పీ4 "బలవంతపు బ్రాహ్మణార్ధం" కారాదు!!
అమరావతి, పోలవరమే కూటమి అజెండా;
By : The Federal
Update: 2025-08-14 04:54 GMT
(ఎంవీ రామారావు)
చంద్రబాబు నాయుడు ఏపీకి ముఖ్యమంత్రి అవుతున్నాడంటే రాష్ట్ర ప్రజలు మళ్లీ మంచిరోజులు వస్తాయని సంతోషించారు. విజన్ ఉన్న నాయకుడు, భారత్ దేశంలో మనరాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచుతారని ఆశించారు. అలాగే అమరావతిని అంతర్జాతీయంగా ప్రధమ స్థానంలో నిలబెడతాడని భావించారు. కాని ఆయన ఇచ్చిన హామీలు అమలులో ప్రాధాన్యం మారడం బాధ కలిగిస్తున్నది. ఆర్ధికంగా రాష్ట్రం పీకల లోతు కష్టాల్లో ఉన్నా సంవత్సరం గడిచేసరికి కొంత నిలదొక్కుకున్నా ఇంకా కుదుటపడలేదు.
కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండోసారి సీఎం అయిన తరువాత ఆయన ప్రధానంగా అమరావతి, పోలవరం లోనై దృష్టి పెడతారని అనుకున్నారు. కాని ఆయన ఇప్పుడు పీ4 నినాదం పట్టుకున్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా పాటుపడడం నిజంగా మంచి విషయమే. దాన్ని అభినందించాల్సిన విషయమే. కాని దాన్ని ఐదేళ్లలో రూపుమాపుతాననడం ఎంతవరకు సాధ్యమనేది పాలకులు ఆలోచించాలి. ఇందిరాగాంధీ కూడా గరీభ్ హటావో నినాదంతో పేదలను ఆకట్టుకుంది. కాని అది ఎంతవరకు సాధ్యమయిందో గత అనుభవాలే నిదర్శనం. చివరకు అది ఎన్నికల నినాదంగా మిగిలింది.
అలాగే చంద్రబాబు కూడా పేదరికాన్ని దత్తత మంత్రం ద్వారా మాయం చేయాలని భావిస్తున్నారు. దత్తత కోసం పారిశ్రామిక వేత్తలు,వ్యాపారులను, చివరకు రైతులను కోరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి కోరుతున్నారు కాబట్టి ఆయన ముందు సరే అన్నా ఆచరణలో వారు ఎంతవరకూ చిత్తశుద్ధి తో పూర్తి చేస్తారనేది అనుమానమే. "బలవంతపు బ్రాహ్మణార్ధం" అనే సామెత ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. దత్తత మనఃపూర్వకంగా చేయాలి తప్ప బలవంతంగా చేయించరాదు. అది స్వచ్ఛందంగా కలగాలి.
దత్తత బదులు ఉపాధి కల్పించే పథకాలు రూపొందిస్తే పేదరికం తొందరగా పోతుంది. అది పాలకులకు తెలియని విషయం కాదు. ఉపాధి కల్పించే పరిశ్రమలను, సంస్థలను ప్రొత్సహించాలి. స్కిల్ డెవలప్ చేసే శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలి. రుణాలు విరివిగా ఇచ్చి సొంత వ్యాపారాలు పెట్టుకునే అవకాశాలు కల్పించాలి. ఔత్సాహక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి.
కూటమి ప్రధాన లక్ష్యం అమరావతి, అభివృద్ధి గా ప్రజలు ఓటువేసారు. రాజధానికి కేంద్రం రూ.15వేల కోట్లు కేటాయించడం. అందుకు సీఎం ఎంతగా ప్రయత్నంచేసారో మర్చిపోలేం. కాని జంగిల్ క్లియరెన్స్ అయి ఇన్నిరోజులైనా పనులు ప్రారంభించలేదు. గతంలో భూములిచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించకుండా మళ్లీ భూములు సేకరించాలని నిర్ణయం కూడా వివాదమైంది. దాంతో తాత్కాలికంగా వాయిదా వేసారు.
సింగపూర్ లేఅవుట్లు ప్రకారం రైతులకు ఇచ్చిన ప్లాట్స్ విభజించ కూడదనే సీఆర్డీఏ నిబంధన ఉంది. విభజిస్తే రాజధాని అందం పోతుందని నిరాకరిస్తున్నారు.
రైతులు ఆనాడు ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదు. తమకు ఉన్న ప్లాట్ లో కొంత అమ్మి మిగతాది ఉంచుకోవాలని ఆశించే రైతులకు ఆశాభంగం కలుగుతున్నది. దాన్ని సవరించి రైతులకు వెసులుబాటు కలిగించాలి. అలాగే వారికి ప్లాట్స్ కేటాయించి తొమ్మిదేళ్ళయినా మౌలిక సదుపాయాలు కల్పించలేదు. రోడ్లు, ఇతర సదుపాయాలు ఇంతవరకూ కల్పించలేదు. జగన్ పాలన ఐదేళ్లు ముగిసినా, రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా, ప్రధానితో ప్రారంభం చేయించినా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.
ఇంకా కేవలం ఎన్నికలకు నాలుగేళ్లు మాత్రమే ఉంది. అమరావతి కనీసం మౌలిక సదుపాయాలు కల్పన పూర్తి కావాలి. ఇప్పటీకే సగం పూర్తి అయిన భవనాలు శిధిలావస్థకు చేరుతున్నాయి. ఇలాగే కాలం గడుపుతుంటే మరింత ఆర్ధిక భారం పడే అవకాశం ఉంది. పోలవరం 70 శాతం పూర్తి అయ్యిందని చెబుతున్నారు. దాన్ని కూడా యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. తాను సంక్షేమంతో పాటు అభివృద్ధి చూపిస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. అది కనపడాలంటే రాజధాని నిర్మాణం కావాలి. పరిశ్రమలు, సంస్థలు రావాలి. ఆదాయాలు పెరగాలి. అందుకు మౌలిక సదుపాయాలు రాజధాని ప్రాంతంలో జెట్ స్పీడ్ తో జరగాలి. కాని ఇంతవరకూ ప్రారంభమే కాలేదు.
తెలంగాణ లో కేసీఆర్ చేసిన తప్పులనే ఆంధ్ర పాలకులు చేస్తున్నారు. కేసీఆర్ హైదరాబాద్ మీద దృష్టి పెట్టి మిగతా రాష్ట్రాన్ని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. కేవలం రాజధాని మీద దృష్టి పెట్టితే భవిష్యత్తులో రెండో నగరం ఉండదు. విశాఖపట్టణం, రాజమండ్రి, కర్నూలు, అనంతపురాలను అభివృద్ధి చేయాలి.
విజయవాడ, గుంటూరులను జంట నగరాలుగా అమరావతికి అనుబంధంగా పెద్ద ఎత్తున అభివృద్ధికి నిధులు కల్పించాలి. రాజధాని నిర్మాణం చకచకా జరిగితే ఉపాధి మార్గాలు కూడా ఊహించని ఫలితాలు ఇస్తాయి.
వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి వికేంద్రీకరణ అయితే ఫలాలు సమానంగా అన్ని ప్రాంతాల వారికి అందుతాయి.
గ్రామీణంలో ఉపాధి మార్గాలు పెంచాలి. వ్యవసాయ ఉత్పత్తి పెరిగే వంగడాలను అభివృద్ధి చేయాలి. త్వరలో ఎకరానికి 100 బస్తాలు ఇచ్చే వారి వంగడం త్వరలో భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. చైనాలో ఎకరానికి70 బస్తాలు పండే వంగడాలు అభివృద్ధి చేసారని, దాన్ని అధిగమించాలని భారతీయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావడంలేని నేటి రోజుల్లో ఇది శుభవార్తే. భూమి ఉన్న రైతులు గిట్టుబాటు కాక కౌలు రైతులను ఆశ్రయిస్తున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే రైతు పంటకు కనీసంమద్దతు ధర ఇవ్వాలి. ఎన్ని భరోసాలు, సుఖీభవ కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేదు. అవి తాత్కాలిక ప్రయోజనం మాత్రమే ఇస్తాయి.
ఉత్పత్తి పెంచే వంగడాలు, ప్రభుత్వ మార్కెటింగ్, క్రాప్ బీమా, గిట్టుబాటు ధర పై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అలాగే వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ప్రకటించాలి. రైతులకు ఆదాయాలు పెరిగే మార్గాలు అన్వేషించాలి. అర్బన్ తో పాటు రూరల్ అభివృద్ధి కూడా జంట గుర్రాలలాగా పరుగెత్తిస్తే ప్రజలతో పాటు ప్రభుత్వాలకూ ఉపాధి, ఆదాయ ఫలాలు లభిస్తాయి. అందుకు విజన్ ఉన్న చంద్రబాబు లాంటి ప్రభుత్వాధినేత సారధిగా ఉండాలి. కాని ఆయన అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా ప్రభుత్వం పై పట్టు రాలేదనే విమర్శలు వస్తున్నాయి. గత పాలనలో అధికారుల అతి ఇంకా తగ్గలేదని, ఎన్ని చర్యలు తీసుకున్నా గాడిలో పడలేదని ఆరోపణలు ఉన్నాయి.
ఓబులాపురం కేసులో ఉన్నతాధికారి చేసిన అతికి ఇంకా కోర్టులు చుట్టూ తిరగడం తప్పలేదు. వారి అనుభవాలు చూసైనా ఇప్పటి అధికారులు తమ పరిధి దాటి వెళ్లరాదనే వాస్తవాలు తెలుసుకోవాలి. రాజకీయనాయకులు తాత్కాలికం, తామే శాశ్వతమనే విషయం గుర్తించుకుని ప్రభుత్వానికి,ప్రజలకు మంచి సలహాలు,సేవ చేస్తే ఆ ప్రభుత్వాలు, అధికారులు చిరకాలం గుర్తుండిపోతారు. అలాగే పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వం చేపట్టే మంచి పనులకు చేయూత ఇవ్వాలి. తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుంటే భవిష్యత్తు లో వ్యతిరేక ఫలితాలతో పాటు పార్టీకి కీడు చేస్తుంది. అధికారులు, నాయకులు పదికాలాల పాటు ప్రజల హృదయాలలో ఉండేలా నిర్ణయాలు తీసుకున్నప్పుడే అది ఆదర్శ రాష్ట్రంగా ఎదుగుతుంది.
(రచయిత- సీనియర్ జర్నలిస్టు, సామాజిక విశ్లేషకులు)