నాటక రంగస్థలంపై "రక్తకన్నీరు"
"రక్తకన్నీరు" సాంఘిక నాటకం. తెలుగు నాటక రంగస్థలంపై ఒక చరిత్ర. 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో ఆంధ్ర దేశాన్ని మూడు దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపిన చరిత్ర.
"రక్తకన్నీరు" సాంఘిక నాటకం. తెలుగు నాటక రంగస్థలంపై ఒక చరిత్ర. 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో ఆంధ్ర దేశాన్ని మూడు దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపిన చరిత్ర. ఆ నాటకం నవ్వించింది. కవ్వించింది. మనిషిలోని హీనత్వపు చెంప చ్ఛెళ్ళుమనిపించింది. నాటి రాజకీయాలను సందర్భోచితంగా తూర్పార బట్టింది "రక్తకన్నీరు"నాటకం. ఇలాంటి నాటకం "గతంలో లేదు, ఇకముందు రాదు." అన్నంతగా ప్రసిద్ధికెక్కింది. రక్త కన్నీరు నాటకాన్ని అందులోని ప్రధాన పాత్రధారి, దర్శకుడు, ప్రదర్శకుడు సి. నాగభూషణం ఆంధ్రదేశానికి సమర్పించారు. నాగభూషణం నిజంగా తెలుగు తల్లికి ఒక నట భూషణం. ఫస్టు ఫారం నుండీ లాస్టు శ్వాసవరకు రంగస్థలమే తన ప్రధాన కార్య స్థానంగా జీవించిన నటుడు చుండి నాగభూషణం. అవును అలా చెపితే ఎలా తెలుస్తుంది మీకు? అతడే "రక్తకన్నీరు నాగభూషణం". నాగభూషణం సినిమా రంగం ఆకర్షణకూ లోనయ్యారు. వెండి తెరపై దాదాపు 350సినిమాల్లో నటించినప్పటికీ ఆయన పూర్తిగా "సినీనటుడు నాగభూషణం" కాలేదు. "రక్తకన్నీరు నాగభూషణం" గానే చరిత్రలో నిలిచిపోయారు. రవి ఆర్ట్స్ థియోటర్ స్థాపించి 5వేల 500లకు పైగా రక్త కన్నీరు నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఉచిత ప్రదర్శనలు అనుకునేరు. కానేకాదు, అన్నీ టికెట్టు ప్రదర్శనలే. ముప్పై కుటుంబాలకు చెందిన దాదాపు అయిదు వందల మందిని మూడు దశాబ్దాలపాటు నాగభూషణంగారి రక్త కన్నీరు నాటకం పోషించింది. 30 సంవత్సరాలు అంటే సుమారు పదివేల తొమ్మిది వందల యాభై రోజులు. ప్రదర్శనలు సుమారు అయిదు వేల అయిదు వందలు. అంటే సరాసరిన రోజుమార్చి రోజు ఒక ప్రదర్శన.
ఇది సాధ్యమా? ఒకే ఒక్క నాటక సమాజం, ఒకే నాటకం, వారే ప్రధాన నటులు, అలా ప్రదర్శించడం ప్రేక్షకుల్ని మెప్పించడం, ప్రజలు ఆదరించడం సంభవమా? ఇవన్నీ ఎవరినైనా అబ్బురపరిచే, సంశయానికి గురిచేసే అంశాలే. కానీ ఇవన్నీ నిజమైన నిజాలే. ఏమిటా నాటకం? ఏమిటి దాని ప్రత్యేకత? ప్రేక్షకుల్ని అంతగా ఎలా రంజింపచేసింది? నటులు తమ నటనలో తామే వైవిధ్యాన్ని ఎలా సాధించి ప్రదర్శించారు? ఎవరికైనా ఎదురయ్యే ప్రశ్నలే.
ఎం. ఆర్. రాధ తమిళ సినిమా కథానాయకుడు. ప్రసిద్ధ రంగస్థల నటుడు. "రక్తే కన్నీర్" నాటకాన్ని తమిళనాట ప్రదర్శిస్తున్నారు. ఆ నాటకం అసలు రచయిత ఎవరో తెలియదు. ఎవరి నాటకాన్నో తనకు అనుగుణంగా నాటకీకరించుకొని తనదైన ముద్రతో ప్రదర్శనలు ఇస్తున్నారు, రాధ. దాన్ని మద్రాసులో నాగభూషణం చూశారు. బాగుంది అనిపించింది. తెలుగులోకి అనువదించి ప్రదర్శిస్తే... ఆమాటే ప్రముఖ రచయిత పాలగుమ్మి పద్మరాజుతో అన్నారు. ఇద్దరూ కలిసి నాటకం చూశారు. పాలగుమ్మి కూడా సానుకూలతను వ్యక్తం చేశారు. నాగభూషణం ఎం.ఆర్. రాధను అనుమతి కోరారు. నిరభ్యంతరంగా ఆడుకోమని అనుమతి ఇచ్చారు రాధ. ఆంధ్ర దేశం సామాజిక వాతావరణానికి తగినవిధంగా మార్పులూ చేర్పులతో తెలుగులో "రక్త కన్నీరు" నాటకం సిద్ధం అయింది.
గోపాల్ అనే జమీందారు బిడ్డ సీమ చదువులు చదివి వస్తాడు. తన వేష భాషలన్నింటినీ పూర్తిగా మార్చుకొంటాడు. తననితాను "మిస్టర్ పాల్"గా చెప్పుకొంటాడు. భారతదేశం పట్ల, సామజిక వ్యవస్థ పట్ల రాజకీయాల పట్ల, కుటుంబం పట్ల ఏవగింపును ప్రదర్శిస్తాడు. వ్యసన పరుడిగామారతాడు. అన్నింటా తన అహాన్ని ప్రదర్శిస్తాడు. తండ్రి అంతకు ముందే చనిపోతాడు. పాల్ తల్లి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తాడు. తూలనాడతాడు. ఆత్మీయ స్నేహితుడు రమణ మాటల్నీ ఖాతరు చేయడు. తల్లి ఒత్తిడితో మేనమామ కూతురు ఇందిరను పెళ్ళి చేసుకుంటాడు. తనకు అనుగుణంగా వర్తించలేదని ఆమెనూ దూరం పెడతాడు. వేశ్యాలోలుడవుతాడు. సుందరి అనే ఆమె మోజులో పడతాడు. తల్లి మరణావస్థలో ఉన్నా ఇంటికి వెళ్ళడు. సుందరి తల్లి పుట్టినరోజు వేడుకల్లో మునుగితేలుతుంటాడు. క్రమేపీ అతని ఆస్తి పాస్తుల్ని సుందరి చేజిక్కించుకొంటుంది. పాల్ కుష్ఠు వ్యాధి బారినపడతాడు. ఇక పాల్ ను ఒక గదికి పరిమితం చేసింది సుందరి. అతనిని క్రమేపీ నిర్లక్ష్యం చేసింది. పాల్ తల్లి చనిపోయింది. రమణ, ఇందిరకు లేనిపోని సంబంధాన్ని అంటగడతాడు పాల్. సుందరి సినిమారంగం మీద మోజుతో మద్రాస్ వెళ్ళిపోతుంది. ఆతర్వాత కొన్నాళ్ళకు కారు ప్రమాదంలో ఆమె మరణిస్తుంది. పాల్ ను ఆమె ఇంటినుండి గెంటేస్తారు. ప్రమాదవశాత్తు చూపును కోల్పోతాడు పాల్. చివరకు భిక్షాటనకు పాల్పడతాడు. వ్యాధి ముదిరిపోతుంది. ఇందిర స్వగ్రామం వదిలి వెళ్ళిపోతుంది. అడుక్కొంటూ ఆమె ఇంటికే వెళతాడు పాల్. ఆమె గొంతును గుర్తు పడతాడు. ఇందిరకు తానుచేసిన ద్రోహాన్ని తలుచుకొని బాధపడతాడు. క్షమాభిక్ష కోరతాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన రమణను ఇందిరను పెళ్ళి చేసుకోమని అభ్యర్థిస్తాడు పాల్. ఆ ఉద్వేగ సన్నివేశంలోనే పాల్ మరణిస్తాడు. టూకీగా రక్త కన్నీరు నాటకం కథ ఇది.
ప్రధాన పాత్రలు -
గోపాల్ (మిస్టర్ పాల్) - సి. నాగభూషణం, సుందరి (వాంప్ రోల్) - సీత, ఇందిర (గోపాల్ భార్య) - వాణిశ్రీ, శారద.
మరో విశేషం ఏమంటే ప్రజానాట్యమండలి తీర్చిదిద్దిన కళాకారుడు "చెయ్యేత్తి జైకొట్టు తెలుగోడా", "పలనాడు వెలలేని మాగాణిరా!" తదితర సుప్రసిద్ధ గీతాలకు సంగీతం బాణీలు కూర్చి పాడిన ప్రజా కళాకారుడు బొడ్డు గోపాలం ఈ నాటకానికి సంగీతం సమకూర్చినవారు. నాగభూషణం భార్య సీత. నాటక ప్రదర్శనల నిర్వహణలో నాగభూషణంకు కుడి భుజంగా ఉన్నారు.
1956లో నెల్లూరులో రక్తకన్నీరు నాటకం మొట్టమొదటి ప్రదర్శన ఇచ్చారు. అదీ ఒక్కరోజు కాదు. రెండురోజులు. రెండురోజులూ టికెట్ మీద ప్రదర్శనమే. నాటినుండి మూడు దశాబ్దాలు తిరిగి చూడకుండా రక్తకన్నీరు నాటక ప్రదర్శన కొనసాగింది. " తెలుగునాట సాంఘిక నాటక ప్రదర్శనల్లో అత్యధిక రెవెన్యూ వసూలు చేసిన నాటకంగా రక్తకన్నీరు చరిత్ర సృష్టించింది." అంటారు ప్రముఖ నాటక రచయిత, పరిశోధకులు వల్లూరు శివ ప్రసాద్.
ఏమిటీ ఈ నాటక ప్రత్యేకత అని అనిపించడం సహజం. ఈ రోజు గుంటూరులో చూసిన నాటకం రేపు ఏలూరులో చూస్తే ఆశ్చర్యపోతారు ప్రేక్షకులు. అంత కొత్తదనం ఉంటుంది. కథలో కాదు. కథ అదే, కానీ సంభాషణలు మారిపోతాయి. వాచికాభినయం మారిపోతుంది. నాటకంలో కథనం ఏలూరు స్థానికతలో నడుస్తుంది. మాండలికం, రాజకీయం స్థానికతను సంతరించుకొంటాయి. తాజా జాతీయ, రాష్ట్ర రాజకీయాల చణుకులు తళుక్కుమంటాయి. అలా ఆ నాటకం నిత్య నూతన త్వాన్ని సంతరించుకొనేది. ప్రేక్షకాదరణ పొందేది. ఒకే రోజు ఒకే ఊర్లో రెండు ప్రదర్శనలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటారు. ఏలూరులో నాటక పోటీలకు రక్తకన్నీరు నాటకాన్ని అనుమతించలేదు. అందులో కమ్యూనిస్టు రాజకీయాలు ఉంటాయనేది వారి అభియోగం. పోటీగా అదే రోజు ఏలూరులో వేరే హాలు రక్తకన్నీరు నాటకాన్ని ప్రదర్శించారు. హాలు కిక్కిరిరిసిపోయింది. టికెట్ ప్రదర్శనే సుమా!
"రంగస్థల నటుడు అన్న ప్రతి ఒక్కడికీ సామాజిక బాధ్యత ఉండాలి." అన్నది నాగభూషణం ఫిలాసఫి. ఆయన నటజీవితం ఆ సూత్రానికి కట్టుబడే కొనసాగింది. కమ్యూనిస్టు సిద్ధాంత ప్రభావానికి లోనయారు. "కళ ప్రజల కోసం" అన్న నిబద్ధతతో ప్రజా చైతన్యం కోసం కృషిచేసిన ప్రజానాట్యమండలితో అనుబంధం ఏర్పడింది. దానికి అధ్యక్షులుగా, గౌరవాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు నాగభూషణం. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూక అనకర్లపూడి గ్రామంలో పుట్టారు. మొన్న మార్చి19న నాటికి చుండి నాగభూషణం జన్మించి 102 ఏళ్ళు నిండాయి. నిన్న మే 5నాటికి మరణించి 29 ఏళ్ళు. అయినా "రక్త కన్నీరు నాగభూషణం"గా తెలుగునాట రంగస్థల నాటక చరిత్రలో ఈనాటికీ చిరస్మరణీయులుగా నిలిచిపోయారు.
- కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ
2 జూన్ 2024