ఆయన అక్షరాలనే నమ్ముకున్నాడు, అక్షరాలనే శ్వాసించాడు
నవలా రచయిత, పాత్రికేయుడు, నాటక రచయిత, సినీ గేయ రచయిత, నిఘంటువుల నిర్మాత నాయుని కృష్ణ మూర్తి జయంతి నేడు;
‘‘మీ రచనా శక్తికి, శైలికీ నా జోహార్లు. ఇంత గొప్ప వచనం ఈ మధ్యకాలంలో చదవలేదు’’ అంటూ నాయుని కృష్ణ మూర్తి వచన భాగవతం మొదటి భాగానికి బొమ్మలు వేయడానికి అంగీకరిస్తూ బాపు రాసిన ఉత్తరంలోని మాటలివి. కృష్ణ మూర్తి అడక్కుండానే ‘‘మిగతా భాగాలకు కూడా బొమ్మలు వేస్తాను పంపించండి’’ అన్నారు బాపు. నాయుని కృష్ణమూర్తి ఆధునిక వచనంలో రాసిన రామాయణ, భాగవతాలే కాదు, మహాభారతం మూల కథ ఆధారంగా చాలా సరళంగా, సులభ శైలిలో రాసిన ‘జయమ్’ నవల చాలా ప్రసిద్ధమైంది.
నాయుని కృష్ణ మూర్తి 'జయమ్' వంటి ప్రసిద్ధ రచనలు చేసింది చౌ డేపల్లె లో ని ఈ గెస్ట్ హౌస్ నుంచే
‘మనిషి గుర్రమురోరి మనిషీ’ , ‘ప్రలోభం’ నవలలు కూడా రాశారు. కృష్ణమూర్తి ముప్ఫై కథలు రాశారు. ఆయనలో కానీ, ఆయన రచనల్లో కానీ నిరాడంబరత్వమే తప్ప ఎక్కడా ఆవేశం కనిపించదు. పతనమవుతున్న కుటుంబ సంబంధాలు, విలువల పట్ల ఆవేదన కనిపిస్తుంది. వైవిధ్యం గల ఆయన కథల్లో ఏ సిద్ధాంతాల, దృక్పథాల ప్రభావం కనిపించదు. సందేశాలు, తీర్పులు చెప్పడం ఉండదు. అనుభవాల ఆధారంగానే ఆలోచింప చేసే వైవిధ్యభరితమైన కథలు ఆయనవి. ఎక్కడా గందరగోళం ఉండదు.
నాయుని కృష్ణమూర్తి