'కూలీ' సినిమా గురించి నాగార్జున ఏమి చెప్పారంటే...
'కూలీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్నో ఏమోషనల్ సీన్లు..నాగార్జున, రజనీకాంత్, అమీర్ ఖాన్, శృతీహసన్, సత్యరాజ్ నటించిన సినిమా ఇది.;
By : The Federal
Update: 2025-08-04 12:17 GMT
' కూలీ' మూవీ సక్సెస్ అవుతుందన్న నమ్మకాన్ని ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున వ్యక్తం చేశారు. ఆ సినిమాలో నాగార్జున ఓ ముఖ్య పాత్రలో నటించారు. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటించారు. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘కూలీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో రజనీకాంత్, శ్రుతి హాసన్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రజనీకాంత్, నాగార్జున ఇద్దరూ పరస్పరం జోకులు వేసి ప్రేక్షకులను నవ్వించారు. నా జుట్టు ఊడిపోయింది గాని నాగార్జునది బాగానే ఉందంటూ రజనీ కాంత్ వేసిన సెటైర్ బాగా పేలింది. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, ఆ సీన్ తనను చాలా కలచివేసిందంటూ నాగార్జున రజనీకాంత్ ని ఓ రేంజ్ లో పొగిడారు.
‘కూలీ’ గురించి నాగార్జున ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'ఒకరోజు లోకేశ్ నన్ను కలిసి ‘మీరు విలన్‌గా చేస్తానంటే మీకో కథ చెబుతా. లేదంటే కాసిన్ని సినిమా కబుర్లు చెప్పి టీ తాగి వెళ్లిపోతా’ అన్నాడు. ఆయన ‘ఖైదీ’ చూసిన తర్వాత ఎప్పటికైనా ఈ దర్శకుడితో పనిచేయాలని బలంగా అనుకున్నా. ఆ కోరికే అతడిని నాకు దగ్గర చేసింది. ‘కూలీ’ కథ చెప్పిన తర్వాత నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ‘రజనీ సర్ ఈ కథ ఒప్పుకొన్నారా’ అని అడిగా. ఎందుకంటే ఈ కథలో ‘సైమన్’ పాత్ర నిజంగా హీరోలాంటిది’ అని నాగార్జున చెప్పుకొచ్చారు.
‘‘ఇన్నేళ్ల నా కెరీర్‌లో మొదటిసారి లోకేశ్ కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నా. ఇంటికి వెళ్లాక మళ్లీ మళ్లీ విన్నా. నాకు అనిపించిన కొన్ని మార్పులు చెప్పా. మరొకరైతే, తేలిగ్గా తీసుకుంటారు. లేదంటే ఆ మూవీ నుంచి నన్ను తప్పించేవారు. కానీ, నేను చెప్పిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ‘సైమన్’ పాత్రను లోకేశ్ డెవలప్ చేసిన తీరు నాకు నచ్చింది. రజనీ సర్ చెప్పినట్లు ఎప్పుడూ మంచి వాళ్లగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా' అన్నప్పుడు సభలో నవ్వులు విరిశాయి.
వైజాగ్‌లో జరిగిన షూటింగ్ సందర్భంగా రికార్డు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం తనను చాలా బాధించిందని, మనుషులు ఇలా కూడా ఉంటారా?’ అనిపించిందని నాగార్జున చెప్పుకొచ్చారు. తనకు మూవీలో నెగెటివ్ రోల్ ఇచ్చినా ఈ పాత్ర చేసిన అనుభూతి పాజిటివ్‌గా ఉంది అని చెప్పారు.
‘‘సత్యరాజ్, శ్రుతిహాసన్, సౌబిన్, ఉపేంద్ర అందరూ చాలా చక్కగా నటించారు. ఈ షూటింగ్ సమయంలో రజనీ సర్ స్వయంగా వచ్చి నన్ను కలిసి మాట్లాడారు. అది ఆయన గొప్పదనం. నన్ను కలిసినప్పుడు కొద్దిసేపు అలాగే చూస్తూ ఉండిపోయారు. ‘మీరు ఇలా ఉన్నారని తెలిస్తే (ఫిట్‌గా) మన సినిమాలో నాగార్జున వద్దని లోకేశ్‌కు చెప్పేవాడిని’ అని సరదాగా అన్నారు. ఆయనతో కూర్చొని మాట్లాడటం అద్భుతం. ఆయన నటన, స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని సినిమాలు చేసినా కూడా రజనీ సర్ పక్కకు వెళ్లి డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు. చేయడమే కాదు, కొత్తగా చేసేందుకు ప్రయత్నిస్తారు. థాయ్‌లాండ్‌లో 17 రోజుల పాటు రాత్రి పూట యాక్షన్ సీక్వెన్స్ తీశాం. దాదాపు 350మందికి పైగా చాలా కష్టపడ్డాం. చివరి రోజు మొత్తం అందరినీ రజనీ సర్ పిలిచి తలో ఒక ప్యాకెట్ ఇచ్చి ‘ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు ఏమైనా తీసుకెళ్లండి’ అన్నారు. అంత మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆయన. ఇక అనిరుధ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా హిట్స్ ఇస్తూనే ఉన్నాడు’’ అని నాగార్జున అన్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ ఒక సందర్భంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను కూలీగా లగేజ్ మోయాల్సి వచ్చిందని, ఆ తర్వాత ఆ వ్యక్తి అన్న మాటలకు ఎంతో బాధపడ్డానని రజనీకాంత్ (Rajinikanth) అన్నారు.
‘‘ఒకరోజు నేను రోడ్డుపై నిలబడి ఉంటే, ఒక వ్యక్తి నన్ను పిలిచి, ‘నా లగేజ్‌ను టెంపో వరకూ తీసుకెళ్తావా’ అని అడిగాడు. నేను సరేనన్నాను. అతన్ని పరిశీలించి చూస్తే, తెలిసిన వ్యక్తిలా అనిపించాడు. కొన్ని క్షణాల తర్వాత తను నేనూ ఒకే కాలేజ్‌లో చదువుకున్నామని అర్థమైంది. అప్పట్లో అతడిని నేను సరదాగా ఆటపట్టించేవాడిని. లగేజ్ టెంపో దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత అతడు రూ.2 చేతిలో పెడుతూ ఒక మాట అన్నాడు. ‘అప్పట్లో నీకున్న అహంకారం ఎవరికీ లేదు. నీకు ఆ రోజులు గుర్తున్నాయా?’ అని అడిగాడు. నాకు కన్నీళ్లు ఆగలేదు. నా జీవితంలో ఎంతో బాధపడిన సందర్భమది’’ అని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.