కార్మికనాయకుడు వుప్పులూరి శతజయంతి సందర్భంగా ఒక నివాళి!

శతజయంతి ముగింపు సభ నవంబర్ 25న రాజమండ్రిలో...

By :  Admin
Update: 2024-11-24 02:23 GMT

-సి.హెచ్.ఎస్.ఎన్.మూర్తి

నీతి, నిజాయితీ, నిబద్ధత, నిస్వార్థపరత, నిరంతర అధ్యయనశీలత, మహోన్నత త్యాగశీలత మొదలగు ఉన్నత లక్షణాలతో, కమ్యూనిస్టు ఉద్యమమే జీవితంగా, కార్మిక/ప్రజాసంఘాల కార్యాలయాలూ, పోరాట శిబిరాలే తన నిరంతర నివాసంగా, కార్మికులూ, పేదప్రజలే తన కుటుంబంగా జీవించిన మహనీయుడు, విప్లవ-కమ్యూనిస్టు, ఆదర్శ కార్మికోద్యమ నేత, అమరుడు వుప్పులూరి సుబ్బారావు గారి శతజయంతి కార్యక్రమాలు 26-11-2023న వారి స్వస్థలం పిఠాపురంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల ముగింపు సంస్మరణ సభ 25-11-2024న ఆయన ప్రధాన ఉద్యమ కేంద్రమైన రాజమండ్రిలో జరుగుతోంది.

మధ్యతరగతి భూస్వామ్య కుటుంబంలో, 26-11-1924న పుట్టిన వుప్పులూరి యువకుడుగా ఉన్నప్పుడే కార్మికవర్గ, పీడిత ప్రజల పక్షపాతిగా మారి, నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో చేరారు. చివరి శ్వాస తీసేవరకూ విప్లవ-కమ్యూనిస్టు సిధ్ధాంతానికే కట్టుబడి పనిచేసారు. పార్లమెంటు/ అసెంబ్లీ ఎన్నికల ద్వారా కాక- మార్క్స్, లెనిన్, మావోల సిధ్ధాంతాల బాటలో, కార్మికవర్గ నాయకత్వంలో సాగు ప్రజల విప్లవోద్యమం ద్వారా మాత్రమే మనదేశంలో నిజమైన ప్రజారాజ్యం, సమసమాజం ఏర్పడతాయని ఆయన బలంగా విశ్వసించారు. ఆ విప్లవోద్యమ నిర్మాణ లక్ష్యంతోనే జీవితాంతం, అహర్నిశలూ కార్మిక, ప్రజావుద్యమాలలో పనిచేసారు.

తన రాజకీయ జీవితం తొలిదశలో ఆయన పిఠాపురం ప్రాంతంలో జరిగిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ పోరాటాలలో పాల్గొన్నారు. రహస్య జీవితంలో వుండి, ప్రాణాలను పణంగా పెట్టి, నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. పిఠాపురంలో మునిసిపల్ పారిశుధ్య కార్మికుల పోరాటాలకు నాయకత్వం అందించారు. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆయన పారిశుధ్య కార్మికుల కుటుంబాలతో మమేకమై, కుల కట్టుబాట్లను, తల్లిదండ్రులను ధిక్కరించి, ఆ కార్మికులను బ్రాహ్మణవీధిలోని తన ఇంటికి తీసుకువెళ్ళి, విప్లవ కార్మికవర్గ చైతన్యానికి మారుపేరుగా నిలిచారు. 1951లో ఆనాటి తెలంగాణ ప్రజల సాయుధపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి పార్టీ ఆదేశాల మేరకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆ పోరాట విరమణ జరిగిన సమాచారం తెలిసి వెనుదిరిగారు. పార్టీ సూచనల మేరకు కొద్దికాలం రూర్కెలా ఉక్కు ఫ్యాక్టరీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసారు. తర్వాత నుండీ కమ్యూనిస్టు, కార్మికోద్యమాలకే తన యావజ్జీవితాన్ని అర్పించారు.

సి.పి.ఐ, సి.పి.ఎం.ల మితవాద, వర్గసంకర విధానాలను, వివిధ సి.పి.ఐ.యం.యల్ గ్రూపుల, సి.పి.ఐ.(మావోయిస్టు) యొక్క అతివాద, అవకాశవాద విధానాలను బలంగా వ్యతిరేకించారు. భారత కమ్యూనిస్టు విప్లవోద్యమ నిర్మాతలు, అమరులు దేవులపల్లి వెంకటేశ్వర రావు, తరిమెల నాగిరెడ్డి గార్లు రూపొందించిన విప్లవ ప్రజాపంథాను సరైనదిగా గుర్తించి, బలపరచారు. వారు స్థాపించిన యు.సి.సి.ఆర్.ఐ.యం.యల్ (UCCRI-ML)  తో (1992-1998) సన్నిహిత సంబంధాలను నెరపి, ఆ సంస్థతో ఐక్యత దిశగా కృషి చేసారు. ఆ సంస్థ నాయకత్వంతో కలసి కార్మికులలో విప్లవ రాజకీయ చైతన్యాన్ని పెంపొందించటానికి విశేషమైన కృషిచేసారు.

పాలకవర్గ పార్టీల కార్మిక/ప్రజా వ్యతిరేక రాజకీయాల పట్టు నుండి, మితవాద, అతివాద కమ్యూనిస్టు పార్టీల ప్రభావం నుండి కార్మికులను బయటకు తెచ్చి, కార్మికవర్గాన్ని ఒక స్వతంత్ర, విప్లవరాజకీయ శక్తిగా అభివృధ్ధి చేసే లక్ష్యంతో ఆయన స్వతంత్ర కార్మికసంఘాల సమాఖ్య- ఎఫ్.ఐ.టి.యు.ను (1983లో) స్థాపించి, అభివృధ్ధి చేసారు. దేశంలోని తెలుగు, తమిళం, కన్నడ, మళయాలీ, బెంగాలీ, పంజాబీ వంటి వివిధ భాషాజాతులకు స్వయం నిర్ణయాధికారం వుండే విధంగా భారత రాజ్యవ్యవస్థను సమూలంగా పునర్నిర్మించుకునే జాతీయ విప్లవోద్యమాలను కూడా కార్మికవర్గ నాయకత్వంలో కమ్యూనిస్టు విప్లవశక్తులు నిర్మించాలని వుప్పులూరి సూత్రీకరించారు.

ఈ కర్తవ్యాలను నిర్వర్తించే ఈ కృషిని ముమ్మరం గా చేస్తున్న కాలంలో 08-09-1998న కాకినాడలో గుండెపోటుతో ఆయన అమరులయ్యారు.

భూస్వామ్య, ధనిక రైతు, పేద/మధ్య తరగతి రైతు, వ్యవసాయ-కూలీ కుటుంబాల నుండి, మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన, వివిధ కులాలకు చెందిన కార్మికులను, వివిధ పార్టీల, యూనియన్ల జెండాల క్రింద చీలివున్న పెర్మనెంటు, క్యాజువల్, బదిలీ, కాంట్రాక్టు కార్మికులను ఒకే పోరాటశక్తిగా సంఘటితపరచారు. వారిచేత అనేక ప్రభుత్వ, ప్రయివేటు రంగాల నిరంకుశ, కార్మిక-వ్యతిరేక యాజమాన్యాలపై పోరాడిగెలిచేలా ఉద్యమాన్నిరూపొందించారు.


వివిధ వర్గాలు, కులాల నుండి వచ్చిన కార్యకర్తలను సమర్థులైన, త్యాగశీలురైన కార్మిక నాయకులుగా ఆయన తీర్చిదిద్దారు. కమ్యూనిస్టుల గురించి కులవాదులు చేసే దుష్ప్రచారాలను తుత్తునియలు చేసే అత్యంత ప్రజాస్వామిక నాయకత్వ విధానాలను ఆయన అనుసరించారు. దళారి, పెత్తందారీ నాయకత్వాలకు సింహస్వప్నంగా నిలిచారు. కార్మిక చట్టాలను లోతుగా అధ్యయనం చేసి, ఔపోసన పట్టి, ఆ జ్ఞానాన్ని కార్మికుల పోరాటాల విజయానికి వుప్పులూరి ఉపయోగించిన తీరు అనితరసాధ్యం! ఆయా పరిశ్రమలలోని పెట్టుబడి, యాజమాన్యాల స్వభావాలకు తగిన ఉద్యమ విధానాలను రూపొందించి, అమలుచేసారు. చిన్న, జాతీయ పరిశ్రమలలో ఆ పరిశ్రమల మనుగడను కాపాడుకోవటానికి అవసరమైన సామరస్య విధానాలను అనుసరించేవారు.

వుప్పులూరి కోనసీమ అమలాపురం (Konaseema) ప్రాంతంలో ప్రయివేటు మోటారు రవాణా కార్మికుల మిలిటెంట్ పోరాటాలకు నాయకత్వం అందించారు. ఎ.పి.ఎస్.ఆర్టీసి సంస్థ ఏర్పడినప్పుడు, అప్పటివరకూ వున్న ప్రయివేటు బస్సులలో పని చేస్తున్న వందల మంది కార్మికులను ఆర్టీసీలో ఉద్యోగంలోకి తీసుకునేందుకు బలమైన, విజయవంతమైన పోరాటాలను నడిపారు. ఆర్టీసీలో ఎన్.ఎం.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రశంసనీయమైన నాయకత్వ భాధ్యతలను నిర్వర్తించారు. ఆర్టీసీ కార్మికుల జీతభత్యాల పెంపుదలకు, మోటారు కార్మిక చట్టాల అమలుకు, కండక్టర్/ డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు, అధికారుల నిరంకుశత్వానికి అడ్డుకట్టలు వేయటానికి అనేక మిలిటెంట్ పోరాటాలను నడిపి, గెలిపించారు.


ఆర్టీసీని దెబ్బతీసి, ప్రయివేటు రవాణాను ప్రోత్సాహించే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజలతో కలసి ఆర్టీసీ కార్మికులు ఉద్యమించే విధంగా వారిని చైతన్యవంతం చేసే లక్ష్యంతో “ ఎ.పి.ఎస్. ఆర్టీసీ యునైటెడ్ వర్కర్స్ యూనియన్”ను స్థాపించి (1989) ఉద్యమ నిర్మాణానికి కృషి చేసారు. రాజమండ్రి, కాకినాడలలో సిటీబస్ కార్మికుల సంఘాలకు, భారత్ మోటార్ పార్సిల్ సర్వీస్(BMPS) కార్మికసంఘానికి స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించి, ఆ కార్మికులకు అనేక హక్కులూ, ప్రయోజనాలూ సాధించారు. ఆ విధంగా నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోటార్ ట్రాన్సుపోర్ట్ కార్మికుల ఉద్యమరంగంలో విలక్షణమైన పాత్ర నిర్వహించిన సాటిలేని మేటి నాయకుడుగా ఆయన పేరుపొందారు.

రాజమండ్రి ఎ.పి.పేపరు మిల్లులో వుప్పులూరి నిర్మించిన ఐక్య కార్మికోద్యమం, మిలిటెంట్ పోరాటాలూ, సాధించిన విజయాలూ కార్మికోద్యమానికి ఎన్నో విలువైన అనుభవాలను సమకూర్చాయి. రాజకీయ పార్టీల, కార్మికసంఘాల క్రింద చీలివున్న కార్మికులను ఒకే పోరాటవేదికలో ఆయన ఐక్యం చేసారు. (1986లో) మిల్లును లాకౌట్ చేయాలన్న యాజమాన్య కుట్రను ప్రతిఘటించి, ప్రభుత్వ పోలీసు బలగాలను ఎదుర్కొని, 36 గంటలపాటు మిల్లును కార్మికులు స్వాధీనం చేసుకున్న మరపురాని సమరశీల కార్మిక పోరాటాన్ని వుప్పులూరి నిర్మించారు. దేశంలోని బలమైన పాలకవర్గ పార్టీల, “వామపక్ష” పార్టీల నాయకత్వంలోని సంఘాల వల్ల కూడా సాధ్యంకాని, ఎంతో మెరుగైన జీతభత్యాల పెంపుదల, బోనస్, ప్రొడక్షన్ ఇన్ సెంటివ్, ప్రమోషన్ పాలసీ, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ మొదలగు అనేక ప్రయోజనాలను, హక్కులనూ ఈ మిల్లు కార్మికులు వుప్పులూరి నాయకత్వంలో స్వతంత్రంగా, ఐక్యంగా పోరాడి సాధించుకున్నారు.

అదేవిధంగా రాజమండ్రిలోని హార్లిక్స్ ఫ్యాక్టరీలో, స్పిన్నింగ్ మిల్లులో, సినిమా ధియేటర్ సంస్థలలో, కొవ్వూరు స్పెక్ ఫ్యాక్టరీలో, త్రివేణి గ్లాస్ షీట్ కంపెనీలో, తాడేపల్లిగూడెం ఫుడ్స్,ఫ్యాట్స్ పరిశ్రమలో, కాకినాడలోని గోదావరి ఫెర్టిలైజర్స్ (ప్రస్తుత కోరమాండల్)లో, సిరీస్ ఆగ్రోలో, పిఠాపురం, సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీలలో వివిధ స్వతంత్ర కార్మికసంఘాలకు, వారి పోరాటాలకు వుప్పులూరి ప్రతిభావంతమైన, ఆదర్శనీయమైన నాయకత్వాన్ని అందించారు.


ఆ పరిశ్రమల కార్మికులకు అనేక హక్కులు, ప్రయోజనాలు సాధించిన, వేలాది కార్మికుల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన కార్మికోద్యమ నిర్మాణంలో ఆయన స్ఫూర్తిదాయకమైన, ప్రజ్ఞావంతమైన నాయకత్వ పాత్ర నిర్వహించారు. మూతబడిన పిఠాపురం పంచదార మిల్లు కార్మికులు తమకు రావాల్సిన చట్టపరమైన పరిహారం, ఇతర బకాయిల వసూలుకు- మిల్లు భూములు స్వాధీనం చేసుకోవడం వగైరా- మిలిటెంట్ పోరాటాలను 20 సం. పాటు ఐక్యంగా, సుదీర్ఘంగా సాగించి, ఈ మధ్యనే 10 కోట్ల రూపాయలను అందుకున్న విజయం సాధించారు; ప్రజల, ఉద్యమాభిమానుల ఎన్నో మన్ననలను పొందిన ఈ కార్మికుల ఉద్యమం వుప్పులూరి నిర్మించిన పునాదిపైనే, ఆయన సిధ్ధాంతాల బాటలోనే సాగింది!

దున్నే వానికే భూమి కోసం, భూస్వామ్య విధానం రద్దు కోసం రైతాంగం, గ్రామీణ పేదలు సాగించు పోరాటాలతో కార్మికవర్గం మమేకం కావాలని వుప్పులూరి బోధించారు. కార్మిక-కర్షక ఐక్యతకై కృషి చేసారు. “దేశభక్తి” పేరుతో పాలకులు రెచ్చగొట్టే జాతీయోన్మాదాన్ని, యుధ్ధోన్మాదాన్ని వుప్పులూరి బలంగా వ్యతిరేకించారు. కార్మికవర్గ అంతర్జాతీయతను బోధించి, ఆచరించారు. భారత ప్రజల సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట విజయానికి భారత, చైనాల మధ్య బలమైన స్నేహ సంబంధాలు అవసరమని భావించి, భారత-చైనా మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మైత్రీ ఉద్యమంలో తాను చురుకుగా పాల్గొని, కార్మికులు పాల్గొనే విధంగా వారిని చైతన్యవంతం చేసారు. ఆయన అమరులైన తర్వాత కూడా, ఈ 25 సం లుగా, ఆయన సిధ్ధాంతాల బాటలో, మరింత విప్లవ రాజకీయ చైతన్యంతో, కార్మికుల, ప్రజల మన్ననలను పొందే విధంగా ఉద్యమ నిర్మాణానికి కృషి చేస్తున్న నేటి ఎఫ్.ఐ.టి.యు. నాయకత్వాన్ని అభివృధ్ధి చేసిన ఆదర్శ కార్మికోద్యమ నేత వుప్పులూరి!

వుప్పులూరి జీవన సహచరి శ్రీమతి రాణీకుమారి ఆయన పట్ల అత్యంత ప్రేమాభిమానాలతో, ఎన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైనప్పటికీ, ఆయన సాగించిన ఉద్యమానికి తనవంతు పూర్తి సహకారాన్ని అందించారు. ఎంతో మంది ఉద్యమ నాయకులకు, కార్యకర్తలకు ఆమె తమ ఇంట మరపురాని ఆత్మీయతతో ఆశ్రయాన్ని, ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసేవారు. వుప్పులూరి యొక్క కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్ళు, మనుమలు, శ్రమజీవులుగా, స్వావలంబనతో సంస్కారవంతమైన, గౌరవప్రదమైన జీవనం సాగిస్తున్నారు. వుప్పులూరిని నిత్యం అపార గౌరవాభిమానాలతో స్మరించుకుంటూ, ఇప్పటికీ కార్మికోద్యమానికి తమ శక్తిమేరకు సహాయ, సహకారాలను అందిస్తున్నారు. ఆయన వారిలో అటువంటి స్ఫూర్తిని నింపారు.

నేడు ప్రపంచంలో ఒకపక్క అమెరికా అగ్రరాజ్యం నాయకత్వంలో వివిధ సామ్రాజ్యవాద, పెట్టుబడిదారీ దేశాలు తమ దోపిడీ, పెత్తందారీ విధానాలతో ప్రపంచ ప్రజలపై పేదరికం, నిరుద్యోగం, తీవ్ర అసమానతలు, యుధ్ధాలూ, విధ్వంసాలూ, రక్తపాతం రుద్దుతున్న పరిస్థితులను చూస్తున్నాము. మరొకపక్క కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో చైనా దేశ ప్రజలు సాధించిన, సాధిస్తున్న అసాధారణ అభివృధ్ధి, ప్రపంచ ఆర్థిక, రాజకీయ రంగాలలో చైనా పోషిస్తున్న శాంతియుతమైన, ప్రజానుకూలమైన, బలమైన, కీలకమైన పాత్రనూ మనం చూస్తున్నాము. ఈ పరిస్థితులు - ప్రపంచ మానవాళి విముక్తికి, అభివృధ్ధికీ, శాంతి, సౌభాగ్యాలకు కమ్యూనిస్టు సిధ్ధాంతం, సోషలిస్టు మార్గం మరో ప్రత్యామ్నాయం లేదని రుజువు చేస్తున్నాయి.

కేంద్రంలో, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా, మన దేశ పాలకులు, అమెరికా అగ్రరాజ్య, ఇతర సామ్రాజ్యవాదుల, అంబానీ అదానీ వంటి బడాపెట్టుబడిదారుల, భూస్వామ్యశక్తుల దోపిడీ, పెత్తనాలకు అనుకూలమైన విధానాలనే అనుసరిస్తున్నారు. ఈ దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు సాగించు పోరాటాలను, వివిధ జాతీయ, ప్రజాస్వామిక విప్లవోద్యమాలనూ పాశవికంగా అణచివేస్తున్నారు. రాష్ట్రాల అధికారాలను, హక్కులనూ మరింతగా హరిస్తూ, కేంద్ర నిరంకుశాధికారాన్ని రోజురోజుకూ బలపరుస్తున్నారు.


సరైన కమ్యూనిస్టు విప్లవోద్యమం నుండి కార్మికులను, ప్రజలను పక్కదారి పట్టించడానికి కులవిద్వేషాలనూ, మతోన్మాదాన్ని, జాతీయోన్మాదాన్ని, యుధ్ధోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికలూ, మితవాద, అతివాద, అవకాశవాద, వర్గసంకర, విఛ్ఛిన్నకర, విప్లవ వ్యతిరేక ధోరణులూ, కార్యాచరణలూ కూడా పాలకవర్గాలకు బాగా ఉపకరిస్తున్నాయి. వుప్పులూరి స్ఫూర్తితో, వీటన్నింటికి వ్యతిరేకంగా పోరాడి, మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానాలను మనదేశ పరిస్థితులకు వర్తింపచేసే సరైన విప్లవ ప్రజాపంథాను గుర్తుపట్టి, కమ్యూనిస్టు/కార్మికవర్గ విప్లవోద్యమ పునర్నిర్మాణానికి కృషి చేయాల్సి వుంది. ఈ విప్లవ ఉద్యమం ద్వారానే మనదేశ ప్రజలు నిజమైన, సంపూర్ణమైన, స్వతంత్రమైన ప్రజారాజ్యాన్ని స్థాపించుకోగల్గుతారు; సమసమాజ నిర్మాణాన్ని సాధించుకోగల్గుతారు! 



(ఇందులో వ్యక్తీకరించినవన్నీ రచయిత సొంత అభిప్రాయాలు.  భావవ్యక్తీకరణకు  ‘ఆంధ్ర ప్రదేశ్ ఫెడరల్ ’ ఎపుడూ ఒక వేదిక ఉంటుంది.)

Tags:    

Similar News