మట్టిదిబ్బగా మారిన ఏలూరు జూట్ మిల్లు
మిల్లు మాయమయిన దృశ్యం మనస్సుని కలచివేసింది;
-ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
ఏలూరు కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ వైపు వెళ్లే దారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి పై బస్సులు, కార్ల వంటి వాహనాల్లో వెళ్లే వారికి నిత్యం రణగొణ శబ్దంతో శ్రీకృష్ణా జూట్ మిల్లు కనిపిస్తుంది. దాని రూపం ఇక కనపడదు, ఆ శబ్దం వినబడదు. అదో కన్నీటి విషాద గాధ!
దాదాపు నూటా ఇరవై ఏండ్ల చరిత్ర గల ఏలూరు శ్రీకృష్ణా జూట్ మిల్లు నేడు ఓ మట్టిదిబ్బగా మారింది. ఈ విషాద దృశ్యం నిన్న 12-1-2025 న ఏలూరు వెళ్లిన సందర్బంగా నా కంటపడింది. ఆ దృశ్యం చూసిన క్షణంలో నా కళ్ళ నుండి అనుకోకుండానే నీళ్లు రాలిపడ్డాయి. అది నా గుండెల్ని పిండింది. మనస్సుని కలచివేసింది. గత రాత్రి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆ విషాద గాధ గూర్చి స్పందించకుండా ఉండలేకపోతున్నాను.
ఏలూరు జూట్ మిల్లు పెట్టుబడిదారుడి కిరాయి గుండా కార్మిక నాయకుడి ప్రత్యక్ష సారథ్యంలో 32 ఏండ్ల క్రితం 16-5-1993 న జూట్ కార్మికవర్గం పై ఓ రౌడీ ముఠా వ్యవస్తీకృత దాడి చేసింది. అందులో ఏలూరు సమీపంలోని కోమడవోలు గ్రామానికి చెందిన యార్లగడ్డ వాసు అనే జూట్ మిల్లు వర్కర్ తీవ్రంగా గాయపడ్డాడు. అది నాటి ఏలూరు జూట్ కార్మికవర్గానికి గుర్తుకు వచ్చే గత చరిత్ర! ఆయన ఫినిషింగ్ డిపార్ట్మెంట్ బేల్ ప్రెస్ సెక్షన్ వర్కర్ గా పని చేసేవాడు. ఆయన్ని కార్మికులు బేల్ ప్రెస్ వాసు అని పిలుస్తారు. IFTU అనుబంధ జూట్ మజ్దూర్ యూనియన్ స్టీరింగ్ కమిటీ సభ్యునిగా పనిచేశాడు. ఆయన పదేండ్ల క్రితమే రిటైర్ అయ్యాడు. షుగర్ వ్యాధి వల్ల కుడికాలు మోకాలి వరకూ తొలగించిన వార్త తెల్సి పరామర్శకై నిన్న 12-1-2025న ఏలూరు వెళ్లా. ఆ సందర్బంగా ఏలూరులో ఓవర్ బ్రిడ్జి పై నుండి వెళ్తుండగా జూట్ మిల్ దృశ్యాన్ని చూశా. అది మట్టిదిబ్బగా మారి మానవతను వెక్కిరిస్తూ వికృతంగా కనిపించింది.
1904 నుండి 2021 వరకు 115 ఏండ్ల పాటు ఐదు తరాలకు చెందిన వేల కార్మిక కుటుంబాలకు ఆ మిల్లు ఒక జీవనోపాధి కేంద్రంగా కొనసాగింది. ఏలూరు పేరు వింటేనే జూట్ మిల్ ఒక ల్యాండ్ మార్క్ గా గుర్తు వచ్చేది. సైరన్ కూతల నుండి మిల్లు యంత్రాల ధ్వనుల వరకూ నిత్య సందడితో వుండేది. యాజమాన్యం విలువైన మిల్లు స్థలాల్ని రియల్ ఎస్టేట్ ఆస్తులుగా మార్చుకొని వాటిని అమ్మి సొమ్ము చేసుకునే దుష్ట బుద్దితో దానిని శాశ్వత మూసివేతకి గురిచేసింది. దేశప్రజలకి స్వాతంత్య్రం వచ్చిందని పండగగా చేసుకునే రిపబ్లిక్ డే రోజే శాశ్వత మూసివేతకు దిగింది. ఈ జనవరి 26కి మూడేండ్లు నిండుతుంది.
పెట్టుబడిదారుడి దుష్ట చరిత్ర అక్కడే ఆగలేదు. కార్మికవర్గ రక్తమాంసాలు, చెమట పై పెను లాభాలు గడించిన యాజమాన్యం తన ఆదీనాన దాదాపు పాతికకేళ్ళ క్రితం ఏలూరు సమీపాన కొత్తూరులో స్థాపించిన మరో జూట్ మిల్లును కూడా శాశ్వత మూసివేతకి పాల్పడింది. ఏలూరు మిల్లు నాలుగు వేలకు పైగా కార్మికులతో కొత్తూరు మిల్లు మరో మూడు వేలకు మందికి పైగా కార్మికులతో కలిపి దాదాపు ఎనిమిది వేల కార్మిక కుటుంబాలకు జీవనోపాధిని కల్పించే పరిస్థితిని యాజమాన్యం క్రమంగా దిగజార్చింది. చివరకు రెండు జూట్ మిల్లుల్ని శాశ్వతంగా మూసివేసింది. సైరన్ మోతలతో, కార్మికుల అలజడితో జీవనోపాధి కేంద్రంగా లేదా ఉద్యమ సందడితో వర్ధిల్లే జూట్ మిల్లులు నేడు బుల్ డోజర్లతో రియల్ ఎస్టేట్ రాబందుల రెక్కల చప్పుళ్ల కేంద్రాలుగా మారి మిల్లుల స్థలాలు చదును చాలా చకచక చేయబడుతున్నాయి.
ఈ మిల్లుల్ని నమ్ముకొని బ్రతికే వేల మంది జూట్ కార్మిక కుటుంబాలను యాజమాన్యం తన రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం బలి తీసుకుంది. కార్మికులు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరి పోయారు. నేడు ఒక్కొక్క జూట్ కార్మిక కుటుంబం ఒక్కొక్క విషాద గాధను వినిపిస్తుంది. బ్రతుకు చితికిన కుటుంబాలు ఎన్నో! జీవనోపాధిని కోల్పోయి దిక్కుతోచని దీనులెందరో! వేరే పని దొరక్క అల్లాడుతున్న నిస్సహాయులెందరో! ఒకవేళ పని దొరికినా అలవాటు లేని పనికి శరీరం సహకరించని వారి వెతలు ఎన్నో! అలవాటు లేని పనుల్లో ప్రమాదాలు జరిగి కారణంగా నష్టాలు కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు ఎందరో! అలా దొరికిన పనికి ఇచ్చే కూలి పనిలో కూడా జీతం కోత ఎంతో! పైగా గాలిబుడగ వంటి అట్టి పనుల నుండి అకారణంగా ఎప్పుడు తొలగిస్తారో తెలియని భయం వెంటాడుతోంది. చేసిన అప్పులు తీర్చలేక, పాత అప్పుల మీద వడ్డీ కట్టలేక, కొత్త అప్పులు పుట్టక, పిల్లల చదువులు చదివించలేక, చివరకు ఇల్లు గడవక ఎన్ని కార్మిక కుటుంబాలు నేడు రోడ్డు పాలైనవో! మనసున్న మనుషులు వినడానికి సిద్దపడితే ఒక్కొక్క జూట్ కార్మిక కుటుంబం ఒక్కో విషాదగాధ వినిపిస్తాయి.
ఒకవైపు కార్మికవర్గ కన్నీటి చరిత్ర ఇంతటి దీనంగా వుంటే మరోవైపు ఆ మిల్లు యాజమాన్యం దర్జాగా స్థలాల్ని రియల్ ఎస్టేట్ భూమిగా మార్చి అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నంలో మునిగింది. బుల్ డోజర్లు, జేసీబీలతో అది జూట్ మిల్లు స్థలాల్ని చదును చేయిస్తోంది. ఆ అమానుష దృశ్యం చూస్తే కళ్ళు చెమరుస్తాయి.
ప్రజల ఓట్లతో గెలిచి పాలిస్తున్న రాజకీయ వ్యవస్థకు వేలాది కార్మిక కుటుంబాల జీవితాల విధ్వంసం గూర్చి పట్టదు. వారి కన్నీటి బాధలు ఏవీ అక్కర్లేదు. పెట్టుబడిదార్ల దగ్గర దొరికే ముడుపులు శ్రామికవర్గం వద్ద వాళ్లకు దొరకవు. ఇది వర్తమాన సోకాల్డ్ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థ నిజ దుస్థితిని సూచిస్తోంది.
ఇంతవరకూ ఏలూరు నగరానికి ఒక ల్యాండ్ మార్క్ గా వర్ధిల్లిన జూట్ మిల్లుల విధ్వంసం జూట్ కార్మిక జీవితాల వరకే పరిమితం కాదు. అది ఇతర శ్రమ వృత్తులపై కూడా దుష్ప్రభావం పడుతుంది. వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాల పై కూడా పడుతుంది. భవిష్యత్ లో ఏలూరు నగరం, పరిసర ప్రాంత ప్రజల పై కూడా ప్రభావం కలిగిస్తుంది.
కార్మిక జీవన విధ్వంసం నుండి కార్మికవర్గం ఒక విలువైన గుణపాఠం నేర్చుకోవాల్సి వుంది. తమ అండతో గెలిచి అధికారం చేపట్టి పాలించే రాజకీయ వ్యవస్థ నిజ ఆచరణలో ఎవరి పక్షాన నిలబడుతుందో అర్ధం చేసుకోవాల్సి వుంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య ఏ తేడా లేదని గుర్తించాలి. వీరిలో ఏ పార్టీ వాళ్లయినా మన కష్టజీవుల రక్తమాంసాలు, చెమట ధారలపై మిల్లుల యాజమాన్యం గడించిన సంపదలో ముడుపుల కోసం కక్కుర్తి పడి మన శ్రామికవర్గానికి పచ్చి ద్రోహం చేసే వాళ్ళే! ఈ చేదు నిజాన్ని గ్రహించి రేపటి తమ కన్నీళ్లకు కారణాల్ని గుర్తిస్తుందని ఆశిస్తున్నాను.
(ఇఫ్టూ ప్రసాద్ (పిపి) ఒక నాటి ఏలూరు జూట్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు, ఏలూరు. ప్రస్తుత AP IFTU రాష్ట్ర అధ్యక్షులు)