వనజీవి రామయ్య ఆరున్నర దశాబ్దాల హరిత యాత్ర

వృక్షో రక్షతి రక్షితః నినాదంతో కోట్లాది మొక్కలు నాటిన వనజీవి పద్మశ్రీ దరిపెల్లి రామయ్య హరితయాత్ర ఆరున్నర దశాబ్దాలుగా సాగుతూనే ఉంది.రామయ్య హరిత యాత్ర గురించి..

Update: 2024-06-15 13:18 GMT

తెలతెలవారుతుండగానే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరానికి 6 కిలోమీటర్ల దూరంలోని మహబూబాబాద్ రోడ్డుపై రెడ్డిపల్లి గ్రామానికి వెళుతుంటే రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెనవేసుకొని పందిరిలా నీడ ఇస్తూ కనిపించాయి.ఈ ప్రాంతంలోని రోడ్లకు ఇరువైపులే కాదు నాగార్జునసాగర్ కాల్వలు, చెరువుల గట్లు, కొండలు, గుట్టలపై పచ్చని చెట్లతో హరిత హారంగా కనిపించాయి. ఈ పచ్చదనానికి ప్రధాన కారకుడైన పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపెల్లి రామయ్యను ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి కలిసి ఆయన వెంట హరిత యాత్రలో పాల్గొన్నారు. 80 ఏళ్ల వయసులోనూ రామయ్య ఉదయాన్నే అమితోత్సాహంతో ద్విచక్రవాహనంపై వెళుతూ పలు రకాల విత్తనాలను నాటారు. ఆరున్నర దశాబ్దాలుగా రామయ్య సాగిస్తున్న హరిత యాత్ర గురించి దరిపెల్లి రామయ్య మాటల్లోనే తెలుసుకుందాం.

ఇదీ హరిత యాత్ర దిన చర్య
‘‘ప్రతీరోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్ర లేచి ఇనుపరేకులు, కార్డుబోర్డులను గుండ్రంగా కట్ చేసి ఆకుపచ్చ రంగు వేసి ఆరాక, దానిపై ‘వృక్షో రక్షతి రక్షితః’ అంటూ నినాదం రాస్తాను. ఆరు గంటల దాకా ప్రజల్లో చైతన్యం నింపేందుకు కావాల్సిన హరిత చక్రాలను తయారు చేస్తుంటాను. అనంతరం వేపపుల్ల నోట్లో పెట్టుకొని నా ద్విచక్రవాహనంపై విత్తనాలు తీసుకొని ఉదయం 11 గంటల దాకా రోడ్లు, చెరువులు, కాల్వ గట్లు, గుట్టలపై తిరుగుతూ విత్తనాలు నాటుతుంటాను. 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి నాలుగు పత్రికలు చదువుతాను. పత్రికల్లో హరిత హారం, చెట్ల పెంపకంపై వచ్చిన కటింగులు చేసి భద్రపర్చుకుంటాను. కొంచెం విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మళ్లీ హరిత ద్విచక్ర వాహనంపై వెళుతూ రాత్రి ఆరుగంటల దాకా విత్తనాలు నాటుతుంటాను. ఇలా ప్రతీ నిత్యం విధి నిర్వహణలాగా ప్రతీ రోజూ మొక్కలు నాటుతూనే ఉంటాను.

విత్తనాల సేకరణలో వనజీవి రామయ్య, జానకి దంపతులు

వేసవికాలంలో విత్తనాల సేకరణ
వేసవికాలంలో చెట్లపై నుంచి రాలి కింద పడిన విత్తనాలను సేకరించే పని నిర్విరామంగా చేస్తుంటాను. గడచిన మూడు నెలల వేసవి కాలంలో నిద్రగన్నేరు, వేపగింజలు, తాటిపిక్కలు, ఎర్రచందనం, శ్రీగంథం విత్తనాలను సేకరించాను. వేసవి కాలంలో చెరువు, కాల్వ గట్లు, గుట్టలపై నీళ్లు పోసి వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు వీలుగా ఈ ఏడాది 5వేల గుంతలు తీసి సిద్ధంగా ఉంచాను. వర్షాలు ప్రారంభం అవుతున్నవేళ గుంతల్లో విత్తనాలు వేయడం, మొక్కలను నాటుతుండటం క్రమం తప్పని నా దినచర్య.

అమ్మ నాటిన బీర గింజలు...
నా చిన్నతనంలో ఇంటి పెరట్లో అమ్మ బీర గింజలు నాటి బీరకాయలు పండించడం చూశాను. అగ్గిపెట్టెలతో ఆడుకునే నాకు అగ్గిపుల్లలు కూడా నాటితే అవి పండుతాయని భావించి మా ఇంటి ముందు ఇంట్లోని అగ్గిపుల్లలు నాటాను. అగ్గిపెట్టె కనిపించక పోవడంతో అమ్మ అడిగితే బీర గింజల్లా భూమిలో నాటానని చెప్పాను. అగ్గిపుల్లలు మొలవవని, విత్తనాలు మొలుస్తాయని చెప్పడటంతో నాటి నుంచి వివిధ రకాల విత్తనాలను సేకరించి వాటిని నాటి మొక్కలు పెరిగితే ఆ పచ్చదనాన్ని చూసి సంతోషపడేవాడిని. అలా అమ్మ నాటిన బీర గింజలను చూసి స్ఫూర్తి పొందాను.

మామిడితోట మాలితో స్నేహం
నేను ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ఆదివారం వచ్చిందంటే బాల్యంలో నా స్నేహితులతో కలిసి రెడ్డిపల్లిలోని మామిడితోటలకు వెళ్లి రాళ్లతో కొట్టి మామిడిపండ్లు తినే వాడిని. ఒకరోజు మామిడితోటకు కాపలా ఉన్న తోటమాలి వచ్చి మమ్మల్ని మందలించారు. తోటలో రాళ్లతో కొట్టి పండ్లను రాల్చకుండా గాలికి కిందపడిన మామిడిపండ్లు తినాలని సూచించారు.తోటమాలి చెప్పడంతో తిన్న తర్వాత మిగిలిన మామిడి టెంకలను తీసుకువెళ్లి మా ఇంట్లో గుంత తీసి, పుట్టమన్ను కలిపి పూడ్చిపెట్టి చెట్లను పెంచాను. ఇలా ఎంగిలి మామిడి టెంకలను నాటితే తీయని మామిడిపండ్లు పండుతున్నాయని గుర్తించి మొక్కలు నాటడంపై మక్కువ పెరిగింది.

అటవీశాఖ ఉద్యోగులకు వనజీవి రామయ్య పాఠాలు


గురజాడ స్ఫూర్తి

‘‘సొంత లాభం కొంత మానుకు, పొరుగు వాడికి తోడుపడవోయి..దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయి...’’ అని గురజాడ అప్పారావు రాసిన కవిత చదివి దాని నుంచి స్ఫూర్తి పొంది మొక్కలు నాటడం ద్వారా పొరుగువారికి తోడ్పడాలని నిర్ణయించుకున్నాను. నాటి నుంచి ప్రతీరోజూ మొక్కలు నాటుతూ హరితయాత్రను కొనసాగిస్తున్నాను. కమ్మటి గోంగూర విత్తనాలు, శనక్కాయలు, గన్సుగడ్డలు పండించాను. మనిషిగా జన్మించినందుకు భవిష్యత్ తరాలకు గుర్తుండి పోయేలా మొక్కలు నాటి జన్మను సార్ధకం చేసుకోవాలనే ఆకాంక్షతోనే మొక్కలు నాటుతున్నాను. రెడ్డిపల్లి రోడ్డు, వైరారోడ్డు, తనికెళ్ల, వెంకటాయపాలెం, గణేశ్వరం, కర్ణగిరి, బైపాస్ రోడ్డు, పాండవుల గుట్టలు, చెరువుల గట్లు, ఎన్సెస్పీ కాల్వల గట్లపై మొక్కలు నాటాను. విత్తనాలు చల్లడంతో అవి మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి.

80 ఏళ్ల వయసులోనూ...
ఎనభై ఏళ్ల వయసులోనూ అవిశ్రాంతంగా ప్రతీ రోజూ మొక్కలు నాటుతూ హరిత యాత్రను కొనసాగిస్తున్నాను. నా గుండెకు స్టంట్ వేసినా మొక్కలు నాటే నా దినచర్యకు బ్రేక్ ఇవ్వలేదు. మొక్కలు నాటేందుకు ఎడ్లబండిపై వెళుతుంటే కిందపడి కాలు విరిగింది. మరోసారి రోడ్డు పక్కన మొక్కలు నాటుతుండగా బైక్ వచ్చి ఢీ కొనడంతో మరో కాలు విరిగింది. రెండు కాళ్లకు కట్టు కట్టించుకొని మానిన తర్వాత మళ్లీ మొక్కలు నాటుతూనే ఉన్నాను. అనారోగ్యం, ప్రమాదాలు నా హరితయాత్రకు ఆటంకం కాదని నిరూపించాను. నా హరిత యాత్రకు నా భార్య జానకి సహకారం అందించి నాకు తోడునీడగా నిలిచింది.

నా సేవకు ప్రభుత్వ ప్రోత్సాహం
నేను గతంలో సైకిలుపై తిరుగుతూ నాటుతున్న మొక్కల గురించి తెలుసుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు స్పందించి రాష్ట్ర అటవీశాఖ నిధులతో నాకు మోపెడు కొనిచ్చి నెలకు 4వేలరూపాయలు ఇచ్చారు, ఆపై నెలకు 8 వేలరూపాయలకు పెంచారు. ప్రస్థుతం తెలంగాణ అటటవీ శాఖ హరిత నిధి నుంచి నాకు నెలకు రూ.40వేలు ఇస్తున్నారు. నాకు ఇచ్చే మొత్తాన్ని పెంచితే కొన్ని రకాల విత్తనాలు కొని నాటుతుంటాను. దీంతోపాటు కొందరు స్వచ్ఛంద సేవకులు ఇచ్చే విరాళాలను మొక్కలు నాటేందుకే వెచ్చిస్తుంటాను.

అటవీశాఖ ఉద్యోగులు, విద్యార్థులకు రామయ్య పాఠాలు
అటవీ కళాశాలతో పాటు అటవీ శాఖ ఉద్యోగులకు, విద్యార్థులకు హరిత పాఠాలు చెబుతుంటాను. నన్ను కలిసేందుకు వచ్చే స్వచ్ఛంద సేవకులు విద్యార్థులు, ఫారెస్ట్ అకాడమి వాళ్లకు మొక్కల పెంపకం గురించి నా అనుభవాలను చెబుతుంటాను. కోట్లాది మొక్కలు నాటినా, నేను చేసింది చాలా తక్కువని, చేయాల్సింది చాలా ఉంది.

అడవిలో విత్తనాలు చల్లుతున్న రామయ్య, విద్యార్థులు


 ఆకలి తీరే చెట్ల పెంపకం

నీడతోపాటు పండ్లు, ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకం చేపట్టాను. హరిత హారం కింద గంగరేవు, ఖర్జూరం,సీతాఫలాలు, మామిడి మొక్కల నాటాను. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే ఎర్రచందనం, శ్రీగంథం చెట్లు పెంచాను. నేను వేసిన ఎర్రచందనం చెట్ల ద్వారా ప్రభుత్వానికి 20 టన్నుల ఎర్రచందనం సమకూరింది. గానుగ, గుల్ మొహర్, వేప, తుమ్మ చెట్లు ఇలా ఎన్నో రకాల మొక్కలు నాటాను.
చెట్ల ఆకులతో వైద్యం
ప్రకృతిలో లభించే చెట్లు పండ్లు, ఆక్సిజన్ అందించడమే కాకుండా వాటి ఆకులు, వాటి పసర్లతోనే వైద్యం చేయవచ్చని నిరూపించాను. చేతులపై చర్మవ్యాధులు వస్తే గుండగరగ ఆకు పసరు రాసేవాడిని. చెవిపోటుకు సబ్జాకు చెట్ల పసరు పోసే వాడిని, దగ్గు నివారణకు కస్తూరి తుమ్మకాయ వాడేవాడిని. కడుపులో నట్టల నివారణకు మోదుమడగ ఆకు పసరు వాడే వాడిని. ఏ జబ్బు చేసినా చెట్ల ఆకులు, పసర్లతోనే నయమయ్యేది.

వేడుక ఏదైనా మొక్కలే బహుమతి
వేడుక ఏదైనా నేను వచ్చారంటే చాలు మొక్కలనే బహుమతిగా ఇస్తూ స్ఫూర్తి అందిస్తున్నాను. మా కుటుంబసభ్యుల శుభలేఖల్లోనూ మొక్కలు నాటాలని పిలుపు ఇస్తూ ఫొటోలు ప్రచురించాను. పెళ్లి అయినా, వేడుక ఏదైనా మొక్కలు ఇచ్చి వాటిని నాటాలని కోరుతుంటాను. పెళ్లి పిలుపు వస్తే స్నేహితులు, బంధువులకు వధూవరులకు మొక్కలను బహుమతిగా ఇస్తుంటాను.

మడగాస్కర్ బాహుబా వృక్షాల పెంపకంతో తీరనున్న నీటి సమస్య
మడగాస్కర్ దేశంలోని బాహుబా వృక్షాల పెంపకంతో నీటి సమస్య తీర్చవచ్చు. ఒక్కో బాహుబా చెట్టు కాండంలో లక్షా ఇరవై వేల లీటర్ల నీరు నిల్వ ఉంటుంది. నీటి ఎద్దడిని తీర్చే బాహుబా వృక్సాలను మడగాస్కర్ నుంచి తెప్పించి మన తెలంగాణలో నాటితే బాగుంటుందని అటవీశాఖ అధికారులకు సూచించాను.

కరెన్సీ నోట్లపై మొక్కలు నాటే చిత్రం ముద్రించాలి
దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లపై మొక్కలు నాటే చిత్రాన్ని ప్రచురించడం ద్వారా మొక్కల ప్రాధాన్యాన్ని పిల్లలకు తెలియజేయాలని కేంద్రప్రభుత్వానికి సూచిస్తున్నాను. వేసవికాలంలో ఎండలు మండుతున్న నేపథ్యంలో మొక్కలను విరివిగా పెంచి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం మన అందరిపై ఉంది. ఎన్నికల్లో పట్టుకున్న డబ్బును హరితనిధికి ఇవ్వాలని సూచించాను.

చివరి శ్వాస వరకు మొక్కలు నాటుతా...
నా చివరి శ్వాస ఉన్నంతవరకు మొక్కలు నాటుతూనే ఉంటాను. ఇప్పటికే పల్లెసృజన ప్రతిపాదనలు చూసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని సిఫారసు చేశారు. నేను కోట్లాది సంఖ్యలో మొక్కలు నాటి నోబెల్ బహుమతి ద్వారా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందాలనుకుంటున్నాను. ఇదే నా చివరి ఆశ. నేను సచ్చినా నా పేరు చిరస్థాయిగా ఉండాలంటే మొక్కలు నాటడం ద్వారా సేవ చేయాలనేది నా లక్ష్యం’’ అంటూ ముగించారు వనజీవి దరిపెల్లి రామయ్య తన హరిత యాత్ర.

వనజీవి రామయ్య మ్యూజియం
మా తాతయ్య పద్మశ్రీ వనజీవి దరిపెల్లి రామయ్య సాగిస్తున్న హరిత యాత్ర గురించి ఆయన సేకరించిన అరుదైన విత్తనాలు, మొక్కల పెంపకంపై సమాచారం, మెమోంటోలు, పద్మశ్రీ పురస్కారం, విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకు తయారు చేసిన వృక్షో రక్షతి రక్షితః చక్రాలను భద్రపర్చేందుకు త్వరలో వనజీవి రామయ్య మ్యూజియంను ఏర్పాటు చేస్తానని ఆయన మనవడు, క్రికెట్ క్రీడాకారుడైన దరిపెల్లి శశికుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.మొక్కల పెంపకంపై ప్రజల్లో రామయ్య స్ఫూర్తి నింపారని మరో హరిత ప్రేమికుడు  సంపత్ చెప్పారు.







Tags:    

Similar News