కరుడు గట్టిన నాస్తిక వాది గోరా
భార్య అంటే అర్ధాంగి కాదు ముప్పావు అని చెప్పిన వ్యక్తి ‘గోరా’
-డాక్టర్ పాండు కామ్టేకర్
అది చాతుర్వర్ణ వ్యవస్థ నిచ్చెనలో అత్యున్నత స్థాయి గల బ్రాహ్మణ వర్గం. సమాజిక రాజకీయ, ఆర్థిక రంగాలను శాసించే గ్రామ అధికారిక వర్గం. ఆరు వేల నియోగుల వజ్రాయుధం కరణీకం. దేశములో ఎన్ని యుద్దాలు వచ్చిననూ, ఎందరు రాజులు మారిననూ, చెక్కు చెదరని కరణీక పీఠం. అందుకే “ ఊరు మీద పిడుగు పడి కాలిపోయిననూ, కర్ణపోని ఇంటి మీద కాకి వాలదు” అని పెద్దలు అంటారు. గ్రామ స్థాయిలో తిరుగులేని , మకుటంలేని మహా రాజభోగం గల సామాజిక నేపథ్యం. సదాచారం, మడి, సంధ్యా వందనాలు, మహాన్యాస, కరన్యాస, అంగన్యాస ఇత్యాధి దైవిక, మత, ఆధ్యాత్మిక ఛాందసములో నిత్యం తల మునకలైన బ్రాహ్మణ సామాజిక జీవన నేపథ్యం. దేవుడిపై పాటలు,కీర్తనలు, కాళ్ళకు గజ్జెలు కట్టి గంతులు వేసీ, భజనలతో 25 సంవత్సరాల వయస్సు వరకు ఆస్తిక వాద కుటుంబంలో పుట్టి ,పెరిగిన ఒక వ్యక్తి నాస్తిక వాదిగా మారడం ఏమిటి? ఒక వేళ మారితే ఉపాన్యాసాలకో, కవితలకో, వ్యాసాలకో, పుస్తక రచనకో పరిమితమౌతారు. కాని ఇలా కర్త, కర్మ క్రియగానూ , మనసా , వాచా ,కర్మణా అంటూ త్రికరణ శుద్దిగా కరుడు గట్టిన “నాస్తిక వాది”గా మారడం ఏమిటీ?
ఏదో గౌతమ బుద్దుడు లాగా ఇల్లు , భార్య , పిల్లలు, సంసారం, రాజ్యం వదిలి పెట్టి వెళ్ళకుండా, తానూ, తన భార్య పిల్లలతో సహా సంసార జీవితంలోనే ఉంటూ తన సంతానమును సహితము నాస్తిక వాదమార్గంలో నడిపించుట ఏమిటి?
జ్ఞానమనీ, తపస్సని అంటూ, ఆత్మ, పరమాత్మ, ముక్తి మార్గం అంటూ ముక్కు నోరు మూసుకుని, ఎక్కడో అడవులకు, ఆశ్రమాలకు, హిమాలయాలకు వెళ్ళ కుండా, మరీ అణగారిన దళిత అట్టడుగు వర్గాలు నివసించే, నిరంతరం దరిద్రం తాండవించే, కూడుకు , గుడ్డకు. తల దాచుకోవడానికి ఇంత గూడు లేక , తరతరాలుగా సామాజికంగా, రాజకీయంగా , ఆర్థికంగా , శ్రమ దోపిడి గురియైన హరిజన వాడలకు పోయి, అక్కడే దానికి దగ్గరలోనే ఒక పూరీ గుడిసె వేసుకుని ఉండడం ఏమిటి? ఆత్మ జ్ఞానం,ముక్తి , స్వర్గ ప్రాప్తి , దైవ సాక్షాత్కారం, దైవ దర్శనం లాంటి భావనలకు పాకులాడకుండా, వాటిని పక్కకు నెట్టి వేసి, నాస్తిక వాదానికి సరికొత్త అర్థం చెప్పిన విధం ఎవరకైనా కొత్తగా , భిన్నంగా ఆశ్చర్యం కలుగక మానదు. అంత గొప్ప మహానీయుని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
“గోరా” అంటే “గోపరాజు రామచంద్ర రావు(1902 నవంబరు 15 - 1975 జూలై 26). ఆయన 1902 లో నవంబర్ 13 నాడు ఒరిస్సా రాష్ట్ర మందలి , చత్ర పురం అనే చోట జన్మించాడు. అక్కడే గల స్థానిక ఒక ఒడిశా బాలుడితో స్నేహము చేసే తంతు లేదా వేడుక ద్వారా ఒక స్నేహతుడిని జత కట్టుతారు . అక్కడ పెద్దలు తమ పిల్లలకు ఒక స్నహితునితో జత కట్టి చేసే వేడుక. ఈ వేడుకను “సంగ” అని పిలుస్తారు.
ఇతని చదువు 1913 లో పీఠాపురం లో రాజావారి కళాశాలలో ఒకటవ పారం, అటు పిమ్మట పీ ఆర్ కళాశాలలో బాటనీ , మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో BA- బాటనిలో అనర్స్ చదివి, అందులో పాసు అయ్యిన ఐదుగురిలో తక్కువ మార్కులుతెచ్చుకున్న వారిలో చివరి వాడు.
అటు పిమ్మట 1925 లో మధురైలో క్రిస్టియన్ మిసినరి కళాశాలలో బాటని లెక్చరరుగా ఉపాధ్యాయ వృత్తి చేపట్టినారు. అక్కడి ఉండుటకు అతనికి ఇక అద్దె ఇల్లు దొరకడం ఎంతో కష్టం అయ్యింది. అత్యధిక అద్దె రూ 20 ఇస్తానన్ననూ ఇల్లు దొరకక ఎంతో కాలంగా కాలిగా ఉన్న ఒక దయ్యాల కొంప అనే ముద్ర పడ్డ ఇంటిలోనే కేవలం రూ 2లు అద్దెకు ఉండినాడు. అక్కడి కాలేజీలో సెలెక్షన్ పరీక్షలలో( ప్రీ -పైనల్) తన వద్ద చదివే అందరిని పాసు చేసినాడు.అందుకు మొదట అక్కడి ప్రిన్సిపాల్ అతడిని మందలించాడు. కాని పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులతోనూ, అత్యుత్తమ శ్రేణిలో చాలా మంది పాసు అయ్యారు, అంతే కాకుండా, ఇంకా కొందరు డిస్టింక్షన్ లో కూడా పాసు అయ్యారు. అంతటితో అతనికి మంచి పేరు వచ్చింది. దానితో పాటు , యాజమాన్యము అతనిని క్రైస్తవములోనికి మారమని, మారితే విదేశాలకు పంపి, పెద్ద చదువులు చదివించీ, మంచి ఉద్యోగం ఇస్తామని ఎంతగానో మభ్య పెట్టింది. కాని వాటికి లొంగక ఉద్యోగానికి రాజనామ చేసినాడు.
అక్కడి నుండి కోయంబత్తూర్ వ్యవసాయ కళాశాలలో బాటని రీసర్చ్ అసిస్టంట్ గా ప్రభుత్వ జాబ్ లో జాయిన్ అయ్యారు. అక్కడ అతనికి చాలా సమయం దొరికింది. అక్కడ ఉండగానే పలు మత గ్రంధాలు , వేదాలు, వేదాంగాలు, బైబిల్, ఖురాను, రామాయణ, మహాభారతం, ద్వైత , అద్వైత , వైష్ణవ, శాక్తేయ, శైవ, వైష్ణవ ,వీర శైవ , లాంటి ఎన్నో గ్రంధాలను లోతుగా అధ్యయనం చేసినాడు. అప్పటి నుండి అతనికి మతాలపై నమ్మకం తగ్గి, మానవత్వం మీద నమ్మకం పెరిగి, నాస్తికత్వ బీజాలు తనలో మొలకెత్తినాయి. అక్కడ కూడా తన మార్గం ఇది కాదని అని భావించి , ఆ ఉద్యోగానికి కూడా రాజీనామ చేసినాడు.
అటు తరువాత శ్రీలంకలోని కొలంబో వెళ్ళి అక్కడ ఒక బుద్దిస్ట్ కళాశాలలో బయాలజీ లెక్చరరు గా పనిచేశాడు. అక్కడ కూడా ఇంకా ఆస్తిక వాద లక్షణాలే ఉండేవి. అక్కడ అంతా మాంసాహారులే, వారు జంతు హింస చేయరు కాని, ఎవరైనా కొస్తే మాత్రం మాంసం తింటారు. అతడు శాకాహారం తినుటకు నాలుగు - ఐదు కిలో మీటర్ల దూరం నడిచి పోయి,అంత దూరమున గల ఒక హోటలులో రోజుకు రెండు సార్లు , ఉదయం సాయంకాలం భోజనం చేసి తిరిగి వచ్చేవారు. అక్కడ ఒక కప్పను కోసి నాడి వ్యవస్థను పాఠ్య విషయం బోధించుటను జీవ హింస పాపమని అక్కడి కళాశాల యాజమాన్యం వ్యతిరేకించింది. అక్కడే ఇంకా బౌద్ద జైన తధితర, చార్వాక , మీమాంస , పలు మత గ్రంధాలను కూడా ఇంకా లోతుగా అద్యయనం చేశాడు. గ్రహణ సమయములో కడుపుతో ఉన్న తన బార్య బయట తిరుగడం వల్ల తన పిల్లలకు గ్రహణ మొర్రి వస్తుందనే అనే మూడ నమ్మకాన్ని ఖండించి , శాస్త్రీయ పద్దతిలో వివరించాడు. ఇక్కడ ఇంకా నాస్తిక వాదం వైపు ఇంకా దగ్గర అయ్యాడు.
తర్వాత కాకినాడలో తను చదివిన కళాశాలలోనే బాటని లెక్చరర్ పోస్ట్ కు అవకాశం వచ్చింది. 1928 లో కాకినాడ వచ్చాడు. ఇక్కడ తండ్రి ముందు జంధ్యం తోను, తండ్రి లేనప్పుడు జంధ్యం లేకుండా తిరిగేవాడు. ఇది గమనించి తండ్రి, కార్తీక పౌర్ణమి( జంధ్యాల పౌర్ణమి) నాడు కొత్త జంధ్యం వేయ పోతూ “ఇది ఎల్లప్పుడు నీ మెడలో ఉండాలని” తండ్రి అన్నప్పుడు వెంటనే అతడు “నేను జంధ్యం వేసుకొను” అని నిక్కచ్చిగా వెంటనే చెప్పగా, “ అయితే నీవు నా పక్క తినడానికి వీల్లేదు” అని తండ్రి కోపంగా గట్టిగా పలుకగా, ఇంటి నుండి భార్యతో సహా బయటకు వెళ్ళి, ఒకటి రెండు రోజులు, ఒక మిత్రుని ఇంటిలో వుండీ, తరువాత ఒక అద్దె ఇంటిలోకి మారాడు.
అదే సమయమున 1928 లో వయోజన విద్యా కార్యక్రమ ప్రారంబించాడు. అంతే గాక గ్రామం బయట, హరిజన వాడకు దగ్గరలో ఒక పూరీ గుడిసె వేసుకుని అక్కడకు కాపురం మార్చాడు. ఇక్కడే తన ఖర్చులు తగ్గించుకున్నాడు. రైలు అతి తక్కువ తరగతిలో అంటే ఇంటర్ క్లాస్ లోనే ప్రయాణం చేయడం, యూనివర్సిటీ ఇచ్చే బత్తెంలో కూడా సగం తగ్గించుకుని తీసుకునేవాడు. ఇతడి బోధన తరగతి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులతో మమేకమై అందరు కలిసి భోజనం చేయడం, అల్పాహారం తీసుకోవడం లాంటివి చేస్తూనే నాస్తిక వాదంపై నిరంతరం చర్చలు జరిగేవి.
శ్రమ విలువ ప్రయోగం :ఇక్కడే ఒక జాతరలో తన విద్యార్థులను రెండు జట్టులుగా చేసి , ఒక జట్టు బిక్షం ఎత్తుకుంటుంది. రెండవ జట్టు మూటలు మోసి కూలి తీసుకోవడం . వచ్చిన రాబడిని లెక్కించగా కూలి చేసిన జట్టుకు అతి తక్కువ డబ్బు పొందిరి. కాని బిచ్చం ఎత్తిన జట్టుకు ఎక్కువ డబ్బు వచ్చింది. చూడండి మన సమాజం దేనికి ప్రాధాన్యత ఇస్తుందో చూడండి. శ్రమ శక్తికి ఇచ్చే ఫలితం అర్థం చేసుకునుటకు ఈ ప్రయోగం చేసినాడు.
నాస్తిక వాద కేంద్రం ఏర్పాటు :ఇక్కడే ఒకసారి విగ్రహ రాధన చేయాలా? వద్దా ? అని చర్చలో పాల్గొంటూ అసలు దేవుడే లేడు అంటే ఇంకా దేవుడు సశరీరుడా ? నశరిరుడా? అనే ప్రశ్న వ్యర్థం , అర్థం లేని చర్చ ఇది అంటూ చెప్పి అందరికీ కంటు అయ్యాడు. ఈ కాలంలోనే “క్రిటిక్” అనే చేతి వ్రాత పత్రికను , 20 ప్రతులతో కార్బన్ పేపర్ తో రాసి అందరికీ అక్కడక్కడ గ్రంధాలయాలలో పెట్టేవారు ఇందులో నాస్తిక వాదం దృష్టితో పలు వ్యాసాలు రాశాడు. అలా 1941 లో కనుమూరులో నాస్తిక వాదం ప్రారంభమై, 1949 విజయవాడ పడమటలో నాస్తిక వాద కేంద్రము ఏర్పాటుకు దారి దీసింది. 1951 లో నూజివీడులోనూ, 1956 లో సూర్య పేటలో, 1957 లో కడపలో , 1959 లో వరంగల్ లో నాస్తిక వాద సమావేశాలు ఏర్పాటు చేసి నాస్తిక వాద వ్యాప్తికి కృషి చేసినాడు, వీటి ద్వారా చాలా పేరు వచ్చింది, అప్పుడ ఎందరో దేశ విదేశాల నుండి వచ్చి నాస్తిక వాద కేంద్రాన్ని సందర్శించారు. వాటిలో అమెరికా నుండి బ్లాక్ ఉడ్ , స్వీడన్ నుండి బరం మెర్కర్, జపాన్ నుండి కోయనాగా, ఆస్ట్రేలియా నుండి రోజ్ మేరీ , ఇంగ్లాండు నుండి జాయి లాంటి వాళ్ళు ఎందరో వచ్చారు.
పంది- గోమాంస కార్యక్రమం: ఇదిలా గుండగా 1972 లో ఈ కార్య క్రమం నిర్వహించాడు. దీన్ని పూరీ శంకర చార్యులు తాను 2000 మంది వచ్చి అడ్డుకుంటాం వ్యతిరేకించారు. దీని నిలిపి వేయుటకు ప్రభుత్వం మీద ఎంతో ఒత్తిడి తెచ్చిరి. స్థానిక క్రైస్తవ సంఘం వారు, తమిళనాడు పెరియారు రామస్వామి నాయకర్ అనుచరులు తాము 20000 మంది వచ్చి మద్దతు ఇస్తమని చెప్పిరి. ఎన్నో అడ్డంకుల ఈ కార్యక్రమం జరిగినది. పోలీస్ నిర్బంధం, 144 సెక్షన్ తదితర ఉద్రిక్తతల మధ్య అన్ని మతాల వారు, కులాల వారు 200 మంది వచ్చి పాల్గొనిరీ.
అటు పిమ్మట పలు యూరప్ దేశాలు పర్యటనలు చేసి , అక్కడ నాస్తిక వాద ప్రచారం చేసిరి. 1970 అంతర్జాతీయ హుమసిస్ట్ సభలకు ముఖ్య అతితిగా ఆహ్వాన వచ్చెను.
ఆర్థిక సమత ఉద్యమం :దీనిలో బాగంగా ఆర్థిక సమాన్యతల గురించి మాట్లాడిన గోరా ను,గాంధేయ ఆర్థిక శాస్త్రవేత్త JC కుమారప్పతో కలిపి కమ్యూనిస్ట్ లుగా ప్రచారం చేశారు అంటే అతని నిబద్ద తను అర్థం చేసుకోవచ్చు . 1949 లో గాంధీజీ ఏర్పరిచిన 13 అంశాల నిర్మాణ కార్యక్రమమును 18 అంశాలు : మత సామరస్యం, అస్పృశ్యత నివారణ, మద్య పాన నిషేదం, ఖాదీ, ఇతర గ్రామీణ పరిశ్రమలు, గ్రామ పరిశుద్దం, నవీన విద్య , వయోజన విద్య, స్త్రీలు , ఆరోగ్య నియమాల శిక్షణ, ప్రాంతీయ భాషలు, రాష్ట్ర భాష, ఆర్థిక సమానత, రైతులు, కార్మికులు, ఆదివాసులు, కుష్టు రోగుల సేవ, విద్యార్థులు . కాని మన దేశం ముఖ్యంగా గ్రామ సీమల సముదాయమైన మన అట్టడుగు ప్రజకు సాగు చేసుకునుటకు ఒకటి లేదా రెండు ఎకరాల భూమి ఇవ్వాలన్న ఆలోచన మన పెద్దలకు ఎందుకు తట్ట లేదో మరి?
గాంధీతో గోరా : 1930 లో దేవుడి గురించి చర్చించుటకు “ దేవుడు మానవ బుద్దికి అతీతుడు” అని ఎక్స్ వాక్యం చెప్పి, చెప్పికలుసు టకు అవకాశం ఇవ్వని గాంధీ , గోరా చేసే కార్యక్రమాలకు ఆకర్షితుడై గోరాను స్వయంగా తన సబర్మతి ఆశ్రమానికి రమ్మని పిలిచాడు. తాను తన కుటుంబం కూడా గాంధీ ఆశ్రమంలో ఉండీ , పలు సేవక బృందాలలో పాల్గొనినను, దేవ ప్రార్థన , భజనలకు మాత్రం దూరం ఉండినారు. తన కూతురును ఒక అంటరాని వ్యక్తికి ఇచ్చి, గాంధీ ఆశ్రమములో వివాహం చేయడానికి నిర్ణయించేను, దేవుడి ప్రస్తావన లేకుండా , దేవుడి బదులుగా “సత్యం”, సాక్షిగాను, మనస్సు సాక్షి గాను ధీవించుటకు గాంధీజీ సహితం ఒప్పించింన దీశాలి. గాంధీకి నాస్తి వాదం యొక్క ప్రధాన్యతను, ఆస్తిక వాదం మానవ మనుగడకు ముప్పు ఎలాగో వివరించిన తీరు అమోఘం. చివరగా గాంధీ గోరా తో “ఔను. నీ మాటలో నాకు ఒక ఆధర్శం కనబడుతుంది. నా ఆస్తికత్వం ఒప్పు అని గాని, నీ నాస్తికత్వం తప్పు అని గాని చెప్పలేను. మనం సత్యాన్వేషులం. తప్పు తోవన పోతున్నాము అని తెలియగానే మనం మానం నడిచే తోవ మార్చుకుంటాము. నా జీవితంలో నేను ఇలాగ ఎన్నో సార్లు మార్చు కున్నాను. మీరు గట్టి కార్య కర్తలనే విషయం నాకు కనబడుతుంది. మీరు అంధ విశ్వాసులు కారు. తప్పు తోవను పోతున్నట్టు తెలుసుకోగానే మార్చుకుంటారు. మీలో అంధ విశ్వాసం లేనంత వరకు భయం ఏమిలేదు. సరియైన విధానం మీదో, నాదో ఫలి తాలే రుజువు పరుస్తాయి. అప్పుడు మీ మార్గాన్ని నేను అనుసరించ వచ్చు, లేదా మీరు నా మార్గాన్ని అనుసరించవచ్చు లేదా ఇరువురం కలిసి మరొక మార్గాన్ని అనుసరించ వచ్చు. అందుచేత మీ పనిలో మీరు ముందుకు సాగి నడవండి. మీ విధానం నాకు వ్యతిరేఖమైనప్పటికి నేను మీకు తోడ్పడుతాను” అని అన్నాడు. ఇక్కడ హెగెల్ తార్కికత విధానం తరహా చర్చ జరిగినట్టు కనపడుతుంది.
పార్టీ రహిత ప్రజా స్వామ్య ఉద్యమం: 1952 పార్టీ రహిత ప్రజా స్వామ్య తరపున విజయవాడ నుండి గోరా, కూచిపూడి నుండి పరుచూరి వెంకట రత్నం, నల్లగొండ నుండి కె. మురళీధర రావు పోటీ చేశారు, వీరికి పలు రాజకీయ పార్టీలు టికెట్లు ఇస్తామని పిలిచిననూ, ఆశ పెట్టినను కూడా తిరస్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినారు. కాని అందరు ఓడి పోయారు. ఇక్కడే స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు కేవలం 20 రోజుల ముందే కేటాయించడం అన్యాయమని, ఇది వివక్షతో కూడినది అని తన వాదనను తెలుపుతూ ఎన్నికల కమీషనుకు లేఖ రాసినారు. ఇప్పుడే అభ్యర్థుల నందరిని ఒకే వేదిక మీద మాట్లాడించే “కామన్ ఫ్లాట్ ఫారం”ను మొదట ఇక్కడే ప్రారంభించాడు. దానితో పాటు “పార్టీలకు ప్రత్యేక గుర్తులు ఉండటం వలన అవి ట్రేడ్ మార్కులుగా మారి పార్టీలకు లాభదాయకం అయ్యాయి. కాని ఇండిపెండెంటు వాళ్ళకు 20 రోజులకు ముందు మాత్రమే గుర్తులు ఇస్తే , అంత తక్కువ వ్యవదిలో ఎలా ప్రచారం చేసుకుంటారు” అని నిలదీసి ప్రశ్నించారు.
“అంతే కాకుండా ఎన్నికలలో పోటీ చేసే అన్నీ పార్టీల అభ్యర్థులను అందరినీ కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించి, గుర్తులు కూడా వేరు వేరుగా ఉండాలనియు, ఎన్నిక గుర్తులు ముందే ఎవరికి రిజర్వు చేయరాదు” అని భావించారు.
దీనితో పాటు “అస్సెబ్లీకి ఎన్నికైనా సభ్యులకు ప్రత్యేక బాక్సులు( sitting places)కేటాయించ వద్దని, అలా కేటాయిస్తే వారు పార్టీకి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు అవుతారు, కాని ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వాళ్ళు కారని , వీరు పాలక పక్ష , ప్రతి పక్షాలుగా విడి పోయి సభ మొత్తం వాగ్వివాదల “యుద్ద భుమి” అవుతుంది” అని ఆందోళన పడ్డారు.
దీనితో పాటు “పార్టీ “విప్పు” వలన సభ్యులు పార్టీకి బానిసలు అవుతారని, సభ్యుల ఆలోచనకు ఈ విప్పు అడ్డంకి” అని కూడా అని భావించారు. అంతే కాదు సభ్యులకు స్వేచ్చ ఉండదు. మంచి చేడ్డల పరిశీలన కాకుండానే పార్టీ బలా బలాల మీదే నిర్ణయాలు జరుగుతాయి. పాలక పక్షమే గెలుస్తుంది. ఇక్కడ న్యాయానికి ధర్మానికి చోటు ఉండదు. సభ్యులు కేవలం జీతాలకే పరిమితం అవుతారు. అందు చేత చాలా సార్లు సభలు కనీస సంఖ్య (Quorum) లేక సభలు వాయుధాలు పడుతాయి. పార్టీ తత్వంతో శాసన సభలు అన్నీకూడా ఒక” ఫార్సు” గా మారి ప్రజా ధనం , విలువైన సమయం వృదా అవుతుందని బావించారు.
విప్ లకు , పార్టీ బాక్సులకు వ్యతిరేకంగా ఉద్యమం : 1960, జనవరి 20 శాసన సభ స్పీకర్ కు ఒక లేఖ రాసీ “పార్టీ బాక్సు”లను, “విప్పు”లను రద్దు చేయాలని కోరినాడు. లేనిచో తాము సత్య గ్రహం చేస్తామని హెచ్చ రించాడు. అన్నట్టుగానే విజయ వాడ నుండి తన అనుచరులతో పాద యాత్ర బయల దేరడం మొదలు పెట్టి , కృష్ణ, నల్లగొండ , హైదరాబాద్ జిల్లాల గుండా 34 రోజులు, 256 మైళ్ళు కాలీ నడకన పాడ యాత్ర చేసి హైదరాబాద్ చేరుకున్నరు. 1960, ఫిబ్రవరి 28 నాడు అస్సెబ్లికి అర మైలు దూరంలో పోలీసులు నీలపి, అరెస్ట్ చేసినారు. ఆరోజు స్పీకర్ సభలో ప్రకటన చేస్తూ “ ఈ పార్టీ విప్, పార్టీ బాక్సులు బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం అనుసరిస్తున్నాయని” ప్రకటించారు. అందుకు గోరా “ సంప్రదాయ బద్దంగా వస్తున్నవి. కాని ఇవి రాజ్యాంగం ఆమోదించినవి కావని, వీటిని తొలిగించాలని” పదే పదే నొక్కి చెప్పారు.
సత్య గ్రహ సమాజ్ ఆవిర్భావం: 1960 లో పార్టీ రహిత మహా సభలు జరిగినవి. దానితో పాటు 1960 లోనే అకిల భారత కాంగ్రెస్స్ సంఘం మహా సభలు కూడా జరిగినవి. ఇందులో సర్వోదయ కార్యకర్తలు “దేశములో పెరిగిన అవినీతి, ప్రజల కష్టాలు బాధలు, పార్టీల ముఠా రాజకీయాల గురించి ఆందోళచెంది, కొందరు సామూహిక ఉప వాస దీక్షకు దిగినరు. అది క్రమంగా పెరిగి 72 మందికి చేరి, చివరకు అది చివరకు “సత్య గ్రహ సమాజ్” ఆవిర్భానికి దారి దీసింది.
పార్టీ రహిత ప్రజాస్వామ్యం ఉద్యమం డిల్లీ పాద యాత్ర : 1960 , అక్టోబర్ 8 నాడు పాద యాత్ర ప్రారంభమయ్యింది. ఒక కర్రకు అన్నీ పార్టీల జండాలు కట్టుకున్నారు. జండాలు పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తాయని, కర్ర మాత్రం ఇండిపెండెంట్లకు ప్రాతినిధ్య వాహిస్తాయనే భావనతో ఇలా అన్నీ జండాలు ఒక కర్రకు కట్టి రూపొందించారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి 14 మందితో కలిసి , కొందరు ఇచ్చిన చందా రూ 300 లు మొత్తం కరపత్రాలకే సరిపోయినవి. చేతిలో ఒకక పైసా లేకుండా , ఇలా 14 మంది సహచరులతో వెయ్యి మైళ్ళ ప్రయాణం “ మంత్రి హమారి నౌకర్ ఔర్ హై జంతా ఉస్కా మాలిక్ హై” అనే బ్యానర్ తో మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, నాగపూర్, మీదుగా 99 రోజులు పాద యాత్ర సాగి, 1960, జనవరి 14 నాడు గాంధీ సమాధి రాజ్ ఘాట్ చేరుకుంది. చివర హెహ్రూ అధికార నివాసం ముట్టడించింది. చివరకు నెహ్రూ దిగి వచ్చి “వీటిని ప్రజా ఉద్యమాల ద్వారానే మార్చ గలం” అని చెప్పడముతో అతది పాద యాత్ర ముగిసింది. ఇలా ఎన్నో సమావేశాల జరిగినవి.
అందులో భాగంగా 1962 , జూన్ లో కలకత్తాలో పార్టీ రహిత ప్రజాస్వామ్య సభలు జరగినవి. ఇందులో ఐదు తీర్మానాలు చేయబడినవి.
1. పార్టీలకు ప్రత్యేక గుర్తులు రిజర్వు చెయ్యరాదు. పోటీలో పాల్గొనే అందరికీ ఒకే సారి, ఒకే విధమైన గుర్తులు ఇవ్వాలి.
2. . అసెంబ్లీ, పార్ల మెంటులలో పార్టీ బ్లాకులు ఉండరాదు. సభ్యులు తమ నియోజక వర్గ వరుస క్రమములో కూర్చోవాలి.
3. ప్రదాన మంత్రి గాని, ముఖ్య మంత్రి గాని సభ్యులు అందరు “రిపీటెడ్ బ్యాలెట్” ప్రకారం ఎన్నుకోవాలి.
ఉదా: 4 గురు పోటీ చేస్తే అతి తక్కువ వోట్లు వచ్చిన వాడిని తొలిగించి, మిగా ముగ్గురకి మళ్ళీ ఓటింగ్ పెట్టాలి, మళ్ళీ తక్కు వచ్చిన వాణ్ని తొలిగించాలి. చివరకు మిగిలి ఇద్దరి మళ్ళీ పోటీ పెట్టాలి ఎవరికి ఎక్కు వోట్లు వస్తే అతడు గెలుపొందినట్టు. ఇది “బిగ్ బాస్” కార్యక్రమం మాదిరి అన్న మాట.
4. తీర్మాణాల ఓటింగ్ లో “విప్పు” తొలిగించాలి,సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్త పరుచుటకు , వోటు వేయుటకు పూర్తి స్వేచ్చా ఇవ్వాలి.
5. తీర్మానాలు, నిరాకరించుటకు, సవరించుటకు, ఆమోదించుటకు సభ్యులకు పూర్తి స్వేచ్చా ఇవ్వాలి. ఒక వేళ తీర్మాణం నిరాకరించిన, సవరించిన సంబధిత మంత్రి పై ఆవిశ్వాసంగా పరిగణించ రాదు. మంత్రులను తొలిగించుటకు ప్రత్యేక అవిశ్వాస తీర్మానం ఉండాలి.
కూరగాయ ఉద్యమం : తీవ్ర ఆహార కొరత కాలంలో కూరగాయల ఉద్యమం నడీపీనాడు. ప్రబుత్వ స్థలాలలో పూల మొక్కలకు బదులు కూరగాయ మొక్కలను పెట్టాలని కోరినాడు. ప్రతి ప్రభత్వ ఉద్యోగ , మంత్రి తక్కువ ఖర్చు చేయాలని, ప్రతి విందుకు, సమావేశానికి 30 మంది కంటే ఎక్కువ ఉండ రాదని. మంత్రులు తక్కువ జీత భత్యాలు తీసుకోవాలని , రైళ్లలో సాధారణ తరగతిలోనే ప్రయాణం చేయాలని ఎన్నెన్నో ఉద్యమాలు చేసినాడు. అస్సెంబ్లి ముందు గల స్థలాలలో ,పూల మొక్కలు తొలిగించి, కూరగాయ మొక్కలు పెట్టినారు. ప్రతి సమావేశానికి పూల దండలకు బదులు కూర గాయాల దండలు తెచ్చి ప్రచారం చేసేవారు.
ఇతడు నిరంతర ఆశ వాది. ఎక్కడ సమావేశం జరిగినను “జై ఇన్ సాన్” అని అభివాదం చేసేవాడు. ఇతడు కుటుంబం చివరి కుమార్తే తొమ్మిదవ సంతానం కనుక “నౌ” అనియు, రెండవ కూతురు గాంధీ- ఇర్విన్ ఒప్పందం కాలంలో పుట్టి నందున “ మైత్రి “ అనియు, 1941 నీయంతల కాలములో పుట్టిన కొడుకుకు “నియంత” అనియు, రెండవ ప్రపంచ యుద్ద సమయాయంలో పుట్టిన వాడికి “సమరం “ అనియు , ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టిన వానికి “లవణం” అనియు వివిధ చారిత్రక విశేషములకు ఆధారంగా తన పిల్లకు పేర్లు పెట్టి తనకు నాస్తిక వాదం పట్ల తన నిబద్దతను చాటుకున్నారు. అంటే కాకుండా సామాన్యంగా అందరు భార్యను “అర్థాంగి” అంటే ఇతడు తన భార్యని “పౌన” అని ఆమె నాకు అర్థాంగి కాదు “ముప్పావు” అని చెప్పి స్త్రీ శక్తి , మహిళల పట్ల తనకు గల గౌరము, వారి ముఖ్య పాత్రకు గల ఔన్నత్వాన్ని గుర్తించాడు
అట్టి హేతువాది, నాస్తిక వాది, గోరా గారు 1975 లో “గ్రామీణ సమాజంలో మార్పులు ఎలా తేవాలి” అనే అంశం మీద విజయవాడలో 45 నిమిషాలు ఏకభిగిగా మాట్లాడి, కులతత్వం, మతతత్వం, మూడత్వం, అజ్ఞానం, లాంటి వాటిం విమర్శిస్తూ శ్రమ శక్తికి విలువ లేక పోవడం, నవీన విద్యా విధానమునకు మన స్వతంత్ర బారత దేశం అనువుగా లేదనియు, మన సమాజములో మార్పులకు గట్టి పట్టుదల, నిరంతర కృషి , త్యాగం అవసరం చాలా ఉందని , మాట్లాడుతూనే ఉద్వేగానికి లోనై కుప్పకూలి చనిపోయాడు.
ఇతని చావు కూడ నాస్తిక వాదం మేరకు మత, ఆచారాల ప్రమేయం లేకుండా చిట్టి రామ చంద్రపురానికి చెందిన దళితుడు, “సత్యానందు” చేత చితికి నిప్పు పెట్టించి అంత్య క్రియలు జరిపించడం. అతని కుటుంబం మొత్తం అతని అడుగు జాడలలో నడవడం ఎంతో ఆదర్శమైన అరుదైన విషయం.
సాంస్కృతిక పునరుజ్జీవ నోద్యమం తరువాత జాతీయ వాద ఉద్యమాలు వచ్చి, వలస వాద పాలన నుండి విముక్తి పొంది, స్వాతంత్ర్యం దేశాలుగా పరిణామం చెందినవి. ఈవిధంగా స్వాతంత్ర్యం పొందిన తరువాత అట్టడుగు స్థాయిలో ఉన్న అలగ జనాన్ని, బడుగులను లెక్కలోకి తీసుకోలేదు. వీరు తరతరాలుగా బానిసత్వంలో మగ్గి , వెట్టి చాకిరీ చేసి, శ్రమ దోపిడి, ఆర్థిక దోపిడి, సమాజిక,అస్తిత్వ భావ దోపిడి మరియు సామాజిక వివక్షతకు గురియై నారు .బుక్కెడు కూడుకు, ఒంటికి జానేడు గుడ్డకు, తల దాచుకోవడానికి ఇంత గూడు , తనది చెప్పుకోవడానికి తనది అని తన్మయత్వం పొంది , సాగు చేసుకోవడానికి సెంటు భూమి ఇవ్వాలని ఎందుకు ఆలోచించలేదో మన పెద్దలు ?
బానిసత్వం , వెట్టి చాకిరీ నిషేదించిన తరువాత చట్ట బద్దంగా బానిసత్వం నుండి విముక్తి పొందారు కాని వీరికి జీవనోపాది చూపడంలో అటు అగ్ర రాజ్యం అమెరికాలోనూ, భారత దేశంలోనూ , అలగే యావత్ ప్రపంచం విపలమయ్యింది. ఎవరైనా సామాజిక అసమానతలు అంటే వాడిని కమ్యూనిస్ట్, తీవ్ర వాదిగా చూడాల్సిన పరిస్తితి ఎందుకు వచ్చింది?
దీనికి అంతటికీ కారణం కుల వ్యవస్థ అనియు, మతం అనియు, మనువాదమనియు, ఎన్నెన్నో సూత్రీకరణలు, వాటికి ప్రతి సూత్రకరణలు చేశారు. తద్వారా పరస్పర దైవ దూషణ , ఒకరి మతాలలోకి ఒకరు తొంగి చూసి,గత చరిత్ర తవ్వి, ఉన్నవి, లేనివి , లోపాలను ఎత్తి చూపి, వక్రీకరణాలు చేసి, నిరంతర వాగ్వివాద సంఘర్షణలకు దారి దీసి , పరస్పర భౌతిక దాడులకు దోహద పడ్డాయి. తద్వారా వర్గాలుగా విడిపోయి, మతాల మధ్య, దేశాల మధ్య, చివరికి మనుషుల మధ్య అపనమ్మకం, ద్వేషం , పగలు మనుషులలోనూ, మనస్సులలోనూ పేరుకు పోయాయి. దీని వల్ల తరతరాలుగా వెట్టి చేసి, దోపిడీకి గురియైన వారి పరిష్టితి గురించి ఆలోచించ కుండా మానవ మేదస్సు విజయవంతంగా పక్క దారి పట్టింది.
అందరు కూడా పార్లమెంటులో ప్రత్యేక సీట్లు, కావాలనియు, విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ కావాలనియు లాంటి పరిమాణాత్మక(quantitative) విషయాల పైనే దృష్టి పెట్టినారు.కాబట్టి ఈ మేరకు అసమానతలు తగ్గినవి, వాటితో పాటు బడుగుల గుణాత్మకంగా(qualitative) ఇంత భూమి , రెండు ఎద్దులు, ఒక గేదె లాంటివి తప్పక ఇచ్చి ఉంటే ఈ అసమానతలు ఈ స్థాయిలో ఉండేవి కావు.అలా కాకుండా మన దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్ వాళ్ళు పోయే ముందు దేశములో గల 600 -700 సంస్థా నాలను రద్దు చేసి పేదలకు ఇంత భూమి ఇచ్చి పోతే వారి గొప్ప తనం చరిత్రలో నిలిచేది. దేశం అన్నీ రంగాలలో 75 సంవత్సరాల ముందు ఉండేదేమో. మన దేశం రాజకీయంగా , ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఆదర్శం అయ్యేది. కేరళలో స్వామి నారాయణ గురు దళితులకు ప్రత్యేక గుడులు, దేవాలయాలు కట్టి, వాటి ఆదాయాన్ని విద్యకు ఉపయోగించడం. పెరియారు రామస్వామి నాయకరు కాంగ్రెస్ తో విభేదించి భయటకు వచ్చి నసత్తిక వాద వాదం అభవృద్దికి పూనుకుంటే , గోరా మాత్రం కాంగ్రెస్ లోనే ఉండీ మరీ , గాంధీతో వాదించి తను ఎంచుకున్న మార్గంలో నడిచాడు.
గోరా గారు ఒక వాస్తవిక వాది(realist), ఒక మానవతావాది (humanist), ఒక ప్రయోగాత్మక వాది( pragmatist), ఒక అనుభవ వాది(empiricist), ఒక నాస్తిక వాది (atheist),ఒక సామ్యవాది (socialist), హేతువాది( rationalist) ఇలా ఎన్నో పాశ్వాలు మనకు గోచరిస్తాయి.
అంతటి వ్యక్తికి మన పాఠ్య పుస్తకాలలో , చరిత్ర లో తగిన స్థానం ఇవ్వక పోవడం, భావితరాలకు తెలియ జెప్పే విదంగా సముచిత గౌరవం, స్థానం ఇవ్వక పోవడం చాలా విచారకరం.
ఇప్పటి వరకు కట్టిన భహులార్ద సాధక ప్రొజెక్టులు, పరిశ్రమలు, పరిశోధన సంస్థలు, సాంకేతిక విద్యా రంగాల రూప కల్పన లాంటి వల్ల ఉన్నవారికే ఎక్కువగా ఉపయోగ పడ్డాయి. ఒక ఆకలి చావులు తగ్గినవి. కాస్త ఆర్థిక వెసలు బాటు కలిగింది కాని అసమానతలు , మానసిక, శారీరక, ఆరోగ్య, అంతు చిక్కని సమస్యలు విపరీతంగా పెరిగాయి.
ఆస్తిక -నాస్తిక , బ్రాహ్మణ -బ్రహ్మణేతర , అధ్యాత్మిక -హేతువాద , చర్చోపచర్చల పైన గల ప్రాధాన్యత బడుగుల బతుకుల పైన లేదు. ఈ రగిలే చిచ్చు ఇంకా సామాజిక మధ్యమాల్లో రావణా కాష్టం లాగా ఇంకా కాలుతూనే ఉంది. ఈ సమాజీక అసమానతలు తొలిగించడం అనేది మొదటి ప్రధాన్యత కానంత వరకు బడుగులలో కలిగే అసంతృప్తులకు మూల్యం చెల్లించుకొక తప్పదు.