ఒక డాక్టర్ తన ఊరి పేద పిల్లలకు ఇచ్చిన కానుక ఈ ఇంటర్నేషనల్ స్కూల్

ఆ ఊర్లో ఒక డాక్టర్ అంతర్జాతీయ స్థాయి స్కూల్‌ని నిర్మించాడు. అది బిలియనీర్ల బిడ్డల కోసం కాదు. కూలీనాలీ చేసుకునే పేదల పిల్లల కోసం. ఎవరా డాక్టర్, ఏమా కథ...

By :  Admin
Update: 2024-04-21 04:09 GMT

(బి.గోపాలకృష్ణమ్మ)


ఆయన పేరు డాక్టర్ ప్రదీఫ్ సేధీ... బాగా పేరున్న హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సర్జన్. బాగా డబ్బులున్నాయి. 

ఒడిశా రాష్ట్రంలోని బెరునపడి గ్రామం లో ఆయన తన పెద్ద మనసుతో, డబ్బులతో ఒక అద్భుతం సృష్టించారు. ఉత్కళ్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్  పేరుతో ఆయన ఆ పల్లెటూర్లో  అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలతో ఒక్క  స్కూల్ కట్టారు.  ఇది కోటీశ్వరుల పిల్లలకు నాలుగు ముక్కలు నేర్పికోట్లు దండుకునేందుకు కాదు. అక్కడి పేదపిల్లలకు ఆయన ఇచ్చిన గిఫ్ట్‌. ఆ ఊరి పిల్లలకు మంచి చదువు అందాలని, వాళ్లంతా రేపు మనసున్న మానవులు కావాలన్నది ఆయన కోరిక. బెరునపడి గ్రామాన్నే ఆయన ఎందుకు ఎంచుకున్నాడు... దానిక వెనక  వేదనామయ కథ ఉంది. అదేంటంటే...


Dr Pradeep Sethi


 

2008లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన సేథీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ టెక్నిక్‌లలో శిక్షణ పొందారు. కొద్దికాలంలోనే ఆయన కెరీర్ ఉచ్ఛ దిశకు చేరుకుంది. కానీ ఆయన తన మూలాలను మర్చిపోలేదు. వృత్తిపరంగా ఉన్నత శిఖరాలు చేరుకుంటుండగా దుబాయ్‌లో ఒక క్లినిక్ పెట్టే అవకాశం, స్టెమ్ సెల్ ప్రాజెక్టును నెలకొల్పే అవకాశం వెదుక్కుంటూ వచ్చింది కానీ ఆయన పూర్తిగా బిన్నమైన మార్గం ఎంచుకున్నారు. తన బాల్యంలో తాను పొందలేకపోయిన విద్యావకాశాలను తన సొంత రాష్ట్రమైన ఒడిశాలో పిల్లలు, యువతకు అందజేయాలని నిర్మయించుకున్నారు. దాని ఫలితమే ఉత్కళ్ గౌరవ ఇంటర్నేషనల్ స్కూల్.




 

ఈ రోజు ఆయన ఆ ఊరిప్రజలకు దేవతలాంటి వ్యక్తి అయిపోయాడు. కారణం ఆ గ్రామంలోని ప్రతి కుటుంబానికి చెందిన పిల్లలు ఈయన స్థాపించిన ఇంటర్నేషనల్ స్కూల్‌లోనే చదువుకుంటున్నారు. నిరుపేద జీవితం గడిపిన తాను ఇవాళ ఈ స్థానంలోకి వస్తానని కల్లో కూడా అనుకోలేదని వినమ్రంగా చెబుతారీ డాక్టర్. నేను ఎదుగుతున్న సమయంలో మా రాష్ట్రం కానీ, మా ఊరు కానీ సంపదను ఎరుగవు. మౌలిక అవసరాలు, నాగరికత వంటి అంశాల్లో ఎంతో వెనుకబడి ఉండేవి. కానీ నమ్రత కలిగిన వ్యక్తుల మధ్య నేను పెరిగాను. వాళ్ల రుణం తీర్చుకునే సమయం వచ్చిందంటారు.


మరి ఈ డాక్టర్ గడిపిన జీవితం సామాన్యమైంది కాదు. తిండి లేకుండా రోజుల కొద్ది గడిపిన కుటుంబం తనది. చిన్నప్పుడు ఒక జత బట్టలను వారాల తరబడి దరించేవాడు. పని దొరికినప్పుడు స్కూల్‌కి వెంటనే డుమ్మా కొట్టేవాడు. మేం పని చేయకపోతే ఆవులకు పచ్చిక ఎవరు తెస్తారు. పొలాల్లో కలుపు ఎవరు పీకేస్తారు అని తన పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కించిత్ బాధపడని ఈ డాక్టర్ తన శక్తి మొత్తాన్ని చదువుపై పెట్టాడు.

ఇదే ఒకప్పుడు డాక్టర్ ప్రదీప్ సేధీకి నీడనిచ్చిన ఇల్లు


 మంచి జీతాన్నిచ్చే ప్రభుత్వోద్యోగాన్ని సాధించాలని తన మనసులో ఉన్నప్పటికీ, డాక్టర్ సేథీ బిన్నమైన కల కన్నారు. ఒడిశాలోని పేద పిల్లల కలలు నెరవెర్చే ప్రాజెక్టు ఉత్కళ్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఆయన ఎంత గొప్పదంటే ఆయన స్థాపించిన ఈ అంతర్జాతీయ పాఠశాలలో చదివే పిల్లలకు ఫీజులు లేవు. డాక్టర్ కావాలనే తన కల కోసం, మెడికల్ ఫీజులకు కావలసిన డబ్బుకోసం ఉన్న ఆస్తులన్నింటినీ అమ్ముకోవడం ద్వారా తన కుటుంబం పడ్డ బాధలను ఆయన మర్చిపోలేదు. కష్టాలెదురైనప్పుడు చలించకుండా ఉండటాన్ని తన బాల్యం నేర్పింది.




 



తీవ్ర కష్టాల నడుమే కాసింత అదృష్టం తలుపు తడుపుతుంటారు కదా. పైసా దొరకని సమయంలో తన విద్య పూర్తి చేసుకునేందుకు ఆ గ్రామంలోని కొందరు వ్యక్తులు సాయం చేస్తామని ముందుకొచ్చారు. వారిచ్చిన మొత్తంతో కుటుంబ కష్టాలు కాస్త తగ్గాయి. వారిచ్చిన స్కాలర్ షిప్పుతో నెలకు రూ. 1300లు వచ్చేవి. దీన్నే నేను పుస్తకాలు, మెస్ పీజులు వంటి వాటికి ఉపయోగించుకునేవాడిని అని డాక్టర్ సేధి చెప్పారు. ఆ సమయంలో కొన్న ఒక పుస్తకం ఆయన జీవితాన్నే మార్చివేసింది. ఆ పుస్తకం పేరు పరమహింస యోగానంద రాసిన 'ఆటోబయోగ్రపీ ఆఫ్ ఎ యోగి'. ఈ పుస్తకంలో రోజువారీగా ధ్యానం చేయడం ఎలాగో చెప్పడమే కాదు, చిన్న చిన్న పనులను అసాధారణంగా చేయడం ఎలాగో కూడా చెప్పారాయన. ప్రతి వ్యక్తికీ జీవితంలో ప్రత్యేక ప్రయోజనం ఉంటుందిని ఈ పుస్తకం నొక్కి చెప్పింది. అప్పుడే నేనేంటి అనే ప్రశ్న నాలో మొదలైంది అంటారు డాక్టర్ సేథీ



 

ఈ క్రమంలోనే ఉత్కళ్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పడానికి ముందుగా తన గ్రామంలో 2016లో ఒక కోచింగ్ సెంటర్ ప్రారంభించారాయన. వ్యాధిగ్రస్తుడైన తన తండ్రి కోసం నిర్మించిన ఇంటినే తండ్రి మరణానంతరం కోచింగ్ సెంటర్‌గా మార్చారు.

ఇంగ్లిష్, మ్యాథ్స్ నేర్చుకోవడానికి గ్రామంలోని పిల్లలు ఒక్కరొక్కరుగా రావడం మొదలెట్టారు. వీరికోసం బయటనుంచి టీచర్లను రప్పించి వారికోసం వసతి సౌకర్యం కూడా కల్పించారు. 2016 లో కోచింగ్ సెంటర్ ప్రారంభమయ్యాక 2023 మార్చినాటికి 300 మంది పిల్లలు ఈ సెంటర్‌లో చేరారు. కోచింగ్ సెంటరే ఇంతమందిని ప్రభావితం చేసినప్పుడు ఒక స్కూల్ పెట్టి వేలాది మందిని ఎందుకు ప్రభావితం చేయకూడదు అనిపించిందాయనకు. అదే ఉత్కల్ గౌరవ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపనకు నాంది. ఇక్కడి విద్యార్థులకు వ్యవసాయం, బిజినెస్, పరిశ్రమ వంటి అంశాల్లో చక్కటి విద్య అందించంపై శ్రద్దపెట్టారు. పిల్లలకు ఇక్కడ యోగా, డ్యాన్స్, ఆర్ట్ వంటివి కూడా నేర్పుతారు.

అవకాశమే అదృష్టం
వెనుకబడిన వర్గాల పిల్లలకు, ముందంజలో ఉన్న పిల్లలకు తేడా ఏంటంటే అవకాశం లభించడం, లభించకపోవడమే అని డాక్టర్ సేధీ చెప్పారు. అత్యుత్తమ పాఠశాల, రాజీపడని కరిక్యులమ్ ఇలాంటి అవకాశాన్నే అందిస్తాయి. ఈ అత్యున్నత సౌకర్యాలున్న పాఠశాలలో పేదపిల్లలలోని నైపుణ్యాలను, ప్రతిభను సానపట్టడం ద్వారా వారికి తోడ్పాడునందిస్తున్నారు. ఆ గ్రామంలో ప్రస్తుతం 450 పిల్లలు ఈ స్కూల్లో చేరారు. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 2 వేలకు పెంచడానికి పథకాలు రచిస్తున్నామని డాక్టర్ సేధీ చెప్పారు.



 



అయితే పేదపిల్లలకు మెరుగైన విద్యావకాశాలను కలిగించడానికి తాను చేసిన ప్రయాణం ఆర్థిక వనరులు లేకుండా సాధ్యమయ్యేవి కాదని డాక్టర్ సేధీ చెబుతారు. కోవిడ్ కాలంలో కోట్లాది వ్యాక్సిన్ లను తయారు చేసి ప్రపంచానికి అందించిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అధార్ పూనవల్లా వంటి ప్రముఖులు ఎంతోమంది అందించిన విరాళలు తన కలను సాఫల్యం చేశాయని వినమ్రంగా చెప్పారు. అమెరికా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలకు చెందిన ప్రొఫెసర్లను పిలిపించి లెక్చర్లు ఇస్తున్నందున పిల్లలకు తమ పరిసరాలకు అవతల ఉన్న విశేషాలను కూడా తెలుసుకునే అవకాశం లభిస్తోందని చెప్పారు.

పేదవాడిగా పుట్టడమే భాగ్యం




 

సిరిసంపదలతో పుట్టిన వారే గొప్ప పనులను చేయగలుగుతారని ప్రజల్లో ఉన్న భావన నిజం కాదని ఈ విద్యాదానతత్పరుడు చెబుతారు. నా ఉద్దేశంలో పేదవాడిగా పుట్టడమే మహా భాగ్యం. ఎందుకంటే ఆ పేదరికం నా మూలం కానట్లయితే, నేను ఇంత పెద్ద కలను సాఫల్యం చేసుకునేవాడిని కాదు కదా అంటారాయన. నిజంగానే ఆయన స్థాపించిన ఈ అంతర్జాతీయ పాఠశాల కలలు కనడానికి సాహసించండి అని ప్రభోదిస్తూ ఒడిశాలోని పేదపిల్లలను సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది.


Tags:    

Similar News