బతకు దెరువు Vs బడి చదవులు

కర్నూలు కరువు ప్రాంతం వేదన వెల్లడించే 'గవిగట్టు' కథలు;

Update: 2025-08-17 04:52 GMT

ఉపాధ్యాయుడిగా కర్నూలు జిల్లా గవిట్టు పాఠశాలనుంచి  రిటైర్ అయి, రెండు వారాలు గడిచిపోయాయి. ఎంత వద్దనుకున్నా తప్పనిసరి కృత్యాల లాగా పదవీ విరమణ అభినందన సభ బంధు మిత్రుల కొరకు ఒకటి,

పనిచేసిన పాత స్కూల్ లో పోయిన సంవత్సరం మంచి ర్యాంక్ లలో పాసైన పదవ తరగతి ఉర్దూ మీడియం పిల్లలతో, ప్రజా సంఘాలతో మరో రెండు సన్మానాలు, అభినందనలు శుభాకాంక్షలు పూర్తయ్యాయి. రిటైర్ అయినా స్కూల్ గవిగట్టు గ్రామ పరిస్థితులు మళ్ళీ మనసు నిండా ముప్పిరిగొంటూనే ఉన్నాయి. రెండవ దశ మన బడి నాడు - నేడు లో హై స్కూల్ బిల్డింగ్ నిర్మాణం పనులు అసంపూర్తిగా మిగిలిపోయినందువల్ల, ఒకటి నుండి పది తరగతుల వరకు దాదాపు 500 మందికి పైగా పిల్లలు ఆడుకోవడానికి ఆటస్థలం లేని, కాంపౌండ్ నిర్మాణం లేని ఒకే క్యాంపస్ లో తరగతులు జరుతున్నందువల్ల, ప్రైమరీ స్కూల్ కు ప్రత్యేకంగా ప్రధానోపాధ్యాయులు వచ్చినప్పటికీ అందరిరూ నన్నే హెడ్మాస్టర్ గా చూసే పరిస్థితి. ఒకటవ తరగతి పిల్లలు మొదలు పదవ తరగతి వరకు అన్ని గొడవలు నా దృష్టికే వస్తాయి.
* ఇంటర్వెల్ బ్రేక్ లోనూ, లంచ్ బ్రేక్ లోనూ, పిల్లలు మట్టిలో కూర్చుని, రాళ్ళు, గోళీలు, కర్ర పుల్లలతో అమాయకంగా, భవిష్యత్ పై బెంగ లేకుండానే ఆటల్లో లీనమై పోతారు. కేరింతలతో, ఎల్లలు ఎరుగని, కపటం తెలియని ఆనందంలో ... మునిగిపోతారు...
వారికి తెలియంది.. వలసల భవిష్యత్తే ! ఇటు కార్పొరేట్ పాఠశాల హోమ్ వర్క్ ఒత్తిళ్లు, తల్లిదండ్రుల లాలనలు... తల్లిదండ్రుల కలలను సాకారం చేసే... భద్ర మైన భావి జీవితం ఏది లేదు.
*  పశ్చిమ మండలాల గ్రామాలలో కనిపించే సాధారణ దృశ్యాలు ఇవే. కానీ పెరుగుతున్న పోటీ ప్రపంచంలో పొందవలసిన.. కనీస మద్దతు లేని అమాయకపు చిన్నారులు... LKG, UKG చదువులు లేకుండా సరాసరి ఒకటి లో చేరుతున్న పిల్లల పరిస్థితి.. తల్లిదండ్రుల నుండి.. చదువులకు సంబంధించి, కనీస సహకారం లేని పిల్లలే. అందువల్లే... కనీస అభ్యాసన ప్రమాణాలు, సామర్థ్యాలు కూడా ఉండవు. ఒక వైపు తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటివద్ద ఉండకుండా బడిలో ఉంటే చాలు భద్రత ఉంటుందని భావిస్తారు తప్ప ఏ మేరకు చదువుతున్నారన్నది వాళ్ల ఊహకు కూడా రాని అంశం. అందువల్లే, ఐదవ తరగతి పూర్తి చేసినా కనీస పదాలు ( తెలుగులో కూడా ) కూడా రాకుండా పోతున్నారు. ఆరవ తరగతిలో చేయకుండానే ఇంటి పనులు చేసుకోవడానికి బడి మానివేస్తున్నారు. ఆడపిల్లలు వంట పనులు చేయడానికి, మగ పిల్లలు మేకలు, గొర్రెలు కాయడానికి లేదా సొంత ఇంటి పొలం పనులకు పోయే పరిస్థితి ఉంది. అమ్మ ఒడి / తల్లికి వందనం పథకం ఉన్నందువల్ల నైనా పిల్లలు పై చదువులు కొనసాగుతున్నారు గాని, పాఠశాలలో హాజరు రెగ్యులర్ గా ఉండడం లేదు. ఎలాగో ఒకలా తొమ్మిదవ తరగతి వరకు కొనసాగుతారు.. మధ్య మధ్యలో డ్రాప్ ఔట్ లుగా మిగిలి పోతారు. ఇలాంటి పరిస్థితి తూర్పు ప్రాంతం లో 15 -20 శాతం గా ఉంటే పశ్చిమ ప్రాంతంలో 70- 80 శాతంగా వుంది.
  లోపించిన శ్రద్ధ....
* ప్రతి సంవత్సరం పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే వారిలో పశ్చిమ ప్రాంత ఉత్తీర్ణత శాతం 30 - 40 కి మించడం లేదు. పశ్చిమ ప్రాంతంలో దానికి పునాదులు ప్రాధమిక పాఠశాల స్థాయిలోనే పడుతున్నాయి. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన అవసరం వుంది. పునాది తరగతుల పై దృష్టి పెట్టకుండా పడవ తరగతి లో మాత్రమే ఎక్కువ శాతం ఫలితాలు వస్తే చాలని ప్రభుత్వం ప్రయత్నించడం వల్లే ఇలా జరుగుతుంది. ప్రాధమిక విద్య ను పటిష్టం చేస్తే, హై స్కూల్ విద్య బలోపేతం అవుతుంది. కొంత అభివృద్ధి చెందిన తూర్పు ప్రాంతం లో తల్లి దండ్రులు శ్రద్ధ పెట్టి చూస్తారు. పశ్చిమ ప్రాంతంలో అదీ లోపం.
 ప్రధాన కారణాలు:
 *పశ్చిమ ప్రాంత విద్యార్థి బాల్యం ఇంత నిర్లక్ష్యానికి గురి కావడానికి ప్రధాన కారణం పేదరికమే... తప్పని సరి వలసల జీవితం.. కొంత మేరకు తల్లిదండ్రుల నిరక్షరాస్యతలు మరికొంత కారణ మవుతున్నాయి. కనీసం ఆరవ తరగతి నుండైనా విద్యార్థులు కనబరచిన సామర్థ్యాల కనుగుణంగా గానీ, వెనుకబడిన విద్యార్థుల లోపాల కనుగుణంగా బోధనా సౌకర్యాలు లేని కారణంగా... పశ్చిమ ప్రాంత పిల్లల అవసరమైన భవిష్యత్ కు భరోసా లేకుండా పోతుంది. ఈ పరిస్థితులు మిగతా ప్రాంత పాఠశాలలో ఉన్నప్పటికీ, పశ్చిమ ప్రాంత పాఠశాలల్లో ఎక్కువగా వుంది.
*ప్రతి సంవత్సరం ప్రథమ్ సంస్థ విలువరించే ASER నివేదికల లెక్కలు అంత అధ్వాన్నంగా వుండడానికి మిగతా కారణాలు ఉన్నప్పటికీ ప్రభుత్వానిదే ప్రధాన కారణం...
వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా, నివేదికలను ప్రచురించి బోధిస్తున్న ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై నెపం వేస్తే సరిపోదు. పునాది స్థాయిలోని సమస్యలను గుర్తించి, ప్రాధమిక విద్య ను బలోపేతం చేయడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటే ఫలితాలుంటాయి.
లేకుంటే ఎన్ని దశాబ్దాలు గడుస్తున్నా అట్టడుగు స్థాయి పరిస్థితులు ఇలాగే ఉంటాయి. పశ్చిమ ప్రాంతంలో మరీ అధ్వాన్నంగా ఉంటాయి.
-రత్నం ఏసెపు


Tags:    

Similar News