LIVE | ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
భారతదేశం ఒక స్వతంత్ర ప్రజాస్వామిక గణతంత్రంగా తన చరిత్రాత్మక ప్రయాణంలో 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.;
భారతదేశం ఒక స్వతంత్ర ప్రజాస్వామిక గణతంత్రంగా తన చరిత్రాత్మక ప్రయాణంలో 75 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఆదివారం నాడు ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా, దేశం తన సైనిక శక్తి, సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేసింది.
ప్రముఖ అతిథులతోపాటు, పారా ఒలింపిక్స్ క్రీడాకారులు, ఉత్తమ ప్రదర్శన చేసిన గ్రామాల సర్పంచులు, చేనేత కళాకారులు, అటవీ, వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలతో కలిపి దాదాపు 10,000 మంది ప్రత్యేక అతిథులను 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌ను వీక్షించేందుకు ఆహ్వానించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మహత్తర సందర్భాన్ని దేశంతో పాటు జరుపుకుంటున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబావో సుబియాన్టో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇండోనేషియాకు చెందిన పరేడ్ బృందం, బ్యాండ్ బృందం ఈ పరేడ్‌లో భాగమవుతుంది.
సుబియాన్టో భారత్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన నాల్గవ ఇండోనేషియా అధ్యక్షుడిగా నిలవనున్నారు. ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకార్నో 1950లో భారత్ తొలి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సంవత్సరం వేడుకల్లో 75 ఏళ్ల రాజ్యాంగ ప్రయాణం ప్రధాన దృష్టికేంద్రంగా నిలుస్తుంది. ఇందులో 'స్వర్ణిమ భారత్: వారసత్వం, అభివృద్ధి' థీమ్ ఆధారంగా ప్రత్యేక శకటాలు ప్రదర్శించబడతాయి.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 16 శకటాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల నుంచి 15 శకటాలు ప్రదర్శించబడతాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పరేడ్‌లో భారతదేశం తన సైనిక సామర్థ్యాలు, గణతంత్ర ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ పరేడ్‌లో బ్రహ్మోస్, పినాక, ఆకాశ్ వంటి ఆధునిక రక్షణ వ్యవస్థలు ప్రదర్శించబడతాయి. సైనికుల కోసం బెటిల్ సర్వైలెన్స్ సిస్టమ్ 'సంజయ్', DRDO అభివృద్ధి చేసిన 'ప్రలయ్' మిసైల్ తొలిసారిగా పరేడ్‌లో భాగమవుతాయి.
T-90 “భీష్మా” ట్యాంకులు, శరత్ (ఇన్ఫంట్రీ క్యారీయింగ్ వాహనం BMP-II), షార్ట్ స్పాన్ బ్రిడ్జింగ్ సిస్టమ్, నాగ మిసైల్ సిస్టమ్, 'అగ్నిబాణ్' రాకెట్ లాంచర్ వ్యవస్థ, 'బజరంగ్' లైట్ స్పెషలిస్ట్ వాహనాలు కూడా పరేడ్‌లో పాల్గొంటాయి.
రాజ్యాంగ సభ నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది.
ఆకట్టుకుంటున్న శకటాల ప్రదర్శన..
ముందుకు సాగిన ఢిల్లీ, పశ్చిమ బెంగాల్
కర్తవ్యపథ్ వేదికగా ఢిల్లీ పోలీసులు కవాతు చేశారు. ఈ బృందానికి అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ రిషి కుమార్ సింగ్ నాయకత్వం వహించారు. ఢిల్లీ పోలీస్ ఆల్-వుమెన్ బ్యాండ్ రెండవసారి పరేడ్‌లో పాల్గొంది, వీరిని బ్యాండ్ మాస్టర్ రుయంగునుయో కెన్సే నేతృత్వం వహించారు.
కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు.. కర్తవ్యపథ్‌లో తమ శకటాలను ప్రదర్శిస్తున్నాయి. అవి సదరు శాఖలు సాధించిన విజయాలను ప్రతిబింబిస్తున్నాయి.