ప్రపంచంలో ఖరీదైన ఎన్నికలు జరిగేది ఇండియాలోనే...

ఆర్థిక శాస్త్రవేత్త జ్యోతి రాణితో ఇంటర్వ్యూ -1 అభ్యర్థులు ఖర్చు చట్టం చెప్పిన దానికంటే చాలా ఎక్కువ. ఇలా చట్టాన్ని ఉల్లంఘించి ఎన్నికయ్యాక చట్టాన్ని కాపాడతామంటారు

By :  Admin
Update: 2024-04-30 05:13 GMT

"ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు మనవి. ఈ ఎన్నికలు మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయి. ప్రజల జీవన సంక్షోభం పెరిగింది. తొలుత విద్య, వైద్య రంగాలలోనే ప్రైవేటీకరణ ప్రవేశించింది. మొత్తం ప్రభుత్వ విద్యను, ప్రజారోగ్యాన్ని ప్రభుత్వమే స్వయంగా ధ్వంసం చేస్తోంది. ఉద్యోగ కల్పన బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగిపోయింది.” అంటారు ప్రముఖ ఆర్థిక శాస్త్ర వేత్త ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి.

దేశ ఆర్థిక పరిస్థితి గురించి సోమవారం వరంగల్ నుంచి ఫెడరల్ న్యూస్ ప్రతినిధి తో సవివరంగా చర్చించిన జ్యోతి రాణి కాతీయ విశ్వవిద్యాలయం ఆర్థిక శాస్త్ర ఆచార్యులుగా ఉద్యోగ విరమణ చేశారు. 'స్త్రీ సంఘటన' పత్రికకు ఎడిటర్ గా ఉన్నారు. దేశ ఆర్థిక రంగం గురించి ఎంతో అవగాహన ఉన్న ప్రొఫెసర్ తోట జ్యోతి రాణితో తిరుపతి నుంచి సెల్ఫోన్లో ఆలూరు రాఘవశర్మ జరిపిన ఇంటర్వ్యూ. మొదటి భాగం ఇది.

-రాఘవ శర్మ

ప్రశ్న : దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పక్షం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓటింగ్ జరగబోతోంది. వర్తమాన భారతదేశం మీకు ఎలా కనిపిస్తున్నది? ఎలా అనిపిస్తున్నది?

జ్యోతి రాణి : భారతదేశంలో ఎన్నికలనేవి మాయాజాలంగా తయారయ్యాయి. ఇవి చాలా ఖరీదైన ఎన్నికలైపోయాయి. ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రజల బలహీనతలను రెచ్చగొట్టే ఎన్నికలవడం 1990-91 నుంచి మొదలై, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేస్తున్నాయి.

ప్రత్యేకించి 2014 – 2019 ఎన్నికలు చాలా ఖరీదైనవైపోయాయని డిల్లీ బేస్డ్ మీడియా అధ్యయనం చెపుతోంది. 2014 ఎన్నికల కంటే 2019 లో జరిగిన ఎన్నికల్లో వ్యయం రెండు రెట్లు అధికమని ఆ అధ్యయనం వెల్లడిస్తోంది. 2019లో జరిగిన ఎన్నికలనేవి 8.6 బిలియన్ల అమెరిన్ డాలర్లు ఖర్చుపెట్టడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నమోదయ్యాయి.

అభ్యర్థులు ఖర్చు పెట్టిన వ్యయం ఎన్నికల కమిషన్ చెప్పిన పరిధికి దరిదాపులలో కూడా ఉండదు. చట్టాన్ని ఉల్లంఘించే వీరు అధికారంలోకి వస్తున్నారు. ఎన్నికయ్యాక చట్టాన్ని కాపాడతామని అంటున్నారు. ఇదొక పెద్ద వైరుధ్యం. అయితే, చట్టాన్ని ఉల్లంఘించి అధికారంలోకొచ్చిన ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తుందా? వారి జీవనోపాధి గురించి ఆలోచిస్తుందా?

చాలా ఖర్చు చేసి ఎన్నికైన ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు, సంపన్న వర్గాల ప్రయోజనాల గురించే ఆలోచిస్తుంది. సామాన్యుల గురించి ఆలోచించదు. అందువల్ల ప్రజల గురించి ఆలోచించడమంటే ప్రజల జీవనోపాధిగురించి ఆలోచించాలి. అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములు చేయాలి. దాన్నే సమ్మిళిత వృద్ధి అంటాము. దీని లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి.

ఉద్యోగ భద్రత ఉండాలి. విద్య వైద్యం ప్రజలలందరికీ అందుబాటులో ఉండాలి. వ్యవసాయ సంక్షోభాన్ని ఆపాలి. అలాంటప్పుడే వలసలు కూడా ఆపగలుగుతాం. కోవిడ్ విపత్తు కాలంలో మన దేశంలో వలసల తీవ్రత, వారి జీవన సంక్షోభాన్ని ప్రపంచమంతా చూసింది. ఈ లక్ష్యాలన్నిటినీ సాధించడానికి ప్రజలందరూ సంఘటితంగా ఒత్తిడి చేసి, ఆ దిశగా ప్రభుత్వాన్ని పనిచేయించినట్టయితే అదే నిజమైన ప్రజాస్వామ్యం అనుకోవాలి.

గత 10 సంవత్సరాల నుంచి నయాఉదారవాద విధానాలు చాలా బలంగా అమలు జరుగుతున్నాయి. మెజారిటీ ప్రజల జీవన సంక్షోభం పెరిగింది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టబడ్డాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రజలే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవాలి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది.

ప్రశ్న : కొన్నేళ్ళుగా పాఠశాలల్లో ఉపాధ్యాయ నిమామకాలు ఆగిపోయాయి. విశ్వవిద్యాలయాలను కూడా ఒప్పంద (కాంట్రాక్ట్) అధ్యాపకులతో నడిపించేస్తున్నారు. శాశ్వత ప్రాతిపదికన నియమితులైన అధ్యాపకులంతా ఒకరొకరుగా రిటైరై పోతున్నారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు దాదాపుగా ఆగిపోయాయి. ప్రభుత్వం ఈ విద్యారంగాన్ని ఏం చేయదలుచుకుంది? నూతన విద్యావిధానం అంటే పరిశోధనలను ఆపేసి, విశ్వవిద్యాలయాలను మూసేయడమేనా? ఒక విద్యావేత్తగా మీరేం చెపుతారు?

జ్యోతి రాణి : నిజానికి మీరు అన్నటువంటి సమస్య తీవ్రమైంది. సీరియస్ గా ఆలోచించాలి. నూతనంగా సెల్ఫ్ ఫై నాన్సింగ్ కోర్సులు 1987 లో మొదలయినప్పటి నుంచి అధ్యాపక నియామకాల బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం ప్రారంభమైంది. తొలుత విద్య, వైద్య రంగాలలోనే ప్రైవేటీకరణ ప్రవేశించింది.

విద్య ప్రైవేటీకరణ మొదలైనప్పుడు ప్రైవేటు రంగంలో విద్యాసంస్థలను ఆధిపత్య వర్గాలే స్థాపిస్తాయి. ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వ విద్యాలయాలను బలహీనపరిచాయి. ప్రభుత్వమే ప్రైవేటీకరణ ను ప్రోత్సహిస్తున్నది. ఒక పద్దతి ప్రకారం ప్రభుత్వ విద్యాలయాలను ప్రభుత్వమే బలహీన పరుస్తూ వస్తోంది.

మన ప్రభుత్వం 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యు టీవో) జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వేసెస్ ను ఆమోదించింది. దానితో విద్య, వైద్య రంగాల ప్రైవేటీకరణ ఊపందుకుంది. ఈ సూచలన ఆధారంగానే విద్యారంగాన్ని ఏం చేయాలో తేల్చడానికి 2000లో భారత దేశం ముఖేష్ అంబాని, బిర్లాతో ఒక కమిటీ వేసి, వారి సూచనలను అడిగింది. ప్రభుత్వమే ఒకపద్దతి ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యావ్యవస్థను దెబ్బతీసింది.

ప్రపంచ బ్యాంకు 2002లో కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్ సొసైటీస్ -న్యూ చాలెంజెస్' అన్న నివేదికను విడుదల చేసింది. దీనిననుసరించి నాలెడ్జి సొసైటీలను తయారు చేయాలని, అలా తయారు చేసే శక్తి కార్పొరేట్ రంగానికి మాత్రమే ఉంటుందని, కనుక విద్యను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని తీర్మానించింది. దీంతో విద్యను లాభం కోసం సరుకుగా మార్చడం మొదలైంది.

ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించడమే లక్ష్యంగా 1990 నుంచి 30 ఏళ్ళుగా పెట్టుకుంది. 2012లో వేసిన నారాయణమూర్తి కమిటీ విద్యారంగాన్ని కార్పొరేటీకరించడం ఎలా? అనే దానిపైన సూచించింది. కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున ఖర్చుపెట్టి విద్యారంగానికి ఎందుకు వస్తాయి? మన విలువైన భూములని వారికి 999 సంవత్సరాలకు లీజ్ కు ఇవ్వాలి. ఆ తరువాత రాముడెవరో, రాకాసి ఎవరో! ప్రజలను వెళ్ళగొట్టి వేల ఎకరాలు కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దీని లక్ష్య .

కార్పొరేట్ శక్తులకు 25 నుంచి 30 శాతం లాభాల గ్యారంటీ ఇవ్వాలి. అంటే ప్రభుత్వం విద్యారంగాన్ని ఏం చేస్తోంది? వాళ్ళ లాభాలకు గ్యారంటీ ఇవ్వడమంటే ఏమిటి? విద్య ఖరీదైతే అది తమ సంపన్న వర్గాలకే లభిస్తుంది. మధ్య తరగతి వారు ఆస్తులను అమ్మి, లేదా తాకట్టుపెట్టి చదువుకోవాలి. పేద వర్గాల వారికి విద్యను అందకుండా చేయడమే వీరి లక్ష్యం.

విద్యారంగాన్ని కార్పొరేటీకరించడం ఎలా? అనేదే 2020 నూతన జాతీయ విద్యావిధానం లక్ష్యం. కింది స్థాయి ప్రైవేటు సంస్థలన్నీ పెద్ద సంస్థల కిందకు చేరిపోయి, బహుళ విషయక విద్య (ముల్టీడిసిప్లనరీ సబ్జెక్ట్) గా పెద్ద సంస్థలుగా రూపొందాలి. ఇవి ఎలా ఉంటాయంటే, అసలు మనదేశంలోనే ఉన్నామా, విదేశాల్లో ఉన్నామా అనేలా చేయాలి. అలా ఉండాలంటే పెద్ద ఎత్తున ఫీజులు, డొనేషన్లు వసూలు చేయాలి.

విదేశీ యూనివర్సిటీలకు 2023 జనవరిలో అనుమతినిచ్చారు. వాటికి కూడా ఇవే కండీషన్లు. చిన్నచిన్నవన్నీ కలిసి భారీ సంస్థలుగా ఏర్పడతాయి. ఇక విదేశీ యూనివర్సిటీలే ఉంటాయి. పెద్దపెద్ద భవనాలు, పెద్ద ఎత్తున ఫీజులు ఉంటాయి. విద్యను పేదలకు దూరం చేసే విధానం 2000 నుంచి మొదలైంది.

స్టేట్ యూనివర్సిటీలలో 1992 తరువాత అధ్యాపక నియామకాలు లేవు. 2005లో కొన్ని నియామకాలు పూర్తి చేశారు కానీ, అవ్వన్నీ బ్యాక్లాగ్ పోస్టులు. యూనివర్సిటీల్లో పర్మనెంట్ స్టాఫ్ లేరు. చివరికి పార్ట్ టైమ్ అధ్యాపకులను నియమించారు. వారికి వారానికి 5 పీరియడ్లు మాత్రమే ఇస్తారు. ఉద్యోగం గ్యారంటీ లేదు. అలాంటప్పుడు విశ్వవిద్యాలయాల్లో ప్రమాణాలు ఉండమంటే ఎలా ఉంటాయి!?

అవసరాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వమే కమిట్ మెంట్ ను ధ్వంసం చేసింది. కన్సాలిడేషన్ పేరున పది కాలేజీలను ఒకే కాలేజీగా చేస్తోంది. మిగతా 9 కాలేజీల్లో ఉన్న భూమిని అమ్ముకుంటున్నారు. భూమి కీలకమైనది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేది. ఈ ఎయిడెడ్ కాలేజీల్లో అధ్యాపకులకు జీతాలు గవర్నమెంటు ఇస్తోంది. వాటన్నిటినీ మూసేసి వాటి భూములన్నిటినీ ప్రభుత్వమే తీసేసుకుంటోంది.

స్కూలు నుంచి యూనివర్సిటీ వరకు మొత్తం విద్యను ప్రభుత్వం బలహీనపరచడం లేదు, పూర్తిగా ధ్వంసం చేస్తోంది. నూతన విద్యావిధానం 2020 వల్ల ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం లేదు. విద్యను పేదలకు అందుబాటులో లేకుండా చేస్తోంది. డిగ్రీ చేయచ్చు. ఆన్లైన్ విద్య అంటే విద్యకు దూరమయ్యారనే కదా! ఆన్ లైన్లో అంటే ఇన్స్టాల్ మెంట్లో చదువుకుకోవడమే. ఆ విద్య ఏం చేయను. ప్రేవేటు విద్య లక్ష్యం లాభాపేక్షే కదా!

అధ్యాపకులు సమాజం గురించి, అన్యాయం గురించి చెపితే వారికి ఉద్యోగం ఉండదు. తెలంగాణా ఉద్యమంలో కీలకమైన పాత్ర నిర్వహించింది ఉస్మానియా, కాకతీ విద్యార్థులే కదా. వాళ్ళే కదా ప్రభుత్వాలను నిలదీసింది. ప్రేవేటు కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు నిలదీయలేరు! ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులంటే సమాజానికి దూరమైపోతారు కదా!

మనది యువజనం అత్యధికంగా ఉన్నదేశం. మన వనరులతో, మన శక్తితో మన దేశాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచించాలి. కానీ ఏ దేశంలో ఏ స్కిల్ అవసరమో, అది నేర్చుకుని అక్కడ బతకమంటోంది మన ప్రభుత్వం. శ్రీలంకలో ఎంత విధ్వంసం జరిగిందో చూశాం కదా! వ్యక్తులుగా వెళ్ళడం వేరు, ప్రభుత్వమే మనల్ని స్కిల్స్ నేర్చుకుని విదేశాలకు వెళ్ళమంటోంది. రకరకాల పద్ధతుల ద్వారా ప్రజలకు వ్యతిరేకమైన విద్య, ఆర్థిక రంగ నిర్మాణాలు ఉన్నాయి. స్వయంగా ఆలోచండం కానీ, నడవడం కానీ ఉండదు. కార్పొరేట్ శక్తుల లాభాల కోసమే విద్యార్థులను సృష్టిస్తున్నారు.

3 ప్రశ్న : భారత దేశం నుంచి విదేశాలకు ఏటావెళ్ళి పోతున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఏటా లక్ష మందికి పైగా భారత పౌరసత్వాన్ని ఒదులుకొని విదేశాలకు ఎందుకు వెళ్ళి పోతున్నారు? వివిధ దేశాల నుంచి అమెరికా కు ఎలాంటి వీసా లేకుండా అక్రమంగా వెళ్ళి పోతున్న వారిలో ఎక్కువమంది భారతీయులే ఎందుకుంటున్నారు?

జ్యోతి రాణి : విదేశాలకు లీగల్ గా వెళ్ళిపోతున్నారంటే, బాగా చదువుకున్నవారికి కూడా ఇక్కడ అవకాశాలు లేవనే కదా! విదేశాల్లోనే అవకాశాలు ఉన్నాయన్న భావన ఏర్పడడం వల్ల కదా! బ్రిటిష్ ప్రభుత్వం విదేశీ అవసరాల కోసం మన దేశంలో 5 ఐఐటీలు స్థాపించాలని భావించింది. స్వాతంత్ర్యం వచ్చాక మన దేశ ప్రభుత్వమే వాటిని స్థాపించింది. మన వనరులు మన అవసరాలకు ఉపయోగపడాలని భావిస్తాం. దేశం అభివృద్ధిచెందాలని ఆలోచిస్తాం.

ఈ ఐఐటీలకు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ నుంచి సిలబస్ తీసుకుంది. ఐఐటీ చదివిన వారు ఇక్కడ భారత దేశ అవసరాలకు కాదు కదా! ఇప్పటికి కూడా 8వతరగతి నుంచే ఐఐటీ లక్ష్యంగా చదువులు చెపుతున్నారు. ఐఐటీకి ప్రైవేటు ఇన్స్టిట్యూట్ కోచింగ్. దీనికొక పెద్ద ఎంట్రెన్స్. దీనిలో పాస్ కావడానికి మరో ప్రైవేటు కోచింగ్. ఐఐటీ చదివి విదేశాలకు వెళ్ళాలి. నాలెడ్జి ఉన్న వారు విదేశాలకు వెళ్ళాలి. అమెరికాకు చార్టెట్ ఫ్లైట్ లో 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టి అక్రమంగా వెళుతున్నారంటే విలాసవంతంగా గడవచ్చుననే కదా!

భారత దేశంలో భద్రత లేదు. ట్రాన్స్పరెన్సీ లేదు. పైగా ఇక్కడ కరెప్షన్. ఎలాగైనా చేసి అమెరికాకు వెళదాం. స్కిల్ లేని వారు కూడా గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. నిర్మాణ రంగంలో ముస్లింలకు పనులను ఇవ్వనని ఇజ్రాయిల్ ప్రకటించింది. బీజేపీ పాలిత రాష్ట్రా ల నుంచి ఇజ్రాయిల్ కు పెద్ధ ఎత్తున కూలి పనికి వెళుతున్నారు. ఇజ్రాయిల్ కు వెళ్ళడమంటే డేంజర్ కదా అని ఒక విలేకరి అడిగితే, 'ఇక్కడ ఉంటే ఆకలితో చస్తాం. అక్కడికెళితే కనీసం ఆకలి తీరు తుంది.' అన్న సమాధానం వారి నుంచి వచ్చిం దం టే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. నిరుద్యోగం, ఆకలి సమస్యలు తట్టుకోలేక యుద్ధం ఉన్న దగ్గరకు కూడా వెళుతున్నా రం టే దేశ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో!

గ్లోబల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ప్రకారం 143 దేశాల్లో మనది 126 వస్థానం. తలసరి ఆదాయం కాకుండా ఈ ఇండెక్స్ లో 126వ స్థానం అంటే ఆలోచించండి. హ్యాపీ నెస్ కోసం, మంచి జీవితం కోసం వెళతారు కదా. ఇక్కడ సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, పైగా ఆకలి. అందుకే ఎలాగైనా సరే విదేశాలకు వెళుతున్నారు.

గల్ఫ్ దేశాలకు వెళ్ళి వచ్చిన వారివి దుర్భరమైన జీవితాలు. అక్కడికెళ్ళి ఒళ్ళు హూనం చేసుకుంటారు. ఈ ప్రక్రియ జరుగుతోనే ఉంటుంది. ఇక్కడి కారణాలవల్లనే అక్రమంగా విదేశాలకు వెళుతున్నారు. సాధారణ వ్యక్తులకు కూడా అమెరికా వెళితేనే తెలివిగల వాడన్న లెక్క. అందుకునే ఇంగ్లీషు మోజు. విదేశాలకు పోతేనే బాగుంటుందని మనమే ప్రవోక్ చేశాం. ఈ 75 సంవత్సరాల నుంచి. విదేశాలకు వెళ్లడమే లక్ష్యమైంది.

ప్రశ్న : దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఉద్యోగాల కల్పన అసలు ప్రభుత్వ బాధ్యతే కాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ సలహాదారులు అనంత్ నాగేశ్వరరావు అన్నట్టు పత్రికల్లో వచ్చింది. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

జ్యోతి రాణి : ఉద్యోగాల కల్పన ప్రభుత్వ బాధ్యత కాదని 1991 నుంచి ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. అంతకు ముందుకూడ ఉన్నప్పటికీ ఆ ఆలోచన 2014 నుంచి తీవ్రమైంది. ఒక వైపు పర్మనెంట్ ఉద్యోగాలు పోయాయి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం 80 శాతం పైగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అది కూడా దుర్భరమైన పరిస్థితిలో పనిచేస్తున్నారు. గౌరవమైన పరిస్థితిలో పని వాతారణం కల్పించాలని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కోరింది.

రెండు దశాబ్దాలుగా ఉద్యోగ రహిత పరిస్థితి కొనసాగుతోంది. 2010 తరువాత ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాల కల్పన కంటే ఉద్యోగాలు పోయేవే ఎక్కువగా ఉన్నాయి . 2012-18 మధ్య ఉద్యోగాలు 467.7 మిలియన్ల నుంచి 461 మిలియన్లకు తగ్గింది. ఇది ఉద్యోగ వ్యాకోచత్వం రుణాత్మకంగా ఉండడం. కార్పొరేట్ శక్తులకు లాభాలు ఎలా ఉండాలో ఆలోచిస్తోంది.

ఉద్యోగ కల్పన బాధ్యత నుంచి ప్రభుత్వం వైతొలగిపోయింది. ఇదే కాలంలో సేవల రంగంలో అదనంగా 25.7 మిలియన్ల ఉద్యోగాలు వచ్చాయి. కానీ అదే కాలంలో వ్యవసాయ రంగంలో, పరిశ్రమల రంగంలో ఉద్యోగాలు కోల్పవడం 31.9 మిలియన్లు, అంటే దాదాపు 6 మిలియన్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. దీన్నే ప్రభుత్వం బలపరిచేవిధంగా ఉంది. మాటవరుసకు కూడా ఉద్యోగ కల్పన ప్రస్థావనే ఉండడం లేదు.

(ఇంకా ఉంది)

Tags:    

Similar News