వేయి గొంతుకలు వినిపించిన వేణుమాధవ్
ధ్వని అనుకరణ కళకి జవం జీవం పోసిన పితామహుడు . ఈయన గళంలో వినిపించని స్వరం అంటూ లేదని చెప్పవచ్చు.
-నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్
ధ్వని అనుకరణ కళకి జవం జీవం పోసిన పితామహుడు . ఈయన గళంలో వినిపించని స్వరం అంటూ లేదని చెప్పవచ్చు. 65 ఏళ్లు పాటు మిమిక్రీ కళకు వెన్నదన్నుగా నిలిచిన మహోన్నత వ్యక్తి . అపూర్వ ఘనత సాధించిన తెలంగాణ తెలుగు తేజం ధ్వన్యనుకరణ సమ్రాట్ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్. వేయి గొంతులు తన నోట వినిపించిన మహనీయుడు. ఈయన వ్రాసిన కళా వ్యాసాలు అనేక విశ్వవిద్యాలయాలలో పాఠ్యాంశాలుగా చోటుచేసుకున్నాయి. చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఇష్టం.
వరంగల్ మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబరు 28న జన్మించారు. తండ్రి వ్యాపారవేత్త. ఆయన ఆరు భాషల్లో పండితుడు. వేణుమాధవ్ ఈయనకు పన్నెండో సంతానం. ఆంధ్ర విద్యాభివర్ధిని హైస్కూల్లో చదువు తున్నప్పుడు హరి రాధాకృష్ణమూర్తి శిష్యరికంలో చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రహసనాల్లో నటించడం ద్వారా రంగస్థల జీవితానికి శ్రీకారం చుట్టారు. హాస్యనాటకాలంటే ఇష్టపడేవారు.
కందాళై శేషాచార్యులు, యద్దనపూడి కోదండ రామ శాస్త్రి ఈయన అభివృద్ధికి తోడ్పడ్డారు. ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే సాహితీ ఉద్దండులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. వారిలో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటివారున్నారు. వారి సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. ఆ కాలంలో వచ్చిన గృహలక్ష్మి, వందేమాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి చిత్తూరు వి నాగయ్య మీద అభిమానం పెంచుకున్నారు.
వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను అనుకరించేవారు. అలా మొదలయ్యింది ఆయన మిమిక్రీ ప్రస్థానం. ఈ విద్య ప్రాపకమే ఆయన ఏకైక లక్ష్యమైంది. 1947 సంవత్సరం లో మొదలయింది ఆ ప్రవాహం. వేణుమాధవ్ సినిమా, సాహిత్యం, కళలు లాంటి పలురంగాల ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.
1952 లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీలో చేరారు. నాటి ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు ఇతర అధ్యాపకులు వారించినా వినకుండా, గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ కు ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్ మంజూరు చేశారు. ఆ సొమ్ముతో తనివిదీరా ఇంగ్లీషు సినిమాలు చూసి నటీీనటుల గొంతులు, ముఖ్యమైన సన్నివేశాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సహా వినిపించారు. రామనర్సు పరమానందభరితులై "నీవు నా రెండవ కుమారుడవు" అని మనసారా ఆశీర్వదించారు. ఆ దీవెనలే, వేణుమాధవ్ ను 'విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్' గా చేసాయి.
1953లో జి.సి.ఎస్.స్కూలు (హనుమకొండ)లో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి, ధర్మసాగరం, హనుమకొండలోని ప్రాక్టీసింగ్ స్కూలు, మట్వాడ ఉన్నత పాఠశాల, జనగామ, శంభునిపేట పాఠశాలల్లో పనిచేశారు. తొలి ప్రదర్శన 1947 లో ఇచ్చారు. 1953 లో రాజమండ్రి థియేటర్స్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ లో బలరాజ్ సహానీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చెప్పుకో దగిన మలి ప్రదర్శన ఇచ్చారు. గరికపాటి రాజారావు, దాడి గోవిందరాజులు, స్థానం నరసింహారావు, చాగంటి సన్యాసిరాజు తదితరుల మెప్పు పొందారు. తెనాలికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు కొల్లా కాశీవిశ్వనాధం, తయారమ్మ దంపతుల కుమార్తె శోభావతితో 1957లో వివాహం జరిగింది.
మిమిక్రీ సాహిత్య రంగంలోనే కాకుండా అనేక పదవులు కూడా నిర్వహించారు. ఎం.ఎల్.సీ గా, ఎఫ్.డీ.సీ డైరెక్టర్ గా, సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా, సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడిగా దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా, టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా.. అనేక హోదాలు అనుభవించారు. సాహిత్యరంగంలో వీరి కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం 1977 సంవత్సరంలో లో "కళాప్రపూర్ణ", జె.ఎన్.టి.యూ.సీ, కాకతీయ విశ్వవిద్యాలయం “గౌరవ డాక్టరేట్లు” ప్రదానం చేశాయి. తిరుపతి పట్టణంలో గజారోహణం, పౌర సన్మానం జరిగాయి. సాహితీ రంగ సేవలకు అనేక బిరుదులు పొందారు.
ఈయన పేరిట హనుమకొండ పట్టణంలో నిర్మించిన 'డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం' సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడుతున్నది. 2001 లో మిమిక్రీ సేవ కు భారత ప్రభుత్వం ”పద్మశ్రీ”పురస్కారంతో గౌరవించింది. 1981 సంవత్సరంలో లో శ్రీ రాజాలక్ష్మీ ఫౌండేషన్ బహుమతి , కళాప్రపూర్ణ, ఎన్టీఆర్ ఆత్మ గౌరవం పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ఠ పురస్కారం కూడా లభించాయి. 85వ యేట 2018, జూన్ 19న వేణుమాధవ్ కన్నుమూశారు. మూగ వోయిన ఆ అపూర్వ స్వరానికి ఆరో వర్థంతి నివాళులు.