చలం... చలం... చలం...

చలం... ఒక ఆలోచన. ఎడతెగని ఆలోచన... తన ఆలోచనలతోనే అతని గొడవ. సమాజం గొడవనూ. ఏమి చేస్తున్నా, ఏమి చూస్తున్నా, ఏమి రాస్తున్నా చలం... చలం... చలం...

Update: 2024-05-18 07:17 GMT

చలం... ఒక ఆలోచన. ఎడతెగని ఆలోచన... తన ఆలోచనలతోనే అతని గొడవ. సమాజం గొడవనూ. ఏమి చేస్తున్నా, ఏమి చూస్తున్నా, ఏమి రాస్తున్నా చలం... చలం... చలం...

ప్రేమలూ, కలవటాలూ, కరిగిపోడాలూ, కన్నీళ్ళూ, తిరుగుబాట్లూ, లేచిపోవడాలూ, తర్కాలూ, తత్వమీమాంసలూ కలగలిసిన అనిర్వచనీయం చలం. చలం శశిరేఖ మొదలు అనిర్వచనీయం వరకు - స్త్రీ, మైదానం, బ్రాహ్మణీకం, అమీనా, దైవమిచ్చిన భార్య ఇంకా కథలు, నాటకాలు, నాటికలు, మ్యూజింగ్స్, ఆత్మకథ, అన్నింటిలోనూ చలం ఇష్టాలు-అయిష్టాల గురించే చర్చ. అది చలం తనపై తాను పెట్టుకున్న చర్చ. మొత్తం సమాజంపై పెట్టిన చర్చ.

వాటన్నింటి గురించైనా, ఏ ఒక్కదాన్ని గురించైనా గాని, చలం గురించి గాని విశ్లేషకులు, విమర్శకులు ఒకరు చెప్పింది ఇంకొకరు చెప్పరు. ఒకరు రాసింది ఇంకొకరు అంగీకరించరు. కొందరు ఆకాశానికి ఎత్తారు. కొందరు పాతాళానికి నెట్టారు. అయినా చలం చెదరని చిరునవ్వే కళ్ళలో కదులుతుంది. అందులో ఏదో ఉంది. ఉంది...ఆ... ఆ నవ్వు వెనుక గడ్డకట్టిన విషాదం ఉంది. బ్రహ్మాండమైన తిరుగుబాటు ఉంది. తిరుగులేని విప్లవం ఉంది.

చలంలో తాత్వికతా శిఖరాలు ఉన్నాయి. అంతుచిక్కని అగాధాలూ ఉన్నాయి. ఆ శిఖరాల్ని ఎవరికివారు అధిరోహించా ల్సిందే. అగాధాల్లో ఎవరికివారు అన్వేషణ సాగించాల్సిందే. ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో తొలి విస్ఫులింగం వీరేశలింగం. తొలి ప్రగతి జాడ గురజాడ. తొలి విప్లవ గళం చలం. ఎవరేమి చెప్పినా, ఎవరేమి రాసినా వారి తర్వాతే. ఎందుకంటే కరుడు కట్టిన సమాజ స్వభావం మీద వారు ప్రప్రథమంగా ప్రత్యక్షంగా వరుస దాడి చేశారు. ఆ స్ఫూర్తితోనే ఆ తర్వాత సాహిత్య ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయి. తదనంతరమే స్త్రీ వాద, దళిత వాద, మైనారిటీ వాద అస్తిత్వ ఉద్యమాలు తలెత్తాయి.

అయినా నాటికీ నేటికీ చలం ఒక చర్చ. అప్పుడూ ఇప్పుడూ చలం ఒక ఘర్షణ. స్త్రీ బానిస సంకెలను బద్దలు కొట్టేందుకు తెలుగు సాహిత్యం చేసిన తిరుగుబాటు చలం. దీనిని భరించలేని సమాజం చలాన్ని బహిష్కరించిందా!? మాడు పగలగొట్టినా బుద్ధిరాని సమాజాన్ని చలం బహిష్కరించాడా!? ఇది ఇప్పటికి ఎప్పటికీ తేలని ప్రశ్నే. చలంలో విప్లవకారుడున్నాడు. గొప్ప సౌందర్య ఆరాధకుడూ ఉన్నాడు. తార్కికుడు ఉన్నాడు. తాత్వికుడు ఉన్నాడు. ఆ విప్లవకారుణ్ణి పట్టించుకోని, ఆ తార్కికుణ్ణి అర్థం చేసుకోలేని, ఆ తాత్వికుణ్ణి స్వీకరించలేని, ఆ ఆరాధకుణ్ని అందుకోలేని సమాజం అతనిలో అరాచకుణ్ణి కనిపెట్టింది. అతని పనిబట్టానని సంబరపడింది. చలంలోని విప్లవకారుడు నిరంతర సంచలితుడు. చలంలోని ఆరాధకుడు అంతర్ముఖుడు. ఇదో వైరుధ్యం. కానీ సత్యం. ఈ సత్యం చలం ఆలోచనలు... వాటి అంతర్మథనం నిక్షిప్తమైన "మ్యూజింగ్స్"లో కనిపిస్తుంది.

- కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

18 మే 2024.

‌‌‌‌‌ గుడిపాటి వెంకట చలం

పుట్టిన రోజు 18 మే 1894.

సందర్భంగా...

Tags:    

Similar News