పంజాబ్ పై అభిషేక్ విశ్వరూపం.. రెండో విజయం సాధించిన ఆరేంజ్ ఆర్మీ
ఐపీఎల్ లో రెండో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన సన్ రైజర్స్ హైదరాబాద్;
By : Praveen Chepyala
Update: 2025-04-12 18:33 GMT
హైదరాబాద్ వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విధించిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో ఏడు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక ఛేదన. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 55 బంతుల్లోనే (10x6,14x4) 141 పరుగులు సాధించాడు.
ఇది ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోర్. అభిషేక్ తోడుగా మరో ఒపెనర్ ట్రావిస్ హెడ్ చెలరేగడంతో ఉప్పల్ లో పరుగుల వరద పారింది. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు 171 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసి విజయానికి బలమైన పునాదులు వేశారు. లక్ష్యానికి చేరువైన క్రమంలో ఇద్దరు పెవిలియన్ చేరిన క్లాసెన్, ఇషాన్ కిషన్ మిగిలిన లాంఛనాలన్నీ పూర్తి చేశారు.
తొలి ఐపీఎల్ సెంచరీ..
ఈ సీజన్ లో మూడు వందల పరుగులు సాధించడమే లక్ష్యం.. కప్పు ఈ సారి మనదే.. మొదటి మ్యాచ్ ప్రారంభంలో ఆరెంజ్ ఆర్మీ పై వచ్చిన అభిప్రాయాలు. అందుకు తగ్గట్టే తొలి మ్యాచ్ లో చేలరేగి పోయారు. పరుగుల వరద పారించారు.
కానీ తరువాత పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో వరుసగా ఓటమి. పాయింట్ల పట్టిక లో అట్టడుగు స్థానం. అభిమానులంతా డీలా పడ్డారు.
అందుకు తగ్గట్టుగానే ఈ రోజు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 245 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మనవాళ్లు ఛేజ్ చేస్తారా? అన్న అనుమానం సగటు అభిమానుల్లో మొదలైంది.
కానీ ఈ సారి హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు పట్టు వదల్లేదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 40 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులే సాధించిన ఈ లెప్ట్ హ్యాండర్.. అందులో ఒక్క సిక్సర్ కూడా సాధించలేకపోయాడు. కానీ ఈ రోజు ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో 141 పరుగులు సాధించాడు. అందులో ఏకంగా పది భారీ సిక్స్ లు బాదేశాడు.
నిజానికి ఈ మ్యాచ్ లో అభిషేక్ కు చాలా సార్లు అదృష్టం కలిసి వచ్చింది. మొదట మాక్స్ వెల్ ఓ రనౌట్ మిస్ చేయగా, 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇచ్చిన క్యాచ్ నోబాల్ గా తేలింది. తరువాత మరో రెండు బంతులు కూడా గాల్లోకి లేపిన అవి ఫీల్డర్లు లేని ప్రదేశంలో పడ్డాడు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించాడు.
ఈ సెంచరీ అభిమానుల కోసం..
13 ఓవర్ లో యుజ్వేంద్ర చాహల్ వేసిన బంతిని లెగ్ సైడ్ కు ఫుష్ చేసి సింగిల్ తీయడంతో సెంచరీ పూర్తి చేసుకున్న శర్మ తన పాకెట్ లో నుంచి ఒక కాగితం తీసి చూపించాడు. దాని పై ఈ సెంచరీ ఆరెంజ్ ఆర్మీ కోసం అని రాసి ఉంది.
అభిషేక్ పరుగులు సాధిస్తున్నంత సేపు స్టేడియం మొత్తం కేరింతలతో మారుమోగుతూనే ఉంది. ఈ మ్యాచ్ లో ఎస్ ఆర్ హెచ్ బ్యాట్స్ మెన్లు పక్కా ప్రణాళితో వ్యవహరించారు. అనవసరమైన దూకుడు ప్రదర్శించకుండా.. అలా అని పరుగుల వేగం తగ్గకుండా బోర్డును పరుగులు పెట్టించారు.
ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన ట్రావిస్ హెడ్.. తరువాత తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఏ బౌలర్ వదిలి పెట్టకుండా పరుగుల పండగ చేసుకున్నాడు. పంజాబ్ జట్టులో లాకీ ఫెర్గుసన్ గాయంతో మైదానం వీడటం జట్టుకు చాలా నష్టం చేసింది.
పంజాబ్ బ్యాట్స్ మెన్ల వీరవిహారం..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ బ్యాట్స్ మెన్లు హైదరాబాద్ బౌలర్లపై విరుచుపడ్డారు. వచ్చిన ప్రతి బ్యాట్స్ మెన్ బాదుడుకే ప్రాధాన్యం ఇవ్వడంతో స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది.
ఈ జట్టు 20 ఓవర్లలో 245 పరుగులు సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. అందులో ఆరు ఫోర్లు, ఆరు సిక్స్ లు బాదేశాడు. ఒపెనర్ ప్రియాంశ్ ఆర్య కూడా తన ఫామ్ ను కొనసాగిస్తూ 13 బంతుల్లోనే రెండు ఫోర్లు, 4 సిక్స్ లతో 36 పరుగులు సాధించాడు.
ప్రభ్ సిమ్రాన్ సింగ్ కూడా 42 పరుగులు సాధించాడు. చివరల్లో మార్కస్ స్టాయినిస్ 11 బంతుల్లోనే 34 పరుగులు సాధించి మంచి ముగింపు ఇచ్చాడు. ఎస్ ఆర్ హెచ్ బౌలర్లలో మహ్మద్ షమీ అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.
ఈ మ్యాచ్ లో నాలుగు ఓవరల్లో షమీ వికెట్లు ఏమి తీయకుండా 75 పరుగులు సమర్పించుకున్నాడు. హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటగా, కొత్త కుర్రాడు ఎషాన్ మలింగ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.