సింధు లోయలో జూలు విదిల్చిన మతోన్మాదం
ఒక సాంస్కృతిక మహా సంగ్రామం. హరప్పనుల గాథ. అధ్యాయం 7. మూలం: The Greatest Battle of Culture (The Story of Harappans) by Bethi Panigrahi. తెలుగు: ఆడెపు లక్ష్మీపతి
బేతి పాణిగ్రాహి
రోజులు గడుస్తున్నాయి, శాంతి దీపకళికను ఆర్పి వేసే బెదిరింపుతో ఒక నల్లని నీడ లోయ అంతటా కమ్ముకు రాసాగింది. హరప్పా మతోన్మాదుల నాయకుడైన చంబా నిగూఢ వ్యక్తిత్వం గల మనిషి; అతడు చాపకింది నీరులాగా ప్రజల మనస్సుల్లో అనుమానం, అపనమ్మకం బీజాలు వెదజల్లాడు. చంబా సమ్మోహక శక్తికి, అతడి అధికార లాలస కి ఆకర్షితులైన కొద్ది మంది అనుచరులు –తప్పుదోవ పట్టిన ప్రేతాల్లా –ప్రజల్లో ఆర్యుల గురించి అబద్ధాలు, అర్ధసత్యాలు ప్రచారం చేశారు.
రెండు నాగరికతల నడుమ సాంస్కృతిక మారకం చంబా సొంత కుటుంబంపై సైతం ప్రభావం చూపింది. అతని చెల్లెలు ఒక ఆర్య యువకుడిని పెళ్ళాడి హరప్పన్ సాంప్రదాయిక పద్ధతులకు స్వస్తి చెప్పి పూర్తిగా ఆర్యుల జీవన విధానాన్ని అవలంబించసాగింది. చంబా కి ఇదొక విద్రోహంలా కనపడింది, ఆర్యుల చెడు ప్రభావం నుంచి హరప్పన్ సంస్కృతిని, సంప్రదాయాలని కాపాడాలని అప్పుడే ఒక స్థిర నిర్ణయం తీసుకున్నాడు.
కానీ, ఆర్యుల పట్ల చంబా కున్న ద్వేషం మరింత లోతుగా పాదుకు పోయింది. హరప్పన్ అర్చకుడైన అతని తండ్రి చాలా సంవత్సరాల కిందట ఆర్యన్ సైనికులతో జరిగిన ఒక గలాటాలో హతుడైనాడు. దు:ఖం, కోపాగ్నితో రగిలి పోయిన చంబా తల్లి ఆర్యుల క్రూరత్వం, హరప్పనుల గొప్పదనాన్ని గురించిన గాథలు చెబుతూ కొడుకును పెంచింది. చంబా గుండెల్లో ప్రతీకార జ్వాల ఎగిసింది; సాంస్కృతిక మారకం హరప్పన్ సమాజానికి పెద్ద ముప్పు అని దృఢంగా విశ్వసించాడు.
పెద్దవాడైనా కొద్దీ చంబా లోని కోపం, ద్వేషం ఇంకా పెరిగిపోయినై. అతని దృష్టిలో ఆర్యులు ఎప్పుడూ పక్కలో బల్లెం వంటివారు, హరప్పనులు గురైన వేధింపులు, వ్యధలను నిరంతరం గుర్తు చేసే శత్రుమూక. ఆర్యులను బయటికి తరిమివేసి, తమ భూభాగాన్ని తిరిగి స్వాధీన పరచుకుని, సంస్కృతిని, జీవన విధానాన్ని పునరిద్ధరించడం ఒక్కటే హరప్పనులను కాపాడే మార్గం అని చంబా గట్టి నమ్మకం.
తన అనుచరుల దృష్టిలో చంబా ఒక ధీరోదాత్తుడు, హరప్పా ప్రజల పాలిట కథానాయకుడు. ఆర్యుల వల్ల కలిగే ముప్పును వాస్తవంగా అతడు మాత్రమె అర్థం చేసుకున్నాడనీ, హరప్పా ప్రజలను కాపాడ గలిగేది అతనొక్కడే అని వాళ్ళు విశ్వసించారు.
మొదట గుసగుసగా వెలిబుచ్చిన చంబా అనుచరుల అభిప్రాయాలు క్రమంగా బాహాటంగా వ్యక్తం కావడం ఆరంభమై అవి గుళ్ళల్లో, గ్రామాల్లో మార్మోగినాయి. ‘‘ఆర్యులను నమ్మకూడదు. వాళ్ళు తడిగుడ్డతో గొంతు కోసే రకం. వాళ్ళు మన మాతృదేవతను ఏవగించుకుంటారు, మన సంప్రదాయాలను నేలమట్టం చేసి వాళ్ళ ఆచారాలను మన మీద రుద్దాలన్నది వాళ్ళ లక్ష్యం.’’
ప్రజలందరి నోటా బాహాటంగా ఇదే మాట, కోపంతో వారి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ‘‘హరప్పా వాసులారా, మేల్కొనండి! మీ జీవన విధానాన్ని రక్షించుకోండి, మీ మాతృదేవతను కాపాడుకోండి !’’ అని చంబా గొంతెత్తి నినాదం చేశాడు. ఉద్రిక్తత తో గాలి సాంద్రమైంది, అనిశ్చితితో వాతావరణం బరువెక్కింది.
కుశాగ్ర బుద్ధి ఐన వరుణ్ ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టి హరప్పనుల రాజు బాగుహరని కలిసి రాబోతున్న తుఫాన్ గురించి హెచ్చరించాడు. బాగుహర ఆలోచనల్లో నిమగ్నుడై రాజ భవనంలో అటూఇటూ పచార్లు చేశాడు. పెరిగిపోతోన్న మతోన్మాదుల ప్రభావానికి ఎలా అడ్డుకట్ట వేయాలో తోచక కిటికీలోంచి బయటకు దృష్టి సారించాడు.
‘‘ప్రభూ, మతోన్మాదుల వలన ఒక్క ఆర్యులకే కాదు, మనం నూతనంగా పునాది వేసిన శాంతి పథానికే పెద్ద ప్రమాదం వాటిల్లుతుంది..’’ అన్నాడు వరుణ్ ఆందోళనా పూరిత స్వరంతో. బాగుహర ముఖం కొద్దిగా పాలిపోయింది, గొంతు వణికింది. ‘‘వరుణ్, నువ్వు చెప్పేది నిజమేనని నాకూ భయం వేస్తున్నది. చంబా తో చర్చలు జరపాలని ప్రయత్నిస్తూనే వున్నాను. కానీ జాతి దురభిమానం పీకలదాకా నిండి అతడు వెర్రిగా వ్యవహరిస్తున్నాడు. మా సొంత జనం వల్ల మరోసారి రక్తపాతం జరగడం నాకిష్టం లేదు. చూస్తూంటే సమయం మించి పోతున్నట్టున్నది..’’
అయితే బాగుహర ఏ చర్యకూ పూనుకోక ముందే, చంబా తన అనుచరులతో, హరప్పా విడిచి వెళుతూ ఏమరుపాటుగా వున్నఆర్యులపై మెరుపు దాడి చేశాడు. గత దాడి బీభత్సం నుంచి తేరుకునేందుకు సతమతమవుతోన్న ఆర్యులు మరింత తీవ్రమైన దమన కాండ కు బలవుతామేమోనని చాలా భయపడ్డారు. తాను రణస్థలి నడుమ వున్నట్టు వరుణ్ గ్రహించాడు. కత్తుల తాకిడులు, సాయం కోసం నిరాయుధ ఆర్యుల ఆర్తనాదాలతో పోరు దృశ్యం బీభత్సంగా, భయానకంగా వుంది.
వరుణ్ మహోగ్రంగా పోరాడాడు, అతని ఖడ్గం పలువురు మతోన్మాదుల దేహాలను వ్రయ్యలు వ్రయ్యలుగా ఖండించింది. కానీ చంబా అనుచరుల సంఖ్య ఎక్కువగా వుంది, అనతికాలంలోనే వాళ్ళు అతణ్ణి చుట్టు ముట్టారు.
అంతా అయిపొయిందనుకున్న దశలో, బాగుహర సేనకు చెందిన దండనాయకుడు రిశాసదుని నేతృత్వంలో హరప్పన్ యోధుల బృందం అక్కడికి చేరుకున్నది. రిశాసదుడు కత్తి ఝలిపించి యుద్ధరంగంలో దూకి, సమాన ప్రతిభతో బల్లెం ప్రయోగించి, చంబా ముఠాని చెల్లాచెదరు చేశాడు. మతోన్మాదులను మట్టి కరిపించి రాజ్యంలో శాంతిని పునః స్థాపితం చేయడమే అతని లక్ష్యం.
రిశాసదుని మనుషులు అతని బాటలోనే నడిచారు ; నాయకుడి నుంచి ప్రేరణ పొంది వీరోచితంగా పోరాడి తమ కత్తుల విన్యాసాలతో, రణన్నినాదాలతో చంబా అనుచరుల గుండెలు అదరగొట్టారు.
పోరు కొనసాగింది. గాయాలు రక్తమోడుతున్నా ఆయుధాలను చేజారనీయకుండా ఇరు పక్షాల వారు తుదికంటా పోరాడనిశ్చయించారు. వరుణ్ తడబడ్డాడు, ముఖం మీది నెత్తుటి ధార అతని దృష్టిని మసక బార్చింది. కానీ రిశాసదుడు అతనికి సాయంగా వచ్చాడు, ఇరువురి ఖడ్గాలు ఏకరీతిలో కదిలి శత్రు శరీరాల్ని తుత్తునియలు గావించాయి. లోయ అంతటా మార్మోగిన కత్తుల మోతతో, క్షతగాత్రుల అరుపులతో అక్కడి గాలి సాంద్రమైంది. ఇరు వర్గాలు అలుపెరగకుండా వెర్రిగా పోరాడుతూ పోయారు.
పగతో, ద్వేషంతో ఎర్రబడిన కళ్ళతో వరుణ్ ని చూస్తూ చంబా ఇక తన లక్ష్యం అతడే నంటూ ముందుకురికాడు. ‘‘మీరు మా సంస్కృతిని నాశనం చేస్తారు, మాతృ దేవతని అగౌరవపరుస్తారు..’’ అంటూ హుంకరించాడు.
‘‘మీకు హాని చేయాలన్న ఉద్దేశం మాకు లేదు, చంబా..’’ అన్నాడు వరుణ్, ‘‘మనం ఒకరినొకరు అర్థం చేసుకుని శాంతిగా జీవించాలని కోరుకుంటున్నాం.’’
‘‘అంతా అబద్ధం!’’ ఉగ్రంగా కేక పెడుతూ చంబా వరుణ్ ని చంపేందుకు కత్తి ఎత్తాడు. కానీ రిశాసదుడు మెరుపు వేగంతో కదిలాడు, సూర్యరశ్మి లో ధగధగ మెరిసే కత్తిని విసిరి చంబాని అడ్డంగా నరికేశాడు. శత్రు మూకలు భయంతో పరుగులు పెట్టాయి, వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు. హరప్పనులు, ఆర్యులు ముందుకురికి చంబా అనుచరుల్లో మిగిలిన వారిని నిర్దాక్షిణ్యంగా చీల్చి చెండాడారు.
తుదకు యుద్ధం ముగిసింది. విజేతల విజయగర్వపు దీర్ఘ శ్వాసలు, క్షతగాత్రుల అరుపులు మాత్రమె అక్కడ వినవచ్చాయి. వళ్ళంతా గాయాలతో రక్త సిక్తమైన దేహంతో వరుణ్ కింద పడివున్నాడు. నీరసమైన చిరునవ్వుతో రిశాసదుని వేపు చూస్తూ కృతజ్ఞతా పూర్వకంగా అతని చేయిని తాకాడు.
‘‘మేము హరప్పనులం.. ఆర్యులతో మా స్నేహ బంధాన్నివిద్వేషంతో రగిలిపోతున్న దుష్ట శక్తుల చేత విచ్చిన్నం కానీయము..’’ స్థిరమైన స్వరంతో స్పష్టంగా పలికాడు రిశాసదుడు ‘‘మనం ఒక్క తాటి మీద నిలబడుదాం, మనల్ని విభజించాలని చూసే వారిని సమైక్యంగా ఎదురిద్దాం.’’
రిశాసదుని మాటలు కేవలం సంఘీభావాన్ని వ్యక్తీకరించిన వాక్యాలు కావు ; తన ప్రజల పట్ల, రాజు బాగుహర పట్ల తన అంకిత భావాన్ని ప్రకటించిన పలుకులు.
వాళ్ళు యుద్ధరంగం నుంచి తిరిగి వెళుతూంటే నీడలు మరింత పొడవుగా సాగినట్టు, రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరికగా గాలి గుసగుసలాడినట్టు కనపడింది. మతోన్మాదులు ఓటమి పాలయి వుండవచ్చు, కానీ వారిని ఉసిగొలిపిన ద్వేషాంధకారం అట్లాగే తరువాతి ఎర కోసం కాచుకుని వుంది.
గొడవలు సద్దు మణిగాక, బాగుహర వరుణ్ వేపు చూస్తూ అన్నాడు. ‘‘నా ప్రజలు మా రాజ్యానికే అవమానం తలపెట్టినందుకు నాకు సిగ్గుగా వుంది. మతోన్మాద దుష్ట శక్తుల్ని సమూలంగా ఏరిపారేసి మా రాజ్యంలో శాంతిని పునరుద్ధరించేదాకా మేము విశ్రమించమని నీకు వాగ్దానం చేస్తున్నా.’’
వరుణ్ మునుపటిలాగా కదలలేక పోతున్నాడు, అతని దేహమంతా గాయాల తాలూకు కట్లు, కదిల్తే నొప్పి. అతడు ప్రశంసాపూర్వంగా బాగుహర వైపు చూశాడు. ‘‘రాజా, మీ మాటలు మీ వివేకాన్ని తెలియజేస్తున్నాయి. అందరమూ సామరస్యంగా, ఒకరిపట్ల ఒకరం గౌరవంగా మనుగడ సాగించగల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పరిచేందుకు మనం ఐక్యంగా పని చేద్దాం.’’
అలా ఆర్యులు, హరప్పనులు శాంతి యుత సహాజీవనం సాధించే దిశగా తమ ప్రయాణం కొనసాగించారు; కానీ ముందున్న మార్గంలో ఎన్నో ప్రమాదాలు, ఆటంకాలు పొంచి ఉన్నాయన్న సంగతి వాళ్ళకు తెలుసు.
ఈ నవలిక ఆరవ భాగం ఇక్కడ చదవండి