట్ లు లేకపోవటంతో సినిమా చూసేటప్పుడు ఏదో కూర్చున్నాం, చూస్తున్నాం అనే నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. దానికి తోడు స్లో నేరేషన్.నెక్ట్స్ ఏం జరుగుతుంది? అనే ఇంట్రెస్ట్ మాత్రం ఆడియెన్స్‌లో కలిపించలేకపోయినప్పుడు ఆ సినిమాని పూర్తిగా చూడటం పెద్ద టాస్కే..
టెక్నికల్ గా చూస్తే..
పొట్టేల్‌లో మంచి సందేశం, మంచి మేకింగ్, ఆర్టిస్టుల పర్పామెన్స్ ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఆ పాత్రలతో కలిసి ప్రయాణం చేసేలా మాత్రం డైరక్టర్ డిజైన్ చేయలేకపోయారు. 70, 80 నేపథ్యానికి తగ్గట్టుగా సెట్స్ వేయటం, క్యాస్టూమ్స్ ఇలా అన్నీ డిపార్టమెంట్స్ బాగా సెట్ అయ్యాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అయితే కీలకమైన రైటింగ్‌ దెబ్బకొట్టింది. క్లైమాక్స్ పోర్షన్ ఒక్కటే హైలెట్ గా అనుకుని చేసినట్లు ఉన్నారు.
గంగాధ‌ర్ పాత్రకు యువ‌చంద్ర న్యాయం చేశాడనే చెప్పాలి. అత‌డి లుక్ ఫెరఫెక్ట్ గా సెట్ అయ్యింది. బుజ‌మ్మ పాత్ర‌లో అన‌న్య నాగ‌ళ్ల పూర్తిగా ఒదిగిపోయింది . అజ‌య్‌లోని విల‌నిజాన్ని బాగానే వాడుకున్నారు. ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, నోయ‌ల్‌, శ్రీకాంత్ అయ్యంగార్ ప‌ర్వాలేద‌నిపించారు.
చూడవచ్చా
పొట్టేల్ మనం రెగ్యుల‌ర్ గా చూసే క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పూర్తి భిన్న‌మైన ప్ర‌య‌త్నం. రా అండ్ ర‌స్టిక్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ఆడియెన్స్‌ను పొట్టేల్ నచ్చుతుంది.
ఎక్కడుంది?
అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో ఉంది


Tags:    

Similar News