‘భారత ఎలక్షన్ కమీషన్‌కు కొన్ని ప్రశ్నలు’

ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యంగా ఈసీ నిష్క్రియాత్మకత, బీజేపీ విద్వేషపూరిత ప్రసంగాల మీద ఇంతకు ముందే ఈఏఎస్ శర్మ ఆందోళనలను వ్యక్తం చేశారు.

Update: 2024-06-13 07:51 GMT


రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని నిర్దేశిస్తున్నప్పటికి ఒక అథారిటీగా కమిషన్ ఎన్నికలను నిర్వహించిన తీరుపై ఆవేదన, నిరాశ వ్యక్తమవుతోంది. ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ నిష్క్రియాత్మకత, బీజేపీ విద్వేషపూరిత ప్రసంగాల మీద ఇంతకు ముందే నేను ఆందోళనలను వ్యక్తం చేశాను. మే 23, 27.. 2024 న కమిషన్ కు లేఖలు రాశాను. వాటిని కమిషన్ విస్మరించకూడదు, ఈ లేఖ (జూన్ 2) ద్వారా కమిషన్ పరిశీలనకు మరికొన్ని విషయాలు నివేదిస్తున్నాను.

ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, మార్పు కోసం కమిషన్ తన విధులను ఒక్కసారైనా భయం, పక్షపాతం లేకుండా నిర్వర్తిస్తుందని ఆశిస్తాము. అయితే కమిషన్ ఇప్పటివరకు ఎన్నికలను నిర్వహించిన తీరు వల్ల దాని రాజకీయ తటస్థత, సమర్థతపై ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందటంలో విఫలమైందని నేను చెప్పగలను.

మీలో ప్రతి ఒక్కరి మనస్సాక్షిని మేల్కొల్పడానికి, ఆర్టికల్ 324 ఆదేశానికి మీరు కట్టుబడి ఉండటంపై ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మీకు గుర్తు చేయడానికి చివరి నిమిషంలో నేను ఈ లేఖ రాస్తున్నాను.

స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా

ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ఏ విషయంలోనైనా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించే అపారమైన అధికారం ఆర్టికల్ 324 ప్రకారం తమకు ఉందని కమిషన్‌కు తెలిసినట్లు కనిపించడం లేదు. "రాజు ఏ తప్పూ చేయలేడు" అని వినయంగా భావించి, తన అసమర్థత వల్లనో, ప్రభుత్వానికి లొంగిపోవడం వల్లనో, అటువంటి అధికారాన్ని ఉపయోగించడానికి కమిషన్ చాలా విముఖతతో, అయిష్టంగా ఉన్నట్టు కనబడుతోంది. ఈ నేపథ్యంలో మీ పనితీరులో పారదర్శకతను ధృవీకరించడానికి, మీరు సమాధానం ఇవ్వడానికి నేను ఈ క్రింది ప్రశ్నలను లేవనెత్తుతున్నాను:

1. రాజకీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, ముఖ్యంగా బీజేపీ, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. ఓట్ల కోసం మతాన్ని విచ్చలవిడిగా ప్రేరేపించడం, విభజన ప్రకటనలు చేయడం, విద్వేషాన్ని ప్రోత్సహించడం, వీటిపై కమిషన్ ఏ మాత్రం చర్య తీసుకోకపోవడం, లేదా చర్య తీసుకోవడంలో అనవసరంగా జాప్యం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోకుండా ఉండటం వంటి నిర్దిష్ట ఉదాహరణలను నేను నా ఉత్తరాల్లో ఎత్తి చూపాను. ఇటువంటి ప్రకటనలు ఎంసీసీ(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని ఉల్లంఘించాయని, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 123, 125 ప్రకారం "అవినీతికి" పాల్పడినట్లు, ఐపిసి / భారతీయ న్యాయ్ సంహిత కింద శిక్షార్హమైన నేరాలకు పాల్పడినట్లు అవుతుందని బాగా తెలుసు.

కమిషన్ తన నిష్క్రియాత్మకత లేక ఆలస్యమైన , సౌమ్యమైన, అసమర్థ మైన ప్రతిస్పందనల ద్వారా, వారిని అరికట్టలేకపోగా, ఆ ప్రచారకులకు ఇటువంటి అభ్యంతరకరమైన ప్రకటనలు పునరావృతం చేయటానికి అవకాశం కల్పించింది. సీనియర్లు బాధ్యతాయుతమైన ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు చేసే ఇలాంటి ప్రకటనలు ఎన్నికల సమగ్రతపై, ప్రజాస్వామ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాలకు దారితీయడమే కాకుండా సమాజ సామరస్యాన్ని దెబ్బతీస్తాయనే విషయం కమిషన్‌కు తెలియదా? కమిషన్ తన నిష్క్రియాపరత్వం వల్ల ఇలాంటి దురదృష్టకర పరిస్థితిలో భాగస్వామిగా మారలేదా?

2019 మార్చిలో జారీ చేసిన తన సొంత "మాన్యువల్ ఆఫ్ ఎంసీసీ, డాక్యుమెంట్ 21" పేరా 2.2.2 లో ఇటువంటి ఎంసీసీ ఉల్లంఘనలపై సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన కమిషన్ తన పూర్వీకులను విడిచిపెట్టలేదా? బహుశా ఆ మాన్యువల్‌లోని అంశాల గురించి కూడా కమిషన్‌కు తెలియకపోవచ్చు!

2. పారదర్శకమైన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ (ఈబీఎస్) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈబీఎస్ ద్వారా భారీ మొత్తంలో కార్పొరేట్ విరాళాలు సేకరించి, బెదిరింపులకు పాల్పడటం, ప్రజాప్రయోజనాలను దెబ్బతీసే అనారోగ్యకరమైన క్విడ్ ప్రోకోలు ఇవ్వడం కమిషన్‌కు తెలియదా? బీజేపీ, ఇతరులు వసూలు చేసిన ఈబీఎస్ మొత్తాలను ఎన్నికల ప్రచారంలో ఉపయోగించకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం తన అధికారాన్ని ఎందుకు వినియోగించలేదు? ఎన్నికల సంఘం తన నిష్క్రియాపరత్వం వల్ల ఉద్దేశపూర్వకంగానో, ఇతరత్రానో ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇవ్వలేదా?

3. ఈవీఎంల తయారీ, సరఫరా బాధ్యతలను అప్పగించిన రెండు సీపీఎస్ఈలైన బీఈఎల్, ఈసీఐఎల్ డైరెక్టర్లుగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన నామినీలను నియమించిందని, అదే విధంగా ఈబీఎస్ నిర్వహణ బాధ్యతలు అప్పగించిన ఎస్బీఐ బోర్డులో తన నామినీని నిలబెట్టిన విషయం కమిషన్కు తెలియదా? ఆ అభ్యర్థులను వెనక్కి పిలిపించాలని ఎన్డీయే ప్రభుత్వాన్ని కమిషన్ ఎందుకు ఆదేశించలేదు? ఇది ఈవీఎంలపై ఉన్న నమ్మకాన్ని పరోక్షంగా దెబ్బతీయలేదా?

4. ఓటు- తాను ఎన్నుకున్న అభ్యర్థికి పడిందని తెలుసుకునే హక్కును ఓటరుకు లేకుండా చేసే ఈవీఎం వ్యవస్థ బ్లాక్ బాక్స్ లో దాగి ఉన్న చట్టపరమైన లోపాలను విస్మరించి ఎన్నికల సంఘం మొండిగా ఈవీఎం వ్యవస్థను సమర్థిస్తోంది. ఈవీఎంలు-వీవీప్యాట్ వ్యవస్థలోని నిర్దిష్ట విభాగాలపై ఇతర సమర్థులైన సాంకేతిక నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కమిషన్ కళ్లు, చెవులు ఎందుకు మూసుకుంది? బదులుగా, కమిషన్ దాని నలుగురు సభ్యుల టిఇసి అందించే సాంకేతిక సలహాలపై మాత్రమే ఆధారపడింది. ఆ విభాగాలను, ముఖ్యంగా లొకేషన్-స్పెసిఫిక్ వీవీప్యాట్ యంత్రాల్లోని "సింబల్ అప్లోడింగ్ మాడ్యూల్"ను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో స్వతంత్ర టెక్నికల్ ఆడిట్కు గురిచేయడానికి కమిషన్ ఎటువంటి ప్రయత్నాలు చేసింది?

5. ఈవీఎం-వీవీప్యాట్ వ్యవస్థకు పేటెంట్ తీసుకున్న బీఈఎల్‌తో టీఈసీలోని నలుగురు సభ్యులు కూడా సహా యజమానులు అన్న విషయం కమిషన్‌కు తెలియదా? సాంకేతిక సలహా సంస్థగా టిఇసి యొక్క స్వతంత్రతపై అనుమానం కలిగించే “ప్రయోజనాల సంఘర్షణను” ఇది సూచించలేదా? బిజెపి నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం టిఇసిలోని కనీసం ఒక సభ్యుడిని దాని స్పాన్సర్ చేసిన రెండు సంస్థలలో డైరెక్టర్‌గా ఎన్నుకున్న విషయం కమిషన్‌కు తెలియదా, అదే సభ్యుడిని బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాజ్యాంగంలో ఒక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ బోర్డులో డైరెక్టర్ గా ఎంపిక చేసింది. ఈవీఎం వ్యవస్థ సమర్థతపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ఇంతటి నిస్సిగ్గు సంఘర్షణను పరిష్కరించడానికి కమిషన్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది?

6. ఈవీఎంల సమర్థతలో సాంకేతిక లోపాలున్నాయని తెలిసినా వీవీప్యాట్ బ్యాలెట్ లెక్కింపుతో పోలిస్తే ఈవీఎం ఓట్ల లెక్కింపును 100 శాతం క్రాస్ వెరిఫికేషన్ కు ఆదేశించడానికి కమిషన్ అంగీకరించి ఉండాల్సింది కాదా? కమిషన్ తన సంసిద్ధతను వ్యక్తం చేసి ఉంటే ఇటువంటి దిద్దుబాటు చర్యలకు సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసేది కాదని తెలిసినా, అటువంటి క్రాస్ వెరిఫికేషన్ ను మొండిగా ప్రతిఘటించడం ద్వారా ఈవీఎం వ్యవస్థ యొక్క విశ్వసనీయతను పునరుద్ధరించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కమిషన్ చేజార్చుకుందా? ఈ ఆలస్య సమయంలో కూడా, ప్రజల నమ్మకాన్ని పొందడానికి కమిషన్ తన అధికారాన్ని ఉపయోగించి, కనీసం గెలుపు మార్జిన్ 10% కంటే తక్కువ ఉన్న అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 100% క్రాస్ వెరిఫికేషన్కు ఆదేశించవచ్చు కదా

7. ఈవీఎంల వ్యవస్థలోని కొన్ని విభాగాలు తారుమారు చేసే అవకాశం ఉందని నిరూపితమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుని (ఉదా: వీవీప్యాట్, కంట్రోల్ యూనిట్‌ను జత చేయడానికి సాంకేతిక ఏర్పాట్లు లేకపోవడం, ఈవీఎం వ్యవస్థ జియో ట్యాగింగ్ లేకపోవడం మొదలైనవి), ఎన్నికల వివిధ దశల్లో నిర్వహించే లాగ్‌లు, రాజకీయ పార్టీలు తదుపరి వెరిఫికేషన్ కోసం చేసిన వీడియో రికార్డింగ్‌లను నిర్వహించడానికి కమిషన్ ఏర్పాట్లు చేసిందా?

8. రాజకీయ పార్టీల ఏజెంట్లు బహిరంగంగానే తమ అభ్యర్థులకు పోలింగ్ బూత్ లోపల కరపత్రాలు ప్రదర్శిస్తూ ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో బీజేపీ ఏజెంట్ పార్టీ అభ్యర్థి కరపత్రాలను ప్రదర్శించిన ఉదంతం పోలింగ్ సిబ్బందికి కాదు, థర్డ్ పార్టీకి కూడా ఎదురైంది. అలాంటి బూత్‌లలో రీపోలింగ్ కు కమిషన్ ఆదేశించిందా? ప్రభుత్వ ఖజానా ఖర్చుతో అన్ని బూత్‌లలో వీడియో రికార్డింగ్‌ను అందించడానికి కమిషన్ ఖర్చు చేసింది కాబట్టి, అటువంటి వీడియో రికార్డింగ్‌లను భద్రపరిచి పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేసిందా?

9. ఎంసిసి అమల్లో ఉన్న కాలంలో రాష్ట్ర సంస్థలపై, ముఖ్యంగా వాటి దర్యాప్తు సంస్థలపై పర్యవేక్షణ చేయడానికి కమిషన్ వెనుకాడలేదు. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం ఆ సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్న విస్తృత ప్రజా ఆందోళన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థల (ఈడీ/ సీబీఐ, ఆదాయపు పన్ను) అధికారులపై కమిషన్ ఇలాంటి పర్యవేక్షణను ఎందుకు అమలు చేయలేదు?

ఈ ప్రశ్నలన్నింటికీ కమిషన్ సంతృప్తికరమైన సమాధానాలను వెంటనే, బహిరంగంగా, సంకోచించకుండా ప్రజలకు అందించాలని నేను కోరుతున్నాను, లేనిపక్షంలో ప్రజలకు కమిషన్‌పై ఉన్న నమ్మకానికి మరింత దెబ్బతగులుతుందని నేను భయపడుతున్నాను. సమాధానాలు ఇవ్వడంలో విఫలమైతే కమిషన్ పాత్రపై ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది.

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నిష్పాక్షికత, పారదర్శకతపై పౌర సమాజ సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టుల్లో దాఖలు చేసిన వరుస పిటిషన్లను ప్రస్తావిస్తూ, 'సందేహాస్పద వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది' అని కమిషన్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇక్కడ నాటకం ఏమిటి, ఏం చేస్తున్నారు, ఈ సందేహాలు ఎందుకు పుట్టుకొచ్చాయి అనే విషయాలను ఏదో ఒక రోజు తప్పకుండా అందరికీ చెబుతాం. ఏదో ఒక రోజు దాన్ని బహిరంగం చేస్తాం. ఇలా ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తున్నారో, దీనివల్ల ఓటింగ్ పై ప్రభావం పడుతుందని ఎలా అనుకుంటున్నామో అందరికీ చెబుతాం. నిబంధనలు, ఓటింగ్ జాబితాలు సక్రమంగా ఉన్నాయా లేదా, ఓటర్ల సంఖ్యను పెంచారా అని ప్రశ్నించే చోట ప్రజల మదిలో సందేహాలు కలుగుతాయి’’ అని వివరించారు.

‘‘ప్రజల పక్షాన వ్యక్తమవుతున్న ఆందోళనలను- వదంతులు వ్యాపింపజేసేవిగా, చికాకు కలిగించేవిగా పరిగణించి, అలాంటి ఆందోళనలు వ్యక్తం చేసే వారందరిపై అసహ్యకరంగా దూషించడం, అదే సమయంలో బీజేపీకి చెందిన సీనియర్ స్టార్ క్యాంపెయినర్లు చేసే విచ్ఛిన్నకర విషపూరిత విద్వేష ప్రసంగాలపై చర్యలు తీసుకోరాదని ఎన్నికల సంఘం నిర్ణయించడం విడ్డూరంగా ఉంది. కమిషన్ నుండి వెలువడే ఇటువంటి ప్రకటనలు దాని విశ్వసనీయతను సమర్థతను తగ్గిస్తాయి. ప్రజా సమస్యల పట్ల దాని నిర్లక్ష్యాన్ని, పారదర్శకతను కాపాడటానికి దాని విముఖతను ప్రతిబింబిస్తాయి.

గతంలో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తదితర స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయని, పోటీ చేసే అభ్యర్థులు తమ పూర్వాపరాలను బహిరంగంగా వెల్లడించాలని, రాజకీయ పార్టీలు తమ ఆదాయ, వ్యయాలను బహిరంగంగా వెల్లడించాలని సుప్రీంకోర్టు నుంచి చారిత్రాత్మక తీర్పులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాయని కమిషన్ తెలుసుకోవాలి. ఈబిఎస్ యొక్క చట్టవిరుద్ధతపై ఇటీవల ఒక దూరదృష్టితో కూడిన తీర్పును పొందింది.

ఇలాంటి స్వచ్ఛంద సంస్థల పై పరోక్షంగా, నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా కమిషన్ విశ్వసనీయతను కోల్పోతుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను దెబ్బతీస్తుంది. పైన నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు కోరుతున్నప్పుడు, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో చేసిన చారిత్రాత్మక ప్రసంగంలో ఈ క్రింది హెచ్చరిక పదాలను ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను’’ అని వెల్లడించారు.

“రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసే వారు చెడ్డవారయితే అది చెడుగా మారడం ఖాయమని, అన్నారు. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా, దాన్ని అమలు చేసే వారు మంచివారయితే ఆమేరకు రాజ్యాంగమూ బాగుంటుంది. ఈ మాటలపై ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవద్దూ !చివరగా, అన్యాయ సంఘటనలపై గాంధీజీ చేసిన ప్రసిద్ధ ప్రకటనను నేను ప్రస్తావిస్తున్నాను:“అన్యాయాన్ని క్షమించడం, అంగీకరించడం ఒక పిరికిపంద చర్య“ అని ఆయన అన్నారు.

వ్యక్తుల్లో పిరికితనం చెడ్డది కానీ ఉన్నత పదవుల్లో ఉన్నవారి విషయంలో పిరికితనం సమాజానికి విపత్తును, హానిని కలిగిస్తుంది. ఈ లేఖలో తాను లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుత ఎన్నికల ప్రక్రియకు, ఎన్నికల ప్రక్రియ ఏ మేరకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా సాగిందో, ఎన్నికల సంఘం తన రాజ్యాంగ ఆదేశానికి సంబంధించి పోషించిన పాత్ర గురించి చర్చించడానికి, చర్చించడానికి ముఖ్యమైనవి కాబట్టి ఈ లేఖను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు.

(సంక్షిప్తానువాదం: డాక్టర్.యస్. జతిన్ కుమార్)

Tags:    

Similar News