మహిళల హక్కుల కోసం చట్టాలున్నాయని ఎంతమందికి తెలుసు

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కులు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ వ్యాసం.;

By :  Admin
Update: 2025-03-08 15:33 GMT


-కెంగార మోహన్ 

మహిళల హక్కుల్ని ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ముందుగా మహిళలు తమకు రాజ్యాంగం ద్వారా ఆపాదించబడిన హక్కులకు ఈ ప్రభుత్వాలు ఎంత మేరకు రక్షణ కల్పిస్తున్నాయో తెలుసుకోవలసిన అవసరం వుంది. ఆధునిక సమాజపు పురిటి బిడ్డ ప్రపంచీకరణ అన్న విషయం అందరికీ అర్థమైతే హక్కుల గూర్చి, చట్టాల గూర్చి ఆలోచించి విశ్లేషించవచ్చు. ఈ పురిటిబిడ్డ దినదినాభివృద్ధి చెంది మానవ సమాజంపై పంజా విసిరి మానవాభివృద్ధి సూచికలో అవమానకర స్థానంలో నిలిపింది.

ఇప్పుడు పెట్టుబడిదారులకు మానస పుత్రికగా వెలుగుతున్నది. ఆధునిక సమాజం సృజియించిన ఈ ప్రపంచీకరణ విష ప్రభావంతో మహిళలపై అరాచకాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు మనదేశంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. పురుషాధిక్యత వేళ్ళూనుకొని ఉన్న నేటి సమాజంలో స్త్రీ స్వేచ్ఛ ప్రశ్నార్థకమైంది. స్త్రీలకు రక్షణలు కల్పించాల్సిన చట్టాలు రాజకీయ రాబందుల కబంధహస్తాల్లో నిర్విర్యమవుతున్నాయి. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లు మహిళలకు రక్షణ కల్పించాల్సిందేనని కోడై కూస్తున్నా, పాలకుల కర్ణభేరికి చేరడం లేదు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు నేతల ప్రసంగాలకీ చట్టసభల్లో ప్రసంగ రికార్డులకే పరిమితమై స్త్రీని వెక్కిరిస్తున్నాయి. భారత రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కులు పరిశీలిస్తే, మనిషి జీవించడానికి గాలి, నీరు, ఆహారము ఎంత అవసరమో, అదే విధంగా మనిషి మనిషిగా జీవించడానికి ప్రాథమిక హక్కులు కూడా అంతే అవసరం. ఈ ప్రాథమిక హక్కులు స్త్రీ, పురుషులిద్దరికీ సమానంగానే వర్తిస్తాయి.

రాజ్యాంగంలోని అధిóకరణం 19లో భావ ప్రకటన స్వేచ్చ (Freedom for Speech)లింగభేదం లేకుండా కల్పించారు. ఈ స్వేచ్ఛ పురుషాదిక్యత సమాజం తమ వశం చేసుకొని సంప్రదాయం, కట్టుబాట్లు విధించి స్త్రీని మాట్లడనివ్వకుండా చేస్తున్నది. తమ భావాలను స్వేచ్ఛగా పంచుకోవచ్చని స్పష్టంగా చెబుతున్నప్పటికీ భావ ప్రకటనా స్వేచ్ఛపై ఈ సమాజం ఆంక్షలు విధించింది. స్వేచ్ఛ రాజ్యాంగం ద్వారా లభించినప్పటికీ సమాజం అంగీకరించని స్వేచ్ఛ కావాలని కోరుకోవడం ముమ్మాటికీ తప్పే అవుతుంది.

అధికరణం 21లో వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు (Protection of Life and Personal Liberty) ను వివరించడం జరిగింది. చట్ట ప్రకారము కాకుండా మరొలా వ్యక్తికి గల జీవించే హక్కును గాని, వ్యక్తి స్వేచ్ఛను గాని హరించరాదు. అధికరణం 22 ప్రకారం జీవించే హక్కును ప్రభుత్వం రెండు సందర్భాలలో హరించవచ్చు. మొదటది చట్టబద్ధంగా మరణ శిక్ష విధించడం, రెండోది చట్టబద్ధంగా నిర్భందించడం. అయితే ఈ అధికరణం ఎక్కువగా ఉల్లంఘనకు గురవుతున్నది. ఉదాహరణకు ప్రభుత్వాలు జరిపే బూటకపు ఎన్‌కౌంటర్లన్నీ రాజ్యాంగ ఉల్లంఘన క్రిందికి వస్తాయి. ఇక రెండో విషయాన్ని వివరించాల్సి వచ్చినప్పుడు నేరస్థులను 24 గంటల లోపు న్యాయస్థానం ఎదుట హాజరు పరచాలని 22వ అధికరణం క్లాజు(2)లో స్పష్టంగా ఉన్నప్పటికి నేర విచారణ ప్రక్రియలో ఇది నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా వుంది.

స్త్రీలనీ కూడా చూడకుండ నిర్భందించడం, అఘాయిత్యాలకు పాల్పడటం వంటి సంఘటనలు దినపత్రికల్లో, మీడియా కథనాల్లో ప్రధానాంశాలవుతున్నాయి. స్త్రీని నిర్భందించినప్పుడు మహిళా కానిస్టేబుల్‌ను రక్షణగా నియమించాల్సి ఉన్నా ఈ నిబంధనను అధికారులు కొన్ని చోట్ల తుంగలో తొక్కేస్తున్నారు. అదే ఒక పేరున్న వ్యక్తిని, నాయకుడిని పోలీసులు అరెస్ట్‌ చేయాల్సి వస్తే అతనికి వెంటనే చాతీనొప్పి రావడం, ఆధునిక ఆసుపత్రికి చికిత్సకు వెళ్ళడం ఇక అక్కడి నుండి ఎత్తుగడలతో బయట పడటం నిరంతరం మనం గమనిస్తున్న విషయాలు. అధికరణం 23లో శ్రమశక్తిని దోపిడి చేయరాదని నిర్ధేశించింది. వెట్టిచాకిరి చేయించుకోవడం, శ్రమ దోపిడి క్రిందికే వస్తుంది.

ఇక్కడ దోపిడి అంటే లైంగిక దోపిడి, మేథాసంపత్తి దోపిడి కూడా దోపిడి పరిధిలోకే వస్తాయి. మనకు సమాజంలో అనేకమంది బాలికలు పనులు చేస్తూ లైంగిక ఆకృత్యాలకు బలవ్వడం చూస్తున్నాం. చిన్నపిల్లలతో కర్మాగారాల్లో పనిచేయడాన్ని ఆర్టికల్‌-24 నిషేదించినా బాలకార్మీక వ్యవస్థ నిర్మూలన అందని ద్రాక్షగానే మారింది. పేదరికాన్ని అలుసుగా తీసుకున్న స్వార్థపర ధనిక వర్గాలు, పిల్లల శ్రమని దోచుకుంటున్నారు. ఆర్టికల్స్‌ 25 నుండి 28 వరకు ప్రతి పౌరునికి, పౌరురాలికి మత స్వాతంత్య్రపు హక్కు కల్పించింది. తమకు ఇష్టమైన మతాన్ని స్త్రీ పురుషులెవరైనా స్వీకరించవచ్చు. మతాంతర వివాహాల్లోనూ భర్త మతమే భార్యకు ఖాయమవుతున్నది.

ఈ తరహా ఆలోచనా విధానం వల్ల అనేక అవరోధాలు స్త్రీ ఎదుర్కొన వలసివస్తుంది. మతం అనేది విశ్వాసానికి సంబంధించనది మాత్రమే అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మతం అంటే ఏమిటో రాజ్యాంగం ఎక్కడా నిర్వచించలేదు. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాగం. అధికారిక మతం ఏదీ లేదు. మనది మతరాజ్యం కాదు. ఇది వ్యక్తిగతమైన విశ్వాసం మాత్రమే. ఇక అధికరణం 31 ఆస్థి హక్కుకు సంబంధించినది. రాజ్యాంగం యొక్క 44వ సవరణ ఆస్థి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించింది. అందువల్ల 20.06.1979 నుండి ఈ అధికరణం అమలులో లేదు.

ఆస్థిహక్కు ప్రాథమిక హక్కుకాదు కేవలం ఒక హక్కు మాత్రమే. ఆ హక్కుకు ప్రత్యేకత లేదు. అయితే ఆకాశంలో సగభాగమైన మహిళలు సామాజిక ఆర్థిక స్వావలంబన వైపు పయనించాలంటే హక్కులను పరిరక్షించడమే కాకుండా అవకాశాలు కల్పించాలి. మహిళల హక్కులను రక్షించడానికి శాఖలకు మంత్రులను నియమించినంత మాత్రాన సరిపోదు. హక్కులను రక్షించే క్రమంలో రాజకీయాలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా కృషి జరిగితే మహిళల హక్కులకు రక్షణ కల్పించినట్లే అవుతుంది. మహిళా హక్కులను కాలరాస్తే అది ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది.

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 10.12.1948న మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించింది. ఇందులో స్త్రీలకు అనేక హక్కులను పొందు పరచింది. స్వేచ్ఛగా జీవించే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు, రాజ్యం నుండి సమాజం నుండి రక్షణ పొందే హక్కు, వివక్షకు తావు లేకుండా సమాన పనికి సమాన వేతనం పొందే హక్కు, మాతా శిశు సంక్షేమానికి సహాయం పొందే హక్కు మొదలైనవి. 1924 జెనీవా బాలల హక్కుల ప్రకటన, 1959 బాలల హక్కుల ప్రకటన బాలల హక్కులపై ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 20.11.1989న ఆమోదించింది.

అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా మహిళా కార్మీకుల హక్కుల ఆమలుకు నిరంతరం శ్రమిస్తూనే వుంది. స్త్రీల పట వివక్ష నిర్మూలనకు (సిఇడిఎడబ్ల్యూ) సిడా ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశం 18.12.1979న ఆమోదించింది. 03.09.1981 నుండి ఇది అంతర్జాతీయ ఒప్పందంగా అమలులోకి వచ్చింది. ఈ నిబందనకు కట్టుబడి ఉంటామని 100 దేశాలకు పైగా తమ ఆమోదాన్ని తెలిపాయి. భారతదేశం సిడా ఒప్పందాన్ని 1993 ఆగస్టులో ఆమోదించింది. ఇంతేకాకుండ భారత రాజ్యాంగంలో అధికరణలతో పాటు ఆదేశిక సూత్రాలలోను కొన్ని హక్కులు కల్పించారు.

రాజ్యాంగ సవరణల ద్వారా కూడా మహిళల కోసం హక్కులు నిర్ధేశించబడ్డాయి. అవి పరిశీలిస్తే 15 ఎ.ఇ. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధిగా గుర్తించారు. 15(3) ననుసరించి ప్రభుత్వాలు స్త్రీలకు అనుకూలంటా విచక్షణ పాటించవచ్చని ఒక ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. 16వ ప్రకరణ ద్వారా ప్రభుత్వ (ఉద్యోగాల) నియామకాల్లో అందరు పౌరులకు సమాన అవకాశాలు కల్పించారు. 21వ ప్రకరణంలో పేర్కొన్న వ్యక్తిగత ప్రాణరక్షణ. స్వేచ్ఛ, 23వ ప్రకరణం ప్రకారం స్త్రీలను వస్తువులుగా మార్చడం, నిర్భంద దాస్యం చేయించడం నిషేదించారు. 24వ ప్రకరణం ప్రకారం పిల్లలను కర్మాగారాలలో, ప్రమాదకరమైన పనులలో నియమించడాన్ని నిషేదించారు. 73, 74వ రాజ్యాంగ సవరణల ననుసరించి పంచాయితీరాజ్‌ వ్యవస్థలో ఎన్నికయ్యే పదవుల్లో మూడోవంతు సీట్లను రిజర్వేషన్ల ద్వారా మహిళలకు కేటాయించారు.

ఆదేశిక సూత్రాలలోని..

36(ఎ) ప్రకారం రాజ్యం పౌరులందరికి, స్త్రీ పురుషులందరికి సమానమైన హక్కుగా జీవనాధారం కల్పించగలిగిన రీతిలో ప్రభుత్వ విధానాలను రూపొందించాలి.

39(ఇ) ననుసరించి శ్రామికుల, స్త్రీ పురుషుల, లేత వయసులో వున్న పిల్లల ఆరోగ్యం, శరీర సత్తువ దుర్వినియోగం కాకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికావసరాలు పౌరులను వారి వయసుకు, దేహదారుఢ్యానికి తగని వ్యాపకాలలోనికి బలవంతంగా నెట్టే పరిస్థితులు వుండకుండా చర్యలు తీసుకోవాలి.

39(ఎఫ్‌) ప్రకారం బాల్యం, యుక్తవయసులోని వారిని అనగా పిల్లలను, యువతను దోపిడీకి గురికాకుండా కాపాడాలి అంతేకాక వారు నైతిక, భౌతికి విశృంఖలతకు లోనుకాకుండా చూడాలి.

42వ ప్రకరణం ప్రకారం న్యాయమైన మానవతా దృక్పధంతో నిండివున్న పనివాతావరణం సమకూరేలా చూడాలని స్త్రీలకు ప్రసూతి వసతులు కల్పించాలని రాజ్యాంగం ప్రభుత్వాలను నిర్ధేశిస్తుంది. 45 ప్రకారం పిల్లలకు 14 సం॥ల వయసు వరకు నిర్భంద ఉచిత విద్యను అమలు చేయాలి.

47 ప్రకారం పోషకాహార విలువల్ని జీవన ప్రమాణాన్ని, ప్రజల ఆరోగ్య ప్రమాణాల్ని పెంచే బాధ్యత ప్రభుత్వానిదేనని రాజ్యాంగం భావిస్తోంది.

మహిళ కోసం చట్టాలు:

స్త్రీలపై జరుగుతున్న హింసకు మరిన్ని పదునైన చట్టాలు అవసరమని తరచుగా వినిపిస్తున్న వాదన. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల వల్ల మహిళలకు రక్షణ లేదా? అనే ప్రశ్న మేధావులకు సవాలుగా మారింది. దినపత్రికల్లో, మీడియా కథనాల్లో వస్తున్న వార్తా కథనాల్లో స్త్రీలపై జరుగుతున్న హింస ఎంతటి స్థాయికి పెరిగిపోయిందో అర్థమవుతున్నది. ప్రస్తుతం ఉన్న చట్టాలను పరిశీలిస్తే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఐ.పి.సి. సెక్షన్‌ 354 ప్రకారం స్త్రీలతో సెల్‌ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడినా, ఆశ్లీల చిత్రాలు చూపించినా, బలప్రయోగం చేసినా నేర తీవ్రతను బట్టి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. మహిళలను మానభంగం చేయుట ఐ.పి.సి. సెక్షన్‌ 376 ప్రకారం యావజ్జీవ జైలుశిక్ష విధించవచ్చును.

మానభంగానికి ప్రయత్నిస్తే సెక్షన్‌ 376 ఆర్‌/డబ్ల్యూ 511 ఐ.పి.సి. ప్రకారం 2 నుండి 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించవచ్చును. బాలికను అపహరించుకొని పోవుట సెక్షన్‌ 363 ఐ.పి.సి. ప్రకారం ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించవచ్చును. వివాహిత మహిళను శారీరకంగా, మానవసికంగా వేధించుట 498(ఎ) ఐ.పి.సి. ప్రకారం 2 నుండి 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష. వరకట్నం కోసం భార్యను వేదించడం వరకట్న నిరోధక చట్టం ప్రకారం 5 సంవత్సరాలకు తక్కువ కాకుండా జైలుశిక్ష విదిస్తూ 15 వేల రూపాయల జరిమానా విధించవచ్చు.

భార్య బతికి ఉండగానే చట్ట ప్రకారం విడాకులు తీసుకోకుండా మరొకపెళ్ళి చేసుకోవడం సెక్షన్‌ 494 ఐ.పి.సి. ప్రకారం 7 సంవత్సరాల జైలుశిక్ష విధించవచ్చును. వరకట్నం కోసం వేధించి భార్య మరణానికి కారణమైతే సెక్షన్‌ 304(బి) ఐ.పి.సి. ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. అక్రమ రావాణాకు సంబంధించి 18 సంవత్సరాల లోపుగల మైనర్‌ బాలికను ఇతర వ్యక్తితో సంబోగానికి ప్రేరేపించి తార్చుట సెక్షన్‌ 366 ఐ.పి.సి. ప్రకారం 10 సంవత్సరాల జైలుశిక్ష. వేశ్యావృత్తి మొదలగు వాటి కోసం కొనుట సెక్షన్‌ 373 ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించవచ్చు.

మైనర్‌ బాలికతో ఎవరైన వ్యక్తి వ్యభిచారం చేసినా వారు మానభంగ నేరం సెక్షన్‌ 376 ప్రకారం 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చును. 1956లో వచ్చిన వ్యభిచార నిరోధక చట్టం సెక్షన్‌ 3 ప్రకారం వ్యభిచార గృహం నిర్వహించినందుకు, అందుకు సహకరించినా సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు రెండు వేల రూపాయల జరిమానా విధించవచ్చును.సెక్షన్‌ 4 ప్రకారం వ్యభిచార వృత్తి మీద వచ్చిన సొమ్ముతో ఆధారపడి జీవించినా రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా. మైనర్‌ బాలిక ద్వారా వ్యభిచారం చేయించి, వచ్చిన సొమ్ము మీద ఆధారపడి జీవించినా 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధిస్తారు.

సెక్షన్‌ 5 ప్రకారం మహిళకు ఆశ చూపి, వ్యభిచార వృత్తిలోకి దించి తార్చి లేదా వ్యభిచారం కోసం బలవంతంగా దించుట 3 నుండి 7 సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు జరిమానా విధిస్తారు. స్త్రీల సంరక్షణకు మరిన్ని పదునైన చట్టాలు వొస్తూనే ఉన్నాయి. 2006 అక్టోబర్‌ నుండి గృహహింస నిరోధక చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా, శిశు సంక్షేమ శాఖకు చెందిన ప్రాజెక్టు డైరెక్టర్‌లు, ఆర్‌డిఓలను ప్రొటెక్షన్‌ ఆఫీసర్లుగా నియమించారు. వారికి డొమెస్టిక్‌ ఇన్సిడెంట్‌ రిపోర్టు నమోదు చేసే అవకాశం కల్పించారు.

ఈ రిపోర్టులు క్రిమినల్‌ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ల వంటివి. జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు పరిధిలో విచారించగలిగే అధికారం కలిగి ఉంటాయి. ఈ ఆదేశాలను కోర్టు జారీ చేస్తుంది. అయితే స్త్రీలపై అరాచకాలు మితిమీరీ పోయాయి. డిసెంబర్‌ 16, 2012 రాత్రి 9.54 గంటలకు పారామెడికల్‌ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి యావత్తు భారతదేశం నివ్వెరపోయింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టింది. స్పందించిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 22, 2012న మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జె.ఎస్‌. వర్మ ఆధ్యక్షతన న్యాయ సంఘాన్ని నియమించింది.

లైంగిక నేరాల విషయంలో ఉన్న చట్టాలను మరింత కఠినం చేయడానికి సవరణలు సూచిస్తూ 30 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరారు. సాధారణ ప్రజానీకంతో పాటు ప్రముఖ న్యాయ నిపుణులను మహిళా సంఘాల వారిని, సంఘసేవా సంస్థలను, మేధావులను ఇతరత్రా పౌరసమాజం వారిని ప్రత్యక్షంగా కలిసి ఈ కమిటీ వారి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించి 29 రోజుల్లోనే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను సమగ్రంగా అధ్యయనం చేసిన కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ రూపొందించి రాష్ట్రపతికి పంపగా ఆయన ఫిబ్రవరి 03, 2013న దీనికి ఆమోద ముద్ర వేసి చట్టబద్ధత కల్పించారు.

లైంగిక నేరాల నిరోధక ఆర్డినెన్స్‌లో నేర శిక్షాస్మ ృతి ఆర్డినెన్స్‌ ` 2012గా పిలువబడే ఈ ఆర్డినెన్స్‌ 1. భారత శిక్షాస్మృతికి, 2. నేర శిక్షాస్మృతి 1973కు 3. భారత సాక్ష్యాధారాల చట్టం 1973కు పలు సవరణలు చేసింది. ఇవి తక్షణం అమల్లోకి వస్తాయి. ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం లైంగిక కేసుల విషయంలో విచారణలో ఉద్దేశపూర్వకంగా దర్యాప్తునకు సహకరించని, చట్టాన్ని ఉల్లఘించే ప్రభుత్యోద్యోగికి ఒక యేడాది వరకూ జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధిస్తారు.

326A : ఉద్దేశపూర్వకంగా ద్రావకంతో (యాసిడ్‌) గానీ, మరిదేనితోనయినాగానీ గాయపరచడం, కాల్చడం, శరీరావయవాలను నిరుపయోగం చేయడం, వాటి రూపురేఖలు మార్చడం వంటి చర్యల ద్వారా పాక్షికంగా కానీ, శాశ్వతంగాకానీ ప్రభావితం చేసే విధంగా దాడులకు పాల్పడిన వారికి పదేళ్ళకు తగ్గకుండా యావజ్జీవం జైలుశిక్ష. పది లక్షల రూపాయల వరకు జరిమాన విధించవచ్చు. అలా విధించిన జరిమానాల ద్వారా వసూలయ్యే మొత్తాన్ని బాధితురాలికి చెల్లించాలి.

326B : ద్రావకంతో దాడిచేసినా, దాడిచేసే ప్రయత్నం చేసినా కనీసం ఐదేళ్ళకు తగ్గకుండా ఏడేళ్ళ వరకు జైలుశిక్ష, జరిమానా విధించాలి. లైంగికేచ్ఛతో శరిరాన్ని తాకినా, ఆవాంఛిత ప్రవర్తన చూపినా, కామవాంఛ తీర్చవలసిందిగా అడిగినా, డిమాండ్‌ చేసినా, కామోద్దేశంతో సంజ్ఞలు, సూచనలు చేసినా, శృంగార దృశ్యాలను బలవంతంగా చూపినా, ఇతరత్రా లైంగిక సంబంధమైన శారీరక, మాటలు తదితర చేష్టల వంటి నేరాలకు ఐదేళ్ళ వరకు కఠిన కారాగార శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించాలి.

354B : బహిరంగంగా ఒక స్త్రీని నగ్నంగా చేసే ఉద్దేశంతో నేరానికి పాల్పడినవారికి మూడేళ్ళ నుంచి ఏడేళ్ళ వరకూ జైలుశిక్ష, జరిమానా విధించాలి.

354C : ఏకాంత ప్రదేశంలో నగ్నంగా, అర్ధనగ్నంగా ఉన్న స్త్రీని చూసినా, చిత్రీకరించినా మొదటిసారి అయితే ఏడాదికి తగ్గకుండా గరిష్టంగా మూడేళ్ళ వరకూ జైలుశిక్ష, జరిమానా విధించాలి. తిరిగి అదే నేరానికి పాల్పడితే ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించాలి.

354D : ఆసక్తి లేదని స్పష్టంగా తెలిసిన తరువాతకూడా వేధింపులకు, భయాందోళనలకూ గురిచేసే వ్యక్తులకు ఒక ఏడాదికి తగ్గకుండా, మూడేళ్ళ వరకూ జైలుశిక్ష, జరిమానా విధించాలి.

370 : లైంగికపరమైన దోపిడీ (అంటే వ్యభిచారం లేదా ఇతరత్రా రూపాలలో.... బలవంతంగా పని, సేవలు చేయించుకోవడం, బానిసత్వం, అభీష్ఠానికి వ్యతిరేకంగా అవయవాల తొలగింపు వంటివి) దురుద్దేశాలతో బెదిరింపులకు పాల్పడినా, బల ప్రయోగం చేసినా, అపహరించినా, మోసం చేసినా, అధికార దుర్వినియోగం చేసినా, లోబరుచుకోవడం కోసం ప్రలోభపెట్టినా దీనిని అక్రమ తరలింపు నేరంగా పరిగణిస్తారు. ఈ నేర నిర్ధారణకు బాధితురాలి అంగీకారంతో ప్రమేయం లేదు. ఈ నేరాలకు పాల్పడిన వారికి ఏడేళ్ళకు తగ్గకుండా 10 ఏళ్ళ వరకూ, ఒకరి కంటే ఎక్కువ మంది పాల్గొంటే పదేళ్ళ నుండి యావజ్జీవం కఠిన జైలుశిక్ష, జరిమానా విధించాలి. ఈ నేరంలో బాధితురాలు మైనరయితే పదేళ్ళకు తక్కువ కాకుండా యావజ్జీవం, ఎక్కువమంది మైనర్లుంటే 14 ఏళ్ళకు తగ్గకుండా యావజ్జీవం వరకూ కఠిన కారాగార శిక్ష విధించాలి. ఒకవేళ ఈ నేరంలో పోలీస్‌ అధికారితో సహా ప్రభుత్వోద్యోగి ఎవరయినా ఉన్నప్పుడు యావజ్జీవ శిక్ష విధిస్తారు. పదేపదే ఇదే నేరానికి పాల్పడితే యావజ్జీవ శిక్ష విధిస్తారు.

370ఎ : ఈ నేరంలోకి ఒక బాలికను దింపినట్లు తెలిసికూడా ఆ బాలికను తన వద్ద ఉద్యోగంలో ఉంచుకున్నవారికి ఐదేళ్ళకు తగ్గకుండా ఏడేళ్ళ వరకూ కఠిన జైలుశిక్ష, జరిమానా విధిస్తారు. అదే మైనారిటీ తీరిన యువతుల విషయంలో అయితే మూడేళ్ళకు తగ్గకుండా ఐదేళ్ళ వరకూ కఠిన జైలుశిక్ష, జరిమానతో సహా విధిస్తారు.

375 : లైంగిక దాడి జరిపి శృంగారేచ్ఛ నెరవేర్చుకున్న వారికి, ఏడేళ్ళ నుండి యావజ్జీవ కఠిన కారాగారం, జరిమానా విధిస్తారు. ఇదే నేరాన్ని ఒక పోలీస్‌ అధికారి, ఒక ప్రభుత్వోద్యోగి, ఒక సైనికోద్యోగి, ఒక జైలు ఉద్యోగి, ఒక రిమాండ్‌ హోం ఉద్యోగి, ఒక అస్పత్రి ఉద్యోగి, ఆశ్రయమిచ్చిన బంధువు, సంరక్షకుడు, ఉపాధ్యాయుడు, సేవాసంస్థ ఉద్యోగిలాంటి వారికి పదేళ్ళకు తగ్గకుండా యావజ్జీవ జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.

376A : లైంగిక నేరాలకు పాల్పడిన నేరస్థుడు తన నేర చర్యలో భాగంగా బాధితురాలిని మరణానికి దారితీసే విధంగా కానీ, శాశ్వతంగా జీవచ్ఛవంగా ఉండేవిధంగా కానీ గాయపరిస్తే కనీసం 20 ఏళ్ళ నుండీ యావజ్జీవ కఠిన కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధించాలి.

376B : చట్టబద్ధంగా విడాకులు పొంది విడిగా నివసిస్తున్న భార్యతో ఆమె అంగీకారం లేకుండా ఏ సంప్రదాయం, ఏ ఆచారం ప్రకారంగానీ లైంగికంగా దాడి జరిపినా కనీసం రెండేళ్ళ నుండి ఏడేళ్ళ వరకూ జైలుశిక్ష, జరిమానా విధిస్తారు.

376C: ఎవరయినా అధికార హోదాతో ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తన ఆధీనంలో ఉన్న స్త్రీని లోబరచుకుని లైంగిక వాంఛ నెరవేర్చుకున్నా, అది లైంగిక దాడి కిందకు రాకపోయినా అటువంటి నేరస్థునికి ఐదేళ్ళకు తగ్గకుండా పదేళ్ళ వరకూ కఠిన జైలుశిక్ష, జరిమానా విధించాలి.

376D: ఒక వ్యక్తిపై ఒకరుగానీ, ఒక బృందం, ఒక సమూహంగానీ ఒక లక్ష్యంతో లైంగిక దాడి జరిపినప్పుడు లింగభేదం లేకుండా వారికి 20 ఏళ్ళకు తగ్గకుండా యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించాలి. బాధితురాలి వైద్య ఖర్చులు, పునరావాస ఖర్చులకు సరిపడా జరిమానా విధించాలి.

376E : పైన చెప్పిన నేరాలను మళ్ళీ మళ్ళీ చేస్తున్న వారికి యావజ్జీవ శిక్ష విధించాలి.

ఇవేగాక ఇంకా సాక్ష్యాధారాల చట్టంలో కూడా అవసరమైన సవరణలు చేశారు.

ఇంతటి సమర్థవంతమైన చట్టాలు ఐ.పి.సి., సి.ఆర్‌.పి.సి. లలో ఉన్నప్పటికి స్త్రీలకు రక్షణ లేదు. పాశ్చాత్య సంస్క ృతి ప్రభావం మనదేశంలో విలయతాండవం చేస్తున్నది. చట్టాలు రూపొందించడం, ఆర్డినెన్స్‌లకు ఆమోదముద్ర వేయడంతో సరిపోదు. వాటి అమలుకు ప్రభుత్వ చిత్తశుద్ది కావాలి. రాజకీయ నాయకుల పాత్ర తగ్గాలి. రాజకీయ జోక్యం తగ్గినప్పుడు అధికారుల అవినీతి, సమాజం నుండి దూరమైన రోజు ఈ చట్టాలు మహిళలకు ఉపయోగపడటమే కాకుండా స్త్రీలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తాయి.

(ఫోటో సౌజన్యం: కందుకూరి రమేశ్ బాబు)


Tags:    

Similar News