అంతరంగ ఆవిష్కర్త - సామాజిక తాత్వికుడు పి. చంద్రశేఖర అజాద్

వ్యక్తి-సమాజం ఉమ్మడి శ్రేయస్సే తన ఏకైక లక్ష్యంగా కలాన్ని ఝళిపించిన రచయిత;

By :  Admin
Update: 2025-07-11 06:15 GMT

-అలజంగి మురళీధరరావు

పుంఖాను పుంఖంగా సాహిత్యాన్ని సృజిస్తూ ప్రజల పక్షం నిలుస్తున్న నేటి సాహితీకారులలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నవాడు, పరిచయం అక్కరలేని రచయిత, సినీ, టీవీ రంగాలలో సైతం తన నటన, రచనా కౌశల్యంతో దూసుకుపోతున్న వ్యక్తి, Lutuwig Witgenstain అన్నట్టు మాటకి, చేతకి, సిద్ధాంతానికి, ఆచరణకి భేదమెరుగనివాడు అయిన సృజనకారుడు ఎవరైనా ఉన్నారూ అంటే అది ఒక్క పి. చంద్రశేఖర అజాద్ అని చెప్పవచ్చు. కమ్యూనిస్టు కుటుంబ నేపధ్యంలో జన్మించి, ఆ సిద్ధాంతాన్నే జీవితాదర్శంగా చేసుకొని రాస్తున్నవాడు నిరాడంబరంగా జీవిస్తున్నవాడు పి. చంద్రశేఖర అజాద్. ప్రచార సాహిత్య సృజనకే పరిమితం కాకుండా ఉమ్మడిహిత ప్రచార ఉద్యమంలో 'వ్యక్తి' విస్మరించతగని అంశమని తన అపార సాహిత్య జ్ఞానంతో గుర్తెరిగి రాస్తున్న అతి తక్కువ రచయితల్లో నిలుస్తాడు. వ్యక్తి-సమాజం ఉమ్మడి శ్రేయస్సే తన ఏకైక లక్ష్యంగా కలాన్ని ఝళిపిస్తూ వందల కథలు, నవలలు, కవిత్వం మరియు వ్యాసాలు రాసిన, రాస్తున్న అతని విస్తారమైన సాహిత్యాన్ని సంపుటీకరించవలసిన సాహిత్య సందర్భంలో మనమిప్పుడు ఉన్నామని అనివార్యంగా గుర్తించాల్సిన సమయమిది. ఇటీవలనే వారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. దీనితో ఆయన సాహిత్య కృషి ఎల్లలు దాటినట్టయ్యింది, జాతీయస్థాయిలో గుర్తింపుకి నోచుకున్నట్టయ్యింది. ఆయన కొన్ని నవలలు సార్వత్రిక మానవీయ విలువలను పొదువుకొని ఉండి ఆంగ్ల భాషలోనికి కూడా అనువాదార్హత కలిగి ఉన్నట్టుగా వారి రచనలను చదువుకున్న నాకు అర్థమయ్యింది. 2025 మార్చి నెలలో మునిపల్లె రాజు సాహితీ పురస్కారాన్ని స్వీకరించిన సందర్భంగా అసంఖ్యాకమైన వారి నవలల్లో ఓ ఐదింటిని తీసుకుని కొండ అద్దమందు అన్న చందంగా పరిచయం చెయ్యబోవడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

విపరీత వ్యక్తులు :

ప్రస్తుత సమాజ పోకడలు, వ్యక్తివాద స్వభావాలు, సాహిత్య ధోరణులు, కుటుంబ కుహనా విలువలు ఇలా జీవితపు సమస్తపార్శ్వాలలోని కపటత్వాన్ని ప్రశ్నించే పాత్ర గౌతమ్. ప్రశ్నించడమేకాదు తాను నిజమని నమ్మిన విధంగా జీవిస్తుంటాడు కూడా. అందరూ అతనిని 'పర్వర్ట్' అంటారు, విపరీత ప్రవర్తనగల మనిషిగా జమకడతారు. వీళ్ళంతా ఎక్కడో అతని వాదనలోని లాజిక్ ని మిస్ అవుతుంటారు. నిజంగా తమ అస్తిత్వపు పునాదులను కుదిపివేసే పాత్ర గౌతమ్ ది. మనిషిలోని అహం ఎదుటి మనిషిలోని సత్యాన్ని అంత తొందరగా ఒప్పుకోనీయరు కదా! గౌతమ్ స్వయానా తను నమ్మిన సత్యం కోసం, అలానే జీవించటం కోసం, స్వేచ్ఛ కోసం సమాజ చట్రం నుండి బయటపడటం కోసం అతను తన తండ్రినే కాదు ఆలుబిడ్డలను కూడా వదులుకుంటాడు. అందుకే అతను 'విపరీత వ్యక్తి' అయిపోయాడు.

దేశమంతా తిరుగుతాడు. పాటలు పాడుతూ రోడ్డు మీద జనం వేసిన చిల్లరతో బతకడానికి సిగ్గుపడడు. అవార్డులు, రివార్డులు అని ప్రభుత్వం చుట్టూ, సంస్థల చుట్టూ తిరిగి ఆత్మహననం చేసుకునే కంటే ప్రజలు మన ప్రతిభని మెచ్చుకొని ఇచ్చిన సత్తు రూపాయి కూడా అదెంతో తనకు ఆనందం కలిగిస్తుందని అంటాడు గౌతమ్. గంజాయి మనిషికి చేసే మేలు మీద ఇంకా చాలా గట్టిగా పరిశోధన జరగాలంటాడు. దాన్ని సరిగ్గా వాడుకోలేక నిషేధించి మానవజాతి ఎంతో నిర్వీర్యం అయిపోయింది అంటాడు గౌతమ్. ఇతని ఆలోచనలు, విమర్శలన్నీ సభ్య సమాజాన్ని ఠారెత్తిస్తాయి. గుడ్డలూడదీసి నిజ చిత్రాన్ని చూపిస్తాయి. గౌతమ్ విపరీత స్వభావంలోని అసలు నిజాన్ని చూసినవారు ముగ్గురే. ఒకరు అతని తల్లి, ఇంకొకరు తనకు సంగీతం నేర్పిన గురువు, మరొకరు తన మిత్రుడు రాయుడు. గంజాయి ప్రభావమో, పర్యటనానుభవమో లేదా తన ఆలోచనల్లో వచ్చిన మార్పోగాని చిత్ర భమలకు లోనవుతూ తన వాళ్ళ మీద, కుమారుడు రాహుల్ మీద గౌతమ్ కు మనసు మళ్లుతుంది. ఒక సందిగ్ధం, ఒక ఝంఝాటం, ఒక మీమాంస, ఒక ఊగిసలాట, టూబీ ఆర్ నాట్ టూ బీ... ఇలా ఒక ఎడతెగని ఒక ప్రశ్న గౌతమ్ పై వేలాడుతుంటుంది. అతనిది ఒక ఒంటరి యుద్ధం. ఓడిపోయినా గాని కాలం అతన్ని చివరికి విజేతను చేస్తుందని పాఠకులకు నమ్మకం కలిగించే రీతిలో రచయిత వాదన సాగుతుంది. మనల్ని బాగా ఆలోచింపచేసి, డిస్టర్బ్ చేసే నవల పి. చంద్రశేఖర అజాద్ 'విపరీత వ్యక్తులు'. ఈ నవలను ఆంగ్లంలోనికి అనువదించి సరిగ్గా ప్రమోట్ చేస్తే ఖండాంతర ఖ్యాతి పొందే కంటెంట్ ఈ నవలలో వుంది.

ఆది-అంతం :

గతంలో మునిపల్లె రాజు 'తాత్విక కథలు' చదివిన అనుభవం ఉన్నా పి. చంద్రశేఖర అజాద్ గారి 'ఆది-అంతం' అనే ఒక తాత్విక నవలని చదవడం ఇదే ప్రథమం. సృష్ఠి ఆరంభం, పంచభూతాల సంఘర్షణాకేళి, కాలం, స్థలం, జీవావిర్భావం, మనిషి పుట్టుక, మానవ సమాజపు తొలితొలి ఐక్యత, ఆర్గానిక్ సాలిడారిటీ, అనంతర అంతః సంఘర్షణ, భిన్నభావజాలాల పుట్టుక. అనైక్యత, వేర్పాటు, యుద్ధాలు, అడిషడ్వర్గాలు చేస్తున్న కరాళ నృత్యాలు, మత ఘర్షణలు, సాంస్కృతిక అస్పుశ్యతలు, గందరగోళపు మానవాంతరంగాలు, స్త్రీ-పురుష పరస్పర సిభిరాలు, పిడివాదాలు, విశ్వమానవ సిద్ధాంతాల మాటునుంచి తొంగి చూస్తున్న మనోవైకల్యాలూ, సప్త సముద్రాలకంటే మించి లోతైన మనస్సుని ఇంకా సరిగ్గా చూడ ప్రయత్నించని హస్వదృష్టులు. ఆదిలో శబ్దముంది, పదార్థ ఘర్షణ నుంచి జనించిన శబ్దం, కాంతి చలించి, జ్వలించి, విచలితమై, జీవులై, మానవులై ఎటు సాగుతోంది ఈ పయనం, అసలు సత్యం అన్నది ఏమిటి? మనలో అప్పుడప్పుడు పైకి వచ్చే, ఒక జిజ్ఞాసువుకి కలిగే సృష్ఠి నిర్మాణపు ఆలోచనాతరంగాలు ఇవి!! మౌలిక తాత్విక యోచనలివి!! చింతన ఏదో బిందువు వద్ద ఆగిపోరాదు, మనం మనల్ని తొలుచుకొని, ఒలుచుకొని మన మూలథాతువుని పట్టుకోవడం, దీని ఆసరాగా విశాల విశ్వ నిర్మాణ మూల రహస్యాన్ని అన్వేషించడం, ఈ సుజ్ఞాన వెలుగులతో వైరుధ్యాలను అర్థం చేసుకోవడం, ప్రకృతి బాటలో నడిచిపోవడం-వైయక్తిక స్వేచ్ఛా పవనాలు సుతిమెత్తగా వీచే ఒక స్వస్థ ఐక్యసమాజాన్ని నిర్మించుకోవడం - భావి తరాలకు అందించడం. ఇది కదా మానవ కర్తవ్యం, ఇది కదా నిజమైన మానవ కళ్యాణం!! ఇంత విశాల దృష్టితో ప్రకృతిని పరికించినపుడే కదా ఒక క్రొంకొత్త సత్యమానవుడు, స్వస్థ సమాజం ఉదయించేది అంటాడు రచయిత అజాద్. 'ఆది-అంతం' నవలలో మనసా నమ్మిన విశ్వాసాలను బద్దలు కొట్టుకొని మనిషి ముందుకు సాగినప్పుడే సత్యం తనంతటతానే ఎదురొస్తుంది. ఆ సత్యం సాపేక్షమా లేక నిరపేక్షమా అన్న మీమాంస పటాపంచలు అయినంత వరకు అన్వేషణ తప్పదు. మానవ జీవితంలోని ఎన్నెన్ని వైరుధ్యాలో అన్నన్ని వైరుధ్యాలని పాత్రలనే ప్రతీకల చాటున సృష్టి లేదా ప్రకృతి యొక్క డైనమిక్స్ ని, చలనాల్ని, తృప్తులని, అసంతృప్తులని చూపే ప్రయత్నమే ఈ నవల. కథని స్థూలంగానే అయినా ఇక్కడ పరిచయం చేస్తే రచయిత అజాద్ కి అన్యాయం చేసినట్టే అవుతుంది. 'ఆది-అంతం'లోనే అతనిని తనివి తీరా దర్శించండి.

మేకింగ్ ఆఫ్ ఎ రైటర్ :

ఇది అజాద్ గారి స్వీయ చింతనాత్మక కథ. పెద్దగా చదువులేదు, డిగ్రీలు లేవు, ప్రపంచసాహిత్యంతో పరిచయమూ లేదు. మరి ఒక వ్యక్తి మహారచయితగా ఎలా తయారవుతాడు? అది సాధ్యమా? సాధ్యమే అని నిరూపణ చెయ్యడానికి ఇటీవల ప్రచురితమైన పి. చంద్రశేఖర అజాద్ ఆత్మ నవలాత్మక కథ 'మేకింగ్ ఆఫ్ ఎ రైటర్' చదివితే చాలు. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో దుర్ఘటనలు, ఆర్థిక సంకటాలు... ఇదే జీవితం అన్నట్టుగా మనుగడసాగించిన అజాద్. రచననే శ్వాసగా పీల్చి జీవితంలో ఎదుర్కున్న ప్రతిసంఘననూ, మానవ ప్రవర్తననూ నవలలుగా మలిచారు. ఒక గోర్కీ, ఒక ఛార్లెస్ డికెన్స్, ఒక దాస్తోవ్ యెస్కీ దుర్భర జీవితం తీర్చిదిద్దిన మహారచయితలు. అజాద్ కూడా ఆకోవకి చెందిన రచయితేనని ఈ రచనలో ప్రతిపుటలోను ఆవిషయం అర్థమౌతుంది. ఈ రచనా క్రమంలో తన అనుభవాల నేపథ్యంలో రచయితలుగా ఎదగాలనుకునేవారికి, సూచనలు, సలహాలు ఇస్తారు. రచనలు ఎలా ప్రారంభించాలి? ఎక్కడ ఆపాలి? చుట్టూ ఉన్న సామాజిక పరిసరాల నుండి కథా ఇతివృత్తాలను ఎలా అన్వేషించాలి? అనే విషయాలు కూడా మనల్ని మరో మెట్టు ఎక్కిస్తాయి. నిఖార్సయిన జీవితం అనే ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయిన అజాద్ సాహిత్యం, అనుభవాలు ఏమి చెబుతున్నాయంటే రచన అంటే ప్రపంచాన్ని ధిక్కరించడం, రచన అంటే మొక్కవోని ధైర్యం, రచన అంటే ప్రకృతిని ఆరాధించడం. ఈ పుస్తకానికి బ్లర్బ్ రాసిన సత్యవోలు కిరణ్ కుమార్ అన్నట్టు 'మేకింగ్ ఆఫ్ ఎ రైటర్' ఒక మాస్టర్ పీస్!

అహానికి రంగుండదు :

విష్ణు ఒక అంతర్ముఖుడు. కథ ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కమ్యూనిస్టుగా బతకాలనుకున్న విష్ణు అహానికి గురై తన జీవన విధానము నుండి బయటకు వస్తే జరిగిన పతనమే ఈ 135 పేజీల చిన్న నవల. ఏ రంగులకి చెందిన వారయినా అహానికి అతీతులుకారు అనే నగ్నసత్యాన్ని ధృఢమైన పాత్రల చిత్రణతో, మానవాంతరంగపు చీకటి చిత్రాన్ని బరువైన మాటలతో రచయిత చూపిస్తూ ఒక అధివాస్తవిక కోణాన్ని ఈ నవలకి అద్దేరు. మనిషి ప్రవర్తనా రీతులని ఎంతో లోతుగా రచయిత స్ప్రుశించేరో ఈ కింది వాక్యాలు నిరూపిస్తాయి.

 వాడికి కోపం వస్తే ఎవరితో మాట్లాడడు. ఎంతగొప్ప బంధాన్నయినా తెంచేసుకుంటాడు. అంతేకాదు రేపు ఏమవుతుంది, ఈ మనుషులతో అవసరం రావచ్చు అనుకోడు. (ఈ వాక్యం నా గురించి రాసేరా అని అదిరిపడ్డాను).

 మద్యం మనుషుల్ని దగ్గరకు చేరుస్తుంది. తాగినప్పుడే ఎవరయినా మనసు విప్పి మాట్లాడతారు. ఎవరికీ చెప్పని రహస్యాలు చెబుతారు.

 ఓ సారి చెడిపోయిన వాడికి ఇంకో సారి చెడిపోవడం, చెడిపోతూనే వుండటం అలవాటవుతుంది.

 త్యాగాలకు వారసత్వం వుండదు. అధికారానికి, వైభవాలకు, దోపిడీకి వారసత్వం ఉంటుంది.

 ప్రతి పతనమైన మనిషికి కొన్ని రహస్యాలుంటాయి. అవి వారితో బాటు కాలగర్భంలో కలుస్తాయి.

కవిగారి అంతరంగాలు :  

ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా నిజాన్ని నిర్భయంగా చెప్పే తత్వం అజాద్ గారిది. ఇది వారు ఇటీవల ప్రచురించిన 'కవిగారి అంతరంగాలు' పుస్తకంలో శిఖరానికి చేరుకుంది. ఇలాంటి రచనలు చేయడానికి టన్నుల కొద్ది ధైర్యం, తెగువ మాత్రమే సరిపోదు, నమ్మిన సిద్ధాంతం పట్ల సంపూర్ణమైన నిబద్ధత కూడా ఉండాలి. 70 పేజీల ఈ చిన్న పుస్తకంలో విమర్శేకాదు ఆత్మ విమర్శ కూడా వుంది. చంద్రశేఖర అజాద్ కవిగా తను చేసిన ప్రయాణంలోని ఎగుడుదిగుళ్లనే కాదు తన కాలం నాటి మరియు నేటి కవితా ప్రపంచాన్ని, సాహితీ ధోరణిని అత్యంత సూటిగా మనముందు పరుస్తారు. అంతేగాక తన వైయక్తిక దోషాలను కూడా ఎంతో నిజాయితీగా చెప్పుకుపోతారు. చిన్న పుస్తకమే గాని పఠనం మిగిల్చిన అనుభవం మాత్రం పెద్దది. జీవితకాలం వెంటాడే పలుకుల సమాహారం ఈ 'కవిగారి అంతరంగాలు'. ఇట్లాంటి పుస్తకాలను చదివినప్పుడే ఫ్రాంజ్ కాస్కా చెప్పిన 'A book must be the ase for the frozen sea with in us' లాంటి వాక్యాలు గుర్తుకు వస్తాయి.

వర్థమాన కవులు, రచయితలు, సాహిత్యకారులంతా చంద్రశేఖర అజాద్ రచనల్ని చదవాలి, ఆత్మ విమర్శని స్వాగతిస్తూ, ఒక నూతన సాహిత్యలోక నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి.

Tags:    

Similar News