చెప్పులతో ఆ గ్రామంలో అడుగు పెడితే రూ. 5వేలు ఫైన్!
పాదరక్షలను నిషేధించాలని ఊరి గ్రామసభలో చేసిన తీర్మానం ఇది. దీని వెనక ఉన్న కథేంటి?;
ఇంద్రవెల్లి నుండి తుమ్మగూడ గ్రామంలోకి వెళ్తున్న వారికి అడ్డంగా చెక్ పోస్ట్ పెట్టి ఆపేశారు గ్రామస్తులు.
దయచేసి మీ చెప్పులు ఇక్కడ వదిలి గ్రామంలోకి వెళ్లండి అని చెప్పారు. సాధారణంగా గుళ్లోకి చెప్పులతో రావద్దు అంటారు కానీ గ్రామంలోకి రావద్దనడం ఏమిటి? ఎందుకీ ఆచారం? దీని వెనుక ఏముందో ఆ గ్రామస్తులనే అడుగుదాం రండి.
‘‘చెప్పులు వేసుకొని మా గ్రామంలో తిరిగితే 5 వేలు జరిమానా కట్టాలి. మందు తాగినా, మాంసం తిన్నా అదే పరిస్ధితి.’’ అన్నాడు, తుమ్మగూడ గ్రామ పటేల్ సోయం శ్రీరామ్.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి మండల కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలోని మారుమూల గోండు పల్లె తుమ్మగూడ.
‘దశాబ్దంన్నర క్రితం తుమ్మగూడలో పంటలు పండేవి కాదు, జనం వింత వ్యాధులతో బాధలు పడేవారు. యువతరం చెడు వ్యసనాలకు బానిసలై తిరిగే వారు. జనమంతా నిస్తేజంగా ఉండేవారు. ఊరెందుకిలా మారిందో అర్ధం కాక కొందరు ఊరొదిలి ఎటైనా పోదాం మూటాముల్లే సర్దుకున్నారు.
ఇదంతా గమనించిన ఊరి పెద్దలు పుష్యమాసంలో తమ గోండు దేవతలు ఆకి దేవుడు, అవ్వల దేవుడు, జంగుబాయికి పూజలు చేస్తూ దీక్షలు చేస్తే ఊరు బాగుఅవుతుందని నమ్మారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతీ ఏడాది ఒక నెల రోజులు క్రమం తప్పక కొన్ని నియమాలు పాటించడం సంప్రదాయంగా పెట్టుకున్నాం. ’’ అని గతాన్ని వివరించాడు దేవర ( పూజారి ) సోయం వినోద్ .
దీక్షలో కట్టుబాట్లు ఏంటీ?
తెలంగాణలో ఒకపుడు పటేల్ పట్వారీ వ్యవస్థ బలంగా ఉండేది. ఆంధ్రలో మునసబుల కంటే తెలంగాణలో పటేల్‌లు కాస్త ఎక్కువ పలుకుబడితో ఉండేవారు. వారు గ్రామాల్లో అనధికారిక పెత్తందార్లుగా ఉండేవారు. వారు బలంగా ఉన్న చోట రాజకీయ నాయకులుగా ఉన్నారు. కొన్ని చోట్ల లేరు. 1985లో ఎన్‌టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాలి పటేల్, పట్వారీలను (మునసబు, కరణాలను) రద్దు చేశారు. అయినప్పటికీ కొన్ని మారు మూల ఆదివాసీ తండాల్లో ఊరి పెద్దను పటేల్ అనే పిలుస్తారు. వారి మాటనే గౌరవిస్తారు. అలాగే తుమ్మగూడకు సోయం శ్రీరామ్ పటేల్‌గా వ్యవహరిస్తున్నారు. తమ గ్రామ యువకులు చెడు వ్యసనాలకు లోనవుతున్నారని వారినెలాగైనా మార్చాలనే తపన ఉన్న యువకుడు శ్రీరామ్.
ఈ సంప్రదాయం గురించి ఆయన మాతో ఏమంటారంటే...
‘‘జనవరి నెలాఖరు వరకు జరుపుకునే ఈ దీక్షలో నిత్యం ఊరిలో ఉన్న హనుమాన్ టెంపుల్‌లో పూజలు నిర్వహిస్తాం. ఆదివాసీ యువతలో ఉన్న చెడు అలవాట్లను దూరం చేసేందుకు పవి త్రమైన పుష్యమాసం నియమాలు పెట్టుకున్నాం. ఈ నెల రోజులు ఎవరూ మద్యం, మాంసం ముట్టుకో రాదు. ఊరిలో చెప్పులు లేకుండా తిరగాలి. ఊరి బయటకు వెళ్తే ఊరు దాటిన తరువాతే చెప్పులు వేసుకోవాలి. తిరిగి వచ్చేటపుడు ఊరి సరిహద్దుల్లో చెప్పులు విడిచి రావాలి. ఈ నెలంతా ఖచ్చితంగా పాదాలకు చెప్పులు వేసుకోకూడదని హెచ్చరిస్తూ చెక్ పోస్ట్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఊరంతా కలిసి గ్రామసభలో చేసిన తీర్మానం ఇది.’’ అన్నారు చెక్‌పోస్ట్ దగ్గర ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డ్‌ను చూపిస్తూ సోయం శ్రీరామ్ .
దీక్షలతో ఊరు మారిందా?
తరతరాలుగా గోండు , కొలాము మూలవాసుల్లో నమ్మకాలు ఎక్కువ. పూర్వీకుల నుండి వచ్చిన విశ్వాసాల మీద ఆధారపడతారు. చిన్న రోగం వచ్చినా దేవుళ్లను మొక్కుకుంటారు. అందుకే తమ ఊరి బాగు కోసం ఈ దీక్షల్లో పాల్గొంటాం అని అక్కడి యువతీ యువకులు మాతో చెప్పారు.
‘‘ పెళ్లయి రెండేళ్లు దాటినా మాకు సంతానం కలుగ లేదు . దానికి తోడు నిరుద్యోగం తో నిరాశకు లోనయ్యేవాడిని . మా ఊరి దేవత జంగుబాయికి మొక్కుకొని గత ఏడాది నెలంతా దీక్షలో ఉండి ఖచ్చితంగా నిమమాలు పాటించాను. ఇపుడు మాకు సంతానం కలిగింది. అంతే కాదు ఉట్నూరు గ్రామీణ బ్యాంకులో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. మా కుటుంబం హ్యాపీ ...’’ అని సంతోషంగా చెప్పాడు ఈ గ్రామానికి చెందిన భగవంతరావు.
మారుతున్న జీవనం
తుమ్మగూడ గ్రామ జనాభా 1200. గోండులు,కొలాములు నివశిస్తారు. ఎక్కువ శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తారు. సోయ,పత్లి,కూరగాయలు సాగు చేస్తారు.
‘‘పూజలు దీక్షలు చేయడం మొదలయ్యాక ఊరు మెల్లగా మారుతోంది, తాగుడు లాంటి వ్యసనాలు తగ్గాయి. పిల్లలు బాగా చదువుతున్నారు. పట్నాల్లో కొందరు బీఇడీ చేస్తున్నారు, అయిదుగురు అమ్మాయిలు నర్సులుగా ,నలుగురు యువకులు టీచర్లుగా పనిచేస్తున్నారు.
పంటలు కూడా బాగా పండుతున్నాయి. ఇప్పటికైతే ఏలోటు లేదు’’ అన్నారు హనుమాన్ టెంపుల్ దగ్గర పూజలకు వెళ్తున్న కమలా బాయి, శాంతాబాయి.
‘‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజన గ్రామాలలో కొన్ని చోట్ల ఈ ఆచారం ఉంది. ప్రతి ఏటా నెలరోజుల పాటు పాదరక్షలు లేకుండా తిరగడం వల్ల ఆరోగ్యపరంగా కూడా మంచిదని భావిస్తారు. ప్రభుత్వం అమ్ముతున్న మద్యం ను అడ్డుకునే శక్తి లేనపుడు యువతను మద్యం వ్యసనానికి దూరం చేయడానికి ఈ దీక్షలు చాలా ఉపయోగ పడుతున్నాయి.
గ్రామస్తులతో పాటు బయట వారు ఎవరైనా చెప్పులతో వస్తే రూ.5వేలు జరిమానా విధిస్తున్నారు. అలా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తున్నారు.
వీరి సంప్రదాయాలు ఆచారాల వెనుక నైతిక విలువు, ఆరోగ్యము , అభివృద్ది ఉంది. యువతరం కూడా అలవాట్లకు దూరం అవుతూ ఉపాధి అవకాశాలను అంది పుచ్చుకుంటున్నారు .’’ అన్నాడు ఇదే ప్రాంతంలో ఒక స్వచ్ఛంద సంస్ధలో పనిచేస్తున్న రవీంద్ర జాదవ్.