చారిత్రక ప్రదేశాలకు గుప్త నిధుల కేటుగాళ్ల ముప్పు

చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా ప్రగల్భాలకు పరిమితమైన పర్యాటకం అంటున్నప్రజాసైన్స్ వేదిక అధ్యక్షుడు డా. యం. సురేష్ బాబు

Update: 2024-12-16 07:17 GMT

రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు కాల గర్భంలో కలిసి పోయిన వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచి ఉన్నాయి. అవి నాటి చరిత్రను, నాగరికతను, నాటి జనజీవనాన్ని, ఆర్థిక సామాజిక పరిస్థితులకు సాక్ష్యాలుగా ఇంకా మిగిలే ఉన్నాయి. కొన్ని పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉండగా కొన్ని ఆలనా పాలనా లేక ముష్కరుల చేతిలో మరింత దోపిడీకి గురవుతున్నాయి.

ఆయా రాజులు, రాజ్యాలు ఆనాటి సంపదను ఆయా కోటలలో దాచి ఉంచారని దుండగులు వాటిని తస్కరించే ప్రయత్నంలో చారిత్రాత్మిక ప్రధానమైన ఆయా కట్టడాలు మరింత శిథిల మవుతున్నాయి. ఆ నాటి కోటలు నిధి నిక్షేపాలకు ఆలవాలమే కాదు, విజ్ఞాన భాండాగారాలు, సాంస్కృతిక సంపదకు ఆలవాలాలు. వీటి పరిరక్షణ భావి తరాలకు ఎంతో ముఖ్యం. చరిత్రలో ఎంతో పేరుప్రఖ్యాతులు గాంచిన గుత్తి కోట, పెనుకొండ కోట, రాయదుర్గం, కొనకొండ్ల లోని జంబుద్వీపం, లేపాక్షి, బుగ్గ రామలింగేశ్వరస్వామి గుడి, బూదగవి లోని సూర్యుని గుడి, గుత్తిలో వెలసిన క్రైస్తవుల సమాధుల తోట నేడు పూర్తిగా నిర్లక్ష్యానికి గురియైనవి.

పది సంవత్సరాల క్రితం అనంత పద్మనాభ స్వామి గుడిలో సంపద వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పురాతన కట్టడాలకు భద్రత లేకుండా పోయింది. చారిత్రక కట్టడాలు , గుళ్ళు , కోటలు గుప్త నిధి వేటగాళ్లు బారిన పడి బీటలు వారుతున్నాయి. నిధి వేటగాళ్లు ధ్వజ స్తంభాలు, గోపురాలను , ముఖద్వారాలు , గర్భ గుళ్లు ఎక్కడ పడితే అక్కడ తొలిచి వేయడం తో చారిత్రక కట్టడాలు రూపు మారుతున్నాయి. ఒకప్పుడు టంకశాల గా ఉన్న గుత్తి కోట ఎప్పుడో పదిహేను సంవత్సరాల క్రింద దొరికిన వెండి నాణ్యము వార్తతో చాలా మంది నేరగాళ్లు కోటను జల్లెడ పట్టారు. ఒక వేళ ఖజానా నిండుగా ఉంటే రాజు ఎందుకు వలస బాట పడతారు?

 

ఇక్కడ పాలించిన చివరి సామంత రాజు బ్రతుకు ఛిద్రమై బళ్లారి దగ్గర ఉన్న సండూరు కు వలస వెళ్ళాడు. ప్రభుత్వం తక్షణమే గుత్తి కోటను పరిరక్షించి చరిత్ర ఆనవాళ్లను భావితరాలకు అందించే బాధ్యత సభ్యసమాజం పై ఉంది. గుత్తి కోట అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన దుర్గములలో ఒకటి.అలనాటి రతనాల సీమ గా పిలువబడే నేటి రాయలసీమలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన గుత్తిలో కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దులో గుత్తి పట్టణానికి తూర్పు దిశలో 300 మీటర్ల ఎత్తున కొండలపై నిర్మించిన గుత్తి కోట శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా విలసిల్లుతోంది.

ఆంధ్రుల పరాక్రమ వైభవానికి, శిల్పుల సౌధ నిర్మాణ కళా కౌశలానికి మౌన సాక్షిగా నిలిచి మూడు వైపులా భారీ విస్తీర్ణంలో కోటను నిర్మించారు. ప్రారంభంలోనే పెద్ద కందకం ఉన్నట్లు సాక్ష్యంగా కోట ప్రారంభం అవుతుంది. దీన్ని దాటిన తరువాత సింహద్వారం, నగరేశ్వర ఆలయం కూడా చెక్కు చెదరలేదు. రెండవ ద్వారం దాటి పైకి వెళ్ళగానే సైనికులు కవాతు ఉద్దేశించిన విశాలమైన మైదానం ఉంది. అక్కడ గజశాల, అశ్వశాల ఉన్నాయి. గుర్రాలు, ఏనుగులు నీరు తాగడానికి పెద్ద బావి ఉంది. మరికొన్ని ద్వారాలు దాటితే రాజోద్యోగుల నివాస గృహాలు ఆనవాళ్లు కనిపిస్తాయి. కోటలో హిందూ రాజులు నాట్యశాలగానూ, మహమ్మదీయుల మసీదు గా ఉపయోగించే రంగమండపం ఉంది.

 

వాటిలో వర్ణ చిత్రాలు నేటికీ వన్నె తగ్గలేదు. మండపం దాటగానే రాజకీయ సౌందర్యాన్ని పుచ్చుకున్న ఒక మండపం ఉంది. దాన్ని బేగం మహల్ లేదా భోగం మహల్ అంటారు. దాని సమీపంలో మురారి రావు గద్దె, సభా భవనం తదితర భవనాలు ఉన్నాయి. దీన్ని దాటాక ఖిల్లా అనే శిఖరాగ్ర భాగం ఉంది. అచ్చటి నుంచి చూస్తే చుట్టూ 50 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. పద్ధతి ప్రకారం శత్రువులను దెబ్బతీయడానికి అనుగుణంగా కోటను నిర్మించారు. ప్రాకారం నుంచి శత్రువులకు కనిపించకుండా దాక్కొని కోట దెబ్బతినకుండా రాళ్లు దోర్లించడానికి వీలుగా నిర్మాణం జరిగింది. దుర్గంలో మంచినీటికి 101 బావులు ఏర్పాటు చేశారు.

ఈ దుర్గం నిర్మాణం శైశిష్ట్యాన్ని చూసిన విల్స్ అనే చరిత్రకారుడు క్షామం, మోసం ఇవి రెండూ మాత్రమే దుర్గాన్ని లొంగదీయగలవని తన పుస్తకంలో వ్యాఖ్యానించాడు. గుత్తి కోట చాళుక్యుల కాలంలో కట్టబడినదని భావిస్తారు అయితే విజయనగర రాజులు దీనిని పటిష్టం చేశారు. గుత్తి కోటను ప్రస్తావించిన తొలి శాసనాలు కన్నడము, సంస్కృతంలో ఉన్నాయి. అవి 7వ శతాబ్దం నాటిదని అంచనా. ఒక శాసనంలో ఈ కోట పేరు గదగా ఇవ్వబడింది. విజయనగర చక్రవర్తి బుక్క రాయల శాసనములో గుత్తి కోట దుర్గ రాజ్యముగా కీర్తించబడింది. గుత్తి కైఫియత్ ప్రకారం కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకొని, ఆ తర్వాత అది కుతుబ్ షాహీ వంశస్తుల పాలనలో ఉంది.

 

 

1746 లో మురారి రావు ఆధ్వర్యంలో మరాఠులు దీనిని జయించారు. 1775 లో హైదర్ అలీ గుత్తి కోటను తొమ్మిది నెలల నిర్భంధము తర్వాత వశపరచుకొనెను. 1779 లో టిప్పుసుల్తాన్ మరణానంతరము జెరువార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనములో ఈ కోట ఉండగా నిజాము తరఫున బ్రిటిషు కల్నల్ బౌజర్ కోటను ఆక్రమించుకొని బ్రిటిష్ వారి పాలనలో తెచ్చాడు. ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది. చుట్టూ ఉన్న మైదానం కంటే దాదాపు 300 మీటర్ల ఎత్తున ఉంది. ఈ కోట నత్తగుల్ల/శంఖము/గవ్వ (షెల్ల్) ఆకారములో నిర్మించబడి 15 బురుజులతో, 15 ముఖద్వారాలు కలిగి ఉంది.

కొండలు తక్కువ స్పర్‌ల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. కోట పశ్చిమ కొండపై ఉంది. ఇందులో రెండు భవనాలు ఉన్నాయి, ఒకటి ధాన్యాగారం కాగా, రెండోది గన్‌పౌడర్ నిల్వ. శిథిలమైన నరసింహ ఆలయ శిఖరం దగ్గర ఉంది. వ్యాయామశాల ఒకటి ఉంది. 300 మీటర్ల ఎత్తైన కొండపైన " మురారి రావు గద్దె" అనే ఒక చిన్న పెవిలియన్ ఉంది. ఇక్కడి నుండి గుత్తి ఊరంతా చక్కగా కనిపిస్తుంది. మరాఠా జనరల్ మురారి రావు ఇక్కడ చదరంగం ఆడేవాడు. దిగువ కోటలు ప్రాకారాల శ్రేణిని కలిగి ఉంటాయి, ఇవి గేట్‌వేల ద్వారా అనుసంధానించబడి బురుజులతో ఉంటాయి . వర్షపునీటిని ఆపి నిల్వ చేయడానికి రాళ్ళ పగుళ్ళలో గుంతలు తవ్వి అనేక జలాశయాలు చేశారు.

 

కోట లోపల 108 బావులు తవ్వారు. కోట లోపల అనేక శిథిలమైన భవనాలు ఉన్నాయి, వాటిలో ధాన్యాగారాలు, స్టోర్ రూములు, ఆయుధాగారం ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి థామస్ మన్రో, జైళ్లుగా ఉపయోగించారు. పర్యాటకులకు మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయం లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలకే పర్యాటక శాఖ పనిచేస్తున్నది.

పెనుకొండ కోట, ఇది అనంతపురం జిల్లా, పెనుకొండ మండలం, పెనుకొండలో ఉంది.పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది. పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం.ఇది అనంతపురం జిల్లాలో ఉన్న గిరి దుర్గాలలో ప్రఖ్యాతి గాంచింది.శాశనాల్లో దీనిని 'పెనుకొండ ఘనగిరి' గా లిఖించినట్లు తెలుస్తుంది. ఈ కోటను మొదటగా హోయసలలు పాలించారు. వారు జైన మతస్తులు ఐనందున అక్కడ జైన మతం బాగా అభివృద్ధి చెందినది. ఆకాలంలో పెనుకొండ అనేక జైన దేవాలయాలు అభివృద్ధి చెందాయి. ఇప్పటికి ఈ ప్రాంతం జైన మతస్తులకు అత్యంత ప్రాదాన్యమైంది.

ఆ తర్వాతి కాలంలో చాళుక్యులు , విజయనగర రాజులు, నవాబులు, టిప్పు సుల్తాన్ పరిపాలించారు. చివరగా బ్రిటిష్ వారి వశమైంది. కృష్ణదేవరాయల కాలంలో పెనుగొండ వారి రాజ్యానికి రెండవ రాజధానిగా వర్థిల్లింది. అదేవిదంగా వారికి ఇది వేసవి విడిదిగా కూడా సేవ లందించింది.విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల తర్వాత వేంకటపతి రాయలు ఈ కోటను తన ఆదీనములోనికి తెచ్చుకొన్నాడు. అతడు రాయ దళవాయి కోనేటి నాయుడుని ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించాడు. వారి వంశస్తులైన కోనేటి నాయుడు పెనుకొండతోబాటు రాయదుర్గ, కుందుర్పి కోటలను కూడా సుమారు 17 సంవత్సరాల పాటు పరిపాలించాడు.

అతని తరువాత వెంకటపతి నాయుడు, పెద తిమ్మప్ప నాయుడు, కోనేటి నాయుడు, రాజగోపాల నాయుడు, తిమ్మప్ప నాయుడు మొదలగు వారు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.విజయనగర రాజ్య పతనానంతరం విజయనగరం నుండు ఆనేక ఏనుగులు, గుర్రాల పై విజయనగర సంపదను తరలించి పెనుకొండలోను, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కోటలో దాచారని చారిత్రిక ఆధారాలున్నాయి. అందుచేత పెనుగొండ కోటలో ముష్కరులు గుప్త నిధుల కొరకు అనేక సార్లు తవ్వకాలు నిధిని తస్కరించారని కథనాలున్నాయి.

 

ఇటీవలి కాలంలో ఇటువంటి సంఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పెనుకొండ కోట బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఉన్నాయి. ఇందులో కట్టడాలు శత్రుదుర్భేద్యంగా ఉంటాయి. ఎర్రమంచి గేటు 1575 లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుద్ధానికి వెళ్లేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండలో 365 దేవాలయాలు ఉన్నాయి. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించారు.

రాయదుర్గం కోట అనంతపురం జిల్లాలో రాయదుర్గంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లోని అతి పురాతన కోటలలో ఇది ఒకటి. ఇది మధ్య యుగం లో నిర్మించిన కోట. ఇది 2727 అడుగుల ఎత్తు ఉంది. చారిత్రిక ఆధారల ప్రకారం ప్రకారం, రాయదుర్గం కోట జుంగా నాయకా, విజయనగర రాజుల యొక్క ఒక సేనాపతి నిర్మించారు. ఈ కోట తళ్లికోట యుద్ధానంతరం వెంకటపతి నాయకుడు ద్వారా చాలా వరకు ప్రతిష్ట చేయబడింది. టిప్పు సుల్తాన్ పాలనలో దీనిని గుత్తి సంస్థానంలో విలీనం చేశారు. .

రాయదుర్గం కోట విజయనగర రాజుల కాలంలో చాలా కీలక పాత్ర పోషించింది. ఇది రాయదుర్గం పట్టణంలో ఒక కీలకమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఒక దశభుజ గణపతి విగ్రహముంది. ఇది ఏక శిలా విగ్రహం. ఇది కాక ఇక్కడ, ఎల్లమ్మ, ప్రసన్న వెంకటేశ్వర ఆలయం, వేణుగోపాలస్వామి ఆలయం, జంబుకేశ్వర ఆలయం వీరభద్ర ఆలయం కన్యకా పరమేశ్వరాలయం మున్నగు ఆలయాలున్నాయి.

Tags:    

Similar News