పెయింటింగ్స్ లో హైదరాబాద్ సరస్సులు
హైదరాబాద్‌లో జలకళతో కూడిన సరస్సుల పాత పెయింటింగులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భవనాల ఆక్రమణలను ‘హైడ్రా’ కూల్చివేతల నేపథ్యంలో ఈ పాత పెయింటింగులు వెలుగుచూశాయి.
By : Shaik Saleem
Update: 2024-09-05 00:43 GMT
హైదరాబాద్ నగరంలో జలకళను సంతరించుకొని అత్యంత సుందరంగా ఉన్న విశాలమైన నాటి మంచినీటి సరస్సుల చిత్రాలను 1879వ సంవత్సరంలో యూరోపియన్ చిత్రకారుడు టి.షిమిడిటిన్కుం కుంచె నుంచి జాలువారాయి.
- కాలక్రమంలో మంచినీటి చెరువులు మురుగునీటి కాసారాలుగా మారడంతోపాటు ఆక్రమణలతో సరస్సుల విస్తీర్ణం తగ్గడంతో పాటు వాటి ప్రాభవం కోల్పోయాయి. సరస్సు ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా భవనాలు వెలిశాయి.
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) చెరువుల్లోని అక్రమ భవనాలను బుల్డోజర్లతో కూల్చివేస్తుంది.
- ‘హైడ్రా’ కూల్చివేతల డ్రైవ్ మధ్య హైదరాబాద్ సరస్సుల పాత పెయింటింగ్‌లను ఆర్కిటెక్ట్, హెరిటేజ్ అన్వేషకుడు ఆసిఫ్ అలీ ఖాన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో హైదరాబాద్ పాత సరస్సుల పెయింటింగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కనువిందు చేస్తున్న 1879 నాటి సరస్సుల పెయింటింగులు
1879వ సంవత్సరంలో యూరోపియన్ చిత్రకారుడు టి.షిమిడిటిన్ గీసిన హైదరాబాద్ నగరంలోని నాలుగు సరస్సుల పెయింటింగ్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.నాటి సరస్సుల అందమైన పెయింటింగ్స్ ను ఆసిఫ్ అలీఖాన్ సీఎం అనుముల రేవంత్ రెడ్డికి ఎక్స్ ద్వారా షేర్ చేశారు.
అందాల హుసేన్ సాగర్ పెయింటింగ్
హైదరాబాద్ నగరంలో 1562వ సంవత్సరంలో నాటి హైదరాబాద్ పాలకుడు ఇబ్రహీం కులీకుతుబ్ షా హుసేన్ సాగర్ సరస్సును తవ్వించారు.నాటి హుసేన్ సాగర్ పెయింటింగ్ చూస్తే చాలు మనసును పరవశింపజేస్తోంది. పచ్చని చెట్లు, రాళ్లు, గుట్టలతో జలకళ ఉట్టిపడేలా ఉన్న నాటి హుసేన్ సాగర్ నేడు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని మురుగునీరు చేరి కాలుష్య కాసారంగా మారింది.
మీరాలం ట్యాంక్ అందాలు
ప్రస్థుతం పాత బస్తీగా పేరొందిన హైదరాబాద్ లో 1806వ సంవత్సరంలో నిజాం పాలకుడైన మీర్ ఆలం సరస్సును నిర్మించారు. గుట్టల మధ్య నిర్మించిన సరస్సులో పడవలో విహారం చేస్తున్న చిత్రాన్ని 1879వ సంవత్సరంలో యూరోపియన్ చిత్రకారుడు టి.షిమిడిటిన్ గీశారు. మీరాలం ట్యాంక్ ఎగువన సూఫీ గురువు మీర్ మహమూద్ టూంబ్ ఉంది. ఈ చిత్రం ఎక్స్ లో నగర వాసులను ఆకట్టుకుంటోంది.
సరూర్ నగర్ సరస్సు అందాలు...
1626 వ సంవత్సరంలో సుల్తాన్ ముహమ్మద్ కులీ కోట గోడ పక్కన మసీదు, పచ్చని చెట్లు, గుట్టల నడుమ సరూర్ నగర్ సరస్సును నిర్మించారు. నాటి సరూర్ నగర్ సరస్సును 1879వ సంవత్సరంలో పెయింటింగ్ గీశారు. నాటి పురాతన పెయింటింగును ఆసిఫ్ అలీ ఖాన్ ఎక్స్ లో పోస్టు చేశారు.
నాటి మీర్ జుమ్లా ట్యాంక్...నేటి తలాబ్ కట్ట
నాటి నిజాం ఆర్మీ జనరల్ మీర్ జుమ్లా పేరిట ట్యాంక్ ను 1879వ సంవత్సరంలో పెయింటింగ్ గీశారు. నాటి మీర్ జుమ్లా ట్యాంక్...నేడు తలాబ్ కట్టగా మారింది. చెట్ల మధ్య కట్ట కింద ఉన్న సరస్సును నాటి పెయింటింగులో సుందరంగా కనిపిస్తోంది. 1914వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో మూసీ నది, సరస్సులు, చెరువులు, నాలాలు మొదలైన వాటిని చూపించారు. 1908 మూసీనదీ వరదల విధ్వంసం తర్వాత హైదరాబాద్ చిత్రపటాన్ని రూపొందించారు.