వాసిరెడ్డి సీతాదేవి మహత్తర నవల.. మట్టిమనిషి నాటక ప్రదర్శన

వాసిరెడ్డి సీతాదేవి రచనల్లోని మహత్తరమైన నాటక ప్రదర్శ ‘మట్టి మనిషి’ ఒకటి. అసలు అందులో ఏముందంటే..

Update: 2024-04-23 15:44 GMT

ఆధునిక యుగపు మూడుతరాల జీవిత క్రమ పరిణామ కథాకథనాల వచన మహా కావ్యం మట్టిమనిషి నవల. పల్లెటూరి రైతుకుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వాసిరెడ్డి సీతాదేవి 1970లో రూపొందించిన నవల.

మట్టిని నమ్ముకున్న ఒక తరానికి చెందిన మనిషి సాంబయ్య జీవన పోరాట కథ. మానవ బలహీనత లకు వ్యవస్థాగత స్వభావం తోడై వ్యక్తిత్వాలను దెబ్బ తీయడం, కుటుంబాలు కూలిపోవడం, దెబ్బకు దెబ్బ వ్యూహ ప్రతివ్యూహాలతో పతనమైన తరానికి ప్రతినిధులు సాంబయ్య కోడలు వరూధిని, ఆమెను వంచించిన రామనాథం బాబు, మరొక మోసకారి కనకయ్య. సాంబయ్య మనుమణ్ణి తిరిగి నిలబట్టేందుకు చేసే ప్రయత్నంలో పెత్తందార్ల అక్రమాలపై మనుమడు రవి తిరుగుబాటు. ఇలా ఆంధ్ర పత్రికలో ధారావాహికగా వచ్చిన రచన. 1972 మొదటగా పుస్తక రూపం తీసుకొంది.

తెలుగు సాహిత్యంలో అదో సంచలనం. పాఠకుల, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నన్నయ నుండి నేటి వరకు వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో వచ్చిన మహోన్నత రచనల సరసన 13వ రచనగా (మాస్టర్ పీసెస్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ కాలమ్ లో) స్థానం పొందిన గౌరవాన్ని అందుకొంది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 14 భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించింది. 1995 నుండి 2000 వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎంఏ ఫైనల్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది.

"అసహజతకూ ఆదర్శానికి, కాల్పనికతకూ అవకాశం ఉన్న వస్తువులో వాటి ప్రభావానికి లొంగక, సామాజిక వాస్తవ దృష్టితో ఒక అద్భుతమైన నవలను తెలుగు నవల పుట్టిన తర్వాత సరిగ్గా వందేళ్ళకు సీతా దేవి గారు అందించారు. "మృణాళిని" పురాణ లక్షణాలను నవీకరిస్తే మట్టిమనిషి ఆధునిక మహా పురాణ మవుతుందని (కె.ఎన్.మల్లీశ్వరి) అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ఇలాంటి ఆధునిక వచన మహా కావ్యాన్ని సుప్రసిద్ధ నాటక రచయిత వల్లూరు శివప్రసాద్ నాటకీకరించారు. ప్రసిద్ధ బహుభాషా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఈ నాటకం ఈరోజు 24 ఏప్రిల్ 2024 బుధవారం సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రదర్శితం అవుతుంది. వాసిరెడ్డి సీతాదేవి మెమోరియల్ ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందించగా రసరంజని ఆధ్వర్యంలో నిభా థియేటర్ ఎన్సెంబుల్ సమర్పిస్తోంది.

-కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ

Tags:    

Similar News