కనికరం చూపరా?
కర్నూలు జిల్లా హల్వి లోని బావి ఇది. ప్రభుత్వానికి పట్టని అద్భుత నిర్మాణం, శిల్పసంపద...
By : The Federal
Update: 2025-12-22 04:13 GMT
జనులారా! నేను మీ ఊరి పెద్ద బావిని
కనికరం చూపరా! నా దీనగాథ విని
మూడు శతాబ్దాలుగా మీ ఊరిని
పాడిపంటలతో పచ్చగా వర్ధిల్ల చేసితిని
ఊరూవాడా జనులందరికీ నీరిచ్చితిని
మూడుపువ్వులారుకాయలుగా మురిపించితిని
నేడు నాలో ఊట ఆగింది, ఉనికి మారింది
కడుపులో బీడు పెరిగింది, కళ మారింది
నాడు అందరూ నాకు హారతులు పట్టారు
వేనోళ్ళ పొగిడారు, వేడుకలు చేశారు
ఆనోళ్ళు ఏమయ్యాయి,ఆ చేతులు ఏమయ్యాయి
తరాలు మారాయి తీరులు మారాయి కదా
చెరువులు బావులతో ఏం పని అనుకునేరు
గుర్తుంచుకోండి..
నీరుంటేనే ఊరు, ఊరుంటేనే మీరు
నీరు లేకుంటే ఊరు వల్లకాడుగా మారు
ఊరు ఉద్యమిస్తే ఊబిలోంచి ఉబికొస్తాను
మీరు పూడిక తీస్తే పుడమి చీల్చి పైకొస్తాను
జలకళతో వెలుగుతూ మళ్ళీ కళకళలాడుతాను
జలసిరిని పంచుతూ మీ కలలు పండిస్తాను.
-గద్వాల్ ఈరన్న