ఇల్లాలి ముచ్చట్లు, ఇంటాయన ముచ్చెమటలు
ఎటువంటి పొరపొచ్చాలూ లేని పండంటి కాపురం మాది. పొరపాటు నాది కాకపోయినా నిండు హృదయం తో మా ఆవిడ నన్ను ఎన్నోసార్లు క్షమించింది...
ఆఫీసునుంచి ఇంటికి రాగానే డైనింగ్ టేబుల్ మీద అరటిపువ్వు, ఒకటిన్నర అడుగుల అరటి దూట, నాలుగు అరటి కాయలు, పెద్ద అరటి ఆకు కనిపించాయి.
అంత అరటి పంట కేసి ఆశ్చర్యంగా చూస్తూంటే "ఏమిటి ఆ వెర్రి చూపులు, ఎప్పుడూ అరటి మొహం ఎరగని వాడిలా ?" అని వెనకనుంచి మా ఆవిడ కంచుకంఠం విని వులిక్కిపడి తేరుకుని" అబ్బే అదేం కాదు"అని సర్దుకున్నా ప్రమాద ఘంటికల మోత చెవిలో గింగురు మంది. "అహా , ముందుంది ముసళ్ళ పండుగ " అనుకున్నాను.
"పక్కింటి పిన్నిగారి ఇంటి పెరటిలో అరటి చెట్టు గెల వేసిందట. పళ్ళగెల కాదుట. గెలలో కాయలు బాగా ఏపుగా ఎదగ్గానే నిన్న చెట్టు కొట్టేసారు. అయినా మీకు తెలియదా ఏమిటి? 'నేను పల్లెటూరి వాణ్ణి , నాకు అన్నీ తెలుసు, పనసకాయని పెసర బద్దల్లా ఎలా కొట్టాలో, అరటి పువ్వు ఎలా ఒలవాలో తెలుసని పెళ్ళయిన కొత్తల్లో తెగ గొప్పలు చెప్పుకునేవారు కదా,' అని మా ఆవిడ గుర్తు చేసింది. పెళ్ళయిన కొత్తలో ఏదో ఒక బలహీన క్షణం లో అలా వాగి వుంటాను. ఇప్పుడది నా పీక్కి చుట్టుకుంది. అయినా మా ఆవిడ జ్ఞాపకశక్తి అమోఘం. దాసోహం తప్పదు అనుకున్నాను.
"పాపం, అరటి పువ్వు వాళ్ళనే వుంచేసు కోమనాల్సింది, గెలకి ఒక పువ్వేకదా వుండేది"అన్నాను.
"ఆ విషయం నాకూ తెలుసు, కానీ మీ ఆయన అరటి పువ్వు ఆవపెట్టి చాలా బాగా వండుతాడని నువ్వేకదా చెప్పావు. రేపు ఎలాగూ ఆదివారం, అబ్బాయి (నేను) ఇంట్లోనే వుంటాడు కదా. బాబయ్యగారు కూడా సరదా పడుతున్నారు ఆవపెట్టిన అరటి పువ్వు కూర తినాలని. మీకు సగం మాకు సగం. కూర వడియాలు కూడా వెయ్యాలి చెప్పు ఆవిషయం మీ ఆయనకి,' అన్నారు పిన్నిగారు, అలాగే అన్నాను" అంది నా శ్రీమతి.
"ఆహా ఆదివారం నాడు ఎంచక్కటి బహుమతి, వురేయ్, అయిపొయావురా, నీ కథ కంచికే , తప్పదు అనుకున్నా."ఏమిటా వెర్రి చూపులు? ప్లీజ్ ,. బాగా వండండి, లేకపోతే నా పరువు గంగలో కలుస్తుంది .
బాబాయ్ గారికి మీ గురించి తెగ బిల్డప్ ఇచ్చాను. తగలేస్తే మటుకు చాలా గొడవలు అవుతాయి , తర్వాత మీ ఇష్టం అని నా అర్థాంగి, నా జీవిత భాగస్వామి ఓ చిన్నసైజ్ అల్టీమేటమ్ ఇచ్చింది. నా బుజ్జికదా,"అంటూ గోముగా నాకేసి చూసి, ఇంకొంచం ఎఫెక్ట్ కోసం ప్రేమగా, సుతారంగా నా భజంమీద చెయ్యివేసింది.అదేదో టన్ను బరువులా అనిపించింది నా ప్రాణానికి.
అసలే మాది అరమరికలు లేని పాతికేళ్ళ అన్యోన్య దాంపత్యం. ఏనాడూ భార్య మాట జవదాటని భర్తని. ఎటువంటి పొరపొచ్చాలూ లేని పండంటి కాపురం మాది. మా మధ్య ఎటువంటి వాదోపవాదాలు వుండవు. ఒకవేళ పొరపాటు నాది కాకపోయినా నిండు హృదయం తో మా ఆవిడ నన్ను ఎన్నోసార్లు క్షమించింది.
పాతికేళ్ళ సంసారంలో ఒకసారా, రెండుసార్లా... ఓ యాభైసార్లయినా అయి ఉంటుంది, ‘మా ఆయన బంగారం నన్నెంతో అపురూపంగా చూసుకుంటారు’ అని ఆ పక్కంటి పిన్నిగారికి ఎన్నిసార్లు చెప్పిందో చెప్పలేను.
"సరే అయితే రేపు మెన్యూ లో మెయిన్ ఐటెమ్ ఆవపెట్టిన అరటి పువ్వు కూర అన్నమాట"అన్నాను బలహీనంగా .
"అదేమిటండీ? ఒక్క కూరతో సరిపెట్టుకంటామా ఏమిటి, అసలే ఆదివారం కూడాను. నాకు భలే ఐడియా వస్తోంది, రేపు మనం ఇంచక్కా ఆవపెట్టిన అరటి పువ్వు కూర, అరటిదూట పెసరపప్పు, అరటికాయ కరకరా వేపుడు చేసుకొని , పిన్నిగారు ఇచ్చిన అరటాకుల్లో భోంచేద్దామండి, ఎంతో వెరైటిగా వుంటుంది" అంది మా ఆవిడ.
అలా అంటూంటే ఆవిడ కళ్ళు మిలమిలా మెరిశాయి. నా కళ్ళముందు నక్షత్రాలు కనిపించాయి. అరటి పువ్వు ఒలవడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ముందు అరటి పువ్వు లో ఒక్కొక్క డిప్పా వలవగానే లోపల గుత్తిలా పువ్వులు వుంటాయి. ఆ గుత్తి పళంగా వాటిని విడదీసి అరచేత్తో రాస్తే లోపలపొడుగ్గా సన్నంగా, చిన్న తలతో ఒకకాడ కనిపిస్తుంది. దానిని దొంగాడు అంటారు.
ఆ తరువాత ఒక గాజు పొరలాంటిది వుంటుంది. దానిని పిల్లేళ్ళు అంటారు. ఆ దొంగాడినీ, పిల్లేళ్ళనీ తీసేయాలి. లేకపోతే కూర చేదుగా వుంటుంది. దీనికే చులాగ్గా ఓ గంట పడుతుంది. ఈ ప్రహసనం పూర్తి అయిన తరువాత దానిని కనీసం నాలుగు సార్లైనా కడగాలి. లేకపోతే కూర రంగు మారి ఒగరుగా తయారవుతుంది.
ఆ తరువాత బాగా నీళ్ళు పిండి ఓ మూకుడులో వేసి, ఓ చెంచా మెంతులు వేసి, ముందుగానే నీళ్ళలో నానబెట్టిన చింతపండుని పిసికి ఆ నీళ్ళని ముకుడులో రుచి కి సరిపడా ఒంపి , కూర బాగా పొడిపొడిగా అయ్యేవరకూ వుడకబెట్టాలి.
ఆ తర్వాత దీనిని ఓ గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుని, మూకుడులో నూనె వేసి అది బాగా వేడెక్కిన తరువాత ఆవాలు, సెనగ పప్పు, మినపప్పు, తగినన్ని ఎండి మిరపకాయలు, కరివేపాకు వేసి ఆవాలు పటపటలాడిన
తరువాత, పక్కనే పెట్టుకున్న వుడకబెట్టిన అరటి పువ్వు మూకుడులో వెయ్యాలి.ఆ తరువాత తగినంత వుప్పు, చిటికెడు పసుపు వేసిబాగా కలియబెట్టాలి, ఆ తరువాత ఒక పచ్చిమిరపకాయ చిన్న అల్లంముక్క దంచి అందులో వేసి ఒకసారి కలియబెట్టి స్టౌవు ఆపేయాలి.
ఆ తరువాత, రోట్లోకానీ మిక్సీలోకానీ రెండు చెంచాల ఆవాలు ఒక ఎండు మిరపముక్క పావు చెంచా నూపప్పు వేసి మెత్తగా దంచి ఆ తరువాత కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా పేస్ట్లా అయ్యేవరకూ నూరాలి.దీంట్లో అరచెంచా నువ్వులనూనె వేసి కలపాలి. ఇప్పుడు ఈ ముద్దని మూకుడులో వున్న అరటిపువ్వు కూరలో వేసి బాగా కలపాలి.దాంతో ఘుమఘుమాలాడే ఆవపెట్టిన అయటి పువ్వు కూర రెడీ.
చూసారా ఎంత కష్టమో ఈ కూరచేయడం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ కూర వండాలి.ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా కూర తగలడి పోతుంది. నా కథ కంచికి.
ఇంతకీ అరిటాకుల్లో వెరైటీగా భోజనం చేద్దాం అని మా ఆవిడ సెలవిచ్చింది మేమిద్దరమేనా లేక ఇంకా బాగా వెరైటీగా వుంటుందని పిన్నిగారింట్లో అందరినీ కూడా సరదాగా పిలవబోతోందా? నా బుర్రకేమీ అర్థంకాలేదు.
‘ఓరి పిచ్చివాడా, ఈ పాతికేళ్ళ సంసారంలో నీకు ఒక్కసారైనా అర్థం అయిందా ఇప్పుడు అర్థం కావడానికి,’ అని మనసులో అనుకుని నన్ను నేను సముదాయించుకున్నాను.
అంత్యనిష్టూరంకన్నా ఆది నిష్టూరం ఒంటికి సేఫ్ అని భావించి ఈ సహపంక్తి భోజనాల సంగతేదో తేల్చుకోవడం మంచిదనుకున్నాను.
ఉన్నమాట చెప్పొద్దూ, నాకు మనసులో నాలాంటి అభాగ్యులు అసూయ పడేటంత ధైర్యం వుంటుంది. ఇంక తాత్సారం చేయకుండా తాడోపేడో తేల్చేసుకోవాలనుకుంటాను మనసులో సుమండీ. కానీ అదేం ఖర్మో నోట్లోంచి మాట పెకలదు. మా పాతికేళ్ళ సంసారంలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.
సంసారం సాఫీగా సాగాలంటే సర్దుకు పోవడంత సుఖం ఇంకొకటి వుండదని నా స్నేహితుడు సుబ్బారావు నాకు ఓ దుర్ముహర్తంలో గీతోపదేశం చేసాడు.
ఒకసారి నేను వాడి దగ్గర వాపోయిన మాట నిజం.
"వురేయ్ సుబ్బిగా, నువ్వు ఎలా లాక్కొస్తున్నావురా సంసారాన్ని? దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షులా వుందిరా నా బతుకు. ఏమీ అంతుపట్టక చస్తున్నాను. నాకు కాస్త మార్గం చెప్పి పుణ్యం కట్టుకో. నీ కడుపున పుడతాను, మా ఆవిడ రోజురోజుకు రెచ్చిపోతోందిరా. ఏమి మాట్లాడితే ఏ గొడవ అవుతుందో తెలియడంలేదురా. నేను ఏమి మాట్లాడినా నా పెళ్ళాం విపరీతమైన అర్థాలు లాగుతోంది. సర్దిచెప్పలేక చస్తున్నాను గురూ. అప్పటికీ ఆవిడ మెప్పుకోసం ఎన్ని తిప్పలు పడుతున్నానో చెప్పలేను తెలుసా. ఆవిడ మొహంలో చిరునవ్వుల కోసం నేను ఎంత తాపత్రయపడతానో ఆ దేముడికే తెలుసు," అని వాడికి ఏడుపు మొహంతో నా దీన గాథని వెళ్ళబోసుకున్నాను.
వాడికి పెళ్ళి అయి 50 ఏళ్ళు అయింది. మొన్నీమధ్యనే పార్టీ కూడా ఇచ్చాడు. బాగా అనుభవం పండిన వాడు.
వాడి జుట్టంతా నుగ్గుబుట్టలా నెరిసిపోయింది. ఎన్ని ఢక్కాముక్కీలు తిన్నాడో పాపం అనుకున్నాను. ఓపిగ్గా నా కథంతా విని, "వురేయ్ నేను చెప్పినట్టు చేస్తే నువ్వు బతికి పొతావు. లేకపోతే ఫొటోఫ్రేమ్ లో మిగిలిపోతావు. వింటానంటే చెబుతాను," అన్నాడు తల నిమురుకుంటూ.
"తప్పకుండా వింటాను చెప్పు, చచ్చి నీ కడపున పుడతాను బాబ్బాబు అని బతిమాలాను. మీ ఆవిడ ఎలా చెబితే అలా చేయి, తు.చ తప్పకుండా పాటించు. ఆవిడ మనసు తెలుసుకుని మసులుకో, ఆవిడకు ఇష్టమైన చీర కొని ఆశ్చర్యంలో ముంచెత్తు, ఆవిడ చెప్పింది ఎంత విడ్డూరంగా అనిపించినా సరే నోరెత్తకు.
"వాట్ యాన్ ఐడియా సర్ జీ" అని పొగుడు, చాలు, నీ దాంపత్యం మూడు పువ్వులు ఆరుకాయల్లా వుంటుంది. ఇదే వేదాల్లోని సారం అని గీతోపదేశం చేసాడు. సరే ముసలాడు ఏదో చెప్పాడు కదా అని వారంరోజుల్లో రాబొతున్న మా పెళ్ళిరోజు నాడు ఈ ప్రయోగం అమలు చేయాలని మనసులో ఒట్టేసు కున్నాను.
ఆ రోజైనా చివాట్లు తినకుండా కాపాడండి అని అన్ని దేముళ్ళకీ సీక్రెట్ గా మొక్కుకున్నాను కూడా. తనకి ఇష్టమైన గులాబీ రంగు మైసూర్ సిల్కు చీర కొని మన పెళ్ళి రోజు కోసం నీకు సర్ ప్రయిజ్ గిఫ్టు అని ఆవిడ చేతిలో పెట్టా. లోలోపల కొంచం భయంగానే వుంది సుమండీ. మెరుస్తున్న కళ్ళతో ఆ గిఫ్ట్ పాకెట్ విప్పింది. ఆ చీర చూడగానే ఆవిడ కళ్ళు ఇంత అయ్యాయి. "బావుందండీ. నాకు ఆ రంగు ఇష్టం అని మీకు ఇంకా బాగానే గుర్తుందే," ఆవిడ మొహమంతా ఆనందం. హమ్మయ్యా, దేముడు నా మొర ఆలకించాడు అని మనసులోనే వుప్పొంగి పోయాను.
ఆ చీరలో ఎంత అందం గా వుంటావో తెలుసా, అసలు ఆ చీరకే అందం వస్తుంది అన్నాను.
"అంటే నేను అందంగా వుండనా? నేను ఎర్రగా బుర్రగా అందంగా వుంటాననే కదా నా వెంటపడి, కానీ కట్నం అడక్కుండా ఎగబడి మరీ చేసుకున్నారు, పోనిలే అంతగా ఇష్టపడుతున్నాడు, నన్ను అపురూపంగా చూసుకుంటాడులే అయినా ఏ రాయి అయితేనేంటి పళ్ళూడగొట్టుకోడానికిఅని ఒప్పు కున్నాను తెలుసా? అయినా అసలు కట్నం అంటే నాకు పరమ అసహ్యం, అసలు ఆ మాట ఎత్తననీ, కట్నం అడిగేవాడు అడ్డగాడిద అనీ డప్పు కొట్టుకున్నారు మీరు గుర్తుందా? అని నా ప్రాణేశ్వరి సెలవిచ్చింది.
"నాకు నువ్వే చాలు , నీ నవ్వే నవరత్నాలు , నాకు వేరే కట్నం దేనికి ? అన్నాను అమాయకంగా మొహంపెట్టి.
ఆ తరువాత తెలిసింది నేనెంత ఘోరమైన పొరపాటు చేసానో అని.
"అంటే ? నేను బాగోలేకపోతే కట్నం తీసుకునే వారా? అసలు కట్నం ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చారో చెప్పండి ముందు. నేనేదో మాటవరసకి అనివుండొచ్చు అది వేరే విషయం. పెళ్ళి చూపుల్లో మీరేమన్నారో గుర్తుందా? నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటానని, మనిద్దరిదీ ఒకే మాటగా వుండాలనీ (అంటే తనమాటే నామాట, అదే వేదం అనీ నాకు వేరే సొంత అభిప్రాయాలు వుండడానికి వీల్లేదని ఆ పెళ్ళిచూపుల మత్తులో నా బుర్రకి తట్టి చావలేదు!)అంటే నేను గానుగెద్దులా తలవూపేసాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను.
మా ఆవిడ మాటే నా మాటగా, ఒకే బాటగా ఎంతో అన్యోన్యంగా, అంతా అసూయపడేలా బతికేస్తున్నాను.
మేము బైటకి వెడితే చుట్టుపక్కల వాళ్ళంతా మమ్మల్ని చూసి ఎంత ముచ్చటైన జంట అని మురిసి పోతుంటారు. ఆడవాళ్ళంతా నాకేసి ఎంతో ఆరాధనా భావంతో చూస్తారు. తమకి కూడా ఇలాంటి నోరెత్తని అమాయక పురుష పుంగవుడు భర్తగా దొరికివుంటే ఎంత బావుండేదో అని కచ్చితంగా అనుకుంటూ వుంటారని పందెం.