గాంధీజీ హత్య ఆర్యావర్త విస్తరణలో భాగమా?

ఆర్యావర్తానికి, అనార్యవర్తానికి మధ్య ఇంకా పోరాటం సాగుతూనే ఉందని చెబుతున్న కల్లూరి భాస్కరం రచన ‘ఇవీ మన మూలాలు’ కు డాక్టర్ సిహెచ్ శారద చక్కటి పరిచయం

By :  Admin
Update: 2024-10-31 04:00 GMT

డా. సిహెచ్ శారద

మనం పుట్టినప్పటినుండి పెద్దలు మన దేశం, ఊరు,పూర్వీకుల గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. సహజంగానే అందరం అటువంటి ఆలోచనలనే సంకెళ్ళతోనే పెరిగి పెద్దవుతాము. చాలా వరకు వర్తమానంలో జీవిస్తూ మనకు తెలియ కుండానే చుట్టూ కనపడని గోడలు కట్టుకుంటాము.

మన సమాజం,సంస్కృతి,మతం, సాహిత్యం, రాజకీయాల వేళ్ళు ఎంత లోతుగా వ్యాపించి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయం.అలా కుటుంబ సభ్యులు, సైన్సు, చరిత్రల ద్వారా వంద మహా అయితే రెండు వందల సంవత్సరాల గతం తెలుసు కుంటాము.

ఇంకా జిజ్ఞాస,ఉత్సాహంతో వేల,లక్షల సంవత్సరాల వెనుకకు వెళ్ళి మానవుల పుట్టుక, అభివృద్ధి తెలుసుకుంటే మరెంత అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుందో కదా !

మన దురదృష్టం ఏంటంటే తరగతి గదిలో నేర్చుకునే పాఠాలు మనం పరీక్షలు, మార్కులు, భవిష్యత్తులో ఆర్దికస్థిరత్వం కోసమే చదువుతాం. జ్ఞానం కోసం కాదు. శాస్త్రీయ దృష్టి అలవాటు కాదు. మన విద్యా విధానం అలా ఉంది.మన గురించి, మన చుట్టూ తలకిందులుగా ఉన్న వ్యవస్థ గురించి ఎవరూ చెప్పరు. చెప్పినా చాలా మందికి అర్ధం కాదు.

మొదట ప్రకృతిలో ఏకకణ జీవిగా మొదలయి బహుకణ జీవులుగా అనేక మార్పులు పొంది నేటి మానవునిగా అభివృద్ధి చెందాడని చెప్పే డార్విన్ పరిణామ సిద్ధాంతమే తప్పని స్కూల్ సిలబస్ నుండి తీసేస్తే ఏం చేయగలిగాము ? మానవులంతా ఒకటేనని, ఇప్పుడు మనం చూసే కుల, మత, సంప్రదాయాలు అన్నీ మనం సృష్టించు కున్నవే అని ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాలి. వేల సంవత్సరాలుగా నాటుకుపోయిన భావజాలం అంత తొందరగా పోదు.

ఈ పుస్తకానికి ముందు మాట రాస్తూ సాహితీవేత్త శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు మనదేశానికి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా జాతి నిర్మాణంలో అన్ని ప్రాంతాల,వర్గాల ప్రజలకు ఎందులోనూ సమాన వాటా దక్కలేదు. దేశంలోని ఉత్తరాది,హిందీ మాట్లాడే ప్రాంతాలు, ముఖ్యంగా హిందువులు అందులోనూ అగ్రవర్ణాలు,అగ్ర కులాలు, అందులోనూ మళ్ళీ పురుషులు అధికారం లోకి రావడం వలన వెనుక బడిన వర్గాలలోని ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టగానే అణచివేత మొదలయిందని అంటారు.

ప్రపంచంలోని అన్ని శాస్త్రాలు,రహస్యాలు, ఆవిష్కరణలు మనకు ముందు నుండీ తెలుసని విదేశీయులు దొంగిలించి తమ పేరు చెప్పుకుంటు న్నాయని ప్రవచన కారులు, రాజకీయ నాయకులు రోజూ ప్రచారం చేస్తూ ఉంటారు.దేశంలోని సమస్యల పరిష్కారానికి ప్రాంతాలనో, మతాన్నో అడ్డుగా చూపి జనంలో ద్వేషం పెంచుతూ ఉంటారు. పెట్టుబడిదారీ శక్తులు మతం పట్ల ఛాందస వైఖరిని ప్రోత్సహిస్తూ ప్రజలను విభజిస్తారు.కానీ మానవ చరిత్రను బాగా పరిశీలించినప్పుడు నేడు మనం చూసే ఖండాలు, దేశాలు లోగడ ఇలాగే లేవని, ఇవన్నీ శాశ్వతం కాదని తెలుస్తుంది.

సుదీర్ఘ ప్రయాణంలో సుదూర ప్రాంతాల సమూహాలు తిండి కోసం,రక్షణ కోసం ఎక్కడెక్కడికో పోయి నాగరికతల నిర్మాణం చేశారనడానికి ఆనవాళ్లు లభించాయి. ఈనాడు నేల మీద నడుస్తున్న ప్రతి ఒక్క మానవుడు ఇంతవరకూ లక్షల ఏళ్ల క్రితం ఈ భూమి మీద సంచరించిన ఆదిమ మానవునికి జన్యు పరంగా వారసుడేనన్నది సత్యం. ఆలా కాక మాది శుద్ధ జాతి, పరిశుద్ధ రక్తం అనుకునేవారికి చెప్పేదేమీ లేదు.అది వారి జ్ఞానం అనుకోవాలి. అంతే ! 




పుస్తక రచయిత కల్లూరి భాస్కరం గారు సంప్రదాయ కుటుంబంలో పుట్టి వేదాలు, మహాభారతం , రామాయణం వంటి ఇతిహాసాలు అధ్యయనం చేసిన మేధావి. తనను పురాతన చరిత్రతో పాటు జన్యుపరిశోధనల అధ్యయనం దిశగా పురికొల్పింది మహాభారతమే అంటారు.

లక్షల సంవత్సరాల క్రితం మొదలుపెట్టి ఇప్పటి వరకు జరిగిన వలసలు,సాంకర్యాల విశ్వరూపాన్ని మనకు తేటతెల్లం చేసిన జన్యు పరిశోధనలు అమితాశ్చర్యానికి గురి చేశాయని అంటారు.మనకు బాగా తెలిసిన దాన వీర శూర కర్ణ సినిమాలో... ఏమంటివి ఏమంటివి అని మొదలుపెట్టి ముత్తాత, తాత, తండ్రుల పుట్టుక గురించి చెప్పి .. ఏనాడో మన వంశము కులహీనమయినది కాగా నేడు కులము కులము అని వ్యర్థ వాదనలు ఎందుకు అని మనచేత చప్పట్లు కొట్టించారు కదా... నిజంగా జరిగింది కూడా అదే.

ఈ పుస్తకంలోని విషయాలు ఒక నిర్ణీత సరిహద్దుకు, కాలానికి లోబడేవి కావు. మనిషి మొత్తం భూగోళమే తనకు హద్దుగా ఉన్న కాలం నాటిది.చదివే వారుకూడా మన చూపుల, ఊహల వైశాల్యాన్ని బాగా విస్తరించి చదవాలి. జన్యు శాస్త్రంలో వచ్చిన విప్లవాత్మక పరిశోధనలు చూసిన తర్వాత తనకున్న అవగాహనకు టోనీ జోసెఫ్ రచించిన ఎర్లీ ఇండియన్స్,డేవిడ్ రైక్, ఆడం రూథర్ ఫర్డ్ రచనలు అన్వయించు కోవడానికి ఉపయోగ పడ్డాయని చెప్పారు.

బాలకృష్ణుని నోటిలో .విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్య పోయిన యశోద లాగా మానవ పరిణామక్రమంలో జరిగిన మార్పును గమనిస్తే మన నమ్మకాలు సందేహాలు కూడా పటాపంచలు కావడం తథ్యం అంటారు. ఇది చాలదూ మన విశ్వాసాలు, ఊహలను అహాలను తలకిందులు చేయడానికి.

దాదాపు రెండు వందల కోట్ల సంవత్సరాల క్రితం ఏకకణ జీవి తనకు తాను రెండుగా మారిన విషయం మనందరికీ తెలుసు.తరువాత ప్రకృతిలో జరిగినా మార్పులన్నీ చూసి ఒకచోట చేర్చిన వారు లేరు.డార్విన్ పరిణామ సిద్ధాంతం వలన కలిగిన అవగాహనకు కూడా పూర్తి ఆధారాలు లేవు కానీ 20 వ శతాబ్దంలో వచ్చిన జన్యు విప్లవం మనిషి లోపలి నిర్మాణాన్ని, పుట్టుకను, పునరుత్పత్తి సంబంధాలను పరిణామ క్రమాన్ని తెలియచేసింది. అంతకు ముందు ఉన్న ఊహలను, అనుమానాలను పక్కన పడేసింది. ఒక చిన్న ఎముక,దంతం ఏది దొరికినా జన్యు వారసత్వాన్ని గుర్తించడంలో మైటోకాండ్రియల్ డి ఎన్ ఏ క్రోమోజోముల వలన తల్లి తండ్రుల గురించి పరిశోధన చేయగలిగే సామర్థ్యం వచ్చింది.

మనిషి శాస్త్రీయ నామం హోమో సేపియన్స్ అంటే తెలివైన మనిషని అర్థం.దాదాపు పది లక్షల సంవత్సరాల కిందట ఉన్న డెనిసోవన్ అనే పురాతన మానవుడు,నాలుగు లక్షల ముప్పై వేల సంవత్సరాల క్రితం నియాండర్తల్ అనే వేరే మానవుని నుండి వేరుపడ్డాడు. ఇతని నుండి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత హోమోసెపియన్ అనే ఆధునిక మానవుడు వేరుపడ్డాడు. వేరుపడడం అంటే జన్యువులలో మార్పులు జరగడం వలన శారీరికంగా,మానసికంగా, అలవాట్లు, పనులు అన్నిటిలో మార్పు వచ్చి కొత్త రూపం సంతరించుకోవడమే.పాత రూపం మెల్లగా అంతరించి కొత్త రూపంతో ఉన్న మానవ జాతి అభివృద్ధి చెందుతారు.

ఇక్కడే మనం నమ్మలేని నిజాలు జరిగాయి. పై మూడు రకాల మానవుల మధ్య శారీరిక కలయికలు జరిగింది అని శాస్త్రజ్ఞులు నిరూపించారు. పది లక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో కొంతకాలం వీరంతా కలిసి ఉన్నారు. అక్కడనుండి విడిపోయి కొన్ని వేల ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడో కలుసుకున్నారు. వేల మైళ్ళ దూరం ప్రయాణం చేశారు. ఈ మూడు రకాల మానవులు వేరు పడక ముందు ఇంకొక అజ్ఞాత మానవ రకం ఉండేదని అందుకే వంశవృక్షం అనేమాట మానవకుటుంబాలకు వర్తించదు అంటారు రచయిత.అలాగే ఆధునిక మానవుడు ఆఫ్రికాలో ఇప్పటి తన రూపాన్ని తెచ్చుకున్నది రెండు లక్షల ఏళ్ల క్రితమని అంచనా.

కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో అర్జునుడు యుద్ధానికి భయపడడానికి యుద్ధానికి వెనుకాడడానికి వర్ణసాంకర్యభయం ఒక ముఖ్య కారణం అని చెప్పినప్పుడు కృష్ణుడు ఇవన్నీ చిన్న చిన్న గీతలని చెప్పి విశ్వరూపమనే పెద్ద గీతను ప్రదర్శించి యుద్ధం చేసేలా చేస్తాడు.ఆ పెద్దగీత ముందు అన్నీ రకాల విభజనలూ,తేడాలూ, వాటి నామరూపాలూ చాలా చిన్న గీతలై అప్రధానమయి పోయాయి.

అనేక లక్షల సంవత్సరాల మహాప్రస్థానంలో జరిగింది వలసలు లేదా విస్తరణలు, సంకరాలు జరిగాయన్నది ఒప్పుకుని తీరాలి. అసలు అటువంటివి జరగనేలేదనడం సరికాదు. ఎవరు ఎంత కాదన్నా సాంకర్యమే నిజం.స్వచ్చత అబద్ధం. ఈ అంతులేని ప్రయాణంలో మానవుడు భూఖండం మొత్తాన్ని మంచునదాలు ముంచేయడం, అగ్నిపర్వతాలు బద్దలై వందలాది కిలోమీటర్ల భూమి బూడిడతో కప్పేయడం, కొన్ని కిలోమీటర్ల లోతుగా పూడిపోవడం చూశాడు. అయినా కొంత జనం దక్షిణ ద్వీప కల్పాలలో ఆశ్రయం పొందారు. మానవులు, జంతు జీవాలు అంతరించిన అవశేషాలు నేటికీ లభ్యమై వాళ్ళ ఆనవాళ్లను తెలియచేస్తున్నాయి. ఈ విధంగా ఆధునిక మానవుల వారసులు చాలావరకు అదృశ్యమై పోయారు.

11-12 వేల ఏళ్ళ క్రితం చివరి మంచు యుగం ముగిసి వాతావరణం అసాధారణంగా కుదుటపడిన తర్వాత వ్యవసాయం ప్రారంభమై పుష్కలంగా ఆహారం దొరకడం జనాభివృద్ధికి కారణమైంది. మానవ చరిత్రలో తొలి మహత్తర విప్లవం వ్యవసాయమే.గృహ జీవితాన్ని అలవాటు చేయడంతో పాటు మానవ సంస్కృతికి,శారీరక లక్షణాలకు సైతం కొత్త రూపునిచ్చింది.వ్యవసాయం కోసం అరణ్యాలను చదును చేసే క్రమంలో ప్రాదేశిక భావన బలపడి రాజ్య అవతరణకు దారి తీసింది. కుక్క పెంపుడు జంతువు కావడం వేటలో తోడు,రక్షణకు ఉపయోగపడింది. కొత్త రాతి పరికరాలతో వ్యవసాయం చేయడం మొదలైంది. అంతకు ముందున్న స్థానిక వేట ద్వారా ఆహార సేకరణ జనానికి వ్యవసాయ జనానికి సంబంధాలు ఏర్పడ్డాయి.


నేటి కాస్పియన్ సముద్రానికి దగ్గరగా ఉన్న మానవులు, యూరప్ నుండి చైనా వరకు రష్యా మీదుగా యూరప్,ఆసియాల మధ్య వేల కిలోమీటర్ల దూరం వ్యాపించిన గడ్డిభూములకు చెందిన స్టెప్పీ సమాజాలనే కొందరు ఆర్యులు అన్నారు.వీళ్ళు గొర్రెలు, ఆలమందల పెంపకానికి చెందిన,ఆర్దికత మీద ఆధారపడిన పశుపోషకులు.వీరు అడవి గుర్రాలను మచ్చిక చేసుకొని వ్యవసాయానికి అందుబాటులోకి తెచ్చుకోవడంతో సంచార జీవనం విప్లవాత్మకమైన మలుపు తిరిగింది. కాలి నడకన తిరిగేకన్నా గుర్రం మీద వెళ్ళే కాపరి ఎక్కువ పశువులను కాయగలుగుతాడు. విశాలమైన ప్రాంతాలకు ప్రయాణం చేయగలుగుతాడు. ఇవి లేని వాళ్లపై ఆధిపత్యం లభించడంతో సామాజిక,ఆర్థిక హెచ్చు తగ్గులు వచ్చాయి.ఋగ్వేదంలో కూడా గుర్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. యాగాలు, యజ్ఞాలలో గుర్రాలను బలివ్వడం, పురాణాలలో ధర్మరాజు, రాముడు అశ్వమేధ యాగాలు చేయటం గురించిన వర్ణనలు చాలా ఉన్నాయి

వ్యవసాయానికి,రక్షణకు,యుద్ధంలో ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి మానవునికి ఆయుధం అవసరమైంది.లోహంతో చేసిన ఆయుధాలు చేయడం మొదలైంది. ఆయుధాల పుట్టుక, అభివృద్ధి క్రమం పరిశీలించినప్పుడు మనకు అసమానతలు కనిపిస్తాయి. దేవాసుర సంగ్రామంలో దేవతల దగ్గర పదునైన ఆధునిక ఆయుధాలు ఉన్నట్లు, అసురులు రాళ్ళు, చెట్లు వంటి వాటితో యుద్ధం చేశారని చెప్పడం ఈ తేడాను తెలియచేస్తుంది. పశువుల కోసం పచ్చిక భూముల కోసం స్టెప్పీ పశుపాలకులు వ్యవసాయ జనంతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం వచ్చింది.

ఆఫ్రికా నుండి వలసలకు జరిగిన ప్రయత్నాలు, కారణమైన పరిస్థితులు,తొలి వైఫల్యాలు, విజయాలు, అందుకుపయోగ పడిన మార్గాలు చదువుతుంటే అదొక గొప్ప చరిత్రకు ఇతిహాసానికీ వస్తువా అనిపిస్తుంది. శీతల వాతావరణాన్ని తట్టుకుని, మంచి శరీర దారుఢ్యంతో ఉన్న నియాండర్తల్ మానవునిపై ఆధునిక మానవుడు పై చేయి సాధించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది.నేడు వందల కోట్ల ప్రపంచ జనాభా మూలాలు ఒక ఆఫ్రికన్ తల్లిలో ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం, సంభ్రమం కలుగుతుంది ! అసలు నమ్మగలమా ? నేటికీ మన దేశంలోని దక్షిణాది రాష్ట్రాల మనుషులో ఆనాటి ఆఫ్రికన్ తల్లి మైటోకాండ్రియల్ డి ఎన్ ఏ, తండ్రి వై- క్రోమోజోమ్ హెప్లో గ్రూపులు ఉన్నాయి అన్నది సత్యం . అందుకే పరిశోధకులు అమ్మ పుట్టిల్లు ఆఫ్రికా అన్నారు

1498 లో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా కేరళ మలబారు ప్రాంతానికి మొదటగా వచ్చాడు. వ్యాపారం కోసం కేరళకు వచ్చి అరబ్బులు సుగంధద్రవ్యాలు, కాఫీ, రబ్బరు, కొబ్బరి పీచు ఉత్పత్తులు తమ నౌకల్లో నింపి పశ్చిమ దేశాలకు తీసుకెళ్ళి అమ్మేవారు.ఒక్కోసారి వాతావరణం అనుకూలించనప్పుడు ఎక్కువ రోజులపాటు ఓడలతో పాటు ఉండిపోయే వారు.అక్కడ స్థానికులకు కొంత డబ్బు చెల్లించి యువతులను తాత్కాలికంగా పెళ్ళిచేసుకుని, వాతావరణం అనుకూలించిన తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళిపోయేవారు.ఆ వధువులు వారికి పుట్టిన పిల్లలు ఇస్లాంలోకి మారిపోయేవాళ్ళు. మాపిళ్ళై అంటే పెళ్ళికొడుకు అని అర్థం.అదే మోప్లా తిరుగుబాటుగా ప్రసిద్ధం అయింది. స్థానిక యువతులకు కేరళ పుట్టిల్లు అయితే, కొందరు అరబ్ ముస్లింలకు కేరళ అత్తిల్లు అయింది. పేదరికం,నిస్సహాయత కారణాలు కాగా బాధితులు మాత్రం మహిళలే. వీటి వలన చరిత్రలో కొన్ని వలసలను ఎవరూ ఆపలేరు అని తెలుస్తుంది. మన పురా,చరిత్రలో బ్రాహ్మణులు,క్షత్రియులు, ఆదివాసీలను, అటవీ జనంలోని యువతులతో జత కట్టడం చాలా చోట్ల కనిపిస్తుంది.

అత్యంత ప్రమాదకరమైన అడవులు, సముద్రాలు, లోయలు,మంచు పర్వతాలు దాటుకుని అనేక సంస్కృతులు, నాగరికతలు నేర్చుకుని చేసిన మానవుని సుదీర్ఘ ప్రయాణం కొంతవరకు అంచనా వేయగలిగారు. ఎటువంటి సరిహద్దుల స్పృహ లేని కాలంలో వలసలు జరిగాయి. ఇండో యురోపియన్ వలసలు మాత్రం తమకు తెలియకుండానే హద్దులను ఏర్పరచుకుంటూ పోయారు. అదే ఆర్యావర్తం. ఆర్యా వర్తమనే పదం అనేక అర్థాలు, వర్ణ,ప్రాంత, భాషా భేదాలతో ముడిపడినది. ఆర్యావర్త వ్యాప్తి రెండు రకాలుగా నేటి మనదేశం వెలుపల, లోపల కూడా జరిగింది.మొదట రష్యా, ఉక్రెయిన్ స్టెప్పీలనుండి మొదలుపెట్టి పశ్చిమాన యూరప్ ను కలుపుతూ మన దేశానికి వ్యాపించిందనీ ఒక అంచనా. ఇక్కడ నివసించిన కంచు యుగానికి చెందిన తెగల జనాలను ఆర్యులు అన్నారు. ఈ ఇండో యూరోపియన్ జనాలు ఒకేసారి భారత్ కు రాలేదు. భిన్న సమయాలలో గుంపులుగా వచ్చారు. తరువాత కాలంలో సరిహద్దులు మొత్తం మారిపోయాయి. మొదట పంజాబ్ కు తర్వాత గంగను దాటి సింధు నుండి దక్కన్ అంచులకు, మళ్ళీ తూర్పుకు వ్యాపించారు.

భారత దేశంలో మగధ లేదా మౌర్య సామ్రాజ్యానికి చాలా ప్రత్యేకత ఉంది. నేడు మనం చెప్పుకునే లౌకిక వాదం ప్రాతిపదికపై వ్యవహరిస్తూ భారత్ సరిహద్దులను దాటి పశ్చిమంగా ఆఫ్ఘనిస్తాన్ వరకూ వ్యాపించి భిన్న సంస్కృతుల, భాషల సామరస్యంతో సహజీవనం చేయగలిగేలా తలుపులు తెరిచింది. అలాగే తెగల స్వతంత్ర అస్తిత్వాన్ని రూపు మాపడం, అశోకుని కళింగ యుద్ధం ద్వారా మూట కట్టుకున్న రక్త చరిత్ర మగధ రాజులకు ఉంది.మగధ తర్వాత వచ్చిన గుప్త రాజుల చరిత్ర కూడా పెద్దదే. యుద్ధంలో జరిగిన హింసను, వినాశనాన్ని చూసిన అశోకుడు వేదన, వైరాగ్యంతో బౌద్ధమతాన్ని స్వీకరించి ప్రచారం చేశాడు. అశోకుని వారసులు బలహీనమవడంతో బ్రాహ్మణ లేదా వైదికమత అనుకూలుడైన పుష్యమిత్రుడు మగధను కూలదోసి సింహాసనం చేజిక్కించు కున్నారు. మౌర్యుల పాలనలోనే హింసకు యజ్ఞ యాగాదులకు వ్యతిరేకంగా బౌద్ధం, జైనం విపరీతంగా వ్యాపించి వైదిక మత ఆధిక్యాన్ని తట్టుకోలేక క్షీణించాయి. అలాగే స్వతంత్ర భారతంలో కూడా ఎక్కువ రోజులు పాలించిన పార్టీని కూలదోసి హిందుత్వ శక్తులు అధికారంలోకి రావడం ద్వారా చరిత్ర పునరావృతమైంది.

మనుస్మృతి వచ్చేసరికి ఆర్యావర్తం ఎల్లలు మారిపోయాయి. వింధ్య,హిమాలయాలకు, తూర్పు, పశ్చిమ సముద్రాలకూ మధ్యనున్న ప్రాంతమే ఆర్యావర్తం అని చెబుతుంది. ఆర్యావర్తం అంటే ఒక భౌగోళిక ప్రాంతమేనా ? కాదు, ఒక నిర్దిష్ట జీవన విధానంతో కూడిన భావజాలం,మతమూ, సంస్కృతి, రాజకీయ చింతన,ఆర్థిక, దేహబలం, గుర్రమూ,రథము,ఆయుధాలు, లోహ సంపద.. అన్నీ కలిసిన ఆధిపత్యం వారికి సంక్రమించింది. ఆ భావజాలానికి గుర్తింపు, అధికారం సంక్రమించి నప్పుడు ఏకపక్ష విస్తరణకు దారి తీస్తుంది.అభద్రత కల్పించే అస్తిత్వ స్పృహ నుండి పుట్టే విస్తరణ దాహం అది అంటారు రచయిత.

భారతదేశం ఇప్పటికీ క్రీస్తు పూర్వ సామాజిక దశలోనే ఉందని, క్రీస్తు శకంలోకి ఇంకా రాలేదని చెప్పడం, దేశంలో నేడున్న పరిస్థితి చూస్తే నిజమనిపిస్తుంది. ఆర్యావర్తం ఇంకా వ్యాపించని భాగమే అనార్యావర్తం.ఈ రెండింటి మధ్య పెనుగులాట తగ్గదు. ఆర్యావర్తం కొత్త పాలకులతో సర్దుబాటు చేసుకుంటూనే తన ఆధిపత్యాన్ని నిలుపు కునే చాకచక్యం చూపుతుంది.

అనార్యావర్తం తన అస్తిత్వాన్ని నిలుపుకునే పోరాటం చేస్తుంది.ఆర్యావర్త విస్తరణకు ఎదురు నిలిచింది ఆనాడు బుద్ధుడు, నేటికాలంలో గాంధీజీ.అందుకే భౌతికంగా అడ్డు తొలగించారు. తమ అజెండాను గెలుచు కోవడానికి వందల,వేల సంవత్సరాలలో చేసిన కృషి అనితర సాధ్యం. నేడు ఎంత చిన్న ధిక్కారాన్ని, సవాలుని స్వీకరించే స్థితిలో లేదు. అంతులేని అర్ధబలం,అంగబలం తో దక్షిణంలోనూ, ఈశాన్య భారతంలోనూ కోటలను చేజిక్కించుకునే ప్రయత్నం జరుగుతోందని రచయిత అభిప్రాయం

(‘ఇవీ మన మూలాలు’ పుస్తకం ధర రు.450. కావలసిన వారు మొబైల్ నెంబర్ 94900 98654 ను సంప్రదించవచ్చు)

Tags:    

Similar News